- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘ఆపరేటర్లు’ తప్పు చేస్తే బాధ్యత ఎవరిది?
సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఇందులో 1.25 కోట్లకు పైగా కుటుంబాల సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల, ఆస్తులు, సంక్షేమ పథకాలు పొందిన లబ్ధి తదితర వివరాలను సేకరిస్తున్నది. 75 ప్రశ్నలకు ప్రజల నుంచి సమాధానాలను రాబడుతోంది. ఉపాధ్యాయులు, అంగన్వాడీ కార్యకర్తలు, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు, వీఏఓలు తదితరులు ఇందులో భాగస్వామ్యమవుతున్నారు.
ప్రభుత్వం, ఈ సర్వేలో సేకరించిన డేటా మొత్తాన్ని కంప్యూటరైజ్ చేయాలని నిర్ణయించింది. దీని కోసం ఇప్పటికే మండల పరిషత్ కార్యాలయాలు, మున్సిపాలిటీ, ఇతర ఆఫీసుల్లో పనిచేసే ఆపరేటర్లకు శిక్షణ ఇచ్చారు. చాలా ప్రాంతాల్లో ప్రైవేటు ఆపరేటర్లను హైర్ చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు. అయితే గతంలో నిర్వహించిన పలు సర్వేలు, వివరాల సేకరణ తర్వాత డేటా ఎంట్రీ సమయంలో అనేక తప్పిదాలు చోటుచేసుకున్నాయి. దీంతో లక్షలాది కుటుంబాలు ప్రభుత్వ పథకాలు, ప్రయోజనాలకు దూరమయ్యాయి. మరోవైపు సర్వే సమయంలో సేకరించిన వివరాలపై గోప్యత పాటించాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. అయితే, ప్రభుత్వం ఎంత ఆదేశాలు ఇచ్చినప్పటికీ ఈ వివ రాలు దుర్వినియోగం అయ్యే ప్రమాదముందనే చర్చ జరుగుతున్నది.
తప్పిదాలతో నష్టపోయిన ప్రజలు..
అభయహస్తంలోని ఆరు గ్యారంటీల అమలు కోసం గత జనవరిలో రాష్ట్ర ప్రభుత్వం ‘ప్రజాపాలన’ పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది. ఇందుకై రాష్ట్రవ్యాప్తంగా 1,25 కోట్లకు పైగా దరఖాస్తులను స్వీకరించింది. ఆ అప్లికేషన్లను ఆన్‌లైన్ చేయడానికి జీహెచ్ఎంసీతో పాటు వివిధ జిల్లాలో ప్రైవేటు ఆపరేటర్లను హైర్ చేసుకున్నది. పలు చోట్ల ఆఫీసులు సరిపోకపోతే ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లో పని చేయించింది. ప్రాంతాల వారీగా ఒక్కో ఫామ్‌కు రూ. 10 నుంచి రూ. 15 వరకు చెల్లించింది. అయితే ఆధార్, రేషన్ కార్డు నంబర్లు, గ్యాస్, కరెంట్ మీటర్‌ల వివరాల నమోదులో అనేక తప్పిదాలు చోటుచేసుకున్నాయి. ఎడిట్ ఆప్షన్ కూడా ఇవ్వకపోవడంతో లక్షలాది మంది ఫ్రీ కరెంట్, గ్యాస్ సబ్సిడీ స్కీమ్స్‌కు దూరమయ్యారు. తప్పుల సవరణకు ప్రభుత్వం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసినా.. ఇప్పటికీ లక్షలాది కుటుంబాలకు ‘స్కీమ్స్’ అందకుండా పోతున్నాయి. రుణమాఫీ విషయంలోనూ అంతే లక్షలాది మంది రైతులకు ఇప్పటి వరకు రుణమాఫీ కాలేదు. ఇందుకు ఆధార్, రేషన్ కార్డు నంబర్లు, పేర్లు, కుటుంబ సభ్యుల వివరాలు, రుణాల వివరాలు తప్పుగా నమోదై ఉండడం, బ్యాంకర్లు సరైన వివరాలు పంపకపోవడమే కారణమని ప్రభుత్వం చెబుతున్నది. ఇక ధరణి కష్టాలు మామూలు కాదు ఆ సమస్యలకు ఇప్పటికీ పరిష్కారం దొరకడం లేదు. ఇలాంటి సమస్యలెన్ని డేటా ఆపరేటర్లు తప్పుగా నమోదు చేయడం వల్ల వచ్చేవి. దీనిని సరిచేయడానికి చాలా సమయం పడుతుంది.
తప్పులను నివారించాలంటే..
వివరాల సేకరణ సమయంలో అధికారులు, సిబ్బంది అనేక జాగ్రత్తలు తీసుకొని నమోదు చేస్తున్నా.. డేటా ఎంట్రీ సమయంలో అనేక తప్పిదాలు చోటుచేసుకుంటున్నాయి. ఇలాంటి తప్పులను నివారించాలంటే ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తేనే సాధ్యమవుతుంది. మండల, జిల్లా స్థాయిలో నోడల్ అధికారులు డేటా ఎంట్రీని పటిష్టంగా పర్యవేక్షించాలి. వివరాల నమోదులో పొరపాట్లు జరగకుండా చూడాలి. అయితే ఫామ్ నంబర్ల వారీగా వివరాలు సేకరించిన సిబ్బంది, డేటా ఎంట్రీ చేసే ఆపరేటర్ ఎవరో నిర్దిష్టంగా రికార్డ్ మెయింటేన్ చేయాలి. తప్పులు జరిగితే అనంతరం చర్యలు ఉంటాయని వారికి స్పష్టంగా చెప్పాలి. కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఆపరేటర్లతో పాటు ప్రైవేటు ఆపరేటర్లనూ హైర్ చేస్తున్నందున.. వారిపై ఇన్‌చార్జీలు పర్యవేక్షించే వ్యవస్థను ఏర్పాటు చేయాలి. జరిగే తప్పులకు ఇన్‌చార్జీలనే బాధ్యులను చేయాలి. ఒక్కరి దగ్గరే వందలాది కుటుంబాల వివరాల నమోదులో తప్పులు జరిగినట్లు గుర్తిస్తే ఆ ఇన్చార్జీపై కఠిన చర్యలకూ వెనుకాడకూడదు. ఈ విషయాన్ని ఇన్‌చార్జీలకు ముందుగా స్పష్టంగా తెలియజేస్తే... తప్పులు జరిగే ఆస్కారం తక్కువగా ఉంటుంది.
ఫిరోజ్ ఖాన్,
సీనియర్ ఫ్రీలాన్స్ జర్నలిస్ట్,
96404 66464