సింగరేణి సోలార్‌‌లో ఆధునిక టెక్నాలజీ వినియోగానికి కృషి

by Aamani |
solar 1
X

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్ : సౌర విద్యుత్‌ ఉత్పత్తి, సద్వినియోగం, సరఫరా వంటివి అంతర్జాతీయ స్థాయిలో ఇప్పుడు ఆధునిక సాంకేతికత అందుబాటులోకి వస్తోందని, వీటిని వినియోగించుకోవడానికి సింగరేణి కృషి చేస్తోందని డైరెక్టర్‌ (ఈఅండ్‌ఎం) సత్యనారాయణ రావు తెలిపారు. శుక్రవారం ఢిల్లీలో జరిగిన అంతర్జాతీయ స్థాయి సోలార్‌ ఎగ్జిబిషన్‌‌ను సందర్శించిన అనంతరం ఆయన సోలార్‌ ఎనర్జీ కార్పోరేషన్‌ ఆఫ్‌ ఇండియా డైరెక్టర్‌ ను, ఇతర అధికారులను కలిసి చర్చించారు. పగటి పూట ఉత్పత్తి అయ్యే సోలార్‌ విద్యుత్‌‌ను నిల్వ ఉంచుకోవడానికి వస్తున్న ఆధునిక టెక్నాలజీపై చర్చించారు.

ప్రయోగ దశలో ఉన్న ఈ టెక్నాలజీ విజయవంతమైతే సింగరేణిలో కూడా దీన్ని వినియోగించే అవకాశం ఉందన్నారు. సింగరేణి సంస్థకు సంబంధించిన సోలార్‌ ప్రాజెక్టులకు సలహాదారుగా ఉన్న సోలార్‌ ఎనర్జీ కార్పోరేషన్‌ ఆఫ్‌ ఇండియా అధికారులతో సింగరేణి సోలార్‌ ప్రగతిపై ముచ్చటించారు. మూడో దశ సోలార్‌ ప్రాజెక్టులు నిర్మిస్తున్న అదానీ గ్రూప్‌ వారు పనులు వేగవంతం చేసి సకాలంలో ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు సోలార్‌ ఎనర్జీ కార్పోరేషన్‌ కృషి చేయాలని, అలాగే కరీంనగర్‌‌లోని లోయర్‌ మానేరు రిజర్వాయర్‌ పై సింగరేణి నిర్మించతలపెట్టిన సోలార్‌ ప్రాజెక్టు గురించి జరుగుతున్న సర్వేలను పర్యవేక్షించి సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌) ను అందించాలని కోరారు. దీనిపై డైరెక్టర్‌(పవర్‌ సిస్టమ్స్‌) ఎస్‌.కె.మిశ్రా మాట్లాడుతూ.. అతి త్వరలోనే మూడో దశ నిర్మాణం పూర్తి చేయిస్తామని, ఫ్లోటింగ్‌ సోలార్‌‌పై నివేదిక సమర్పిస్తామన్నారు.

Advertisement

Next Story

Most Viewed