నో అపాయింట్‌మెంట్

by Shyam |
నో అపాయింట్‌మెంట్
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఉత్కంఠగా మారిన పీఆర్సీ అంశంలో ప్రస్తుతం ఉద్యోగ సంఘాలకు చేదు అనుభవం ఎదురవుతోంది. సీఎస్‌ను కలిసేందుకు కొన్నిరోజులుగా ట్రై చేస్తున్నా ఉద్యోగ సంఘాల ఐక్య వేదికకు మళ్లీ నిరాశే ఎదురైంది. తాజాగా శుక్రవారం సీఎస్‌ను కలిసేందుకు సెక్రటేరియట్ (బీఆర్కే భవన్​)కు వెళ్లింది. చాలా సమయం రోడ్డుపై ఎదురుచూసిన ఉద్యోగ సంఘాల నేతలు… ఎలాగో లోపలకు వెళ్లినా సీఎస్ ​అపాయింట్‌మెంట్​ దొరక లేదు. దీంతో గంటల సమయం సీఎస్​ చాంబర్​ ఎదుట ఎదురు చూసిన సంఘాల నేతలు.. చివరకు కలువకుండానే వెనుదిరిగారు. అనంతరం విడుతల వారీగా ఆందోళనలకు దిగుతున్నట్టు ప్రకటించారు.

నో అపాయింట్‌మెంట్..
రాష్ట్రంలోని పలు ఉద్యోగ సంఘాలు సీఎస్‌ను కలిసేందుకు శుక్రవారం అనుమతి కోరాయి. పండుగ మరసటి రోజు కావడం, సందర్శకులు, ప్రజాప్రతినిధులు తక్కువగా ఉంటారనే కారణంతో తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్​ అధ్యక్షుడు సంపత్​కుమార్​స్వామి, ఎస్‌టీయూ సదానందంగౌడ్​, యూటీఎఫ్ ​జంగయ్య, చావా రవి, తెలంగాణ పెన్షనర్ల జేఏసీ అధ్యక్షుడు లక్ష్మయ్యతో తదితరులు సీఎస్‌ను కలిసేందుకు సెక్రెటరేట్‌కు వెళ్లారు. వేతన సవరణ నివేదిక అమలు కోసం సీఎస్‌ను కలిసి వినతిపత్రం ఇవ్వాలని అనుకున్నారు. వీరిని ముందుగా సచివాలయంలోకి రానివ్వలేదు. ఆ తర్వాత లోపలికు వెళ్లిన ఉద్యోగ ఐక్య వేదిక నేతలు సీఎస్‌కు సమాచారం పంపించారు. వాస్తవంగా అధికారులు, సందర్శకుల తాకిడి లేదని, కేవలం 5 నిమిషాల వ్యవధిని కేటాయించాలని కోరినట్టు ఉద్యోగ సంఘాల నేతలు వెల్లడించారు. అక్కడ గంటల తరబడి ఎదురుచూసినా సీఎస్ రానీయలేదు. చివరకు అపాయింట్‌మెంట్ లేదని, వెళ్లిపోవాలని ఉద్యోగ సంఘాల నేతలను సిబ్బంది బయటకు పంపించారు. ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి కలుద్దామనుకున్నా.. అక్కడ సైతం ఉద్యోగ సంఘాల నేతలకు సమయం ఇవ్వలేదు.

టైం ఎందుకు ఇవ్వడం లేదు?
ఉద్యోగ సంఘాల నేతలకు అపాయింట్ మెంట్ ఇవ్వకుండా వెనక్కి పంపించడంతో ఉద్యోగ సంఘాల నేతల నుంచి విమర్శలు ఎదురవుతున్నాయి. సెక్రెటేరియట్ చుట్టూ ఇప్పటికే ఆంక్షలు పెట్టారని, కనీసం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సైతం టైం ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అటు సీఎంను కలిసేందుకు అసలే అవకాశం ఉండటం లేదని, అధికార పక్షాన సీఎస్​సైతం సమయం ఇవ్వడం లేదని ఆరోపించారు. సచివాలయాన్ని నిషేధిత ప్రాంతంగా చేస్తున్నారంటూ అసహనం వ్యక్తం చేశారు.

ఉద్యోగ సంఘాలతో చర్చలు ప్రారంభించాలి
సచివాలయం ఎదుట రోడ్డుపైనే ఉద్యోగుల ఐక్య వేదిక సభ్యులు సంపత్ కుమారస్వామి, సదానందం, లక్ష్మయ్య, జంగయ్య, రవి తదితరులు మీడియాతో మాట్లాడారు. సీఎం కేసీఆర్​ ఉద్యోగ సంఘాలతో చర్చించాలని చెప్పి రోజులు గడుస్తున్నా ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పీఆర్సీ నివేదికను ఇచ్చి 15 రోజులు గడుస్తున్నా సిఫారసులను పబ్లిక్ డొమైన్‌లో ఉంచడం లేదని, ఈ నెల 6, 7 తేదీల్లోనే ఉద్యోగ సంఘాలతో చర్చించాలని సీఎం కేసీఆర్​ చెప్పారని, కానీ అధికారుల నిర్లక్ష్యంతో గందరగోళం నెలకొందన్నారు. పీఆర్సీ కోసం ఈ నెల 23న ఐక్య వేదిక స్టీరింగ్​కమిటీ సభ్యుల నిరాహారదీక్ష చేపట్టుతున్నామని, ఫిబ్రవరి నుంచి ప్రత్యక్ష నిరసనలకు దిగుతామని హెచ్చరించారు.

మీడియాకూ నో ఎంట్రీ
సచివాలయం ప్రాంతంలోకి ఇప్పటికే చాలా వర్గాలను దూరంగా ఉంచుతున్నారు. వాస్తవంగా ఏదైనా దరఖాస్తు పట్టుకుని సచివాలయంలోకి వెళ్లే వీలు లేదు. గతంలో సీఎంలు కూడా కొంత సమయం సచివాలయంలో సమయం కేటాయించి వినతులు తీసుకునేవారు. ఇప్పుడు అధికారులు కూడా ప్రజలకు అందుబాటులో ఉండటం లేదని రూఢీ అవుతోంది. కనీసం అత్యవసరంగా, ఆరోగ్య పరమైన వినతులతో వచ్చేవారు కూడా సచివాలయంలోకి వెళ్లడం నిషేధమే. అంతేకాకుండా గతంలో లేని విధంగా ఇప్పటికే మీడియాను నో ఎంట్రీ ఉన్న విషయం తెలిసిందే. మీడియాతో పాటు ఉద్యోగ సంఘాలు, ప్రతిపక్షాలకు కూడా ఇప్పుడు సచివాలయంలోకి అనుమతి లేదని స్పష్టమవుతోంది.

Advertisement

Next Story