బీసీలు జగన్ వెంటే ఎందుకున్నారు?

by Ravi |   ( Updated:2022-12-13 02:00:43.0  )
బీసీలు జగన్ వెంటే ఎందుకున్నారు?
X

జగన్ 2019 ఎన్నికలలో బీసీల కొరకు ఎటువంటి హామీ ఇవ్వకున్నా తమకు అండగా నిలబడిన బీసీల సంక్షేమం కోసం ఇప్పటికే రూ.83 వేల కోట్ల రూపాయలు వారి ఖాతాలలో వేశారు. 17 మంత్రి పదవులలో 11 బీసీలకు కేటాయించారు. 139 బీసీ కులాలకు చెందిన 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి కేబినెట్ హోదాతో చైర్మన్‌లను నియమించారు. జడ్‌పీ, మున్సిపాలిటీ, మున్సిపల్ కార్పొరేషన్, మార్కెట్ కమిటీ చైర్మన్ లాంటి పదవులలో బీసీలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించారు. నలుగురు బీసీలను రాజ్యసభకు పంపించారు. బీసీల హక్కుల కొరకు పోరాడిన ఆర్. కృష్ణయ్యను ఎంపీగా చేసి బీసీల హక్కుల సాధనకు మార్గం సుగమం చేయడం గొప్ప పరిణామం.

ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలకు సమయం సమీపిస్తున్న కొద్దీ రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు బీసీలపై ఎక్కడ లేని ప్రేమను ఒలకబోస్తున్నాయి. వారి ఓట్ల కోసం అవకాశవాద రాజకీయాలకు తెర తీస్తున్నాయి. 2019 ఎన్నికలలో బీసీలు మూకుమ్మడిగా వైఎస్ఆర్ కాంగ్రెస్(ysr congress) పార్టీకి మద్దతుగా నిలిచి 151 సీట్లు గెలవడంలో ప్రముఖ పాత్ర పోషించారు. మొదటి పర్యాయం అధికారంలోకి వచ్చిన జగన్ అనతి కాలంలోనే బీసీలకు వందలాది నామినేటెడ్ పదవులు, అత్యధిక నిధులు ఇచ్చి వారి సంక్షేమానికి కృషి చేశారు. దీంతో బీసీలు ఆయన వెంటే స్థిరంగా ఉండే పరిస్థితి ఏర్పడింది.

ప్రస్తుతం రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా రాష్ట్ర జనాభాలో 52 శాతం ఉన్న బీసీల మద్దతు కచ్చితంగా అవసరం. ఈ విషయాన్ని గమనించిన ప్రతిపక్ష పార్టీలు అధికార పార్టీ నుంచి బీసీలను వేరు చేసి వారి మద్దతు పొందేందుకు అనేక కార్యక్రమాలు రూపొందించుకుంటున్నాయి. ఈ విషయాలను క్షుణ్ణంగా గమనిస్తున్న బీసీలు ప్రలోభాలకు, సెంటిమెంట్లకు, బూటకపు హామీలకు లొంగకుండా తమ బతుకులు బాగుపరుస్తున్నవారికే తిరిగి మద్దతు పలికేందుకు స్పష్టంగా ఇప్పటికే నిర్ణయం తీసుకుంటున్నారు.

ఎన్నికల సమయంలో

1982లో ఎన్‌టీఆర్(nt ramarao) తెలుగుదేశం పార్టీని(telugu desam party) స్థాపించారు. అప్పుడు ఎస్‌సీ, ఎస్‌టీ, మైనారిటీ, కాపు, రెడ్డి, బ్రాహ్మణులందరూ కాంగ్రెస్ పార్టీకి మద్దతిస్తూ రాజకీయంగా చురుగ్గా ఉండేవారు. బీసీలు మాత్రం స్తబ్దుగా ఉండేవారు. ఈ విషయాన్ని గమనించిన ఎన్‌టీఆర్ బీసీలకు పెద్ద పీట వేపి అఖండ విజయాన్ని సాధించారు. ప్రభుత్వం ఏర్పడినాక బీసీలకు కీలక స్థానాలు కేటాయించడమే కాక, స్థానిక సంస్థలలో రిజర్వేషన్ కల్పించారు. రెండు రూపాయలకు కిలో బియ్యం, జనతా వస్త్రాలు, పక్కా గృహాలు, విద్యుత్ స్లాబ్, మద్య నిషేధం వంటి సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. అందుకే తెలుగుదేశం పార్టీలో 1982 నుండి 1995 వరకు బీసీలకు స్వర్ణయుగంలా ఉండేది. 1995 తర్వాత చంద్రబాబు(chandrababu naidu) ముఖ్యమంత్రి పదవితో పాటు పార్టీ అధ్యక్ష పదవి చేపట్టి ఎన్‌టీఆర్ పేదల కోసం ప్రవేశపెట్టిన పథకాలకు తిలోదకాలు ఇచ్చారు.

రామారావు మానస పుత్రిక గా భావించే రెండు రూపాయలకే కిలో బియ్యం పథకానికి తూట్లు పొడిచాలని ప్రయత్నించారు. ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో వెనక్కి తగ్గారు. 1999 ఎన్నికలలో బీజేపీతో పొత్తు పెట్టుకొని వాజ్‌పేయ్(wajpayee) మద్దతుతో విజయం సాధించారు. ప్రజలలో వెల్లువెత్తిన వ్యతిరేకత కారణంగా 2004, 20009 ఎన్నికలలో పరాజయం పాలయ్యారు. దీంతో బీసీల మద్దతు లేనిది విజయం సాధించడం కష్టమని భావించి, 2014 ఎన్నికలపుడు బీసీ డిక్లరేషన్(bc declaration) ప్రకటించారు. ప్రతి ఎన్నికలలో బీసీలకు 100 సీట్లు, స్థానిక సంస్థలలో 50 శాతం రిజర్వేషన్, యేటా బడ్జెట్ లో రూ.10 వేల కోట్ల నిధులు, బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ వంటివి ఇందులో ప్రధానాంశాలు. ఎన్నికలలో గెలిచినా డిక్లరేషన్‌లో పేర్కొన్న ఒక్క అంశాన్ని కూడా అమలు చేయలేదు. వారి సంక్షేమానికి రూ.50 వేల కోట్లు ఖర్చు చేయాల్సి ఉండగా, రూ. 19,800 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. తెలంగాణలో బీసీ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించి పార్టీని గాలికి వదిలేసిన చరిత్ర చంద్రబాబుది.

జగన్‌కే మద్దతు ఎందుకు?

2014 ఎన్నికలపుడు అనుసరించిన వ్యూహాలతోనే 2024 ఎన్నికలకు చంద్రబాబు(tdp cheif) తెరతీశారు. అందుకే తెలంగాణలో ఆర్థిక పరిపుష్టి కలిగిన బీసీ నాయకుడు కాసాని జ్ఞానేశ్వర్‌కు(kasani gnaneshwar) రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు ఇచ్చారు. బీసీ కార్డుతో కాసానిని రాష్ట్రం అంతా తిప్పి ఏపీలోని బీసీలనూ గతంలో వలె భ్రమలకు గురిచేసి తాను లబ్ధి పొందాలని చూస్తున్నారు. ఎన్నికలు వస్తేనే బీసీలను గుర్తు చేసుకునే చంద్రబాబు వారి కోసం చేసిన కార్యక్రమం ఒక్కటీ లేదు. ఆయన హయాంలో బీసీ నాయకుడు ఒక్కరూ కూడా లేరు. ఇప్పటివరకు ఒక్క బీసీ నాయకుడికి రాజ్యసభ సభ్యత్వం ఇచ్చిన దాఖలా లేదు. ఎప్పుడో ఎన్‌టీఆర్ చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలనే తాను చేసినట్లు ఇప్పటికీ ప్రకటించుకుంటున్నారు. నాటి నాయకులనే బీసీలకు ప్రతినిధులుగా చూపిస్తున్నారు.

చట్టప్రకారం వీలుకాని కాపులని బీసీలలో చేరుస్తామని హామీలిచ్చి కమిటీ వేశారు. అన్నదమ్ముల వలె మసలుకుంటున్న వారిద్దరి మధ్య చిచ్చు పెట్టారు. ఇటువంటి కుటిల యత్నాలను గమనించిన బీసీలు 2019 ఎన్నికలలో జగన్‌కు(ysrcp cheif) మద్దతు తెలిపారు. బీజేపీ సైతం బీసీలతో సామాజిక చైతన్య సభ నిర్వహించి పలు హామీలు ఇచ్చింది. స్వయంగా బీసీ అయిన మోడీ(narendra modi) ప్రధానిగా ఉన్నా ఎప్పటి నుంచో కోరుతున్న బీసీ జనగణన ఇప్పటికీ చేయకపోవడం విడ్డూరం. ఆ డిమాండ్ నేరవేర్చలేని బీజేపీ నాయకులు ఇప్పుడు హామీలు ఇవ్వడం ఆశ్చర్యకరం. రాజధాని, ప్రత్యేక హోదా, రైల్వే జోన్ వంటి విషయాలు విస్మరించిన వారిని నమ్మే స్థితి లేదు.

ఆయన మాటలు అయోమయం

జనాసేనాని సైతం 'నాకు కులం అంటగట్టవద్దు' అంటూనే కాపు, బలిజ కులస్తులు రాజకీయంగా ముందుకు రావాలని పదే పదే ప్రస్తావిస్తున్నారు. వారి కుల పెద్దలు కూడా పవన్‌ను ముఖ్యమంత్రి చేసుకుంటామని బహిరంగంగా ప్రకటిస్తున్నారు. దీంతో బీసీలు పవన్(pavan kalyan) కు మద్దతు తెలిపే అవకాశమే లేదు. జగన్ 2019 ఎన్నికలలో బీసీల కొరకు ఎటువంటి హామీ ఇవ్వకున్నా తమకు అండగా నిలబడిన బీసీల సంక్షేమం కోసం ఇప్పటికే రూ.83 వేల కోట్ల రూపాయలు వారి ఖాతాలలో వేశారు. 17 మంత్రి పదవులలో 11 బీసీలకు కేటాయించారు. 139 బీసీ కులాలకు చెందిన 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి కేబినెట్ హోదాతో చైర్మన్‌లను నియమించారు.

జడ్‌పీ, మున్సిపాలిటీ, మున్సిపల్ కార్పొరేషన్, మార్కెట్ కమిటీ చైర్మన్ లాంటి పదవులలో బీసీలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించారు. నలుగురు బీసీలను రాజ్యసభకు పంపించారు. బీసీల హక్కుల కొరకు పోరాడిన ఆర్. కృష్ణయ్యను(r.krishnaiah) ఎంపీగా చేసి బీసీల హక్కుల సాధనకు మార్గం సుగమం చేయడం గొప్ప పరిణామం. బీసీలకు చట్టసభలలో రిజర్వేషన్ కావాలని బిల్లు పెట్టడం, కాపులను బీసీలలో చేర్చడం సాధ్యపడదంటూ చెప్పడం, చేతి వృత్తుల వారికి జీవనోపాధి కల్పించడం వంటివన్నీ జగన్‌ను బీసీల హృదయాలలో శాశ్వత స్థానం ఏర్పరచాయి. ఇవన్నీ కేవలం మూడున్నర సంవత్సరాల వ్యవధిలో చేసిన జగన్‌కు బీసీలంతా అండగా నిలబడడంలో తప్పు పట్టాల్సిన అంశమే లేదు.


కైలసాని శివప్రసాద్

జర్నలిస్ట్, కాలమిస్ట్

94402 03999

Also Read...

అది ఆలివ్ గ్రీన్ కాదు.. ''వారాహి'' వాహన రంగుపై మంత్రి పువ్వాడ క్లారిటీ

Advertisement

Next Story

Most Viewed