ఏపీ ఎంసెట్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. గతంలో మాదిరిగా ఇంటర్ మార్కులకు వెయిటేజీ

by Harish |
ఏపీ ఎంసెట్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. గతంలో మాదిరిగా ఇంటర్ మార్కులకు వెయిటేజీ
X

దిశ, ఎడ్యుకేషన్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఈఏపీసెట్ (EAPCET) కు సిద్ధమవుతున్న వారికి గుడ్ న్యూస్. ఈ పరీక్షలో ఇంటర్ మార్కులకు వెయిటేజీని గతంలో మాదిరిగా ఇవ్వాలని ఉన్నత విద్యామండలి నిర్ణయం తీసుకుంది. ఇంటర్ మార్కులకు ఈఏపీసెట్ లో మొత్తం 25 శాతం వెయిటేజీ ఇవ్వాలని నిర్ణయించింది.

కరోనా కారణంగా 2020-21, 2021-2022లో విద్యార్థులకు ఎగ్జామ్స్ నిర్వహించలేదు. దీంతో ఇంటర్ మార్కులకు వెయిటేజీని ఇవ్వలేదు. ప్రస్తుతం ఈఏపీసెట్ రాస్తున్న విద్యార్థులు గతేడాది ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ రాయగా.. ఈ ఏడాది సెకండియర్ ఎగ్జామ్స్ కూడా రాయనున్నారు. దీంతో ఇంటర్ మార్కులకు ఈఏపీసెట్ లో వెయిటేజీని పునరుద్ధరించాలని అధికారులు నిర్ణయించారు.

ఈ సారి ఈఏపీసెట్ లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ కు సంబంధించి కేవలం 70 శాతం సిలబస్ ను మాత్రమే ఇవ్వనున్నారు. గతేడాది ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ రాసిన విద్యార్థులు కేవలం 70 శాతం సిలబస్ తోనే పరీక్షలు రాయడం దీనికి కారణం. సెకండియర్ నుంచి మాత్రం పూర్తి సిలబస్ ఉంటుంది. ఈ ఏడాది ఈఏపీసెట్ ను మే 15 నుంచి నిర్వహించనున్నారు. ఈ మేరకు ఉన్నత విద్యామండలి ఇటీవల షెడ్యూల్ విడుదల చేసింది.

EAPCET షెడ్యూల్ ఇదే: మే 15 నుంచి 22 వరకు ఎంపీసీ విభాగం ఎగ్జామ్స్ ను, మే 23 నుంచి 25 వరకు బైపీసీ విభాగంలో ఎగ్జామ్ ను నిర్వహించనున్నారు. ఏపీలో ఇంటర్ ఎగ్జామ్స్ ను మార్చి 15 నుంచి నిర్వహిస్తారు.

Advertisement

Next Story

Most Viewed