ఈ రాష్ట్రాల్లో విజయావకాశాలు ఎవరివి?

by Ravi |
ఈ రాష్ట్రాల్లో విజయావకాశాలు ఎవరివి?
X

రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యంగా ఢిల్లీ, హరియాణాలలో గెలుపు ఎవరిని వరించబోతుంది అనే అంశంపై ఓటర్లలో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. అక్కడ ప్రధానంగా కాంగ్రెస్, బీజేపీ మధ్యనే పోటీ జరగనుందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఢిల్లీలో సీఎం పదవికి రాజీనామా చేసిన క్రేజీవాల్ ప్రభావం రాబోయే ఎన్నికల్లో ఉండే అవకాశం లేదని, కాంగ్రెస్, బీజేపీ వర్గాలు బలంగా భావిస్తున్నాయి.

అయితే, అధికార మార్పిడి అనేది ఆప్ అంతర్గత వ్యవహారమేననీ, అసెంబ్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్ రాజీనామా ప్రభావం ఉండదనీ, సానుభూతి ఓట్లుపడే అవకాశం లేదని అవి భావిస్తున్నాయి. సుదీర్ఘమైన ఆప్ పాలన తర్వాత పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని కనుక చాలా మంది నాయకులు, మంత్రులు ఆప్‌ను వదిలి కాంగ్రెస్‌లో చేరిపోతున్నారని అందువల్ల ఈ సారి కాంగ్రెస్ గెలుపు ఖాయం అని, ఢిల్లీ కాంగ్రెస్ శాఖ అధ్యక్షుడు దేవేంద్ర యాదవ్ గట్టి ధీమా వ్యక్తం చేస్తున్నారు. అరెస్ట్ అయిన వెంటనే నైతిక బాధ్యత వహించి కేజ్రీవాల్ రాజీనామా చేసి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని. బహుశా ఆప్ పార్టీపై సానుభూతి పనిచేసేదని తనతో పాటు విమర్శకుల వ్యాఖ్య. ఈ నేపథ్యంలో మొన్న లోక్‌సభ ఎన్నికల్లో ఆప్‌తో కలసి పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ, ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఒంటరిగా పోటీ చేయనుంది.

ఆయన చేసిన అభివృద్ధే తిరిగి..

అయితే, ఇప్పటికీ కేజ్రీవాల్ సమర్ధ నాయకత్వం మీద ఢిల్లీ ప్రజలలో విశ్వాసం తగ్గిన సూచనలు ఏమీ కనపడటం లేదు. బీజేపీ కుట్రపూరితంగా లిక్కర్ స్కాంలో కేజ్రీవాల్‌ను, ఆయన మంత్రి వర్గ సహచర మంత్రులను ఇరికించి జైల్లో వేసిందనే అభిప్రాయం ప్రజల్లో బలంగా ఉంది. ఇటీవల, ఆయన సహచర మంత్రులు జైలు నుంచి విడుదల కాగానే ప్రజలు... జేజేలు పలుకుతూ ఇచ్చిన స్వాగత సత్కారాలు ఇందుకు నిదర్శనం. ఇప్పుడు కేజ్రీవాల్ విడుదల సందర్భంగా ప్రజలు ఊరేగింపుగా పలికిన స్వాగత నీరాజనం అపూర్వం. ఆయన పాలనా కాలంలో చేసిన అభివృద్దే తిరిగి ఆప్‌కు పట్టం కట్టే అవకాశం ఉంది. పార్టీలో ఆయన మాటకు తిరుగులేదు. అసమ్మతి ఊసులేదు. అందుకే ఆయన ప్రతిపాదించిన అతిశీని సీఎంగా అందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు.

హరియాణాలో భిన్నమైన వ్యూహాలు..

ఈసారి హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ సభ్యుల్లో కీచులాటలు జరగకుండా కాంగ్రెస్ అధిష్టానం వ్యూహాత్మకంగా వ్యవహరించింది. రాజకీయ ఎత్తుగడలో భాగంగా ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో కాంగ్రెస్ పార్టీ ముందుగా ప్రకటించలేదు. ఎన్నికల అనంతరం మెజార్టీ శాసనసభ సభ్యుల నిర్ణయం మేరకు ముఖ్యమంత్రి ఎంపిక జరుగుతుందని అధిష్టానం ముందుగానే తేల్చి చెప్పింది. నిజానికి ఈ సంప్రదాయం కాంగ్రెస్ సహజ స్వభావానికి వ్యతిరేకం. ఇంతవరకు దేశంలో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో తమ ముఖ్యమంత్రిని ఎన్నికైన మెజార్టీ శాసనసభ సభ్యుల అభీష్టం మేరకు ముఖ్యమంత్రిని నిర్ణయించిన ప్రజాస్వామిక స్వభావం ఎన్నడూ కనబర్చలేదు. ప్రతిసారీ ముఖ్యమంత్రి ఎవరు ఉండాలో, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ఎవరు ఉండాలో నిర్ణయించేది కాంగ్రెస్ అధిష్టాన వర్గమే. కాంగ్రెస్‌లో పార్టీ సభ్యుల అభిప్రాయ సేకరణ అనేది ఒక తంతు మాత్రమే. చివరకు అధిష్టాన వర్గం ఒక చిట్టీ పంపుతుంది. దానిలో ఎవరి పేరు ప్రతిపాదిస్తే వారే ముఖ్యమంతి అవుతారు. ఇప్పుడు హరియాణాలో టిక్కెట్ల కేటాయింపుల్లో తమకు కీలక షేర్ ఇవ్వాలని మాజీ ముఖ్యమంత్రి భూపేంద్ర సింగ్ హుడాతో పాటు... కేంద్ర మాజీ మంత్రి కుమారి సెల్జా, స్థానిక నేత రణదీప్ సుర్జేవాలా పట్టుపట్టారు. చర్చల అనంతరం మొత్తం రాష్ట్రంలోని 90 అసెంబ్లీ సీట్లలో అధిక వాటాను భూపేందర్ సింగ్ హుడా వర్గీయులకే కాంగ్రెస్ కట్టబెట్టింది. కేవలం 6 సీట్లలో మాత్రం అభ్యర్థులను ఏఐసీసీ సమిష్టిగా నిర్ణయించింది. అగ్రనేతలు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ కలిసి మొత్తానికి వివాదరహితంగా సీట్ల కేటాయింపులు చేశారు.

బీజేపీలో అంతర్గత పోరు..

అయితే, బీజేపీలో మాత్రం అంతర్గత కీచులాటలు జరిగాయని ఏఐసీసీ ప్రతినిధి మనోజ్ చౌహాన్ వ్యాఖ్యానించారు. కానీ బయటకు మాత్రం అలాంటి సూచనలు ఏమీ కనిపించడం లేదు. కాంగ్రెస్ తరపున హుడా వర్గానికి చెందిన మల్లయోధురాలు వినేష్ ఫోగాట్ ఎన్నికల బరిలోకి దిగారు. బీజేపీ ప్రభుత్వం పాలనలో రాష్ట్రాన్ని పదేళ్లు వెనక్కి నెట్టిందని, ఆ పార్టీని ఓడించడానికి పోరాడుతామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. టికెట్ల పంపిణీలో కాంగ్రెస్ పార్టీ జాగ్రత్తలు పాటించింది. జాట్‌లకు 35, ఓబీసీలకు 20, ఎస్సీలకు 17, ముస్లింలకు 6, బ్రాహ్మణులకు 4, వైశ్యులకు 2, పంజాబీలకు 6 స్థానాలు కేటాయించింది. ఈసారి ఎలాగైనా విజయం సాధించి రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తుంది. ఓటర్లు ఏ నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.

డా. కోలాహలం రామ్ కిషోర్

98493 28496

Next Story