- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జూడాలతో మంత్రి ఈటల చర్చలు విఫలం
దిశ, న్యూస్ బ్యూరో
ఆందోళన కొనసాగిస్తున్న గాంధీ ఆస్పత్రి జూనియర్ డాక్టర్లతో మంత్రి ఈటల రాజేందర్ జరిపిన చర్చలు విఫలమయ్యాయి. విధి నిర్వహణలో ఉన్న వైద్యులపై పేషెంట్ల బంధువులు దాడి చేసిన నేపథ్యంలో బుధవారం ఉదయం గాంధీ ఆస్పత్రి జూడాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆందోళనను విరమింపజేసేందుకు సాయంత్రం మంత్రి ఈటల స్వయంగా గాంధీకి చేరుకున్నారు. జూడాలు ప్రతిపాదించిన ఐదు డిమాండ్లపై చర్చలు జరిగాయి. కానీ కేవలం ఒక్కదానికి మాత్రమే మంత్రి నుంచి హామీ లభించింది. దీంతో తమ ఆందోళనను కొనసాగించనున్నట్లు వారు స్పష్టం చేశారు. అదే జరిగితే సుమారు 300 మంది జూనియర్ డాక్టర్లు విధులకు దూరం కానున్నారు. రెసిడెంట్ డాక్టర్లు, ప్రభుత్వ వైద్యులు మాత్రమే సేవల్లో కొనసాగనున్నారు. జూనియర్ డాక్టర్లలో ఎలాంటి చీలిక రాలేదని జూనియర్ డాక్టర్ల సంఘం ప్రధాన కార్యదర్శి కిజర్ హుస్సేన్ స్పష్టం చేశారు.
విధి నిర్వహణలో ఉన్న డాక్టర్లపై దాడులు జరగకుండా ఇప్పటికే ఉన్న స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ పోలీసులను మరింత ఎక్కువ సంఖ్యలో నియమించాలని, ప్రతీ వార్డులోనూ వారిని నియమించాలని జూనియర్ డాక్టర్లు చేసిన మొదటి డిమాండ్‌కు మాత్రం మంత్రి సానుకూలంగా స్పందించారు. నగర పోలీసు కమిషనర్‌తో మాట్లాడి తగిన సంఖ్యలో అదనపు పోలీసుల్ని నియమించాలని ఆదేశించారు. గాంధీ ఆస్పత్రికి వస్తున్న కరోనా పేషెంట్లలో నాలుగు రకాల స్థాయిల్లో ఉంటున్నారని, అందరినీ ఒకేచోట కాకుండా వేర్వేరు ఆస్పత్రుల్లో పెట్టడం ద్వారా ఒకరి నుంచి మరొకరికి ఇన్‌ఫెక్షన్ సోకకుండా కాపాడవచ్చునని జూనియర్ డాక్టర్లు మంత్రికి వివరించారు. కరోనా పాజిటివ్ అని నిర్ధారణ కావడంతో అందరినీ ఇక్కడికే పంపడం ద్వారా ఆచరణలో అనేక సమస్యలు వస్తున్నాయని వివరించారు. అయితే ఈ డిమాండ్‌పై మంత్రి నుంచి స్పష్టమైన హామీ లభించలేదు. ముఖ్యమంత్రితో మాట్లాడిన తర్వాతే స్పష్టత వస్తుందనే అభిప్రాయం వెలువడటంతో జూనియర్ డాక్టర్లు ఆందోళనను కొనసాగించాలనే నిర్ణయం తీసుకున్నారు.
ప్రస్తుతం ఆస్పత్రుల్లో డాక్టర్లు, నర్సులు, పారా మెడికల్, ల్యాబ్ టెక్నీషియన్, ఐసీయూ టెక్నీషియన్, వార్డు బాయ్ తదితరులను రిక్రూట్ చేసుకోవాలని జూనియర్ డాక్టర్లు చేసిన డిమాండ్‌కు కూడా మంత్రి నుంచి స్పష్టత రాలేదు. తాత్కాలిక ప్రాతిపదికన ప్రభుత్వం నియమిస్తున్నందున చేరడానికి అభ్యర్థులు సుముఖంగా లేరని, శాశ్వత ప్రాతిపదికన నియమకాలు జరగాలని మంత్రికి స్పష్టం చేశారు. కానీ, ఇది ప్రభుత్వం తీసుకోవాల్సిన విధాన నిర్ణయం కావడంతో ఈ డిమాండ్‌పై ఎలాంటి హామీ లభించలేదు. పీపీఈ కిట్లు, ఎన్-95 మాస్కులు ఉన్నప్పటికీ వాటి నాణ్యత విషయంలో సైతం జూనియర్ డాక్టర్లు అసంతృప్తి వ్యక్తం చేశారు.
రాష్ట్ర వైద్యారోగ్య శాఖ అడ్వయిజరీ కమిటీలో జూనియర్ డాక్టర్లకు కూడా ప్రాతినిధ్యం ఉండాలన్న డిమాండ్‌పై ఎక్కువ సేపు చర్చ జరిగింది. జూనియర్ డాక్టర్లు, మంత్రి ఈటల రాజేందర్‌కు మధ్య మొత్తం 3గంటల పాటు చర్చ జరగ్గా ఎక్కువ సమయం దీనిపైనే ఫోకస్ అయింది. విధి నిర్వహణలో జూనియర్ డాక్టర్లు ఎదుర్కొంటున్న ఇబ్బందులు ప్రభుత్వం దృష్టికి వెళ్ళాలంటే వారికి ఈ కమిటీలో ప్రాతినిధ్యం ఉండటం అవసరమని, అప్పుడే సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని మంత్రికి వివరించారు. దీనిపై ముఖ్యమంత్రి కేసీఆర్‌తో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుందామని మంత్రి అర్థం చేయించారు. జూనియర్ డాక్టర్లు ఐదుగురితో ఒక కమిటీని ఏర్పాటు చేసుకుంటే ఆ సమావేశాలకు మంత్రి హోదాలో తాను హాజరవుతానని, అక్కడ వచ్చిన అభిప్రాయాలను అడ్వయిజరీ కమిటీ దృష్టికి తీసుకెళ్తానని జూడాలకు అర్థం చేయించారు. ఇందుకు జూడాలు సానుకూలంగా స్పందించినా తుది నిర్ణయం మాత్రం జరగలేదు. చర్చలు మూడు గంటల పాటు జరిగినా అసంపూర్తిగానే ముగిశాయి. చివరకు ఆందోళనను కొనసాగించడానికే జూనియర్ డాక్టర్లు మొగ్గుచూపారు. మంత్రితో జరిపిన చర్చలు విఫలంగానే ముగిశాయి.