- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నాణ్యమైన పరిశోధన లేకుంటే..
విశ్వవిద్యాలయాలలో అన్నికోర్సుల్లో పరిశోధనలు వేగంగా జరుగుతున్నాయి. ఈ రంగంలో ఎదురయ్యే సమస్యలు ఇతర పరిశోధనా రంగాలకు కూడా వర్తిస్తాయి. సాధారణంగా పరిశోధన పట్ల స్వతహాగా ఆసక్తి కంటే, పీజీ అయిన వెంటనే హాస్టల్‌లో భోజనం, వసతి, ఇతర ఆర్ధిక అవసరాల కోసం వెంటనే వేరే ఆదాయ మార్గం కనిపించక పోవటంతో విద్యార్ధులు పీహెచ్‌డీలో ఎక్కువమంది చేరుతున్నారు.
ఈ కోర్స్‌లో సీటు లభించగానే కనీసం 3-4 సంవత్సరాలపాటు కొంత రిలీఫ్ దొరుకుతుంది. యూజీసీ ఇతర సంస్థల నుండి కొంత ఆర్థిక వెసులుబాటు కూడా లభి స్తుంది. కానీ పరిశోధకుడు తాను ఎంచు కున్న పరిశోధనా అంశంపై లోతైన అధ్య యనం, అన్వేషణ, ఆలోచన చేయకుండానే రీసెర్చ్ టాపిక్‌ని ఎంచుకుంటున్నాడు. ఆ రంగానికి సంబంధించిన సమగ్ర సమాచా రం, సాహిత్యం, విమర్శనాత్మక వ్యాసాలు, పరిశోధనా నివేదికలు (రిపోర్టులు), గ్రంథ సూచీలు, సమీక్షలు వచ్చాయా లేదా అనే విషయాలను పట్టించుకోకుండానే పరిశోధకులు పీహెచ్‌డీ కోర్సుల్లో చేరి పరిశోధనా టాపిక్‌ను వేగంగా ఎంచు కుంటున్నారు. తీరా పరిశోధనకు ఉపక్రమించాక తగినంత సమాచారం లభించక పరిశోధకుడు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు.
డాక్టరేట్‌ను డిగ్రీగా భావించి..
పరిశోధకుడికి పరిశోధనా అంశంపై స్వతహాగా ఆసక్తి, అభిరుచి, లేకపోతే ఆ పరిశోధన కూడా మొక్కుబడిగా, నిస్సారం గా కొనసాగుతుంది. పరిశోధనా ఫలితా లు కూడా అలాగే పేలవంగా వస్తాయి. అందుకే చాలామంది పరిశోధకులు ఒకసారి పీహెచ్‌డీ అవార్డు అందుకున్నాకా, కనీసం తమ పరిశోధనా థీసిస్ మొహం కూడా చూడరు. దీనిని పీహెచ్‌డీని విద్యారంగంలో సాధించదగిన ఉన్నత డిగ్రీగా భావిస్తారు. ఈ డిగ్రీతో ఉద్యోగం దొరికాక తమ పేరుకు ముందు డాక్టర్ అనే పదాన్ని చూసుకొని సంతృప్తి పడతారు. డాక్టరేట్ అనేది ఒక ప్రాథమిక సోపానం అనే విషయాన్ని మరచిపోయి అంతిమ, అత్యుత్తమ డిగ్రీగా భావిస్తారు.
ఒక విషయాన్ని ఒక పరిశోధనా దృష్టితో చూడటానికి మాత్రమే పీహెచ్‌డీ ఉపయోగపడుతుంది. చాలా మంది పోస్ట్ డాక్టోరల్ వర్క్‌ను చేపట్టటం లేదు. విద్యా దాహం, పరిశోధనా దృష్టి నిరంతరం కొనసాగే వ్యాపకం, వ్యసనం కావాలి. తాము చేసిన పరిశోధనా రంగలో ప్రపంచ వ్యాప్తంగా నూతన పోకడలు, వినూత్న అంశాలు, పరిశోధనా పురోగతిని వివిధ మాధ్యమాల్లో గమనిస్తుండాలి. పరిశోధకుడు తనకు తాను అప్‌డేట్ అవుతూ ఉండాలి. తరచుగా పరిశోధనా జర్నల్స్‌ను చదవాలి. నిత్యం తమ సబ్జెక్ట్‌పై సమకాలీన విషయాలపై నూతన తరానికి పనికి వచ్చే రచనలను సులభ భాషలో పత్రికలు, పరిశోధనా జర్నల్స్‌లో రాస్తూ ఉండాలి. ఇతరులు రాస్తున్న వాటిని చదువుతూ తమ అవగాహనా పరిధిని పెంచుకోవాలి. విద్య నిరంతరం కొనసాగే ప్రక్రియ. ఒక డిగ్రీతో, ఉద్యోగంతో జ్ఞానాన్వేషణ అంతం కాదు.
సబ్జెక్టును గైడ్ బలవంతంగా రుద్దితే..!
చాలామంది పరిశోధక సూపర్ వైజర్లు తమకు ఆసక్తి, పరిచయం ఉన్న అంశాలపైనే లేదా ప్రత్యేక విభాగంలోనే తమ స్కాలర్లకు రీసెర్చ్ టాపిక్‌లను ఇస్తూ కొన్నిసార్లు బలవంతంగా రుద్దుతుంటారు. అయితే ఈ రోజుల్లో పరిశోధకుని ఆసక్తితో పాటు ఉద్యోగ, ఉపాధి అవసరాన్ని గమనించి ఆ టాపిక్ ఇవ్వడం కూడా అవసరమే. అలాగే చాలా మంది పర్యవేక్షకులకు ఒక బలహీనత ఉంటుంది. తాము చెప్పిందే వేదం అనుకుంటారు. రీసెర్చ్ స్కాలర్ భావజాలం, అభిరుచి, అభినివేశం, స్వయం నిర్ణయాలు, భిన్న వ్యక్తిత్వం వారికి నచ్చవు. అప్పుడు విధిలేక పరిశోధకుడు తన పర్యవేక్షకుడి నిర్ణయం మేరకు డిగ్రీ కోసం తమ ఆసక్తిని చంపుకుని రాజీపడతారు. లేదా రీసెర్చినే మధ్యలో వదిలేస్తారు. సూపర్ వైజర్లకు చాలా మందికి రీసెర్చ్ స్కాలర్ల పట్ల చిన్న చూపు ఉంటుంది. వారితో వెట్టి చాకిరీ చేయించుకొన్న సందర్భాలు, హేళన చేసి, చిన్న బుచ్చిన ఉదంతాలు కూడా లేకపోలేదు. కొన్నిచోట్ల మహిళా స్కాలర్ల పట్ల లైంగిక వేధింపులు, అనుచిత ప్రవర్తనలపై ఆరోపణలు వచ్చిన ఉదాహరణలు ఉన్నాయి. ఇలాంటి కేసులు చాలావరకు స్కాలర్ల భవిష్యత్తు దృష్ట్యా వెలుగు చూడవు. అందరినీ ఒకే గాటన కట్టలేము. మినహాయింపులు ఎక్కడైనా ఉంటాయి.
పరిశోధనతోటే ప్రగతి బాట
విశ్వవిద్యాలయాల్లో అప్పుడప్పుడు కొన్ని అపశృతులు దొర్లినా ప్రజాస్వామ్య వాతావరణం ఉంటుంది. పరిశోధన చేసే వారిలో అత్యధికులు అట్టడుగు సామాజిక వర్గాల వాళ్లే కావటం హర్షనీయం. ప్రస్తుతం మన దేశ విశ్వవిద్యాలయాల్లో ఉన్నత విద్యకు, పరిశోధనలకు బడ్జెట్‌లో కేటాయింపులు ప్రతి సంవత్సరం గణనీయంగా పడిపోతున్నాయి. యూజీసీ ప్రాధాన్యత తరిగిపోయింది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మన విశ్వ విద్యాలయ స్థాయి, పరిశోధనల స్థాయి కూడా క్రమంగా పడిపోతుంది. నిధులు, వసతులు సమకూర్చడంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతుంది. గత 15 ఏళ్లుగా ప్రొఫెసర్ల నియామకాలు నిలిచిపోయాయి. పార్ట్ టైం, గెస్ట్ లెక్చరర్లతో అతి కష్టంగా విద్యాబోధన జరుగుతుంది. ఇక ఇతర సిబ్బంది నియామకాలు కూడా నిలిచిపోయాయి. ప్రభుత్వ విశ్వ విద్యాలయాలు వసతుల లేమితో అవస్థలు పడుతున్నాయి. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు విద్యను దేశ భవిష్యత్తుగా భావించాలి. నిరర్ధక ఖర్చుగా చూడరాదు. యువత భవిష్యత్తుకు, దేశ ప్రతిష్టకు విద్యపై పట్టే ప్రతిపైసా పెట్టుబడిగా చూడాలి. నాణ్య మైన విద్య, పరిశోధన లేకుండా ఏ దేశం కూడా ప్రగతి సాధించలేదు.
డా.కోలాహలం రామ్ కిశోర్
98493 28496