- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
క్రీడల్లో మనమెందుకు వెనుకబడ్డాం?
అనేక చిన్న చిన్న దేశాలు ఒలింపిక్స్‌లో పత కాలు ఎగరేసుకుపోతుంటే, మనదేశం అరకొర మెడల్స్‌తోనే సంతృప్తి పడుతోంది. ఒలింపిక్స్‌లో పతకాలు కొల్లగొడుతున్న అనేక దేశాలు మనతో పోలిస్తే పేద దేశాలే.. ఆదాయ పరంగానే కాదు, మానవ వనరులలోనూ మనతో పోటీకి రాని దేశాలే. అయితేనేం, పతకాలు గెలుస్తున్నాయి. అక్కడి ప్రభుత్వాలు క్రీడల కోసం పెడుతున్న ఖర్చు మనతో పోలిస్తే బాగా ఎక్కువ.
మనదేశం క్రీడల కోసం వార్షిక బడ్జెట్‌లో చేస్తున్న కేటాయింపులు తక్కువే. అరకొర కేటాయింపులతోనే పాలకులు కాలం గడుపుతున్నారు. దేశంలో క్రీడల పట్ల ఆసక్తి ఉన్న యువతను గుర్తించి, వారిని ప్రోత్సహించాల్సిన బాధ్యత నిస్సందేహంగా ప్రభుత్వాలదే. అవసరమైతే ఆయా క్రీడా విభాగాల్లో అత్యుత్తమమైన కోచ్‌లను విదేశాల నుంచి రప్పించుకోవాలి. మన క్రీడాకారులకు మెరుగైన శిక్షణ ఇప్పించాలి. అప్పుడే ఒలింపిక్స్ లో రెండంకెల పతకాలకు మనం చేరుకోగలం.
చిన్న, పేద దేశాలు సాధిస్తున్నా..
దురదృష్టవశాత్తూ మనదేశంలో క్రీడలు ఇప్పటికీ ఒక లాభదాయకమైన కెరీర్ కాలేకపోయింది. చదువులో వెనుకబడిన వారు మాత్రమే ఆటలపై ఆసక్తి చూపుతారన్న అభిప్రాయం సమాజంలో బలంగా నాటుకుంది. ఈ అభిప్రాయంతో ఎంతమంది ఏకీభవిస్తారన్న అంశాన్ని పక్కన పెడితే, క్రీడల్లో భారత్ బాగా వెనుకబడి ఉందన్న విషయం వాస్తవం. ఒలింపిక్స్ పోటీలే దీనికి ఉదాహరణ. ఒలింపిక్స్ చరిత్రలో భారతదేశం మొత్తం 41 పతకాలను మాత్రమే గెలుచుకుంది. మిగతా దేశాలతో పోలిస్తే ప్రతి ఒలింపిక్స్‌లోనూ మనదేశం పతకాల వేటలో వెనుకబడే ఉంటోంది. మనకంటే విస్తీర్ణంలోనూ, మానవ వనరులలోనూ వెనుకబడ్డ అనేక చిన్న చిన్న దేశాలు ఒలింపిక్స్‌లో పతకాలు ఎగరేసుకుపోతుంటే, మనదేశం మాత్రం అరకొర మెడల్స్‌తోనే సంతృప్తి పడుతోంది. ఈ పరిస్థితికి అనేక కారణాలున్నాయి.. దేశంలోని చాలా మంది నాణ్యమైన విద్యను పొందుతున్న మొదటి తరం ఇది. దీంతో క్రీడలపట్ల తల్లితండ్రుల వైఖరి మారింది.
పిల్లలలో ఆసక్తి ఉన్నా..
పిల్లలు తమలా కష్టాలు పడకూడదని తల్లిదండ్రులు నిర్ణయించుకున్నారు. ఆటలతో సమయం వృథా తప్ప ప్రయోజనం ఏమీ ఉండదన్న ఒక స్థిరమైన నిర్ణయానికి తల్లిదండ్రులు వచ్చేశారు. తమ పిల్లలు పెద్దయ్యాక డాక్టరో, ఇంజనీరో కావాలని తల్లిదండ్రులు కలలు కంటున్నారు. అంతేకాదు, తమ కలలు సాకారం చేయాలంటూ చిన్నప్పటి నుంచే పిల్లలపై ఒత్తిడి తెస్తున్నారు. ఈ నేపథ్యంలో పిల్లలకు క్రీడల పట్ల ఆసక్తి ఉన్నా, తల్లిదండ్రుల ప్రోత్సాహం కరువవుతోంది. దీంతో క్రీడలను కెరీర్‌గా ఎంచుకునే వైపు చిన్నారులు పెద్దగా కృషి చేయలేకపోతున్నారు. దేశంలో సగం జనాభా పేదరికంలో ఉన్న ప్పుడు, రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబాల నుంచి వచ్చిన చిన్నారులు క్రీడలను కెరీర్‌గా మలచుకుంటారని ఆశించ డం కూడా దురాశే అవుతుంది. కొంత మంది చిన్నారులకు క్రీడల పట్ల ఆసక్తి ఉన్నా, వారు ఆడుకోవడానికి సరైన ప్రాంగణాలు దొరకడం లేదు. క్రీడా ప్రాంగణాలకు అనువైన స్థలాలే కాదు, అసలు ఎకరం స్థలం కూడా దొరకని గ్రామాలు ఎన్నో ఉన్నాయి. దేశవ్యాప్తంగా అన్ని గ్రామాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ప్లే గ్రౌండ్‌లు అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తున్నా ఎక్కడా ఎకరం భూమి కూడా దొరకని దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఇప్పటితరం చిన్నారులు ప్లే గ్రౌండ్‌లు లేని పాఠశాలల్లోనే చదువులు పూర్తి చేస్తున్నారు.
సోషలిస్టు దేశాల ప్రణాళికలు..
క్రీడాకారులకు అనేక ప్రభుత్వరంగ సంస్థల్లో రిజర్వేషన్లున్నాయి. అయితే క్రీడాకారుల కోటాను సరిగా అమలు చేయడం లేదన్న ఆరోపణలు వస్తు న్నాయి. క్రీడల కోసం వార్షిక బడ్జెట్‌లో చేస్తున్న కేటాయింపులు కూడా తక్కువే. అరకొర కేటాయింపులతోనే పాలకులు కాలం గడుపుతున్నారు. మనదేశంలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా లాంటి జాతీయ స్థాయి సంస్థలున్నా.. క్రీడాభివృద్ధి కోసం చేస్తున్న కృషి నామమాత్రమే అనే విమర్శలు వస్తున్నాయి. క్రీడల అభివృద్ధి కోసం కృషి చేయాల్సిన సంస్థలు రాజకీయాల్లో మునిగి తేలుతున్నాయన్న ఆరోపణలు సైతం ఉన్నాయి. అయితే క్రీడలకు సంబంధించి అనేక సోషలిస్టు దేశాల్లో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. అయా దేశాల్లో స్టేట్ యూత్ డిపార్ట్‌మెంట్ల ద్వారా ఆణిముత్యాల్లాంటి క్రీడాకారులను సోషలిస్టు దేశాలు తయారు చేసుకుంటున్నాయి. ఒలింపిక్స్‌లో మెడల్స్ కొల్లగొడుతున్నాయి.
ప్రోత్సాహం కరువై..
మనదేశంలో క్రీడల అభివృద్ధికి సంబంధించి పక్కా ప్రణాళిక అంటూ లేదు. క్రీడాకారులకు మౌలిక వసతులు కూడా కరువే. క్రీడాభివృద్ధి కోసం అంకితమై కృషి చేసే కోచ్‌లు, ఫిజికల్ ఇన్‌స్ట్రక్టర్లకు మనదేశంలో తీవ్ర కొరత ఉంది. అంతర్జాతీయ స్థాయిలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించే సత్తా ఉన్న ప్రతిభావంతులైన క్రీడాకారులను ముందుగా గుర్తించాలి. ఆ తరువాత వారిని ప్రోత్సహించేలా పాలకులు చర్యలు చేపట్టాలి. అయితే మనం ఇక్కడో చేదు వాస్తవాన్ని అంగీకరించి తీరాలి. క్రికెట్‌కు క్రీడా సంఘాలు, పౌర సమాజం ఇచ్చినంత ప్రాధాన్యం ఇతర క్రీడలకు ఇవ్వడం లేదన్న విమర్శలున్నాయి. ఈ విషయంలో ఆయా సంఘాల తీరు మారాలంటున్నారు క్రీడాభిమానులు. చైనా సహా అనేక దేశాలు తమ అథ్లెట్ల శిక్షణా పద్ధతులను మెరుగుపరచడానికి సాంకేతికతను కూడా బాగా ఉపయోగించుకుంటున్నాయి. ఈ విషయంలో భారత్ ఇంకా వెనుకబడే ఉందని చెప్పుకోవాలి. భారత్‌లో ప్రతిభావంతులైన క్రీడాకారులకు కొదవ లేదు. వీరికి తగిన ప్రోత్సాహం దొరకడం లేదన్న వాదన బలంగా వినిపిస్తోంది. క్రీడల పట్ల ఆసక్తి ఉన్న యువతను గుర్తించి, వారిని ప్రోత్సహించాల్సిన బాధ్యత నిస్సందేహంగా ప్రభుత్వాలదే. అవసరమైతే ఆయా క్రీడా విభాగాల్లో అత్యుత్తమమైన కోచ్‌లను విదేశాల నుంచి రప్పించుకోవాలి. మన క్రీడాకారులకు మెరుగైన శిక్షణ ఇప్పించాలి. సరైన ప్రోత్సాహం లభిస్తే మారుమూల పల్లె ప్రాంతాల నుంచి ఒక ధ్యాన్‌చంద్, ఒక మిల్కా సింగ్ లాంటి క్రీడాకారులు, అథ్లెట్లు తయారవుతారు.
-ఎస్. అబ్దుల్ ఖాలిక్,
సీనియర్ జర్నలిస్ట్
63001 74320