వీరికి బోర్డు ఎగ్జామ్స్ ఎందుకు?

by Ravi |   ( Updated:2025-01-11 00:46:21.0  )
వీరికి బోర్డు ఎగ్జామ్స్ ఎందుకు?
X

కేంద్ర ప్రభుత్వం స్కూల్ ఎడ్యుకేషన్‌లో ఐదు, ఎనమిదవ తరగతులకు సంబంధించి 'నో డిటెన్షన్ పాలసీ'ని రద్దు చేసింది. అంటే ఇకపై ఈ క్లాసుల స్టూడెంట్లు వార్షిక పరీక్షలో ఫెయిల్ అయితే పై తరగతులకు ప్రమోట్ చేయరు. వారికి మళ్లీ ఎగ్జామ్ నిర్వహిస్తారు. అందులో పాసైతేనే పై తరగతులకు పంపిస్తారు. లేదంటే అదే క్లాస్‌ను చదవాలి. ఇది మొదటగా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న విద్యాసంస్థలలో అమలు చేస్తున్నట్టు ప్రకటించారు. అయితే ఈ నిర్ణయం పేద, గ్రామీణ వెనుకబాటుకు గురైన వర్గాల విద్యార్థులకు తీరని నష్టదాయకమైనదని ఇది అమలు అయితే విద్యార్థులు ప్రాథమిక విద్యనే డ్రాప్ అవుట్ అయ్యే ప్రమాదం ఉంది. బాల కార్మికులలుగా మారే ప్రమాదం ఉంటుంది.

ఈ విధానం నూతన జాతీయ విద్యా విధానంలో భాగంగానే అమలు చేస్తున్నారు. పదవతరగతి, ఇంటర్మీడియెట్ తరగతులకు బోర్డ్ ఎగ్జామ్స్ తొలగించి ఐదు ఎనిమిదో తరగతులకు ఈ తరహా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంలో నూతన జాతీయ విద్యా విధానంలో ఉన్న అంశాలను పరిశీలించాల్సిన అవసరం ఏర్పడ్డది. ఇప్పటికే ఈ విద్యా విధానంపై కొన్ని రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి. రాష్ట్రాల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండానే ఏకపక్షంగా ఈ విద్యా విధానాన్ని కేంద్ర ప్రభుత్వం అమలుప రుస్తుంది. ఈ విధానాన్ని అమలు చేస్తేనే కేంద్ర ప్రభుత్వం నుండి నిధులు వస్తాయని షరతులు పెడుతుంది. ఉమ్మడి జాబితాలో ఉన్న విద్యా విధానంపై కేంద్ర ప్రభుత్వం పెత్తనం ఎందుకని తమిళనాడు రాష్ట్రం అసెంబ్లీలో మా రాష్ట్రంలో విద్యా విధానాన్ని అమలు చేయమని తీర్మానం చేసింది.

ఉపాధి మార్గంపై దృష్టి పెట్టి..!

ఇప్పటికే జాతీయ స్థాయి పరీక్షల్లో రాష్ట్రాలకు భిన్నాభి ప్రాయం ఉన్నది. అన్ని స్థానిక భాషల్లో సిలబస్‌లో వ్యత్యాసం పరీక్షలు నిర్వహించే ఎన్‌టీఏ సంస్థపైన సరైన విశ్వాసం లేకపోవడం వల్ల దక్షిణాది రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి. జాతీయ పరీక్ష పేరుతో దక్షిణాది రాష్ట్రాలకు తీవ్రంగా అన్యాయం జరుగుతుందనేటువంటి అభిప్రాయం కూడా ఉన్నది. అయితే ఈ విద్యా విధానంలో వృత్తి విద్యను ఐదవ తరగతి నుండి అమలు చేయడం వల్ల విద్యార్థులు వారి ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఉపాధి మార్గం వైపు వెళ్లే అవకాశం కలుగుతుంది. విద్యార్థిపై చదువులు చదువుకోవాలనే దానికంటే పెద్ద పెద్ద కంపెనీలో కార్మికుడిగా, గుమస్తా గిరిగా మారే ప్రమాదం కూడా ఉందనేది విద్యా విశ్లేషకులు అభిప్రాయం. ఇదే జరిగితే సమాజపు అవసరాలకు తగ్గట్టుగా పరిశోధన చేసేటువంటి విద్యార్థులు ఉన్నత విద్య మరింత తగ్గే ప్రమాదం ఉందనేది తేటతెల్లమవుతుంది. వైవిద్య భరిత మైన దేశంలో సిలబస్ నిర్వహణలో, పరీక్షల తయారీలో వారి సంస్కృతి జీవన విధానం ప్రతిబింబించేటట్లు విద్య ఉండాలి కానీ అది కొరవడుతోంది. ఈ విద్యా విధానం అమలు చేయని రాష్ట్రాలకు నిధుల కోత పెడతారు. స్వయం ప్రతిపత్తి కలిగిన యూజీసీ లాంటి సంస్థలు రేపు ఉండవు కాబట్టి బీజేపీ పాలిత రాష్ట్రాల పట్ల చూపే ప్రేమ ఇతర రాష్ట్రాలపై ఉండదనేది స్పష్టం. పైగా రాజ్యాంగ పీఠికలో పేర్కొన్న లౌకిక, సామ్యవాద అంశాలకు ఈ విద్యా విధానంలో ఎక్కడ తావు లేదు. దీనిని బట్టి ఈ విద్యా విధానం యొక్క రాజ్యాంగ స్ఫూర్తి తేటతెల్లమవుతుంది.

సామాజిక న్యాయాన్ని విస్మరించి..

మొత్తం ఎన్ఈపీలో సామాజిక న్యాయాన్ని గురించి ఎటువంటి ప్రస్తావన చేయలేదు. సమాజంలో అట్టడుగున ఉన్నవారు చదువు నేర్చుకుని, నైపుణ్యాన్ని సాధించి ఆర్థికంగా, సామాజికంగా పై స్థాయికి చేరుకోడానికి కుల వ్యవస్థలోని ఆధిపత్య స్వభావం, పితృస్వామ్య భావజాలంలోని ఆంక్షలు ఏ విధంగా ఆటంకంగా వ్యవహరించాయో.. ఎన్‌ఈపీ పరిగణనలోకి తీసుకోడంలో విఫలమైంది. ఈ వివక్షను, అణచి వేతను నిర్మూలించాలన్న అంశం కానీ రిజర్వేషన్ల విధానం గురించి ఎక్కడ పేర్కొనలేదు. సమాజంలో శతాబ్దాల తరబడి వివక్షతను ఎదుర్కొంటూ అవకాశాలకు దూరంగా నెట్టి వేయబడిన వర్గాల విద్యార్థులకి ఇతరులతో సమాన స్థాయికి ఎదగాలంటే వీరికి ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వడం వలన సాధ్యమవుతుందనేది వాస్తవం. ఇది మన రాజ్యాంగం కల్పించిన హక్కు. ఇంత కీలకమైన అంశంను ఎన్ఈపీ పట్టించుకోలేదు. దీంతో సామాజిక వెనకబాటుకు గురైన వర్గాల విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్థకమే?

ఇన్నేండ్లు నిధులు ఎందుకు కేటాయించలేదు?

ఈ నూతన జాతీయ విద్యా విధానంలో (ఎన్.అర్.ఎఫ్) నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ పేరుతో పరిశోధనలను నియంత్రించనున్నది. పరిశోధనలు చేయాలంటే ఎన్.అర్.ఎఫ్ సూచనలకు అనుగుణంగా చేయాల్సిందే. వాటికి మాత్రమే గుర్తింపు ఇస్తుంది. ఫెలోషిప్ సౌకర్యాన్ని కల్పిస్తుంది. ఈ ఎన్అర్ఎఫ్ కూడా అర్ఎస్ఏ (రాష్ట్రీయ శిక్ష అయోగ్) ప్రధానమంత్రి అద్యక్షతన ఉండే జాతీయ సంస్థగా పనిచేస్తుంది. ఇది సామాజిక పరిశోధనల కన్నా వాణిజ్య పరమైన, ఆకర్షణీయమైన, పరిశోధనలకు ప్రాధాన్యతను ఇస్తుంది. ఉన్నత విద్యా సంస్థలలో విస్తృతంగా ఎక్కడికక్కడ జరగాల్సిన పరిశోధనలను కేంద్రీకృత వ్యవస్థ అదుపులోకి తెచ్చి రీసెర్చ్‌కు అవసరమైన చొరవను, ఉత్సాహాన్ని దూరం చేయనుంది. ఇప్పటికే దేశంలో పరిశోధన విద్యార్థుల ఫెలోషిప్‌లు తగ్గిం చింది. దేశవ్యాప్తంగా ఎం.ఫిల్ కోర్స్ రద్దు చేశారు. పైగా మాతృభాషలో విద్యా బోధన ప్రాధాన్యత గురించి స్పష్టంగా చెప్పలేదు. ఈ విద్యా విధానంకి జీడీపీలో ఆరు శాతం నిధులు కేటాయిస్తామని చెప్తున్నారు. ఇది మంచి నిర్ణయిమే కానీ ఈ పది సంవత్సరాల కాలంలో నిధులు ఎందుకు కేటాయించలేకపోయారు? మౌలిక మొత్తంగా ప్రభుత్వ అనుకుల భావజాలాన్నీ విద్యలో పెంచి పోషించనున్నారు. ముఖ్యం గా సామ్రాజ వాద దేశాలకు మన మేదస్సును తాక ట్టు పెట్టే లాగా విదేశీ విశ్వవిద్యాలయాలకు ఉన్నత విద్యను వ్యాపారం చేసుకునేలా రెడ్ కార్పెట్‌తో స్వాగతం పలకనున్నది ఎన్ఈపీ-2020.

ఆర్.ఎల్ మూర్తి

ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు

82476 72658


Advertisement
Next Story

Most Viewed