సరిగా కూర్చోకున్నా ప్రమాదమే!

by  |
సరిగా కూర్చోకున్నా ప్రమాదమే!
X

ఒకప్పుడు పాఠాలు సరిగా వినలేరని స్కూళ్లోకి ఫోన్ అనుమతించేవారు కాదు, కానీ ఇప్పుడు ఫోన్ లేకపోతే పాఠాలే లేవు. రోజులో 24 గంటల్లో 18 గంటలు పిల్లలు ఫోన్‌తోనే కాలక్షేపం చేస్తున్నారు. ముఖ్యంగా ఈ కొవిడ్ 19 లాక్‌డౌన్ సమయంలో ఆ వాడకం మరింత పెరిగింది. అది పాఠాలు వినడానికైనా కావొచ్చు, లేదంటే గేమ్స్ ఆడటానికి, సినిమాలు చూడటానికైనా కావొచ్చు. కేవలం ఫోన్ మాత్రమే కాదు, కంప్యూటర్, ల్యాప్‌టాప్ వంటి ఇతర డిజిటల్ ఉపకరణాల ముందు కూడా పిల్లలు ఎక్కువ సమయం కూర్చుంటున్నారు. అయితే వారు ఎలా కూర్చుంటున్నారన్నదే ఇక్కడ అసలైన సమస్య. ఎలక్ట్రానిక్ ఉపకరణాల ముందు పిల్లలు ఎక్కువ సమయాన్ని గడుపుతున్నపుడు వారు సరిగా కూర్చోకపోవడం వల్ల అనేక దుష్ప్రభావాలు కలుగుతున్నాయి.

పిల్లల భిన్నమైన శారీరక పరిమాణం, ఎత్తులు కలిగి ఉంటారు. సరైన స్థితిలో కూర్చోవడం గురించి వారికి అంతగా అవగాహన ఉండదు. చాలా మంది పిల్లలు తమ కాళ్లను నేలకు తాకించి కూర్చోరు. కంటికి-మానిటర్‌కు మధ్య తగిన దూరం ఉండాలని చెబితే పట్టించుకోరు. గంటల తరబడి కూర్చునే సమయంలో మధ్యమధ్యలో విశ్రాంతి తీసుకోవాలని కూడా వారికి తెలియదు. ఇన్ని సమస్యల మధ్య ఎర్గోనామిక్స్ (సౌకర్యవంతమైన స్థితి) గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.

అందరూ చదువు, మార్కుల మీద దృష్టి పెడతారే గానీ ఎలా నేర్చుకోవాలనే దాని మీద శ్రద్ధ వహించరు. దీని గురించి అవగాహన కార్యక్రమాలు, శిక్షణా తరగతులు కూడా తీసుకోరు. ఎందుకంటే ఇప్పటివరకు ఎర్గోనామిక్స్‌తో పెద్దగా అవసరం రాలేదు. కానీ ఆన్‌లైన్ క్లాసులకు విపరీతంగా డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో స్క్రీన్ చూసే ముందు ఏ భంగిమలో కూర్చోవాలనే దానిపై పిల్లలకు తెలియజేయాలి. తప్పుడు భంగిమలో కూర్చోవడం వలన ఏర్పడే రిపిటేటివ్ స్ట్రెయిన్ ఇంజ్యూరీ (ఆర్ఎస్ఐ), క్యుములేటివ్ ట్రామా డిజార్డర్స్ (సీటీడీ), మస్కులోస్కెలిటల్ డిజార్డర్స్ (ఎంఎస్‌డీ) వంటి సమస్యల గురించి పిల్లలకే కాదు, పెద్దలకు కూడా అవగాహన లేదు.

ఈ విషయాల గురించి ఒక ఆన్‌లైన్ సర్వే జరిగింది. 10 నుంచి 17 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన 186 మంది బాలబాలికలు, వారి తల్లిదండ్రులు ఈ సర్వేలో పాల్గొన్నారు. ఇందులో ఎలక్ట్రానిక్ గాడ్జెట్ల ముందు పిల్లలు కూర్చుంటున్న వ్యవధి, స్క్రీన్ ముందు వారు గడిపే సమయం, మానిటర్‌ను చూడటంలో వారు కూర్చునే స్థితి, వీపును వెనకకు ఆనించి కూర్చునే స్థితి, నేలపై కాళ్లను తాకించి కూర్చునే స్థితి, పనిచేసే సమయంలో మధ్యలో తీసుకునే విరామాలు వంటి అంశాలను ఈ సర్వేలో తెలుసుకున్నారు.

అయితే ఎర్గోనామిక్స్ గురించి కానీ, దాని తప్పుడు పరిణామాల వల్ల కానీ అటు పిల్లలతో పాటు ఇటు తల్లిదండ్రులకు ఎలాంటి అవగాహన లేదని సర్వేలో తేలింది. అంతేకాకుండా వీటి గురించి తరగతి పాఠాల్లో లేదని, టీచర్లు కూడా అవగాహన కల్పించలేదని తెలిసింది. ఇప్పటికే చాలా మంది పిల్లల్లో మెడ, భుజాల్లో తీవ్రమైన నొప్పి కలుగుతోందని వారు చెప్పారు. అంతేకాకుండా కంటి సమస్యలు, తలనొప్పి, సరిగా నిద్రపట్టకపోవడం, కోపానికి గురికావడం వంటి సమస్యలు కూడా తలెత్తుతున్నట్లు సర్వేలో తేలింది. భవిష్యత్తుకాలంలో ఆన్‌లైన్ విద్య అనేది పూర్తిస్థాయిలో విద్యార్థుల జీవితంలో భాగం కానుంది కాబట్టి ఇప్పట్నుంచే ఎర్గోనామిక్స్ గురించి అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంది. కేవలం పిల్లలు మాత్రమే కాకుండా తల్లిదండ్రులు కూడా వీటి గురించి అవగాహన పెంచుకోవాలని నిపుణులు చెబుతున్నారు.


Next Story

Most Viewed