సమభాగంతోనే స్త్రీ సాధికారత

by Ravi |   ( Updated:2024-03-24 01:15:54.0  )
సమభాగంతోనే  స్త్రీ సాధికారత
X

చైనా, జపాన్‌, జర్మనీ వంటి దేశాల్లో స్త్రీల ఉత్పత్తి సామర్థ్యం సాంకేతిక రంగాల్లో గణనీయంగా ఉంది. భారతదేశంలో, తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ స్థాయిలో మహిళలు అభివృద్ధి చెందాలంటే ఆయా దేశాల్లోని మహిళలకు లింగవివక్ష లేకుండా అభివృద్ధిలో ఎలా భాగస్వామ్యం కలిగిస్తున్నారో నిశితంగా పరిశీలించాలి. మన దేశంలోనూ దళిత, బహుజన, ఆదివాసి మైనార్టీ స్త్రీలకు విద్యా, ఉద్యోగ, పారిశ్రామిక రంగాల్లో అవకాశాలను కలుగజేయాల్సిన పరిస్థితులు ఏర్పడాలి. అన్ని రంగాల్లో స్త్రీలకు సమభాగం కల్పించడమే మహిళా సాధికారత అని చెప్పాలి.

ప్రపంచవ్యాప్తంగా స్త్రీలు ఆర్థిక, సాంఘిక, సాంస్కృతిక, శాస్త్ర సాంకేతిక రంగాలలో అద్వితీయమైన కృషి సాగిస్తూ ఉన్నారు. పితృస్వామ్య వ్యవస్థాధిపత్యాన్ని సమర్థవంతంగా ఎదుర్కొంటున్నారు. వ్యక్తిత్వ నిర్మాణం నైతికత, ఆత్మ గౌరవం, ఆత్మ స్థైర్యం, అభివ్యక్తి నైపుణ్యం సమాచార సామర్థ్యం కలిగి ఒక్కొక్కడుగు ముందుకు వేస్తున్నారు. మన దేశంలోనూ మహిళా దినోత్సవం, ఎన్నికలు, తదితర సందర్భాల్లో మహిళల గురించి అందరూ మాట్లాడుతున్నారు. కానీ మహిళా సాధికారికతకు సంబంధించిన ప్రధానాంశం భూమి పంపకం. భూమిని పంచుతామని ఏ రాజకీయ పార్టీ చెప్పడం లేదు. ఈ విషయం ఏ పార్టీ మ్యానిఫెస్టోల్లోనూ చోటు చేసుకోవడం లేదు.

క్షీర విప్లవంలో స్త్రీలకే భాగస్వామ్యం

భారతదేశంలో దళిత బహుజన గిరిజన స్త్రీలు పశువులను ప్రేమగా సాకుతారు. వారికి గానీ మూడు, మూడు గేదెలిచ్చి మరల వారికి ఆ గేదెలు పెంచడానికి 5 ఎకరాల భూమిని గడ్డికిచ్చి మళ్ళీ ఆ గేదెలు తరిపికి వచ్చాక మళ్ళీ మూడు గేదెలు కాని ఇచ్చినట్లయితే క్షీర విప్లవంలో స్త్రీలు భాగస్వాములవుతారు. రెండు రాష్ట్రాలలోనూ కమ్మ, రెడ్డి, వెలమ, క్షత్రియ కులాలకే ఎక్కువ భూమి ఉండటం వల్ల రైతు భరోసాలన్ని, ఉచిత విద్యుత్‌ పథకాలన్ని అగ్ర కులాలకే ఉపయోగపడుతున్నాయి. మరోప్రక్క దళిత, మైనారిటీ, బహుజన స్త్రీలు అసంఘటిత రంగంలో ఎక్కువగా వున్నారు. వీరికి పని కాలం 10, 12 గంటలుగా వుంటుంది. అందువల్ల వారు అతి తక్కువ కాలంలోనే వృద్ధులవుతున్నారు. వారు 50 ఏళ్ళకే వంగిపోతున్నారు. 45 ఏళ్ళకే వాళ్లకు కళ్లు మసకలొస్తున్నాయి. రక్త లేమితో బాధపడుతున్నారు. దాని వలన వారు దీర్ఘకాలిక వ్యాధులకు గురి అవుతున్నారు. వారి సంపాదన వైద్య ఖర్చులకు కూడా సరిపోవడం లేదు. సరైన ఆహారం వుంటే వారు బలంగా, దృఢంగా వుంటారు. శక్తివంతంగా వుంటే వారి పిల్లలను బాగా చదివించుకో గలగుతారు. పని పాటల్లో చురుకుగా వుంటారు. వారికి గాని భూమిని ప్రభుత్వం ఇవ్వగలిగితే వారు తమ పొలంలో పండిన ధాన్యాల వల్ల వారు శక్తివంతమైన ఆహారం తీసుకోగలుగుతారు.

దళిత గిరిజన స్త్రీల పట్ల నిర్లక్ష్యం

ఇకపోతే భారత జి.డి.పి.లో 50% వాటా సేవారంగం నుంచే లభిస్తుంది. ఇందులో దళిత, గిరిజన స్త్రీలను నిర్లక్ష్యం చేస్తున్నారు. 2024`25 ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక ప్రగతి ప్రస్తావనలో దళిత, గిరిజన స్త్రీలు లేరు. మరోవైపున దళిత విద్యావంతులైన మహిళలకు పారిశ్రామిక రంగంలో ఇస్తున్న పెద్ద ఎత్తున రాయితీలలో భాగస్వామ్యం కల్పించడం లేదు. కోట్ల రూపాయలు పరిశ్రమలకు ఇస్తున్నారు. కానీ దళిత స్త్రీ పారిశ్రామిక వేత్తలను అభివృద్ధి చేయడం లేదు. ముఖ్యంగా ఇతర దేశాలలో విద్యాభ్యాసం చేసే దళిత బహుజన విద్యార్థినులకు కేంద్ర ప్రభుత్వం 100 స్కాలర్‌షిప్‌లే ఇవ్వడం విడ్డూరం. అందులో దక్షిణాది విద్యార్థినులకు 20 లోపే అందుతున్నాయి. మహిళలపై హింసా, అణచివేత, వేధింపు, అరాచకత్వం, అత్యాచారాలు తగ్గేవి. ఇప్పటికైనా దళిత బహుజన,, గిరిజన స్త్రీల ఆర్థిక సామాజిక రాజకీయ విద్య సాంకేతిక రంగాలలో ప్రభుత్వాలు చిత్తశుద్ధితో అభివృద్ధి చేయటం వలన ప్రపంచ దేశాల సరసన భారతీయ స్త్రీలలో అన్ని తరగతుల వారు తలెత్తుకుని నిలబడతారనేది చారిత్రక సత్యం.

శ్రామిక మహిళలను విస్మరిస్తే చేటు

అంబేడ్కర్‌ రాజ్యాంగం స్త్రీవాద, దళిత బహుజనవాద ఆర్థిక సాంఘిక అభివృద్ధితో కూడి వున్నది. పాలకవర్గాలు ఈ విషయాన్ని విస్మరిస్తున్నాయి. స్త్రీ అభివృద్ధి దేశ అభివృద్ధికి కీలకమైన అంశం. స్త్రీలు జ్ఞాన సంపన్నులు, శ్రమ జీవులు, ప్రకృతిని అవగాహన చేసుకొని జీవన సౌరభాలు వెదజల్లగలిగినవారు. వారిని ఏ దేశం విస్మరిస్తే ఆ దేశం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతుంది. చైనా జపాన్‌ జర్మనీ దేశాలు స్త్రీల శ్రమను గుర్తించి వారిని పారిశ్రామికీకరణలో భాగం చేసారు. అందుకే ఆ దేశాలు అన్ని రంగాల్లో ముందున్నాయి. ఈ రోజున దళిత స్త్రీ పారిశ్రామిక వేత్తలు బ్యాంకుల్లో లోన్లు లభ్యం కాక పరిశ్రమలు పెట్టడానికి స్థలాల కేటాయింపులు దొరకక, భర్తల పేరున ఉన్న ఆస్తులు బ్యాంకు షూరిటీలకు లభ్యం కాక ఎక్కువ మంది బ్యాంకు మేనేజర్లు దళిత స్త్రీలకు అవకాశం ఇవ్వక దళితులను ఉపయోగించుకొని బినామీ అగ్రవర్ణ పారిశ్రామిక వేత్తలు విస్తరించడం వలన బ్యాంకు మేనేజర్లలో ఉన్న పురుషాధిపత్యం స్త్రీ అభివృద్ధి నిరాకరణ వలన దళిత స్త్రీ పారిశ్రామిరంగంలో అభివృద్ధి చెందడం లేదు. అందువలన వీరు కూలీలుగానే మిగిలిపోతున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి పాలకవర్గాలు, ప్రజలు ఇచ్చే ప్రాధాన్యతను బట్టి వారి ఆత్మగౌరవ పతాకం ఆకాశమంత ఎత్తుకు ఎదిగి భారతదేశ కీర్తి నలుదిశల పరివ్యాప్తి చెందే మార్గానికి అంబేడ్కరే దిక్సూచి అని, ఆయన రాజ్యాంగమే ప్రేరణ శక్తి అని చరిత్ర చాటి చెబుతున్న సత్యం. హిందూ కోడ్‌ బిల్లు సాధించి స్త్రీల అభ్యున్నతికి నిలువెత్తు సోపానాన్ని నిర్మించిన అంబేడ్కర్‌ మార్గంలో నడుద్దాం.

డాక్టర్‌ కత్తి పద్మారావు

98497 41695

Advertisement

Next Story

Most Viewed