సర్కారు మాట తప్పిందని… మాజీ మావోయిస్టుల ధర్నా

by  |
సర్కారు మాట తప్పిందని… మాజీ మావోయిస్టుల ధర్నా
X

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: లొంగిపోతే ఆదుకుంటామని ప్రకటించిన ప్రభుత్వం తీరా తాము లొంగి పోయిన తర్వాత పట్టించుకోకుండా మోసం చేస్తున్నదని మాజీ మావోయిస్టులు ఆరోపించారు. ఈ మేరకు నిర్మల్ జిల్లా కలెక్టరేట్ ఎదుట సోమవారం వారు ధర్నాకు దిగారు. 2006లో మావోయిస్టు సిద్ధాంతాలకు ఆకర్షితులై దళంలో చేరామనీ, 2019లో ప్రభుత్వ పిలుపుమేరకు పోలీసుల ఎదుట లొంగి పోయామని వారు చెబుతున్నారు. వివరాల్లోకి వెళితే… మావోయిస్టు పార్టీలో నిర్మల్ జిల్లా మామడ మండలం బురద పల్లి గ్రామానికి చెందిన మార్కం సునీల్, మార్కం గంగుబాయి అలియాస్ లత దంపతులు చేరారు. చత్తీస్ గఢ్ రాష్ట్రంలో మావోయిస్టు పార్టీలో సుదీర్ఘ కాలం పనిచేశారు. వీరిపై నాలుగు లక్షల రివార్డు కూడా ఉంది. అయితే జనజీవన స్రవంతిలో కలవాలని నిర్మల్ జిల్లా పోలీసులు వారి కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. దీంతో 2019లో ఎస్పీ ఎదుట ఈ మావోయిస్టు దంపతులు లొంగిపోయారు.

సాయం చేయడం లేదని… ధర్నా..!

లొంగిపోయిన తర్వాత తమ తలల పై ప్రకటించిన రివార్డుతోపాటు నగదు, ఇంటి స్థలం, ఐదు ఎకరాల వ్యవసాయ భూమి ఇస్తామని ప్రభుత్వం తమకు చెప్పిందని వారు గుర్తు చేస్తున్నారు. తర్వాత తమకు ప్రభుత్వం ఎలాంటి సహాయం అందించలేదని అన్నారు. అధికారుల చుట్టూ తిరిగి విసిగి వేసారి పోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమను ప్రభుత్వం, అధికారులు మోసం చేశారని చెబుతున్నారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ నిర్మల్ జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నాకు దిగారు. కాగా ఈ హఠాత్పరిణామం పోలీస్ వర్గాల్లో కలకలం సృష్టిస్తోంది. భవిష్యత్తులో మావోయిస్టు దళాలు, దళాల్లో పనిచేస్తున్న సీనియర్ నేతలు, దళ సభ్యులను లొంగి పోయేలా చేయడం ఇబ్బందిగా మారుతుందన్న అభిప్రాయాలు సీనియర్ పోలీసు అధికారుల్లో వ్యక్తమవుతోంది. లొంగిపోయిన నక్సలైట్లకు పునరావాసం కల్పించే కార్యక్రమంలో ఇలాంటి జాప్యం జరిగితే పోలీసు శాఖ తో పాటు, ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందనే అభిప్రాయం పోలీసు యంత్రాంగం‌లో ఉంది.


Next Story