- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- వైరల్
ఎస్సీ వర్గీకరణ హామీ ఓట్లు రాలుస్తుందా..?
ఒకటోసారి, రెండోసారి, మూడోసారి ఇలా పలుమార్లు వివిధ పార్టీలు ఎస్సీ వర్గీకరణ కోసం హామీ ఇచ్చాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు హామీ ఇవ్వడం, అధికారంలోకి రాగానే ఈ అంశాన్ని విస్మరించడం రాజకీయ పార్టీలకు పరిపాటిగా మారింది. గత ముప్పై ఏళ్లుగా వర్గీకరణ కోసం పోరాడుతున్న మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ హైదరాబాద్‌లో నిర్వహించిన అణగారిన వర్గాల విశ్వరూప సభకు నరేంద్రమోదీ ప్రధానమంత్రి హోదాలో వచ్చి మాదిగల పోరాటంలో తోడుంటానని, ఎస్సీ వర్గీకరణపై కమిటీ ఏర్పాటు చేసి వారికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో ఎమ్మార్పీఎస్ డిమాండ్లను బీజేపీ అంగీకరించిందా? లేక దేశవ్యాప్తంగా మాదిగల మాదిరి దళిత ఉప కులాల ఓట్లను ఆకర్షించడానికి దీన్నొక రాజకీయ అస్త్రంగా చూస్తోందా? అనే చర్చ మొదలయింది.
రాష్ట్రవ్యాప్త నెట్‌వర్క్ విస్తరించుకొని..
ఒకే గ్రూపులో ఉన్నప్పటికీ ఏ రెండు కులాలూ సమానంగా ఉండవని, వర్ణవ్యవస్థలో కులాలన్నీ నిచ్చెన మెట్లలా ఉంటాయని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అంటారు. ఈ సమస్య దేశవ్యాప్తంగా దళిత, బహుజన ఉప సమూహాలలో ప్రతిబింబిస్తోంది. ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ఇరువురూ ఎస్సీ జాబితాలో ఉన్నప్పటికీ మాలలు, మాదిగలను చిన్నచూపు చూస్తారు. మాలల కంటే మాదిగల జనాభా ఎక్కువ. అయినప్పటికీ మాలలతో పోలిస్తే విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాలలో మాదిగలు తక్కువ ప్రయోజనం పొందుతున్నారని ఎమ్మార్పీఎస్ పోరాటం మొదలుపెట్టింది. ఎస్సీ రిజర్వేషన్లను కూడా బీసీ రిజర్వేషన్ల తరహాలో ఎ,బి,సి,డి లుగా వర్గీకరించి జనాభా, సామాజిక, ఆర్థిక స్థితిగతుల ఆధారంగా రిజర్వేషన్లను పంచాలనే డిమాండ్‌తో ఈ ఉద్యమం మొదలైంది. ఉమ్మడి ఏపీలోని ప్రకాశం జిల్లాలో 1994 జూలై 7న మంద కృష్ణ మాదిగ ఎమ్మార్పీఎస్‌ను ఏర్పాటు చేశారు. కేవలం 20 మంది యువకులు ప్రారంభించిన ఈ ఉద్యమం అనతి కాలంలోనే రాష్ట్రమంతా వ్యాపించింది. ఎమ్మార్పీఎస్ హక్కుల కోసం పోరాడే ఒక సంఘంలా ప్రయాణం మొదలుపెట్టినప్పటికీ, రెండు తెలుగు రాష్ట్రాల్లో గ్రామస్థాయి కమిటీలు, గ్రౌండ్ లెవల్ క్యాడర్‌తో ఎమ్మార్పీఎస్ రాజకీయ పార్టీలకు సమానంగా ఎదిగింది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాలకు కూడా తన నెట్‌వర్క్‌ను విస్తరించింది. 30 ఏళ్లుగా ఎస్సీ వర్గీకరణను నిత్యం చర్చలో ఉంచుతూ ఈ అంశాన్ని రాజకీయ పార్టీలు తమ మేనిఫెస్టోలో చేర్చేలా ఎమ్మార్పీఎస్ విజయం సాధించినా, వర్గీకరణ కల మాత్రం సాకారం చేసుకోలేకపోయింది.
ఎస్సీ వర్గీకరణకు అడ్డంకేమిటి?
బీహార్‌లో కులగణన గణాంకాలు బహిర్గతం అయ్యాక కులగణన ఆధారంగా రిజర్వేషన్ కోటా కేటాయించాలనే డిమాండ్ దేశవ్యాప్తంగా ఊపందుకుంటోంది. ఈ సందర్భంగా ఎస్సీ వర్గీకరణ డిమాండ్ కూడా మళ్లీ ఊపందుకుంది. ఎస్సీలకు మొత్తం 15 శాతం రిజర్వేషన్ ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ కోటా కింద మాలలే ఎక్కువ వాటా పొందుతున్నారనే చర్చ 50 ఏళ్ల కిందే మొదలైంది. మోదీ వేస్తానని చెబుతున్న కొత్త కమిటీ కూడా తేల్చాల్సిన కొత్త విషయలేమీ లేవు. ఎందుకంటే ఇలాంటి కమిటీలు ఇప్పటికే ఎన్నోవచ్చాయి. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల జాబితాలను సవరించేందుకు 1965లో ఏర్పాటైన బి.ఎన్. లోకూర్ కమిటీ ఎస్సీ, ఎస్టీ జాబితాల నుంచి 14 తెగలు, 28 కులాలను తొలగించాలని ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మాలలను జాబితా నుండి తొలగించాలని ప్రతిపాదిస్తూ, వారు మాదిగల కంటే చారిత్రకంగా, సామాజికంగా, ఆర్థికంగా మెరుగైన స్థితిలో ఉన్నారని పేర్కొంది. 1996లో జస్టిస్ పి. రామచంద్రరాజు నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన మరో కమిషన్ కూడా దళిత ఉప కులాల మధ్య అసమానతలు ఉన్నాయని గుర్తించింది. వెనుకబాటుతనం, జనాభా ప్రాతిపదికన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని దళితులను నాలుగు గ్రూపులుగా విభజించాలని ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ఈ కమిటీల సిఫార్సులు ఆచరణలో ముందుకు సాగలేదు.
మాదిగ పోరాటాలు, ఆమరణ నిరాహార దీక్షల ఫలితంగా 2000 సంవత్సరంలో రాష్ట్రపతి ఆర్డినెస్స్ ద్వారా ఎస్సీ రిజర్వేషన్లను ఎ,బీ,సీ,డీ లుగా వర్గీకరిస్తూ చట్టం చేయడం జరిగింది. 2000- 2004 మధ్య ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ సిఫార్సులను అమలు కూడా చేసింది. కానీ మాదిగలకు వ్యతిరేకంగా మాల మహానాడుతో పాటు ఇతర మాల సంఘాలు ప్రారంభించిన ఉద్యమం ఎస్సీ వర్గీకరణకు అడ్డంకిగా మారింది. ఎస్సీ వర్గీకరణ దళితుల్లో ఐక్యత దెబ్బ తీస్తుందని మాల సంఘాలు సుప్రీంకోర్టుకు వెళ్లడంతో, కేవలం రాష్ట్రపతి ఆర్డినెన్స్‌తో వర్గీకరణ కుదరదని, దీనికి పార్లమెంటు ఆమోదం తప్పనిసరి చేస్తూ ఆ వర్గీకరణ చట్టాన్ని సుప్రీంకోర్టు కొట్టేసింది. దీంతో ఎమ్మార్పీఎస్ పోరాటానికి రాజకీయ పార్టీల మద్దతు అత్యవసరంగా మారింది.
మాట తప్పిన కాంగ్రెస్!
ఎమ్మార్పీఎస్ ఒత్తిడితో 2004లో దివంగత నేత వైఎస్.రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం రాజ్యాంగ సవరణ కోరుతూ అసెంబ్లీలో తీర్మానం చేసింది. దీనికి స్పందనగా కేంద్ర ప్రభుత్వం 2007లో ఉషా మెహ్రా కమిషన్‌ను ఏర్పాటు చేసింది. 2008లో మాల, మాదిగల మధ్య అసమానతలు ధృవీకరించిన ఈ కమిషన్, రాజ్యాంగంలోని ఆర్టికల్ 341కి సవరణ చేయాలని సిఫార్సు చేసింది. లేదా రాజ్యాంగంలోని ఆర్టికల్ 16(4) ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఈ పని పూర్తి చేయవచ్చని సూచించింది. అయితే అప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ దీనిని సీరియస్‌గా తీసుకోలేదు. కానీ, 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వర్గీకరణ డిమాండ్‌ను నెరవేర్చేందుకు కట్టుబడి ఉన్నామని కాంగ్రెస్ రాష్ట్ర శాఖ ప్రకటించింది. అయితే, కాంగ్రెస్ ఈసారి కూడా ఇదే మాట చెప్తోంది. నిజంగా కాంగ్రెస్ దీనికి కట్టుబడి ఉంటే, 2009లోనే ఇటు రాష్ట్రంలో, అటు కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడే అందించి ఉండేదని మాదిగలు భావిస్తున్నారు.
బీజేపీ అంతే...
2014 సార్వత్రిక ఎన్నికలకు ముందు అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ పూర్తి చేస్తామని హామీ ఇచ్చిన బీజేపీ దానిని నిలబెట్టుకోలేదు. పదేళ్లుగా ఎమ్మార్పీఎస్ నాయకులు కేంద్ర మంత్రులను కలుస్తూ వినతిపత్రాలు ఇస్తూ వస్తున్నారు. 2016 నవంబర్‌లో ఎమ్మార్పీఎస్ నిర్వహించిన సభకు కేంద్ర మంత్రి హోదాలో హాజరైన వెంకయ్యనాయుడు మాదిగల డిమాండ్లకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. ఇప్పుడు మళ్లీ ప్రధాని మోదీ వచ్చి ఎమ్మార్పీఎస్‌కి మద్దతు తెలుపుతూ, ఒక కమిటీ వేస్తామని చెప్పారు గానీ ఆర్టికల్ 370 లాగా చట్ట సవరణ చేసి, వర్గీకరణ చేపడతామని ఎక్కడా చెప్పలేదు. ఎందుకంటే వర్గీకరణకు రాజ్యాంగ సవరణ చేయడం అంత సులభం కాదు. దీనికి పార్లమెంటు ఉభయ సభల ఆమోదంతో పాటు దేశంలోని సగానికి పైగా రాష్ట్రాల ఆమోదం అవసరమవుతుంది.
బీఆర్‌ఎస్ కూడా అంతే..
ఉమ్మడి రాష్ట్రంలో దళితులు నిర్లక్ష్యానికి గురయ్యారని, ప్రత్యేక రాష్ట్రంతోనే దళితుల సాధికారత సాధ్యమవుతుందని ఉద్యమ సమయంలో బీఆర్‌ఎస్ చెప్పేది. ఒకడుగు ముందుకేసి, దళితుడినే ముఖ్యమంత్రిని చేస్తామని కూడా బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు. ఆ మాట నిలబెట్టుకోలేకపోయినా 2014లో బీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీ వర్గీకరణపై నాటి వైఎస్ ప్రభుత్వంలాగే రెండు తీర్మానాలు చేసి, కేంద్ర ప్రభుత్వానికి పంపింది. మాదిగల విశ్వాసాన్ని గెలుచుకునేందుకు తమ బాధ్యత పూర్తి చేశామని చెప్తూ ఆ నెపాన్ని కేంద్రంలోని బీజేపీపైకి నెట్టివేసి చేతులు దులుపుకుంది.
బీఎస్పీ వ్యతిరేకమే...
దళిత బహుజనులకు ప్రాతినిథ్యం వహిస్తున్నామని చెప్పుకునే బీఎస్పీ కూడా ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తోంది. వర్గీకరణతో అధిక రిజర్వేషన్ పొందుతున్న మరో వర్గాన్ని దూరం చేసుకోవద్దని ఈ పార్టీ భావిస్తోంది. దేశంలోని ప్రధాన పార్టీలన్నీ వర్గీకరణకు ఆమోదం తెలిపినవే. కానీ వాటి రాజకీయ ప్రయోజనాల దృష్ట్యా దాని పరిష్కారానికి ముందుకు రావడం లేదు. అన్ని పార్టీలకూ మాల, మాదిగ రెండు కులాల ఓట్లు కావాలి. 2011 జనగణన ప్రకారం తెలంగాణలో మొత్తం ఎస్సీ జనాభాలో మాలల కంటే మాదిగలు 17 లక్షలు అధికంగా ఉన్నారు. కానీ, ఏపీలో గుంటూరు, ప్రకాశం, కృష్ణ జిల్లాలు మినహా అన్ని జిల్లాల్లోనూ మాలల జనాభానే ఎక్కువ. కాబట్టి కరవమంటే పాముకు కోపం, విడవమంటే కప్పకు కోపం అన్నట్టు ఎవరినీ దూరం చేసుకున్నా తెలుగు రాష్ట్రాల ప్రధాన పార్టీలకు నష్టమే! అందుకే వర్గీకరణ సమస్య ఇలా నలుగుతూ ఉంటేనే మాదిగలను తమ వైపు నిలబెట్టుకోవడం, ఓట్లు రాబట్టుకోవడం సాధ్యమవుతుందని పార్టీలు రాజకీయ కోణంలో ఆలోచిస్తున్నాయి.
ఎవరు ఎటువైపు?
ఈసారి దళితుల ఓట్లు మునుపెన్నడూ లేని విధంగా చీలే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ నేతృత్వంలోని బీఎస్పీ పార్టీ వైపు కొంత చీలిక ఉండగా, అధికార బీఆర్‌ఎస్‌కి మద్దతిచ్చే వర్గం కూడా బలంగానే ఉంది. మరోవైపు మాలలు తరతరాలుగా కాంగ్రెస్‌కు మద్దతుగా ఉంటున్నారు. తమ డిమాండ్లకు మద్దతు తెలిపిన పార్టీల వైపు ఎస్సీలు ఉంటున్నారు. ఈ 30 ఏళ్లలో మందకృష్ణ మాదిగ మద్దతిచ్చిన వారికే ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు తమ ఓటు వేస్తూ వస్తున్నారు. ‘ఈ పార్టీ లేదు.... ఆ పార్టీ లేదు... ఉన్నది ఒక్కరే మోదీ’ అని మందకృష్ణ హైదరాబాద్ సభ వేదికగా పిలుపునిచ్చారు. తెలంగాణ ఎన్నికల వేళ బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలను ఇరుకున పెట్టడానికి ప్రధాని మోదీ ఈ ప్రకటన చేయించారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మాదిగలు బీజేపీ ఓటు బ్యాంకు కానప్పటికీ ప్రధానమంత్రి వాగ్దానంతో, బీజేపీ మాజీ అధ్యక్షుడు బంగారు లక్ష్మణ్‌కి ఆ పార్టీ గతంలో చేసిన అవమానాన్ని మర్చిపోయి మాదిగలు బీజేపీకి ఓట్లేస్తారా? మోదీ కూడా కేవలం వాగ్దానాలు చేసి వాటిని తుంగలో తొక్కిన ఇతర రాజకీయ నేతల జాబితాలో చేరతారా అనేది కొన్ని రోజుల్లోనే తేటతెల్లమవుతుంది.
- జంపాల ప్రవీణ్
రీసెర్చర్, పీపుల్స్‌పల్స్ రీసెర్చ్ సంస్థ,
peoplespulse.hyd@gmail.com