సిటీ గల్లీలో బిర్యానీ అమ్ముకుంటున్న ఇంజినీర్లు..

by Shyam |
సిటీ గల్లీలో బిర్యానీ అమ్ముకుంటున్న ఇంజినీర్లు..
X

దిశ, ఫీచర్స్ : ఇద్దరూ కార్పొరేట్ ఎంప్లాయీస్, సరిపడా జీతం.. అయితేనేం స్థానిక ప్రజలకు టేస్టీ అండ్ క్వాలిటీ ఫుడ్ అందించాలనే ఉద్దేశ్యం ఫుడ్ ట్రక్‌ స్టార్ట్ చేసేలా ప్రేరేపించింది. ప్రతీరోజు సాయంత్రం తమ హోమ్ సిటీలోని గల్లీలో మసాలా ఘుమఘుమలను పంచేలా చేసింది. బిర్యానీ, చికెన్ టిక్కా వంటి కొద్దిపాటి మెనూకే పరిమితమైనా యూనిక్ టేస్ట్‌తో భోజన ప్రియుల మనసు దోచేస్తున్నారు. మార్చి 2021 నుంచి ‘ఇంజినీర్స్ టేలా’ పేరుతో చిన్న వెంచర్ నడుపుతూ సరికొత్త ఈటింగ్ కల్చర్‌‌ నేర్పిస్తున్నారు.

ఒడిశాలోని మల్కాన్‌గిరికి చెందిన ఇంజినీర్స్ సుమిత్ సమల్, ప్రియం బెబార్త.. చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్. పాండమిక్ వల్ల వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే అవకాశం లభించడంతో సాయంత్రం పూట లోకల్ స్ట్రీట్ వెండర్స్ వద్ద బిర్యానీ తినేందుకు ఇష్టపడేవారు. కానీ ఆ బిర్యానీ స్టాల్స్‌ను దగ్గరి నుంచి చూసినపుడు వారిలో అనేక ప్రశ్నలు తలెత్తాయి. మురుగునీటి కాల్వ పక్కన బండి నిలపడంతో పాటు బిర్యానీలో వాడే మాంసం క్వాలిటీ బాగుండక పోవడం వారిని ఆలోచింపజేసింది. అన్ని జాగ్రత్తలు పాటిస్తూ అన్ని వర్గాల ప్రజలకు అందుబాటు ధరల్లో స్వచ్ఛమైన, రుచికరమైన ఆహారాన్ని అందించేందుకు కొత్త బిజినెస్ ఏర్పాటుకు ప్రేరేపించింది.

స్ట్రీట్ కార్ట్ ఏర్పాటు..

ప్రియమ్, సుమిత్ ఇద్దరిలో ఎవరూ ప్రొఫెషనల్ చెఫ్ కాకపోగా.. తన తల్లి ఇంట్లో బిర్యానీ చేస్తున్నప్పుడు చూసి నేర్చుకున్నానని ప్రియమ్ వెల్లడించాడు. ఇదేక్రమంలో వివిధ వంటకాలు, మెనూలు, మసాలా దినుసుల గురించి పరిశోధించి చివరికి చిన్న మెనూతో స్టార్ట్ చేశారు. తమ సేవింగ్స్ నుంచి తీసుకున్న రూ .50వేల ప్రారంభ పెట్టుబడితో బిజినెస్ స్టార్ట్ చేసి, రోజువారీ కార్యకలాపాల నిర్వహణకు ఇద్దరు వంటవాళ్లను నియమించుకోవడంతో పాటు ఒక గదిని అద్దెకు తీసుకున్నారు. అప్పటి నుంచి ప్రతీరోజు సాయంత్రం ఆఫీస్ వర్క్ ముగిసిన తర్వాత లోకల్ స్ట్రీట్‌లో తమ బండిని ఏర్పాటు చేస్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్.. చికెన్ బిర్యానీ ప్లేట్‌ రూ.120/-, సగం ప్లేట్‌కు ధర రూ .70కు విక్రయిస్తున్నారు. క్రమంగా తమ ‘ఇంజినీర్స్ టేలా’కు కస్టమర్ల ఆదరణ పెరగడంతో ప్రస్తుతం చికెన్ టిక్కా ఆర్డర్స్ కాకుండా రోజుకు 100 ప్లేట్ల బిర్యానీ సేల్ చేస్తున్నారు.

రోజుకు రూ.8000/-

రోజువారీ పుడ్ తయారీకి సుమారు రూ .1,000 ఖర్చవుతుండగా.. రూ. 8,000 వరకు ఆదాయం లభిస్తుంది. ఇతరత్రా అన్ని ఖర్చులను తీసేయగా నెలకు దాదాపు రూ .45,000 లాభాన్ని పొందుతున్నామని ఇంజినీర్లలో ఒకరైన ప్రియమ్ వెల్లడించాడు.

Advertisement

Next Story