- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఉత్తమ ఉపాధ్యాయుడు అంటే ఎవరు..?
విద్యార్ధి దశలో మన జీవితంలో అతి ముఖ్యమైన వారు ఇద్దరే. తల్లిదండ్రులు, గురువులు. తల్లిదండ్రులు మన భవిష్యత్తు పట్ల ఆరాటంతో అప్పుడప్పుడు కఠినంగా వ్యవహరించవచ్చు. అతి క్రమశిక్షణ రుద్దవచ్చు. కానీ వేలాది విద్యార్థుల ఎగుడు దిగుడులును చూసిన అనుభవం కలిగిన గురువులు ఆవేశాలకు లోనుకాకుండా ప్రవర్తించగలరు. చదువులో ప్రస్తుతం వెనుకబడిన వారు వెనుకబడినట్లే ఉండరని, ఒకదానిలో కాకపోయినా మరొక దానిలో తమ ప్రతిభాపాటవాలు ప్రదర్శించి జీవితంలో ముందుకు సాగగలరని వారికి తెలుసు. అందుకే పిల్లలపై ఆందోళన చెందే తల్లిదండ్రులకు, విద్యార్థులకు ధైర్యం చెప్పగలరు, ప్రోత్సహించగలరు. భావి పౌరులలో ఆత్మవిశ్వాసాన్ని నింపగలరు. ఈ విధంగా సమాజాన్ని తీర్చిదిద్దగల మహాశక్తి ఉపాధ్యాయుల చేతిలో ఉన్నదనడం అంగీకరించాల్సిన విషయం.
సమాజంలోని వృత్తులన్నిటిలో ఉదాత్తమైనది, పవిత్రమైనది, శక్తివంతమైనది ఉపాధ్యాయ వృత్తి. వారు ఏం ఆశించకుండా విద్యార్థుల ఉన్నతిని ఆకాంక్షిస్తారు. ఉడతా భక్తిగా ప్రభుత్వాలు, విద్యార్థులు సెప్టెంబర్ 5న గురువులను సత్కరించడం ఆనవాయితీగా వస్తున్నది. ఇదే క్రమంలో జాతీయ, రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిలో ఉపాధ్యాయులను సత్కరించడం ఏళ్లుగా జరుగుతున్నది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం గత దశాబ్ద కాలంలో రాష్ట్ర స్థాయిలో ఉపాధ్యాయుల అవార్డుల ప్రధాన కార్యక్రమానికి ఏనాడు గౌరవ ముఖ్యమంత్రి హాజరయిన దాఖలాలు లేవు. నూతన సర్కారు ఏర్పడిన తరువాత మొదటిసారి గురువులను గౌరవించే కార్యక్రమానికి గౌరవ ముఖ్యమంత్రి హాజరవుతారా? లేదా అన్నది వేచి చూడాలి.
గుణం, ఫలితంపై ఆధారపడి ఉంటుందా?
ఉత్తమ ఉపాధ్యాయులంటే ఎవరు? వారిని ఉత్తములుగా ఎవరు ఎంపిక చేయాలి? ఎంపికా విధానంలో ప్రస్తుతం ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలు సరైనవేనా? అనే ప్రశ్నలు ప్రశ్నలుగానే మిగిలిపోతున్నాయి. ఉపాధ్యాయుల సర్వీసు, వారి బోధనా విధానం, సాధించిన ఫలితాలు, సమాజంతో టీచర్లకు గల సత్సంబంధాలు, సామాజిక స్పృహ తదితర అంశాల ఆధారంగా క్షేత్రస్థాయిలో అధికారులు పరిశీలించి ఎంపిక చేయాల్సి ఉండగా దానికి విరుద్ధంగా, అయ్యా నేను ఉత్తముడిని నాకు అవార్డు ఇవ్వండి అని దరఖాస్తు చేసుకోవాల్సిన దుస్థితి నేడు రాష్ట్రంలో నెలకొందనడంలో అతిశయోక్తి లేదు. ఈ క్రమంలో ఒక ప్రొఫార్మా రూపొందించి అందులోని అంశాలను పూరించి సంబంధిత పత్రాలను జతచేసి అధికారులకు అందిస్తే అందులోని అంశాలను ఏవి పరిశీలించకుండా కేవలం సీనియారిటీ ప్రాతిపదికనే ఉత్తములను ఎంపిక చేస్తున్నారనేది వాస్తవం. కొన్ని సందర్భాల్లో ఎటువంటి దరఖాస్తు లేకున్నా, ఎటువంటి పత్రాలు జత చేయకున్నా జాబితాలో పేర్లు చోటు చేసుకోవడం కొస మెరుపు. ఫలితాలు సాధిస్తేనే ఉత్తమ ఉపాధ్యాయుడు అవుతాడా? లేకపోతే కాడా? అతని ఉత్తమ గుణం ఫలితం మీదే ఆధారపడి ఉంటుందా? ఫలితాలు అనేవి పిల్లలకు చదువు పట్ల గల ఆసక్తి, వారి కృషి, వారి మానసిక ఆరోగ్య స్థితిగతులు, ఇంటి పరిస్థితులు, స్నేహాలు మొదలైన అంశాలపై ఆధారపడి ఉంటాయి. ఈ స్థితుల ప్రభావం ఫలితాల మీద తప్పకుండా ఉంటుంది. అలాంటప్పుడు ఫలితాలకు ఉపాధ్యాయుడిని బాధ్యుడిని చేసి ఫలితాలను ప్రామాణికంగా తీసుకుని ఉత్తమ ఉపాధ్యాయుడిని ఎంపిక చేయడం సరైనదేనా? అతని బోధన ఎలా ఉన్నదో చూడరా?
పనితీరు ఆధారంగా ఎంపిక ఉండాలని..
దీనికంతటికీ కారణం ఏమిటా..? అని లోతుల్లోకి వెళ్లి పరిశీలిస్తే క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ వ్యవస్థ పటిష్టంగా లేకపోవడం అనే విషయం అవగతమవుతున్నది. మండలానికో విద్యాధికారి, జిల్లాకు ఒక అధికారి ఉన్నట్లయితే ఎంపికా విధానంలో పారదర్శకత ఉండేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 615 మండలాలకు కేవలం పదుల సంఖ్యలోనే రెగ్యులర్ ఎంఈఓలు ఉండడం మిగిలిన వారంతా ఇంచార్జులుగా కొనసాగుతుండడం గమనార్హం. ఈ పరిస్థితుల్లో వారు కార్యాలయాలకే పరిమితమవ్వడంతో విరివిగా పాఠశాలను సందర్శించి, ఉత్తమ టీచర్లను ఎంపిక చేసే తీరిక లేదన్నది నిర్వివాదాంశం.
ఈ ఎంపిక విధానాన్ని చాలామంది టీచర్లు వ్యతిరేకిస్తున్నారనేది సత్యం. నేనే ఉత్తముడిని అని తమకు తాను దరఖాస్తు చేసుకునే విధానానికి స్వస్తి పలకాలని క్షేత్రస్థాయిలో మెజారిటీ ఉపాధ్యాయులు కోరుతున్నారు. పాఠశాలల్లో ఉపాధ్యాయుల పనితీరు ఆధారంగా ఎంపిక విధానం చేపట్టాలని కోరుతున్నారు. గత ప్రభుత్వాలు అనుసరించిన మూస విధానానికి స్వస్తి పలకాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎంపిక విధానంలో పైరవీలకు తావు లేకుండా పరిమిత సంఖ్యలో ఉత్తములను ఎంపిక చేయాల్సిన బాధ్యత ప్రస్తుత ప్రభుత్వం పైన ఉన్నది. ఆ దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని ఆశిద్దాం.
సుధాకర్.ఏ.వి
రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి, STUTS,
90006 74747