- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జూన్‌లోగా కాంగ్రెస్ అధ్యక్షుడి ఎన్నిక
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్షుడి కోసం నిర్వహించాల్సిన సంస్థాగత ఎన్నికలు మరోసారి వాయిదా పడ్డాయి. జూన్‌లోగా కాంగ్రెస్ అధ్యక్షుడిని ఎన్నుకోనున్నట్టు పార్టీ వెల్లడించింది. ఢిల్లీలో శుక్రవారం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశమైంది. ఈ కమిటీలో అధ్యక్షుడి ఎన్నికతోపాటు దేశంలోని ప్రస్తుత సమస్యలపై చర్చలు జరిగాయి. ఈ భేటీ అనంతరం మధుసూదన్ మిస్త్రీ సారథ్యంలోని పార్టీ సంస్థాగత ఎన్నికల అధికార బృందం విలేకరులతో మాట్లాడింది. సీడబ్ల్యూసీలో రైతుల ఆందోళనలు, టీకా తయారీ, అర్ణబ్ వాట్సాప్ లీక్ అంశాలపై తీర్మానాలు చేసినట్టు వెల్లడించింది. ఐదు రాష్ట్రాలు పశ్చిమ బెంగాల్, తమిళనాడు, అసోం, కేరళ, పుదుచ్చేరిలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో కాంగ్రెస్ శ్రేణులు నూతన అధ్యక్షుడి సారథ్యంలో పోరాడుతాయని ఉవ్విళ్లూరాయి.
కానీ, ఈ ఎన్నికలు ముగిసిన తర్వాతే జూన్‌లో నూతన అధ్యక్షుడి కోసం ఎన్నికలు నిర్వహించబోతున్నట్టు పార్టీ ప్రకటించింది. దీంతో సోనియా గాంధీ నేతృత్వంలోనే ఈ ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల బరిలోకి కాంగ్రెస్ దిగనుంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోరపరాభవం తర్వాత అధ్యక్ష పదవి నుంచి రాహుల్ గాంధీ తప్పుకున్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్ నేతలు ఎన్ని విజ్ఞప్తులు చేసినా రాజీనామాను వెనక్కి తీసుకోలేదు. ఫలితంగా సోనియా గాంధీనే పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలిగా బాధ్యతలు తీసుకున్నారు. ఆరు నెలలు అధ్యక్షురాలిగా సేవలందించాలని సోనియా గాంధీని కాంగ్రెస్ నేతలు అభ్యర్థించారు. ఫిబ్రవరి నెలలో అధ్యక్షుడి కోసం పార్టీ సంస్థాగత ఎన్నికలు జరగాల్సి ఉంది. తాజాగా, మరో నాలుగు నెలలపాటు వాయిదా వేస్తూ సీడబ్ల్యూసీ నిర్ణయించింది.
కాంగ్రెస్‌ను సంస్కరించాలని, సంస్థాగత ఎన్నికలు తప్పకుండా నిర్వహించాలని, పూర్తికాల అధ్యక్షుడిని ఎన్నుకోవాలని 23 మంది కాంగ్రెస్ సీనియర్ నేతలు అధిష్టానానికి లేఖ సంధించి చర్చను లేవనెత్తిన సంగతి తెలిసిందే. గతనెలలోనూ అధ్యక్షుడి ఎన్నికపై ఇందులో కొందరు నేతలు సోనియా గాంధీని కలువగా పోలింగ్ షెడ్యూల్‌ను ప్రకటిస్తామని హామీనిచ్చినట్టు సమాచారం. కానీ, గాంధీ సమర్థకులు ఎన్నికల ముందు అధ్యక్షపదవిని రాహుల్ గాంధీకి ఇవ్వడంపై అభ్యంతరం చెప్పారని తెలిసింది. పరాజయం తర్వాత వెనుదిరిగిన రాహుల్‌కు అధ్యక్ష బాధ్యతలు తీసుకోవడంతోనే రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల బాధ్యతలు అప్పగించడం సరైంది కాదని అభిప్రాయపడ్డట్టు సమాచారం. కాగా, అభ్యర్థిత్వంపై రాహుల్ గాంధీ కూడా అనాసక్తిని ప్రదర్శించారని సంబంధితవర్గాలు వెల్లడించాయి.
చట్టాలను వెనక్కి తీసుకోవాలి..
ఢిల్లీ సరిహద్దులో చేస్తున్న రైతుల ఆందోళనలను కాంగ్రెస్ ఉన్నతస్థాయి కమిటీ సమర్థించింది. ఆ ఆందోళనలకు మద్దతునిస్తున్నట్టు పేర్కొంది. నూతన సాగు చట్టాలను కేంద్ర ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని తీర్మానం చేసింది. అలాగే, అత్యల్ప సమయంలోనే టీకా తయారుచేసిన శాస్త్రజ్ఞులను ప్రశంసించింది. ప్రజలు టీకా వేసుకోవడానికి ముందుకు రావాలని సూచించింది. బ్రాడ్‌కాస్ట్ ఆడియెన్స్ రీసెర్చ్ కౌన్సిల్(బార్క్) సీఈవో పార్థో దాస్‌గుప్తా, రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ చార్జ్ అర్ణబ్ గోస్వామికి మధ్య జరిగిన వాట్సాప్ సంభాషణలపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ దర్యాప్తు చేయాలని డిమాండ్ చేసింది.
సర్కారు నిర్లిప్తత దారుణం: సోనియా గాంధీ
దేశంలో అనేక సమస్యలు తాండవిస్తుంటే కేంద్ర ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు ఉండటం దారుణమని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ సీడబ్ల్యూసీ సమావేశంలో అభిప్రాయపడ్డారు. సాగు చట్టాలు కనీస మద్దతు ధర, పంట కొనుగోలు, ఆహార పంపిణీ వ్యవస్థలను నాశనం చేస్తాయని, ఈ చట్టాలను మొదటి నుంచీ తాము వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. పార్లమెంటులో చర్చకు ఆస్కారమివ్వకుండానే ఆ బిల్లలను ఆమోదించుకుందని అన్నారు. కరోనా కాలంలో కొన్ని అనాలోచిత నిర్ణయాలతో ప్రజలు తీవ్ర పరిణామాలను ఎదుర్కోవలసి వచ్చిందని చెప్పారు. ఆ గాయాలు మానడానికి కొన్నేళ్లు పడుతాయని వివరించారు. అర్ణబ్ గోస్వామి వాట్సాప్ చాట్‌లపైనా మాట్లాడారు. మిలిటరీకి చెందిన అధికారిక సమాచారాన్ని లీక్ చేయడమంటే రాజద్రోహానికి పాల్పడినట్టేనని ఆంథోని వ్యాఖ్యలను సోనియా గాంధీ ప్రస్తావించారు. అయినప్పటికీ ప్రభుత్వం మౌనం వహించడం దారుణమని అభిప్రాయపడ్డారు.