ఈ-వాహనాలు ఎందుకు పేలుతున్నయ్?

by Ravi |   ( Updated:2022-09-03 16:49:14.0  )
ఈ-వాహనాలు ఎందుకు పేలుతున్నయ్?
X

లక్ట్రిక్ వాహనాల పేలుళ్లు వాటి భవిష్యత్‌ని ప్రశ్నార్థకం చేయబోతున్నాయా? ప్రపంచ మోటారు వాహనాల సంపదలో మన వాటా ఒక శాతం. ప్రపంచంలోని రహదారులపైన జరుగుతున్న ప్రమాదాలలో మన దేశం వాటా పదకొండు శాతం. కరోనా మరణాలతో పోటాపోటీగా జనహననానికి కారణమవుతున్న రహదారులు, వాహనాల ప్రపంచంలో ఈ.వి ల పేలుడు సంచలనం కలిగిస్తోంది. రహదారుల నిర్మాణంలో లోపాలు, అనునిత్యం ఘోర ప్రమాదాల రూపంలో ప్రాణాలను బలి తీసుకుంటున్న బ్లాక్ స్పాట్లతో ఈ దేశ రహదారులపై వాహనాలలో ప్రయాణమంటేనే దడ పుడుతున్నది.

ఈ నేపథ్యంలో కోటి ఆశలతో తక్కువ మెయింటెనెన్స్‌తో సదుపాయాలను పొందవచ్చనే విశ్వాసంతో వినియోగదారులు కొనుగోలు చేస్తున్న ఎలక్ట్రిక్ వాహనాలు పేలిపోతూ ఆందోళన కలిగిస్తున్నాయి. ఉక్రెయిన్-రష్యా యుద్ధంతో ఆకాశాన్నంటుతున్న పెట్రో ధరలు, పెరుగుతున్న సుంకాలు, వాల్యూ ఎయిడెడ్ ట్యాక్స్ మూలాన మరింత పెరుగుతున్న చమురు ధరలు, భూతాపాన్ని పెంచుతున్న వాహనాల వాడకంతో పర్యావరణ పరిరక్షణ కోసం ప్రభుత్వాలు అనివార్యంగా చమురు వాహనాల మీద ఆంక్షలు విధిస్తున్నాయి. దీంతో తక్కువ కాలుష్యాన్ని సృష్టించే సీఎన్‌జీ, విద్యుత్‌తో నడిచే వాహనాలను కొనుగోలు చేయడానికి వినియోగదారులు ఆసక్తి చూపుతున్నారు. పెరుగుతున్న నిరుద్యోగిత, తగ్గిపోతున్న ప్రజల ఆదాయ వనరులు, అధిక ధరలతో పెట్రో వాహనాలను మెయింటైన్ చేయలేకపోవడం కూడా కారణాలుగా చెప్పవచ్చు.

విదేశీ బ్యాటరీలే కారణమా?

నాణ్యమైన బ్యాటరీలను తయారు చేసేందుకు భౌగోళికంగా ఉండాల్సిన వాతావరణం, లిథియం, కోబాల్ట్‌లాంటి రసాయనిక పదార్థాల నిల్వలతో కూడిన గనులు మన దేశంలో లేవు. చైనా, బ్రెజిల్, రష్యా, ఆస్ట్రేలియా లాంటి దేశాలలో అవి విస్తారంగా అందుబాటులో ఉన్నాయి. మన దేశ ఆటో మొబైల్-ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీ వంద శాతం విదేశీ బ్యాటరీలపై ఆధార పడక తప్పనిసరి పరిస్థితి ఉంది. మితిమీరిన డిమాండ్‌ని క్యాష్ చేసుకునే క్రమంలోనే వాహనాల ఉత్పత్తిదారులు నాణ్యతకు తిలోదకాలిస్తున్నారా? ప్రైవేటీకరణే తన విధానంగా ముందుకు సాగుతున్న ప్రభుత్వాల వైఖరితో, ఇన్సెంటివ్ పేరుతో సమకూర్చిన 50 వేల కోట్ల రూపాయల ప్రోత్సాహకాల ఫలితంగా పుట్ట గొడుగుల వలె పుట్టుకొస్తున్న చిన్న తరహా పరిశ్రమల యజమానులు లాభాలు ఆర్జించేందుకు నాసిరకపు బ్యాటరీలను ఉపయోగిస్తున్నారని, ఫలితంగా పేలుళ్లు సంభవిస్తున్నాయనే వాదన కూడా ఉంది.

ఒకప్పుడు బడా పారిశ్రామికవేత్తలకు మాత్రమే ఆటోమొబైల్ కంపెనీల ఏర్పాటు సాధ్యమయ్యేది. నేడు నూతన పారిశ్రామికవేత్తలు ఎలక్ట్రికల్ బైక్‌లు, ఇతర వాహనాలను ఉత్పత్తి చేసే వెసులుబాటును అందుకోగలగడం అభినందనీయమే. కాకపోతే ఎలక్ట్రికల్ వాహనాల బ్యాటరీలను సొంతంగా మన దేశంలోనే తయారు చేసుకునే అవకాశం లేకపోవడం విచారకరం. టాటా, మహీంద్రా, హుందాయ్ లాంటి అనేక బడా ఆటోమొబైల్ కంపెనీలు విదేశాల నుంచి ఎ-గ్రేడ్ బ్యాటరీలను దిగుమతి చేసుకుంటున్నాయి. స్టార్టప్ కంపెనీలు మాత్రం ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించుకునేందుకు బి,సి గ్రేడ్ బ్యాటరీలను దిగుమతి చేసుకుంటున్నాయి.

అక్కడ లోపాలు లేవా?

బడా కంపెనీలు బ్యాటరీలు, ఇతర లోపాల నేపథ్యంలో తమ వాహనాలను మార్కెట్ నుంచి వెనక్కి తీసుకున్న సంఘటనలు లేకపోలేదు. స్టార్టప్ కంపెనీలు లోపభూయిష్ట బ్యాటరీలతోనే ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేసి విడుదల చేస్తున్నందునే అవి పేలుళ్లకు గురవుతున్నాయని అంటున్నారు. వాహనాల ఉత్పత్తి ప్రమాణాలను సాంకేతికంగా విశ్లేషించి, నివారణ చర్యలను తీసుకోవాల్సిన ప్రభుత్వ యంత్రాంగం లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. వాహనదారులకు సురక్షిత ప్రయాణ సదుపాయాలను కల్పించాల్సిన ఈ.వి.లు ఓ అసెంబుల్డ్ పరిశ్రమగా కొనసాగుతూ ప్రాణాలను బలి తీసుకుంటున్న వైనం బాధాకరం. ఇటీవల తెలంగాణలో పర్యటించిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ శాస్త్రవేత్తలు, నిపుణులతో విచారణ కమిటీని ఏర్పాటు చేసి ఏ కంపెనీ తప్పు చేసినట్లు తేలినా భారీ జరిమానాతో పాటు కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు.

తక్కువ ధరతో, తక్కువ నిర్వహణా వ్యయంతో, తక్కువ కాలుష్యంతో ప్రమాదాలకు ఆస్కారం లేని ఈ-వాహనాలను ఆవిష్కరించారు. వాటి నాణ్యతను, మన్నికను శాస్త్రీయంగా పరిశీలించి ధ్రువీకరించేందుకు శాశ్వత యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలి. బ్యాటరీ సిస్టమ్‌ను ఎప్పటికప్పుడు సమీక్షించి వాటి పని తీరును మెరుగు పరచాలి. నిపుణుల సూచనల ప్రకారం వాహనం ఆగిన ఓ గంట తర్వాతనే ఛార్జింగ్ పెట్టాలి. ఛార్జ్ నిల్ అయ్యేంత వరకు చూడకుండా కనీసం 20 శాతం ఉన్నప్పుడే రీఛార్జ్ చేయాలి. వాహనానికి ఎప్పుడూ వంద శాతం ఛార్జ్ చేయరాదు. 80 శాతం లోపే ఉండాలి. హీట్ సిగ్నల్ వచ్చిన మరుక్షణమే వాహనాన్ని నిలిపి వేయాలి. ఆథరైజ్డ్ ఛార్జర్‌లే ఉపయోగించాలి. పేలుడు బాధితులకు కంపెనీలు, బీమా కంపెనీలు పరిహారం చెల్లించేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి.

నీలం సంపత్

రోడ్ సేఫ్టీ ఫౌండేషన్, హైదరాబాద్

98667 67471

Advertisement

Next Story

Most Viewed