సినిమా మేకింగ్ నేర్పే.. వర్క్‌షాప్స్‌

by Ravi |   ( Updated:2023-08-12 00:31:11.0  )
సినిమా మేకింగ్ నేర్పే.. వర్క్‌షాప్స్‌
X

When people ask me if I went to film school, I tell them, ‘no, I went to films అన్నాడు ప్రపంచ ప్రఖ్యాత దర్శకుడు Quentin Tarantino. అయినప్పటికీ చలన చిత్ర నిర్మాణమన్నది కేవలం కళే కాదు సైన్స్ కూడా. సినిమా దర్శకుడు తనకున్న ఎన్నో ఆలోచనల్ని భావాల్నీ తెరపైకి మలచాలంటే ఎన్నో శాస్త్ర సాంకేతికాంశాల్ని వినియోగించాల్సి వుంటుంది. దానికోసం శిక్షణ అవగాహన ముఖ్యం. అంతేకాదు ఒక మంచి సినిమా తీయాలంటే స్క్రిప్ట్ , స్క్రిప్ట్ , స్క్రిప్ట్ అనే మూడు అంశాలు తప్పనిసరి అంటాడు ఆల్ఫ్రెడ్ హిచ్ కాక్. అంటే సినిమా రూపొందించడానికి మిగతా అన్నీ అంశాల కంటే కూడా ముఖ్యమయింది ప్రధానమయింది స్క్రిప్ట్ అన్నమాట. ఆ స్క్రిప్ట్ రాయడానికి దర్శకుడు తప్పనిసరిగా చదవాలి.. చదవకపోతే దర్శకుడు కావడం సాధ్యమే కాదు.

ఫిల్మ్ మేకింగ్ కోర్సు ప్రారంభించి..

నా మట్టుకు నేను ఫిల్మ్ సొసైటీ ప్రదర్శనల్లో అనేక సినిమాలు చూసిన తర్వాత ఫిల్మ్స్‌కు సంబంధించి, ఫిల్మ్ మేకింగ్‌కు సంబంధించి నా తర్వాతి తరానికి పరిచయం, శిక్షణ కల్పించాలనుకున్నాను. నాకున్న పరిమితుల మేర పూర్తిస్థాయిలో సినిమా రంగంలోకి వెళ్ళే స్థితి లేదు కనుక యువకులకైనా ఆ రంగం పట్ల కనీస అవగాహన కలిగించాలనుకున్నాను. మంచి సినిమాల్ని చూడండి, ప్రపంచాన్ని అర్థం చేసుకోండి. ఆసక్తి వుంటే ఫిల్మ్ మేకింగ్ నేర్చుకోండి అని విద్యార్థులకు యువకులకు చెప్పేవాన్ని. కాలేజీల్లో ఓ పక్క క్యాంపస్ ఫిల్మ్ క్లబ్స్ ఏర్పాటు చేస్తూనే ఫిల్మ్ మేకింగ్ వర్క్ షాప్స్ నిర్వహించడం మొదలు పెట్టాను. మా కాలేజీలో ఏకంగా ఆర్నెల్ల ఫిల్మ్ మేకింగ్ కోర్స్‌నే ప్రారంభించాను. అప్పుడు ప్రిన్సిపాల్స్‌గా వున్న మిత్రులు డా. మధుసూధన్ రెడ్డి, డా. మురళి ఎంతగానో సహకరించారు. అట్లా మా కాలేజీలో మొదలు పెట్టిన సత్యజిత్ రే ఫిల్మ్ క్లబ్ నుంచి ఫిల్మ్ మేకింగ్ కోర్స్ ప్రారంభించాను.

అప్పటి శాతవాహన విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ డాక్టర్ ఇక్బాల్ దీనిని లాంఛనంగా ప్రారంభోత్సవం చేశారు. ప్రిన్సిపాల్ మధుసూధన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ప్రముఖ తెలుగు ఫిల్మ్ క్రిటిక్ చల్లా శ్రీనివాస్ అతిథిగా వచ్చి పిల్లలకు సినిమా మీద సినీ విమర్శమీద ముఖ్యంగా తెలంగాణ సినిమా గురించి ప్రేరణాత్మకంగా మాట్లాడారు. అలాగే అప్పుటి కరీంనగర్ డీఐజీగా వున్న అధికారికి ఫిల్మ్ మేకింగ్ పట్ల ఆసక్తి వుందని తెలిసి తనని క్లాస్‌కి పిలిపించి ఆయన అనుభవాలతో కూడిన క్లాస్ చెప్పించాను. అలాగే రచయిత దర్శకుడు అక్కినేని కుటుంబరావు, ఎడిటర్ లెనిన్ వంటి వారిచే క్లాసులు చెప్పించాను. చిత్ర నిర్మాణానికి చెందిన అనేక విషయాల్ని ఆయన సోదాహరణంగా వివరించారు. కోర్సుల్లో స్క్రిప్ట్ రచన, కెమెరా పనితనం, ఎడిటింగ్ తదితర విషయాల వంటి ప్రాథమిక విషయాల్ని చెప్పాం.

రెండు రోజుల వర్క్‌షాప్

కోర్సు అట్లా నడుస్తూ వుండగానే మాకొక ఆలోచన వచ్చింది. ప్రత్యేకంగా ఓ రెండు రోజుల వర్క్ షాప్ నిర్వహిస్తే ఎట్లా వుంటుంది అని. ఇంకేముంది దానికి ‘మేక్ అప్ టు పాక్ అప్’ (MAKE UP TO PACK UP) అని పేరు పెట్టాం. ఆసక్తి వున్న పిల్లలకు దృశ్యభాష, దృశ్యచిత్రీకరణ, స్క్రిప్ట్ రచన, ఎడిటింగ్ తదితర అంశాల‌పైన వర్క్ షాప్‌లో చెప్పాలనుకున్నాం. ముఖ్యంగా తెలంగాణ జిల్లాల నుంచి యువతను ఆహ్వానించి.. వారికి అవగాహన కల్పించాలనుకున్నది లక్ష్యం. నా పిలుపును అందుకుని నిజామాబాద్, హైదరాబాద్, సిద్దిపేట్, గంభీరావుపేట్, మంచిర్యాల తదితర ప్రాంతాల నుంచి యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. దీనికి మా కాలేజీ సత్యజిత్ రే ఫిల్మ్ క్లబ్‌తో పాటు ‘గామా’ ఫిల్మ్ సంస్థ కూడా సహకరించింది. మొదటి రోజు శాతవాహన విశ్వవిద్యాలయం వీసీ ఆచార్య వీరారెడ్డి అతిథిగా పాల్గొన్నారు. ఇందులో దర్శకుడు సునీల్ కుమార్ రెడ్డి తన అనుభవాలు చెప్పి దర్శకత్వం గురించి వివరంగా చర్చించారు. దీనికి మొదటి సెషన్‌లో సీరియల్ దర్శకుడు హరిచరణ్, రెండవ సెషన్‌కు సీనియర్ దర్శకుడు వీ. వీ రాజు సినిమాల్లోని 24 ఫ్రేమ్స్‌కు చెందిన అనేక అంశాల్ని వివరించారు. అలాగే ఫిల్మ్ ఎడిటర్ రవీంద్ర బాబు ఎడిటింగ్ ఆవిర్భావం నుండి వర్తమాన స్థితి వరకు వివరించారు. కలరింగ్, గ్రాఫిక్స్ గురించి కూడా చెప్పారు. ఇక వర్క్ షాప్ రెండవ రోజు దర్శకుడు సతీష్ కాశెట్టి ఫిల్మ్ కాన్సెప్ట్ నుంచి మొదలు ఫైనల్ ప్రాడెక్ట్ దాకా జరిగే సాంకేతిక అంశాల గురించి స్పెల్ బౌండ్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఆ తర్వాతి సెషన్‌లో జర్నలిస్ట్, ఫిల్మ్ క్రిటిక్ జగన్ ఫిల్మ్ ఫెస్టివల్స్ ప్రాముఖ్యత గురించి చెప్పారు. అలాగే నిర్మాత చావా సుధారాణి ఆత్మవిశ్వాసంతోనే గొప్ప సినిమాలు నిర్మించవచ్చని వివరించారు. ఇక ముగింపు సమావేశంలో నంది అవార్డును అందుకున్న ‘విముక్తి కోసం’ సినిమా నిర్మాత నారదాసు లక్ష్మణ రావు సినిమా అత్యంత శక్తివంతమయిన మాధ్యమని వివరించారు. అట్లా మా కాలేజీ క్లబ్ నిర్వహించిన రెండు రోజుల కార్యక్రమంలో పాల్గొని యువతీ యువకులు గొప్ప దృశ్య చైతన్యంతో వెనుదిరిగారు. మా ఎస్ఆర్ఆర్ కాలేజీ గొప్ప వేదికగా నిలిచినందుకు మా ప్రిన్సిపాల్, అధ్యాపకులు సిబ్బంది ఎంతో సంతోషపడ్డారు.

ఆంధ్రాలోనూ వర్క్‌షాప్

ఆ తర్వాత నేను నిర్వహించిన ఫిల్మ్ వర్క్ షాప్ శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో జరిగింది. ఇది అక్కడి నా మిత్రుడు గుడ్ల సంతోష్ కుమార్ సహకారంతో సాధ్యమయింది. 2011 ఆగస్ట్ ఆరు, ఏడు తేదీల్లో నిర్వహించిన ఈ వర్క్ షాప్ నాకెంతో ఆనందాన్ని ఇచ్చింది. విజయ గర్వాన్ని కూడా అందించిందనే చెప్పుకోవాలి. అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని మారుమూల జిల్లా అయిన శ్రీకాకుళం ‘టెక్కలి’లోని ఆదిత్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ మేనేజ్మెంట్‌లో ఈ కార్యక్రమం నిర్వహించాము. దీనికి కాలేజీ డైరెక్టర్ ఆర్థికంగానూ, హార్దికంగానూ సహకరించారు. దీనికి కాకినాడ, విజయవాడ, విశాఖ లాంటి పలుచోట్లకు చెందిన వివిధ ఇంజనీరింగ్ కాలేజీల్నుంచీ సుమారు120 మంది విద్యార్థినీ విద్యార్థులు ఇందులో పాల్గొన్నారు. FEDERATION OF FILM SOCIETIESకు అప్పుడు నేను కార్యదర్శిగా వున్నాను. ఎఫ్ఎఫ్ఎస్ఐ తన వంతు పూర్తిసహకారాన్ని అందించింది. నా విజ్ఞప్తిని ఆమోదించి పలువురు సినీప్రముఖులు ఈ వర్క్ షాప్ లో పాల్గొన్నారు. హైదరాబాద్ ఫిల్మ్ క్లబ్ కార్యదర్శి దీనిని మొత్తం కో ఆర్డినేట్ చేశారు. దీని ప్రారంభోత్సవ కార్యక్రమానికి కాలేజీ డైరెక్టర్ అధ్యక్షత వహించారు. దర్శకుడు రేలంగి నరసింహారావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఇందులో రేలంగి గారు తన సినిమా దర్శకత్వ అనుభవాల్ని సోదాహరణంగా వివరించారు. వర్క్ షాప్ రిసోర్స్ పర్సన్స్‌గా సినిమాటోగ్రాఫర్ ఎం.వీ.రఘు, ‘అంకుశం’ దర్శకుడు సి.ఉమామహేశ్వర్ రావు, రచయిత కె.ఎల్.ప్రసాద్, దర్శకుడు ప్రవీణ్ బండారు, బిహెచ్ ఎస్.ఎస్. ప్రకాష్ రెడ్డి గార్లు ఉత్సాహంగా పాల్గొన్నారు. రిసోర్స్ పర్సన్స్ అంతా స్క్రిప్ట్, సినిమాటోగ్రఫీ, దర్శకత్వం తదితర అంశాల గురించి చైతన్యవంతమైన ప్రసంగాలు చేశారు. నేనేమో నా ఫిల్మ్ ప్రజెంటేషన్ ఇచ్చాను. మిత్రులంతా హైదరాబాద్ తదితర ప్రాంతాల నుంచి టెక్కలి దాకా వచ్చి రెండు రోజులపాటు ఉండి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. విద్యార్థినీ విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా ప్రశ్నల్ని సంధిస్తూ మమేకమయి పోయారు. అట్లా విద్యార్థులు యువకులకోసం నేను నిర్వహించిన వర్క్ షాప్‌లు నాకు ఎంతో నేర్పించాయి. ఎందుకంటే... Organisation is an experience, and experience is great learning. I want to be a learner always...

-వారాల ఆనంద్

94405 01281

Advertisement

Next Story