- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నివేదిక: ఎవరు బాధ్యులు?
మహబూబాబాద్ జిల్లాలో రెండు నెలల వ్యవధిలోనే దాదాపు 20 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. మనం తినే అన్నం, తొడిగే బట్టల ఉత్పత్తిలో రైతుల చెమట, నెత్తురే కాదు, వాళ్లు కోల్పోతున్న ప్రాణాలు కూడా కలిసి ఉండటం ఎంతో బాధ కలిగించే విషయం. వివరాలు సేకరించడానికి మార్చి 12, 13వ తేదీలలో మానవ హక్కుల వేదిక, రైతు స్వరాజ్య వేదికకు చెందిన ఎనిమిది మంది సభ్యులం మహబూబాబాద్ జిల్లాలో పర్యటించాం. కేసముద్రం, మహబూబాబాద్, దంతాలపల్లి, మరిపెడ మండలాలలో ఆత్మహత్య చేసుకున్న పన్నెండు మంది రైతుల కుటుంబాలను కలిసాం. వ్యవసాయ అధికారులతో మాట్లాడాం. మరణాలు ప్రధానంగా మహబూబాబాద్, కేసముద్రం మండలాలలోనే ఎక్కువగా జరిగాయి.
నెల్లికుదురు, డోర్నకల్ మండలాలలో ముగ్గురు చొప్పున, దంతాలపల్లి, మరిపెడ మండలాలలో ఒక్కొక్కరు చొప్పున ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ప్రాంతంలో రైతులు కొద్ది సంవత్సరాలుగా పెద్ద ఎత్తున వ్యాపార పంటల సాగుకు మళ్లారు. రోజురోజుకు పెరుగుతున్న జీవన వ్యయం, ఇతర పంటలకు ధరలు లేకపోవడం రైతులను ఈ మార్పు వైపునకు నెట్టింది. మిర్చి పంట సాగుకు ఎకరానికి లక్ష రూపాయల వరకు పెట్టుబడి అవసరం. దీనికి కౌలు విలువ అదనం. మిర్చి సాగు కోసం తెచ్చిన అప్పులు ఏటేటా పెరిగిపోయాయి. ఈ సంవత్సరం అకాల వర్షాల అనంతరం సోకిన బ్లాక్ త్రిప్స్‌తో పంటంతా మాడిపోయింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు.
పంటలు దెబ్బ తినడంతో
మేం కలిసిన 12 కుటుంబాలలో ఒకరు రెడ్డి, ఒకరు యాదవ కాగా మరొకరు దళితుడు. మిగిలిన వాళ్లందరూ లంబాడా గిరిజనులు. అందరూ 2- 4 ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని వ్యవసాయం చేశారు. ఈ సంవత్సరం ఎక్కువగా మిర్చి పంటను వేశారు. అత్యధికులు బ్లాక్ త్రిప్స్ సోకి పాడైన పంటను చూసి తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడ్డారు. అందరికీ కనీసం 6 నుండి 12 లక్షల రూపాయల అప్పు అయి ఉంది. ఒక్కరికి కనీసం ఇరవై ఐదు లక్షల అప్పు ఉంది. మహబూబాబాద్ మండలం అమ్మనగల్‌కు చెందిన దేవిరెడ్డి వెంకటరెడ్డి కుటుంబానికి 20 లక్షల రూపాయలు అప్పు ఉంది. చిన్నప్పుడే తండ్రిని కోల్పోయిన వెంకటరెడ్డి ముగ్గురు ఆడపిల్లలను కూడా తండ్రి లేని వాళ్లను చేసి చేనులోనే గడ్డి మందు తాగాడు. దళిత కుటుంబానికి చెందిన 25 ఏళ్ల యువకుడు నారమల్ల సంపత్ తల్లిదండ్రులకు ఒక్కడే కొడుకు. ట్రాక్టర్ కూడా లోన్ లో తీసుకొని, తండ్రికి గల కొంత భూమికి అదనంగా మరింత భూమిని కౌలుకు తీసుకుని వ్యవసాయం చేసేవారు.
వరుసగా దెబ్బ తిన్న పంటలను చూసి తట్టుకోలేక చేనులోనే గడ్డిమందు తాగాడు. సంపత్ పేరు మీద భూమి కూడా లేనందున రైతుబీమా వచ్చే పరిస్థితి లేదు. భార్య, ఇద్దరు చిన్న ఆడ పిల్లలు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. దంతాలపల్లి మండలం తూర్పు తండాకు చెందిన 30 సంవత్సరాల యువకుడు మాలోతు శ్రీను డిసెంబర్ 24న ఇంట్లోనే ఉరి వేసుకున్నాడు. ఎండిపోయిన మిర్చి , దిగుబడి రాని పత్తి, పొలం బాధలు, కిస్తీలు కట్టలేదని బైక్ లాకెళ్లిన ఫైనాన్స్ అవమానం తట్టుకోలేక, పసివాడుగా ఉన్నప్పుడే తండ్రిని కోల్పోయిన శ్రీను తిరిగి తన ఇద్దరు పిల్లలను తండ్రి లేని వారిని చేస్తూ వెళ్లిపోయాడు. మరిపెడ మండలం గుర్రపుతండాకు చెందిన 25 ఏండ్ల దేవేందర్‌కి సొంత భూమి లేదు. తండ్రికి ఉన్న 30 గుంటలకు అదనంగా మూడెకరాలు కౌలుకు తీసుకుని సాగు చేశాడు. 12 లక్షల అప్పు అయింది. మందు తాగి చనిపోయాడు. రైతుబీమా కూడా రాదు.
సహకరించని అధికారులు
మృతుల కుటుంబాలను ఇప్పటికీ అప్పులవాళ్లు వేధిస్తున్నారు. అప్పులను మాఫీ లేదా సెటిల్ చేయటానికి ప్రభుత్వం ఎటువంటి ప్రయత్నం చేయటం లేదు. కొన్ని కుటుంబాలకు ఇంకా రైతు బీమా అందాల్సి ఉంది. కొందరరికి బీమా కూడా వచ్చే పరిస్థితి లేదు. తమకు వ్యవసాయ, ఉద్యాన శాఖలు, సుగంధ ద్రవ్య బోర్డుల నుండి ఎటువంటి సాంకేతిక, శాస్త్రీయ సహకారం అందటం లేదని, మూడేళ్లుగా బ్యాంకులో లోన్‌లు ఇవ్వడం లేదని బాధితులు చెబుతున్నారు. మరో దారి లేక దుకాణాదారులు ఇచ్చిన మందులనే వేస్తున్నామని చెప్పారు.
పురుగుల మందులు, విత్తన షాపులపై ఎటువంటి నియంత్రణా, పర్యవేక్షణా లేకపోవటంతో వారి మోసాలు, దోపిడీ రైతుల పెట్టుబడి వ్యయాన్ని విపరీతంగా పెంచుతున్నాయి. పంటలు నష్టపోయినప్పుడు ఆదుకుంటారనే నమ్మకం ఉంటే ఈ ఆత్మహత్యలలో చాలా భాగం జరిగేవి కావు.ప్రభుత్వాలు తమ వ్యవసాయ విధానాన్ని పున:సమీక్షించుకోకపోతే ఆత్మహత్యల పరంపర కొనసాగుతూనే ఉంటుంది.
ప్రభుత్వం ముందు మా డిమాండ్లు
బాధిత కుటుంబాలు నిలదొక్కుకోవడం కష్టంగా ఉంది. వారి అప్పులను సెటిల్ చేసి ఆదుకోవాలి. రైతుబీమా రాని కుటుంబాలను జీఓ నంబర్ వన్ 194 ద్వారా ఆదుకోవాలి. ప్రతీ కుటుంబంలో ఒకరికి పెన్షన్ ఇవ్వాలి. ఇటువంటి మరణాలు భవిష్యత్తులో చోటుచేసుకోకుండా నివారణ చర్యలు చేపట్టాలి. కౌలు రైతులను వాస్తవ సాగుదారులుగా గుర్తించాలి.
వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులను నిరంతరం అందుబాటులో ఉంచాలి. తక్షణమే అధికారులను శాశ్వత ప్రాతిపదికన నియమించాలి. కల్తీ పురుగుల మందులను, విత్తన దుకాణాల దోపిడినీ, మోసాలనూ అరికట్టాలి. ప్రకృతి వైపరీత్యాలు, అకస్మాత్తుగా ప్రబలే చీడపీడలను నివారించేలా చూడాలి. వ్యవసాయ విధానాన్ని పున సమీక్షించుకొని తగిన చర్యలు తీసుకోవాలి.
డాక్టర్ ఎస్ తిరుపతయ్య (మానవ హక్కుల వేదిక, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి)
బి. కొండల్ ( రైతు స్వరాజ్య వేదిక, రాష్ట్ర కమిటీ సభ్యులు)
బి రాజు, టి హరికృష్ణ, ఎ. యాదగిరి, పి శ్రీనివాస్, యు.సురేందర్, బీరం రాములు.