హ్యాకర్స్ కే షాకిచ్చిన 15ఏళ్ల కుర్రాడు.. ప్రశంసించిన లైబీరియన్ ప్రభుత్వం

by Shyam |   ( Updated:2021-08-11 03:02:27.0  )
Ethical hacker
X

దిశ, ఫీచర్స్: లైబీరియన్ ప్రభుత్వ ఆర్థిక, అభివృద్ధి మంత్రిత్వ శాఖ అధికారిక వెబ్‌సైట్‌‌‌ను హ్యాక్ చేసి.. ప్రభుత్వం నుంచి డబ్బు వసూలు చేసిన హ్యాకర్‌ను పట్టుకోవడంలో ఒడిషా, ఫుల్‌బని పట్టణానికి చెందిన పదో తరగతి విద్యార్థి సాయం చేశాడు. అతడు చేసిన పనికిగానూ లైబీరియా ప్రభుత్వం ప్రశంసలతో ముంచెత్తింది.

ఆర్థిక శాఖ అధికారిక వెబ్‌సైట్ హ్యాకింగ్‌కు గురైనట్లు లైబీరియన్ సైబర్ క్రైమ్ ప్రివెన్షన్ అండ్ మిటిగేషన్ ఏజెన్సీకి జూలైలో తెలిపింది. అయితే సమస్యను పరిష్కరించడానికి వాళ్లు ప్రయత్నించినా ప్రయోజనం లేకపోగా.. ఇండియన్ సైబర్ సెక్యూరిటీ సొల్యూషన్స్ సంస్థ సహాయం కోరారు. ఈ కేస్ సాల్వ్ చేసేందుకు ఆ సంస్థలో సైబర్ సెక్యూరిటీ నిపుణునిగా మంచి గుర్తింపు పొందిన సాహును నియమించారు. హ్యాకింగ్‌కు సంబంధించిన డిజిటల్ సాక్ష్యాలను లైబీరియన్ ప్రభుత్వానికి అందించడంతో పాటు, అధికారిక వెబ్‌పేజీని కూడా సరిచేశాడు. అతడి పనికి మెచ్చిన లైబీరియా ప్రభుత్వం సాహుకు ప్రశంసా పత్రం, ఆఫ్రికన్ దేశంలో జాబ్ ఆఫర్‌తో పాటు కొన్ని అమెరికన్ డాలర్లను అందజేసింది.

హ్యాకింగ్ మీద ఆసక్తితో ఎథికల్ హ్యాకర్‌గా ఎదిగిన పదిహేనేళ్ల సౌమ్య సాహు.. నాలుగు ఏళ్లుగా ఇండియన్ కంపెనీ సైబర్ సెక్యూరిటీ సొల్యూషన్స్‌తో కలిసి పనిచేస్తున్నాడు. అంతేకాదు ఎథికల్ హ్యకింగ్ గురించి స్థానిక యువకులకు బోధిస్తుంటాడు. ఇండియన్ ఇంటెలిజెన్స్ బ్యూరోలో ఎథికల్ హ్యాకింగ్ ఆఫీసర్ కావాలని లక్ష్యంగా పెట్టుకున్న సాహూ.. తల్లిదండ్రులు మొదట్లో వ్యతిరేకించినా ఇప్పుడు తన విజయం‌ పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు.

‘లైబీరియన్ సెక్యూరిటీ ఏజెన్సీ నుంచి IP చిరునామా, ఇతర సంబంధిత సమాచారాన్ని సేకరించి హానికరమైన హ్యాకర్‌ను ఫైండవుట్ చేశాను. నేను పంపిన అన్ని డిజిటల్ సాక్ష్యాలను ఉపయోగించి లైబీరియన్ ప్రభుత్వం హ్యాకర్‌ను గుర్తించి పట్టుకుంది. ప్రస్తుతం అధికారిక వెబ్‌సైట్‌ కూడా యథావిథిగా రన్ అవుతోంది’ అని సౌమ్య సాహు తెలిపాడు.

Advertisement

Next Story

Most Viewed