రాజకీయ రణక్షేత్రం మునుగోడులో గెలుపెవరిది?

by Ravi |   ( Updated:2022-10-11 07:04:39.0  )
రాజకీయ రణక్షేత్రం మునుగోడులో గెలుపెవరిది?
X

మునుగోడు శాసనసభకు జరిగే ఉప ఎన్నికలో వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి అభ్యర్థులు సిద్ధపడుతున్నట్లు గా కనిపిస్తున్నది. గెలుపు కోసం పార్టీలు పెడుతున్న ఖర్చు చూస్తే బహుశా మునుగోడు శాసనసభ ఉప ఎన్నిక దేశంలోనే అత్యంత ఖరీదైన ఉప ఎన్నిక గా మారే అవకాశం ఉంది. తెలంగాణ శాసనసభ ఎన్నికలకు ముందు జరుగుతున్న మునుగోడు శాసనసభ ఉప ఎన్నిక రాష్ట్ర రాజకీయాలను మార్చే ఎన్నిక అవుతుందేమో కానీ, ప్రజల జీవితాలను మార్చేది మాత్రం కాదు. లెనిన్ చెప్పినట్లు 'ఏ నినాదం వెనుక ఎవరి ప్రయోజనాలు దాగి ఉన్నాయో జనం తెలుసుకోలేనంత కాలం పార్టీలు గెలుస్తూనే ఉంటాయి. ప్రజలు మోసపోతూనే ఉంటారు.

ప్రత్యేక పరిస్థితులలో జరిగే ఉప ఎన్నికలకు రాజకీయంగా పెద్దగా ప్రాధాన్యం ఉండదు. కానీ, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత జరిగిన ఉప ఎన్నికలలో రాజకీయ పార్టీలు గెలుపునకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వటం వలన అవి రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. సాధారణంగా ఉప ఎన్నికలలో (munugode by election) ఫలితం అధికార పార్టీకి అనుకూలంగా ఉంటుంది. టీఆర్ఎస్ పార్టీ మొదటి సారి అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన నారాయణఖేడ్, పాలేరు ఉప ఎన్నికలలో అధికార టీఆర్ఎస్ పార్టీ (trs party) విజయం సాధించింది. కానీ, టీఆర్ఎస్ పార్టీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన నాలుగు శాసనసభ ఉప ఎన్నికలలో రెండు నియోజకవర్గాలలో గెలిచి, మరొక రెండు నియోజకవర్గాలలో ఓడిపోయింది.

2020 లో జరిగిన దుబ్బాక శాసనసభ ఉప ఎన్నికలలో అనూహ్యంగా భారతీయ జనతా పార్టీ గెలవడం, తదనంతరం జరిగిన రాజకీయ పరిణామాలలో భారతీయ జనతా పార్టీకి టీఆర్ఎస్‌కి మధ్య రాజకీయంగా వైరం పెరగగడం, నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ గెలిచింది. ప్రతిష్టాత్మకంగా జరిగిన హుజూరాబాద్ ఉప ఎన్నికలో గెలిచిన తరువాత తెలంగాణలో బలపడటానికి బీజేపీ ప్రయత్నాలు చేస్తున్నది. ఇందులో భాగంగా రాజకీయంగా కలిసి వచ్చే ప్రతి అంశాన్ని ఉపయోగించుకుంటున్నది. మునుగోడు శాసనసభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. ఇప్పుడు అక్కడ జరుగుతున్న ఉప ఎన్నిక ఒక రాజకీయ రణక్షేత్రాన్ని తలపిస్తుంది.

మూడు పార్టీలకు ప్రతిష్టాత్మకం

2023 డిసెంబర్‌లో జరిగే తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు ముందు జరుగుతున్న మునుగోడు ఉప ఎన్నికలో గెలుపు మూడు పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారిపోయింది. ఇక్కడ గెలిచిన పార్టీకి రాష్ట్ర శాసనసభ ఎన్నికల నాటికి రాజకీయంగా రాష్ట్రంలో సానుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. కాబట్టి టీఆర్ఎస్, బీజేపీ కాంగ్రెస్ పార్టీలు మునుగోడులో గెలుపుని ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి. సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవడానికి కాంగ్రెస్, 2014లో గెలిచిన ఈ స్థానాన్ని మరొకసారి సాధించుకోవడానికి టీఆర్ఎస్ హుజురాబాద్‌లో గెలుపుని మునుగోడులో కూడా పునరావృతం చేయాలని బీజేపీ సర్వశక్తులు ఒడ్డుతున్నాయి.

గెలుపు కోసం మూడు పార్టీలు ఎన్నికల నోటిఫికేషన్ (munugode by election notification) రాకముందు నుండే ప్రచారాన్ని ప్రారంభించాయి ఒక ఉప ఎన్నిక కోసం మూడు పార్టీల రాష్ట్ర నాయకత్వాలు తమ బలగాలను నియోజకవర్గంలో మోహరించాయి అంటే, ముఖ్యమంత్రి కూడా ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారంటే ఇక్కడ గెలుపుని మూడు ప్రధాన రాజకీయ పార్టీలు ఎంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయో అర్థమవుతుంది.

త్రిముఖ పోటీ

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత జరిగిన ఆరు శాసనసభ ఉప ఎన్నికలలో ద్విముఖ పోటీనే జరిగింది కానీ, మునుగోడు ఉప ఎన్నికలో మొదటిసారి టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మధ్య త్రిముఖ పోటీ జరుగుతోంది. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజలలోకి తీసుకెళ్లడం ద్వారా, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలడం ద్వారా గెలుపు సాధించవచ్చని టీఆర్ఎస్ భావిస్తోంది. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక చర్యలను ప్రజలలోకి తీసుకెళ్లి బలమైన అభ్యర్థిని నిలబెట్టి దుబ్బాక హుజూరాబాద్ ఉప ఎన్నికల ఫలితాలను పునరావృతం చేయాలని బీజేపీ భావిస్తోంది. బీజేపీ, టీఆర్ఎస్ ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టి తన స్థానాన్ని ఎలాగైనా నిలబెట్టుకోవాలని కాంగ్రెస్ అనుకుంటోంది. ఈ త్రిముఖ పోటీలో గెలుపు పై మూడు పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.

కాంగ్రెసు సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోలేక పోయినా, అధికార పార్టీ టీఆర్ఎస్ గెలవకపోయినా రాజకీయంగా నష్టం జరిగే అవకాశం ఉంది. కానీ, ఈ ఉప ఎన్నికలో బీజేపీ గెలిచినా గతంలో సాధించిన 12 వేల కంటే ఎక్కువ ఓట్లు సాధించినా రాజకీయంగా కలిసి వచ్చే అంశమే. మునుగోడు ఉప ఎన్నికలో మరొక జాతీయ పార్టీ బహుజన సమాజ్ పార్టీ (బీఎస్‌పీ) బీసీ కార్డుతో తన అభ్యర్థిని నిలబెడుతున్నప్పటికీ, మూడు పార్టీల మధ్యనే పోటీ ఉండే రాజకీయ వాతావరణం కనిపిస్తున్నది. రెండు లక్షల ఇరవై ఏడు వేల ఓట్లు ఉన్న ఈ నియోజకవర్గంలో 70 వేల పైచిలుకు ఓట్లు సాధించిన పార్టీ గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.

also read: శతాబ్దాలుగా అభివృద్ధికి ఆమడదూరంలో మునుగోడు!సీనియర్ జర్నలిస్టు విశ్లేషణ

కోమటిరెడ్డి బ్రదర్స్ భవితవ్యం ఏమిటి?

నల్లగొండ జిల్లా రాజకీయాలలో కోమటిరెడ్డి బ్రదర్స్‌కి (komati reddy brothers) ప్రత్యేక రాజకీయ గుర్తింపు ఉంది. 2009 ఎన్నికలలో నల్లగొండలో వెంకటరెడ్డి, నకిరేకల్‌లో చిరుమర్తి లింగయ్య, భువనగిరి లోక్‌సభ నియోజకవర్గం నుండి రాజగోపాల్ రెడ్డి గెలవడంతో వైఎస్ రాజశేఖర్ రెడ్డి జానారెడ్డి లాంటి సీనియర్ కాంగ్రెస్ నాయకుడిని కూడా కాదని కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మంత్రి పదవి కట్టబెట్టారు. 2018 తెలంగాణ శాసనసభ ఎన్నికలలో నల్లగొండ జిల్లాలో 12 శాసనసభ నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీ కేవలం మూడు శాసనసభ నియోజకవర్గాలను మాత్రమే గెలుపొందింది ఈ మూడింటిలో మునుగోడులో రాజగోపాల్ రెడ్డి నకిరేకల్‌లో చిరుమర్తి లింగయ్య గెలిచారు. ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరడం వలన ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ ఉప ఎన్నికలో గెలిస్తే నల్గొండ జిల్లా పై కోమటిరెడ్డి బ్రదర్స్ ప్రభావం కొనసాగుతుంది.

రాజగోపాల్ రెడ్డి ఓడిపోతే కోమటిరెడ్డి బ్రదర్స్ రాజకీయ భవిష్యత్తు ప్రమాదంలో పడే అవకాశం లేకపోలేదు. భువనగిరి లోక్‌సభ పరిధిలోకి వచ్చే మునుగోడు ఉప ఎన్నికలో భువనగిరి లోక్‌సభ సభ్యుడైన కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి అనుకూలంగా ప్రచారం చేయకపోవటంతో కూడా కాంగ్రెస్‌లో వెంకటరెడ్డి భవితవ్యంపై ప్రభావం పడే అవకాశం ఉంది. కోమటిరెడ్డి బ్రదర్స్ వేరువేరు పార్టీలలో ఉండి నల్లగొండ జిల్లా రాజకీయాలను ప్రభావితం చేయలేరు. కోమటిరెడ్డి బ్రదర్స్ వేరువేరు పార్టీలలో ఉండటం వారి రాజకీయ భవిష్యత్తుపై ప్రతికూల ప్రభావం ఉంటుందనేది వాస్తవం. మునుగోడు శాసనసభ ఉప ఎన్నిక కోమటిరెడ్డి బ్రదర్స్ రాజకీయ భవిష్యత్తుని నిర్దేశించబోతుంది అనడంలో సందేహం లేదు.

అత్యంత ఖరీదైన ఎన్నిక

2006లో అప్పటి కర్ణాటక ఉప ముఖ్యమంత్రి సిద్ధరామయ్య జనతాదళ్ సెక్యులర్ పార్టీకి, శాసనసభ్యత్వానికి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరడం వలన చాముండేశ్వరి శాసనసభ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరిగింది. సిద్ధరామయ్య ని ఓడించటానికి అధికార పార్టీ వంద కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినట్లుగా ఆరోపణలున్నాయి. 2017లో జరిగిన నంద్యాల ఉప ఎన్నికలో అధికార తెలుగుదేశం పార్టీ, 2021లో జరిగిన హుజురాబాద్ ఉప ఎన్నికలో ఈటల రాజేందర్ ని ఓడించటానికి అధికార టీఆర్ఎస్ పార్టీ వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు మునుగోడు శాసనసభకు జరిగే ఉప ఎన్నికలో వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి అభ్యర్థులు సిద్ధపడుతున్నట్లు గా కనిపిస్తున్నది.

గెలుపు కోసం పార్టీలు పెడుతున్న ఖర్చు చూస్తే బహుశా మునుగోడు శాసనసభ ఉప ఎన్నిక దేశంలోనే అత్యంత ఖరీదైన ఉప ఎన్నిక గా మారే అవకాశం ఉంది. తెలంగాణ శాసనసభ ఎన్నికలకు ముందు జరుగుతున్న మునుగోడు శాసనసభ ఉప ఎన్నిక రాష్ట్ర రాజకీయాలను మార్చే ఎన్నిక అవుతుందేమో కానీ, ప్రజల జీవితాలను మార్చేది మాత్రం కాదు. లెనిన్ చెప్పినట్లు 'ఏ నినాదం వెనుక ఎవరి ప్రయోజనాలు దాగి ఉన్నాయో జనం తెలుసుకోలేనంత కాలం పార్టీలు గెలుస్తూనే ఉంటాయి. ప్రజలు మోసపోతూనే ఉంటారు.

ఇవి కూడా చదవండి : మునుగోడులో పోస్టర్ల కలకలం.. షాక్‌లో కోమటిరెడ్డి

also read: రెండు దెబ్బలకు ఒక్క పిట్ట! మునుగోడులో ఏం జరగనుంది?

డా. తిరునాహరి శేషు

రాజకీయ విశ్లేషకులు

కేయూ, వరంగల్

98854 65877

Advertisement

Next Story