మరోకోణం: బీజేపీ వ్యూహంతోనే మునుగోడు ఉపఎన్నిక జరగనుందా?

by D.Markandeya |   ( Updated:2022-09-27 10:02:26.0  )
మరోకోణం: బీజేపీ వ్యూహంతోనే మునుగోడు ఉపఎన్నిక జరగనుందా?
X

రాష్ట్రంలో మరో ఉప ఎన్నిక ఖాయమైంది. దుబ్బాక, హుజూర్‌నగర్, నాగార్జునసాగర్‌, హుజూరాబాద్‌ తర్వాత ఇప్పుడు మునుగోడు శాసనసభ నియోజకవర్గానికి బై ఎలక్షన్ జరగనుంది. 2018 ఎన్నికలలో అక్కడ గెలిచిన కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి తన శాసనసభ్యత్వాన్ని వదులుకోనున్నారు. కాంగ్రెస్ పార్టీకి సైతం ఆయన గురువారం రాజీనామా చేశారు. తాను పార్టీని వదిలి వెళ్లడానికి పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డే కారణమని, అనేకమార్లు పార్టీలు మార్చి, ప్రజాప్రతినిధి చేయకూడని పనులు చేసి జైలుకు వెళ్లిన వ్యక్తి ఆధ్వర్యంలో తాను పనిచేయలేనని ఈ సందర్భంగా ఆయన సోనియాకు లేఖ రాశారు.

రేవంత్ అధ్యక్షుడైనప్పటి నుంచీ జూనియర్ కోమటిరెడ్డి ఆగ్రహంగానే ఉన్నారు. పలుమార్లు బహిరంగంగానే రాష్ట్ర పార్టీ తీరుతెన్నులను విమర్శించారు. తాను బీజేపీలోకి వెళ్లడం ఖాయమన్న సంకేతాలను ఇచ్చారు. ఏడాది కాలంగా ఈ తతంగం కొనసాగుతూ ఒకరకంగా ఆయన మాటలను ఎవరూ నమ్మని పరిస్థితి ఏర్పడింది. స్పీకర్ అపాయింట్‌మెంట్ కోరానని, స్పీకర్ ఫార్మాట్‌లోనే రాజీనామా పత్రాన్ని సమర్పిస్తానని ప్రకటించారు కనుక ఇప్పుడు అది నిజం కాబోతున్నది.

ఎందుకంత తొందర?

ఒకవైపు కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళతారనే టాక్ రాష్ట్రంలో జోరుగా నడుస్తోంది. ఈ డిసెంబర్‌లో గుజరాత్‌తోనో లేదంటే వచ్చే మేలో కర్ణాటకతోనో ఎన్నికలకు వెళ్లడానికి వీలుగా మంచి ముహూర్తం చూసుకుని ఆయన శాసనసభ రద్దుకు సిఫారసు చేస్తారని అనుకుంటున్నారు. టీఆర్ఎస్ నేతలు, ఎమ్మెల్యేలు ఈ విషయాన్ని బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. ప్రతిపక్షాలు సైతం ఇదే అభిప్రాయంతో ఉన్నాయి.

పోల్ మేనేజ్‌మెంట్ అవసరాల కోసం వివిధ పార్టీలకు చెందిన ఆశావహులు ముందు జాగ్రత్త చర్యగా గ్రామాలలో డబ్బులు సైతం డంపు చేసుకుంటున్నారు. అయినప్పుడు ఇలాంటి సమయంలో మునుగోడు ఉపఎన్నికకు బీజేపీ ఎందుకు స్కెచ్ వేసినట్టు? పార్టీలో చేరాలంటే శాసనసభ సభ్యత్వానికి ముందే రిజైన్ చేయాలని రాజగోపాలరెడ్డికి షరతు ఎందుకు పెట్టినట్టు? అమిత్ షా, నడ్డాతో పాటు ఆ పార్టీ అగ్రశ్రేణి నాయకత్వమంతా మునుగోడుపై ఎందుకు కేంద్రీకరిస్తున్నట్టు? అక్కడ గెలవడం ద్వారా ఆ పార్టీ ఏం సాధించాలనుకుంటున్నది? తెలంగాణలో పాగా వేసే పకడ్బందీ వ్యూహంలో భాగంగానే ఇదంతా జరుగుతోందా? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు విశ్లేషకుల మదిలో మెదులుతున్నాయి.

అందుకోసమే ముందడుగు

మునుగోడు ఉపఎన్నికను బీజేపీ కోరుకోవడానికి బలమైన కారణాలే ఉన్నాయి. 2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఆ పార్టీ రాష్ట్రంలో వరుసగా పాజిటివ్ ఫలితాలను సాధించింది. ఆ ఎన్నికలలో కేవలం రాజాసింగ్ ఒక్కరే ఎమ్మెల్యేగా గెలిచినా, ఐదు నెలల తర్వాత వచ్చిన లోక్‌సభ ఎన్నికలలో నాలుగు ఎంపీ స్థానాలను చేజిక్కించుకోగలిగింది. అటు తర్వాత జీహెచ్ఎంసీ ఎన్నికలలో అధికార పార్టీకి గట్టి పోటీ ఇచ్చి, దుబ్బాక ఉపఎన్నికలో విజయదుందుభి మోగించింది.

సాగర్‌లో ఉనికిని చాటుకోవడంలో విఫలమైనా, హుజూరాబాద్‌లో ఈటెల గెలుపు ఆ పార్టీ ప్రతిష్టను అమాంతం పెంచేసింది.అధికార టీఆర్ఎస్‌కు ఇక బీజేపీయే ప్రత్యామ్నాయమని, కాంగ్రెస్ మూడో స్థానంతో సరిపెట్టుకోక తప్పదనే చర్చను రాజకీయవర్గాలలో తెచ్చింది. ఓ వైపు బండి సంజయ్ ప్రజాసంగ్రామయాత్ర, మరోవైపు మోడీ, షా సహా అగ్రనేతల పర్యటనలు వెరసి కమలదళం జోష్‌ను భారీగా పెంచాయి. సీఎం కేసీఆర్ కూడా ఇటీవల కాంగ్రెస్‌ను వదిలేసి మోడీ సర్కారు పైన, బీజేపీ పైనా తీవ్రంగా విరుచుకు పడుతుండడం కూడా కలిసివచ్చింది. ఇక అధికారం చేజిక్కడమొక్కటే మిగిలిందనే స్థాయిలో ఆ పార్టీ నేతలు ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శిస్తున్నారు.

గెలుపు బాటన నడిచేందుకే

అయితే, ఇల్లలకగానే పండుగ కాదన్నట్లుగా, రాజకీయ ఆధిపత్యం ఒక్కటే గెలుపునకు ప్రాతిపదిక ఎంతమాత్రం కాబోదని ఆ పార్టీ థింక్ టాంక్‌కు తెలుసు. ఇంటెలిజెన్స్ వర్గాలు సహా ఇటీవల పలు సంస్థలు నిర్వహించిన సర్వేలలో బీజేపీకి 15 నుంచి 20 స్థానాలు మాత్రమే వస్తాయని వెల్లడైంది. అంతర్గత కుమ్ములాటలతో కుదేలైనప్పటికీ కాంగ్రెస్ పార్టీకి 40 కి అటూ ఇటూగా రావచ్చనే విశ్లేషణలు వచ్చాయి. మెజారిటీ స్థానాలలో పోటీ ప్రధానంగా టీఆర్ఎస్-కాంగ్రెస్‌ మధ్యే ఉంటుందని, అనేక సెగ్మెంట్లలో కమలనాథులకు అభ్యర్థులే లేరని బయటపడింది.

ముఖ్యంగా దక్షిణ తెలంగాణలో ఆ పార్టీ చాలా బలహీనంగా ఉందని ఈ సర్వేలు తేల్చాయి. పట్టణ ప్రాంతాలలో మాత్రమే ప్రాబల్యముందని, గ్రామీణ ఓటర్లకు పువ్వు గుర్తు అంతగా పరిచితం కాలేదని కూడా సర్వేలు పేర్కొన్నాయి. మరోవైపు, తెలంగాణ కాంగ్రెస్ కాస్త గాడిలో పడి, ప్రజలలో వర్క్ చేస్తే ఆ పార్టీకి వచ్చే ఎన్నికలలో విజయావకాశాలు మెండుగా ఉన్నాయన్న విషయాన్ని ఈ సర్వేలు ధ్రువ పరిచాయి.

ప్రత్యర్థులను దెబ్బతీయాలని

ఈ వ్యతిరేక పరిస్థితులను అనుకూలంగా మార్చుకోవడానికి బీజేపీ హైకమాండ్ ద్విముఖ వ్యూహాన్ని రచించినట్లు కనిపిస్తోంది. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నుంచి పెద్దయెత్తున చేరికలను ప్రోత్సహిస్తూ ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉన్న పార్టీ బీజేపీయే అన్న టాక్‌ను ప్రజల్లో కలగజేయడం మొదటిది. కేసీఆర్ ముందస్తుకు వెళ్లే లోపే వీలైనన్ని స్థానాలలో ఉప ఎన్నికలు వచ్చేలా చక్రం తిప్పి, వాటిలో గెలవడం ద్వారా టీఆర్ఎస్, కాంగ్రెస్‌ను కోలుకోలేని విధంగా దెబ్బతీయడం రెండవది.

ఇందులో భాగంగానే కాంగ్రెస్‌కు సిట్టింగ్ స్థానంగా ఉన్న మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాలరెడ్డి వస్తాననగానే రాజీనామా షరతు పెట్టారు. త్వరలో మరిన్ని ఉప ఎన్నికలు రావడం ఖాయమంటూ స్టేట్ చీఫ్ బండి సంజయ్, చేరికల కమిటీ చైర్మన్ ఈటల ప్రకటించడం ఈ విషయాన్నే తెలియజేస్తుంది. వరస ఉపఎన్నికలలో విజేతగా నిలువడం ద్వారా రాష్ట్రంలో వచ్చే ఎన్నికలు టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీగా జరిగేలా చూడడం ఆ పార్టీ అగ్రనేతల లక్ష్యంగా కనిపిస్తోంది. తద్వారా కేంద్రంలో తమ ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్‌ రాష్ట్రంలో కనుమరుగు కావడాన్ని ఆశిస్తున్నారు.

ఆయన కోరికా అదే

విచిత్రంగా సీఎం కేసీఆర్ కూడా వచ్చే ఎన్నికలు టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీగానే జరగాలని కోరుకుంటున్నారు. అందుకు ఆయన కారణాలు వేరుగా ఉన్నాయి. పోరు టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీగా జరిగితే ప్రభుత్వ వ్యతిరేక పవనాలు ఆ పార్టీ పైనే ప్రభావం చూపుతాయని, మోడీ సర్కారు ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టడం ద్వారా పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకోవచ్చునని ఆయన ఆశిస్తున్నారు. అంతేగాకుండా, బీజేపీ మతతత్వ రాజకీయాలను వ్యతిరేకించే మైనారిటీల, దళితుల, వామపక్షాల, నక్సలైట్ల ఓటు బ్యాంకు అంతా టీఆర్ఎస్ వైపు మళ్లుతుందని నమ్ముతున్నారు.

అలా కాకుండా టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్‌గా జరిగిన పక్షంలో కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వాల వ్యతిరేక ఓటు, పైన పేర్కొన్న వర్గాల ఓటు మూకుమ్మడిగా హస్తం గుర్తుకు పడుతుందని శంకిస్తున్నారు. కాంగ్రెస్ పుంజుకుంటోందన్న సంకేతాలు ప్రజలలోకి వెళితే, ఆటోమాటిక్‌గా తమకు నష్టం వాటిల్లుతుందని, ఇప్పటికీ గ్రామస్థాయిలో ఆ పార్టీ బలంగా ఉందని భావిస్తున్నారు. అందుకే ఆయన గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీని విమర్శించడం మానేసి కాషాయదళంపై పడ్డారు.

ఇంతకీ ఏం జరుగుతుంది?

మొత్తంగా చూస్తే, వచ్చే శాసనసభ ఎన్నికలలో ఏ రెండు పార్టీల మధ్య ప్రధాన పోటీ ఉండబోతోందన్న అంశం పైననే ప్రస్తుతం అందరి వ్యూహాలూ కేంద్రీకృతమయ్యాయి. మునుగోడు అందుకు తొలివేదిక కాబోతున్నది. ఇక్కడ జరిగే ఎన్నికలలో బీజేపీ గెలుస్తుందా? లేదంటే టీఆర్ఎస్ కైవసం చేసుకుంటుందా? అంతర్గత తిరుగుబాట్లతో సతమతమవుతున్న కాంగ్రెస్‌కు డిపాజిట్ అయినా దక్కుతుందా? కమలనాథులు చెప్పినట్లు మునుగోడుతో పాటు మరికొన్ని ఉప ఎన్నికలు జరుగుతాయా? లేదంటే ముందస్తు ముంగిట ఓటమికి భయపడి సీఎం కేసీఆర్ ఈలోపే అసెంబ్లీ రద్దుకు సిఫారసు చేసి గుజరాత్‌తో పాటు ఎన్నికలకు వెళతారా? త్వరలోనే తేలిపోనుంది.

డి.మార్కండేయ

[email protected]

Advertisement

Next Story