గెలిస్తేనే కానుక.. లేకపోతే అంతే..

by Anukaran |   ( Updated:2021-03-19 01:00:38.0  )
గెలిస్తేనే కానుక.. లేకపోతే అంతే..
X

దిశ, తెలంగాణ బ్యూరో: ‘టీఆర్​ఎస్​, కేసీఆర్​ అంటే నాకూ కోపం వస్తుంది. ఉద్యోగులను ఘోరంగా చూస్తున్నారు. కానీ ఈసారి పీఆర్సీ ఇస్తామన్నారు. మండలి ఎన్నికల్లో మనం ఓట్లేయకుండా టీఆర్​ఎస్​ ఓడిపోతే మళ్లీ రెండేండ్ల వరకు పీఆర్సీ ఇవ్వరు. మనోళ్లు కూడా అడుగరు. ఎందుకు ఈ తంటా. ఒక్క పీఆర్సీ జమ అయితే ఇంకో రూ. 30 వేలు పెరుగుతాయి. అందుకే కోపం ఉన్నా టీఆర్​ఎస్​కే ఓటేశా’ ఇప్పటిదాకా పీఆర్సీ అంశంలో టీఆర్​ఎస్​పై వ్యతిరేక నిరసనలు చేసిన ఒక ఉద్యోగ సంఘం నేత చేసిన వ్యాఖ్యలివి.

మండలి ఎన్నికల్లో కేసీఆర్​ వ్యూహం ఫలించినట్లైంది. గెలుపోటములు ఎలా ఉన్నా… తొలి ప్రాధాన్యత ఓట్లలో టీఆర్​ఎస్​ ఆధిపత్యం సాధించింది. ఇది కేవలం ఉద్యోగవర్గాల ఓట్లతోనే సాధ్యమైందని ఇప్పుడు టాక్​. మండలి పోలింగ్​కు మూడు రోజుల మందు వరకూ కోపంతో ఉన్న ఉద్యోగులను ఒక్కసారిగా కేసీఆర్ చల్లబర్చారు. ఏదైతే పీఆర్సీ మీద కోపంగా ఉన్నారో… అదే పీఆర్సీని ఆశగా చూపించారు. దీంతో ఉద్యోగుల ఓట్లు టీఆర్​ఎస్​కు టర్న్​ అయినట్లు ఉద్యోగ సంఘాల నేతలే చెప్పుతున్నారు. ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగిన రెండు సెగ్మెంట్లలో దాదాపు 3 లక్షల వరకు ఉద్యోగులు, వారి కుటుంబాలకు చెందిన ఓట్లున్నాయి. ఇవన్నీ టీఆర్​ఎస్​కే గంపగుత్తగా పడినట్లు ప్రచారమవుతోంది.

30 శాతం పీఆర్సీ

ఇక మండలిలో రెండు చోట్లా గెలిస్తే ఉద్యోగులకు 30 శాతం ఫిట్​మెంట్​ ఇస్తామని సీఎం కేసీఆర్​ హామీ ఇచ్చినట్లు ఉద్యోగ సంఘాల నేతలు చెప్పుతున్నారు. అంతేకాదు… ఇప్పుడు అదే ఆశల్లో తేలియాడుతున్నారు. తమ ఓట్లన్నీ అనుకూలించి రెండుచోట్లా గెలిస్తే మాత్రం 30 శాతం పీఆర్సీ వస్తుందంటున్నారు. దీనిపై ఇప్పటి నుంచి సంఘాలు ప్రచారానికి సైతం దిగుతున్నాయి. మేమేంటే మేమే పీఆర్సీని సాధించామంటూ చెప్పుకుంటున్నాయి. మండలి ఎన్నికల ముందు ఈ నెల 10న సీఎం కేసీఆర్​ఉద్యోగ సంఘాల నేతలతో సమావేశమైన విషయం తెలిసిందే. ఈ సమావేశం తర్వాత సీఎం కనీసం మాట కూడా మాట్లడకుండా కేవలం ఉద్యోగ సంఘాలతోనే పీఆర్సీ వస్తుందంటూ చెప్పించారు. ఇది మండలి ఎన్నికల్లో ప్రభావం చూపించినట్లైంది. అప్పటి వరకు వ్యతిరేకతతో ఉన్న ఉద్యోగులు అనుకూలంగా మారిపోయారు. చివరకు రోడ్లపై నిరసనలకు దిగిన ఉద్యోగ సంఘాల నేతలు, కొంతమంది అధికార స్థాయి ఉద్యోగ సంఘాల నేతలు కూడా టీఆర్​ఎస్​కు అనుకూలంగా ఓటేసే వరకు మారిపోయింది. ఇప్పుడు ఆ ఓట్లే టీఆర్​ఎస్​కు లీడ్​గా మారాయని ఉద్యోగుల్లో టాక్​.

Advertisement

Next Story

Most Viewed