పీఆర్సీ అమలు చేయాలని 23న నిరాహార దీక్ష

by Shyam |
పీఆర్సీ అమలు చేయాలని 23న నిరాహార దీక్ష
X

దిశ, తెలంగాణ బ్యూరో: పీఆర్సీ నివేదిక ఇవ్వడానికే రెండున్నరేళ్ళు పట్టింది. అది కూడా ఎంతో ఒత్తిడి, ఎన్నో పోరాటాల తర్వాత అందింది. నివేదిక ఇచ్చి ఇరవై రోజులైనా సీలు విప్పలేదని రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల ఐక్య కార్యాచరణ సమితి విమర్శించింది. ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సంఘాల ప్రతినిధులను పిలిచి మాట్లాడలేదని, అందుకే మళ్ళీ పోరాట మార్గం పట్టక తప్పడం లేదని జేఏసీ చైర్మన్ లక్ష్మయ్య, సెక్రటరీ జనరల్ టి.శుభాకర్‌రావు, ఫైనాన్స్ సెక్రటరీ ఎస్ జ్ఞానేశ్వర్, కో కన్వీనర్లు సూర్యనారాయణ, పి.కృష్ణమూర్తి, ఏ.రాజేంద్ర బాబు, ఎం. భరత్ రెడ్డిలు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 15న పెన్షనర్స్ జేఏసీ సమావేశం చైర్మన్ లక్ష్మయ్య అధ్యక్షతన జరిగింది. అందులో పీఆర్సీ నివేదికను వెంటనే బహిరంగ పరచాలని, సంఘాల ప్రతినిధులతో చర్చించి సంతృప్తికరమైన ఫిట్‌మెంట్‌తో నూతన పే స్కేళ్ళను 2018జూలై ఒకటో తేదీ నుంచి అమలు పరచాలని డిమాండ్ చేశారు. ఆ డిమాండ్ల సాధనకు ఒకరోజు నిరాహార దీక్ష, మధ్యాహ్న సమయంలో ఆఫీసుల వద్ద, కలెక్టరేట్ల వద్ద ప్రదర్శనలు నిర్వహించాలని ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల కాంటాక్ట్ ఉద్యోగుల సమిష్టి పోరాట సంస్థ “ఐక్యవేదిక” నిర్ణయించింది. అందుకే పెన్షనర్స్ సంఘాల అధ్యక్ష, కార్యదర్శులు ఈనెల 23న హైద్రాబాద్ ఇందిరా పార్క్ వద్ద ఉదయం 10 గంటలకు ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ప్రకటించారు.

Advertisement

Next Story

Most Viewed