నడుస్తున్న చరిత్ర: బీజేపీ సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీస్తుందా?విపక్ష పార్టీలపై బీజేపీ వ్యూహమేంటి?

by Ravi |   ( Updated:2022-09-03 13:56:30.0  )
నడుస్తున్న చరిత్ర: బీజేపీ సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీస్తుందా?విపక్ష పార్టీలపై బీజేపీ వ్యూహమేంటి?
X

అసెంబ్లీ ఎన్నికల దాకా ఆగకుండా మధ్యలోనే విపక్ష ప్రభుత్వాలను దింపి తమ పార్టీ ప్రభుత్వాలను ఏర్పాటు చేయడం 2019 నుంచి బీజేపీ ముఖ్య కార్యక్రమంగా మారిపోయింది. దీని వలన రాష్ట్రాలలో సజావుగా సాగవలసిన పాలనా కుంటపడుతోంది. బొటాబొటి మెజారిటీతో ఏర్పడిన ప్రభుత్వాలు బీజేపీ దెబ్బకు తట్టుకోలేకపోతున్నాయి. సంకీర్ణ ప్రభుత్వాల దృష్టి అంతా పాలన వైపు కాకుండా ఎన్నాళ్లు పాలనలో ఉంటామో అన్న బెంగతోనే గడుస్తోంది. ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు లాంటి పూర్తి మెజారిటీ ప్రభుత్వాలను కూడా కేంద్రం ప్రశాంతంగా ఉండనీయడం లేదు. ఎమ్మెల్యేలపై ఈడీ, సీబీఐ దాడులతో వాటికీ నిద్ర పట్టకుండా చేస్తోంది. రాజకీయాలలో నేరగాళ్లను ఏరివేయడం అత్యవసరమే కానీ రాజకీయ కక్ష, లబ్ధి కోసం భాజపా పాలన లేని రాష్ట్రాలపై ఇవి విరుచుకుపడడం వివక్ష కిందికే వస్తుంది.

జాతీయ పార్టీలకు ఓ రోగముంటది. కేంద్రంలో అధికారం చేజిక్కగానే దేశంలో ఉన్న రాష్ట్రాలన్నీ తమ పార్టీ పాలన లోకి రావాలని దురాలోచనతో పడతాయి. ఇతర పార్టీ పాలకులను పరాయి వ్యక్తులుగా, పాలనకు వారికి హక్కు లేనట్టుగానే వ్యవహరిస్తాయి. 1957లో కేరళ మొదటి ముఖ్యమంత్రిగా గద్దెనెక్కిన సీపీఐ నేత నంబూద్రిపాద్ పాలనకు, ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ రాష్ట్రంలో అల్లర్లు సృష్టించి అక్కడ కమ్యూనిస్టుల పాలనను ముందుకు సాగనీయలేదు. రెండేళ్లకే అల్లర్ల సాకుతో నెహ్రూ ప్రభుత్వం కేరళలో రాష్ట్రపతి పాలన తెచ్చి ప్రజా తీర్పునే పక్కన పెట్టింది.కమ్యూనిస్టులంటే ఓర్వలేనితనమే ఆ అధికార దుర్వినియోగానికి మరో మూలమైంది.

తెలుగుదేశం పార్టీ అధినేతగా ఎన్‌టీ రామారావు 1983లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పదవి చేపట్టిన ఏడాదికే గవర్నర్ రాంలాల్‌ను పాచికలా వాడుకొని ఇందిరమ్మ ఎన్‌టీఆర్‌ను దింపేసి భంగపడింది. రామారావు చికిత్స నిమిత్తం విదేశాలలో ఉన్నవేళ బలనిరూపణ లేకుండానే మరొకరిని సీఎం సీట్లో కూర్చోబెట్టడం అతి నీచమైన 'కేంద్ర'రాజకీయ ప్రక్రియ.అహంకారం, కన్నుకుట్టు ఇలాంటి కుచ్చితాలకు బీజం వేస్తుంది. ఈ విద్యలో భారతీయ జనతా పార్టీ నాలుగు ఆకులు ఎక్కువే చదివింది అనవచ్చు.

ఫిరాయింపులకు కొత్త రూట్లు

బీజేపీ కాకుండా దేశంలో ప్రాంతీయ లేదా ఇతర పార్టీలు పాలిస్తున్న రాష్ట్రాలను ఎలాగైనా పడగొట్టి తన ఖాతాలో వేసుకోవడానికి అది ఎలాంటి ప్రయత్నమైనా చేస్తుందని గత కొన్నేళ్లుగా దేశవ్యాప్తంగా సాగుతున్న రాజకీయ పన్నాగాలను చూస్తే అర్థమవుతుంది. ఎన్నికలలో ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాకపోతే అది బీజేపీ పిడికిట్లోకి వెళ్లిపోవడం జరుగుతోంది. మెజారిటీకి దగ్గరలో ఉన్న పార్టీల ఎమ్మెల్యేలను రకరకాల ప్రణాళికలతో తమవైపు తిప్పుకొని పాలనను కైవసం చేసుకుంటోంది. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో తీరైన పన్నాగం రచించి దేశ రాజకీయ చరిత్రలోనే పార్టీ ఫిరాయింపులకు కొత్త రూట్లు కనుగొంటోంది. సగం మందైనా ఫిరాయించనిదే చట్టప్రకారం అది పార్టీ అతిక్రమణ కిందికి వస్తుంది, శాసన‌సభ్యత్వం ఊడిపోతుంది.

ఫిరాయింపుతో సాధ్యం కానందున అవసరమున్న సంఖ్య మేరకు 15 మంది సభ్యులతో రాజీనామా చేయించి కర్ణాటకలో కుమారస్వామి ప్రభుత్వాన్ని కూల్చడం ఎవరికీ తట్టని సరికొత్త ఆలోచనగా నిలుస్తుంది. బీజేపీ ఈ చాతుర్యాన్ని కర్ణాటక రాష్ట్రంలో ప్రదర్శించి పాలనను కైవసం చేసుకుంది. మధ్యప్రదేశ్‌లో 2018లో కాంగ్రెస్ టికెట్టుపై గెలిచిన 22 మంది ఎమ్మెల్యేల రాజీనామా తంత్రంతో కమలనాథ్ మూణ్ణెల్ల పాలనను ముగించి శివరాజ్ చౌహాన్‌ను తిరిగి ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టింది. తమకు మెజారిటీ లేకపోతే తమకన్నా ఎక్కువ సభ్యులున్న పార్టీ నుంచి కొందరిని రాజీనామా చేయించి తమదే అధిక సభ్యులున్న పార్టీ అని పాలనకు సిద్ధమవడం జరుగుతోంది.మధ్యప్రదేశ్‌లో ఈ తతంగమంతా జ్యోతిరాదిత్య సింధియా ముందుండి నడిపించాడు. దానికి ప్రతిఫలంగా 2019లో ఎంపీగా గెలువని ఆయన రాజ్యసభ సభ్యుడై ఇప్పుడు కేంద్రంలో మంత్రి పదవి లో కూచున్నాడు.

ప్రశాతంగా ఉండనీయకుండా

మహారాష్ట్రలో శివసేన నుంచి 40 మంది ఎమ్మెల్యేలను ఆకర్షించి సంకీర్ణ ప్రభుత్వాన్ని దించివేసింది. 2020 రాజస్థాన్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు అదే పార్టీకి చెందిన యువ ఎంపీ సచిన్ పైలెట్‌తో కొంత కథ నడిపింది. చివరకు రాహుల్, ప్రియాంక బుజ్జగింపులతో సచిన్ మెత్తబడడంతో జైసల్మేర్ హోటల్‌లో పార్టీ మారడానికి సిద్ధంగా ఉన్న ఎమ్మెల్యేలు వెనక్కి వచ్చారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల దాకా ఆగకుండా మధ్యలోనే విపక్ష ప్రభుత్వాలను దింపి తమ పార్టీ ప్రభుత్వాలను ఏర్పాటు చేయడం 2019 నుంచి బీజేపీ ముఖ్య కార్యక్రమంగా మారిపోయింది. దీని వలన రాష్ట్రాలలో సజావుగా సాగవలసిన పాలనా కుంటపడుతోంది. బొటాబొటి మెజారిటీతో ఏర్పడిన ప్రభుత్వాలు బీజేపీ దెబ్బకు తట్టుకోలేకపోతున్నాయి.సంకీర్ణ ప్రభుత్వాల దృష్టి అంతా పాలన వైపు కాకుండా ఎన్నాళ్లు పాలనలో ఉంటామో అన్న బెంగతోనే గడుస్తోంది.

ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు లాంటి పూర్తీ మెజారిటీ ప్రభుత్వాలను కూడా కేంద్రం ప్రశాంతంగా ఉండనీయడం లేదు. ఎమ్మెల్యేలపై ఈడీ, సీబీఐ దాడులతో వాటికీ నిద్ర పట్టకుండా చేస్తోంది. రాజకీయాల్లో నేరగాళ్లను ఏరివేయడం అత్యవసరమే కానీ రాజకీయ కక్ష, లబ్ధి కోసం బీజేపీ పాలన లేని రాష్ట్రాలపై ఇవి విరుచుకుపడడం వివక్ష కిందికే వస్తుంది. మన దేశంలో ప్రజాప్రతినిధులను ఒక రాష్ట్రంలో నిజాయితీపరులని, ఇంకో రాష్ట్రంలో అవినీతిపరులని విభజించలేము. ఎన్నికల అఫిడవిట్ పరిశీలిస్తే నేరారోపణలు ఉన్నవాళ్లు అన్ని పార్టీలలో, అన్ని రాష్ట్రాలలో కనిపిస్తారు. నేరం, అవినీతి, రాజకీయం తోబుట్టువుల్లా ఉన్న కాలంలో ఒక నేరగాన్ని మరో నేరగాడు వేటాడడమే నేటి పాలనగా భావించాలి. బీజేపీలో చేరే దాకా విచారణ, నిఘా సంస్థలు కొరడాతో వెంటాడి శరణు జొచ్చాక కేసును పక్కన పెట్టడం ఆ పార్టీ రాజనీతిలో ఒకటి.

లేని శత్రువులను కొని తెచ్చుకొని

ఈ మధ్య జరిగిన రాష్ట్రపతి ఎన్నికలలో బీజేపీకి అనుకూలంగా కొన్ని విపక్షాలు నడుచుకున్నాయి. వాటిలో వివిధ రాష్ట్రాలలో అధికారంలో ఉన్న బిజూ జనతాదళ్, వైఎస్సార్సీపీ, ఝార్ఖండ్ ముక్తి మోర్చా కూడా ఉన్నాయి. కత్తులు దూసుకున్న ఉద్ధవ్ శివసేన, టీడీపీ సైతం బీజేపీకి తోడు నిలిచాయి. కాంగ్రెస్ బలపరచిన అభ్యర్థి యశ్వంత్ సిన్హా తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే, టీఆర్‌ఎస్, ఆమ్ ఆద్మీ, కమ్యూనిస్టులు బహిరంగ మద్దతునిచ్చారు. అందువల్ల తెలంగాణ, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు, ఢిల్లీ, పంజాబ్ ప్రభుత్వాలు బీజేపీ డేగ కన్ను కింద బతుకక తప్పదు. తెలంగాణ విషయానికొస్తే గతంలో బీజేపీ ఇక్కడ ప్రజల మద్దతు లేని ఒక సాధారణ పార్టీ. 2014 లో అయిదు అసెంబ్లీ స్థానాలలో గెలిచినా 2018లో కేవలం ఒకే స్థానానికి పరిమితమైంది.

రెండోసారి అసెంబ్లీ ఎన్నికలలో ఘన విజయం సాధించిన టీఆర్‌ఎస్‌కు, తర్వాత ఆరు నెలలలో జరిగిన పార్లమెంటు ఎన్నికలలో ఊహించని దెబ్బ తగిలింది. తెలంగాణాలో నాలుగు ఎంపీ సీట్లు గెలవడంతో బీజేపీకి ఎన్నడూ లేని కొత్త ఊపు వచ్చింది. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేటర్‌గా కొనసాగుతూ 2014,2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన బండి సంజయ్ కుమార్ ఊహించని రీతిలో కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నిక కావడంతో కాలక్రమంగా తెలంగాణ రాజకీయ ముఖచిత్రమే మారిపోయిందనవచ్చు. దానికి తోడుగా పదేళ్లకు పైగా క్రియాశీలంగా పనిచేస్తున్న ఎం. రఘునందన్ రావును చిన్న కారణంగా సస్పెండ్ చేసి టీఆర్‌ఎస్ దుబ్బాకను బీజేపీకి అప్పగించింది. ఇక హుజురాబాద్ సంగతి అందరికి తెలిసిందే. మోసినవారందరిది టీఆర్‌ఎస్ జెండా అన్న మాటని జీర్ణించుకోలేక 'ఈటల'ను పోగొట్టుకొని బీజేపీని మరింత బలోపేతం చేసింది. లేని శత్రువులను తెచ్చుకొని కేసీఆర్ పెంచి పోషించినట్లయింది.

ప్రజా తీర్పును గౌరవించాలి

ఇలాంటి రాజకీయ వైషమ్యాల వల్ల చివరకు రాష్ట్రాల అభివృద్ధిపై ప్రభావం ఉంటుంది. ఐదేళ్ల ప్రజా తీర్పును గౌరవించవలసిన కనీస బాధ్యత అన్ని పార్టీలపై ఉంటుంది. నిజానికి తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెట్టి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఏ బీజేపీ పాలిత రాష్ట్రాలలోనూ లేవు. అందువలన పెరిగిన అప్పుల కారణంగా ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టే ప్రయత్నం బీజేపీ చేస్తోంది. అప్పులకు కాలడ్డం పెట్టి ఆర్థిక ఇబ్బందులను తెచ్చి జీతాలీయలేని సర్కారని ప్రచారం చేస్తోంది.అనవసరంగా మునుగోడు ఎపిసోడును తెర మీదికి తెచ్చి రాజకీయ గందరగోళంతో పాలనను అస్థిరం చేస్తోంది.

కేంద్రంతో యుద్దానికి అన్ని విధాలా సన్నద్ధం సాధ్యం కాలేని కేసీఆర్ పరిస్థితి రెండడుగులు ముందుకు, మూడడుగులు వెనక్కి అన్నట్లే ఉంది. ఏది ఏమైనా రాజకీయ పార్టీలు మళ్ళీ ఎన్నికలొచ్చేదాకా ఓపిక పట్టాలి. ఉప ఎన్నికల రాజకీయాలు మొదలైతే ప్రభుత్వాలే కాదు అభ్యర్థులు కూడా దివాళా తీసే రోజులు వస్తాయి.

బి.నర్సన్

9440128169

Advertisement

Next Story

Most Viewed