ఈ ఉచిత హామీలకు ఎవరు జామీను..?

by Ravi |   ( Updated:2024-05-23 01:15:11.0  )
ఈ ఉచిత హామీలకు ఎవరు జామీను..?
X

రెండో ప్రపంచ యుద్ధ కాలంలో తీవ్రంగా నష్టపోయిన దేశాల ఆర్థిక అసమానకలను చక్కదిద్దే క్రమంలో 'సంక్షేమం' అనే ప్రతిపాదన మిక్కిలి ప్రచారంలోకి వచ్చింది. అయితే నేటి పాలకులకు సంక్షేమం అంటే నీళ్ల మీది రాతలా మారిపోయింది.

బహుళ రాజకీయ పార్టీల వ్యవస్థలు ఉన్న దేశంలో దేశ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఎన్నికల్లో పాలు పంచుకుంటున్నాయి. భిన్న రాజకీయ తాత్విక చింతనల సమాహారం ప్రజలకు మరింత మేలు చేస్తుందని మన రాజ్యాంగ నిర్మాతలు భావించి.. ఎన్నికల్లో వివిధ భావజాలాల పార్టీలన్నీ పాల్గొంటే ప్రజలకు మరింత మెరుగైన సేవలు లభిస్తాయని, క్షేమం జరుగుతుందని భవిష్యత్తును ఊహించి రాజ్యాంగ పరిషత్తు తలపోసి ఉండవచ్చును. కానీ, మన ప్రజాస్వామ్యంలో రాజకీయ వ్యవస్థలు ఎన్నికలకు ఎన్నికలకు మధ్య ప్రజల యొక్క అభిమానాన్ని చూరకొనడంలో విఫలం చెందాయి. అందుకే ఈసారి ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు హామీల గ్యారెంటీల పల్లవిని ఎత్తుకున్నాయి. ఇందులో ఎక్కువ పథకాలు అనుత్పాదక రంగానికి చెందడం వలన ఇవి ఆర్థికంగా ఉచితాలు కావడం వలన గోడకు వేసిన సున్నంలా తాత్కాలికంగా ప్రజలకు ఉపశమనాన్ని కలిగించి, ప్రభుత్వాలు గెలుపొందడానికి దోహదం చేస్తాయి. తప్ప దీర్ఘకాలంలో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల ఆర్థిక పరిపుష్టతకు ఏమాత్రం జాతి నిర్మాణానికి తోడ్పడలేవు.

పార్టీల పట్ల అనుకూలంగా ఉంటూనే..

ప్రజలకు తమను ఎన్నుకుంటే మేలైన 'సంక్షేమ రాజ్యం' అందిస్తామని, రాజకీయ నాయకులు తమ తమ ఎన్నికల మేనిఫెస్టోల ద్వారా హామీలు ఇస్తుంటారు. తీరా అధికారంలోకి వచ్చాక ఆదాయ వ్యయాల నిజమైన గణాంకాలు తెలుస్తాయి. హామీ ఇచ్చిన పథకాల ఖర్చులు.. ప్రభుత్వాలపైన పడుతున్న ఆర్థిక భారం మధ్య సమతుల్యత దెబ్బతింటుంది. ఈ క్రమంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థికంగా బలహీనపడి రోజుకింత రుణాల ఊబిలో కూరుకుపోతాయి. ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలో మనుగడ సాగిస్తున్న ప్రధాన రాజకీయ పక్షాలు ఎన్నికల ప్రణాళికలను అయితే విడుదల చేశాయి. కానీ ఈసారి అట్టి ప్రణాళికలలో ఇచ్చిన హామీల పట్ల ప్రజలు వెలుబుచ్చుతున్న అసంతృప్తులను, అపనమ్మకాలను గ్రహించి ఈ మారు గ్యారంటీల పేరున ప్రజల విశ్వాసం పొందే ప్రయత్నం చేయడం మరో పరిణామం.

గత ఎన్నికలలో నెరవేర్చని హామీలను పూర్తిచేయని వాగ్దానాలను మరిచిపోయి.. ప్రజలు ఆ నాయకుల, పార్టీల పట్ల అనుకూలంగా ప్రదర్శిస్తున్నారనుకుంటారు. కానీ అవకాశం వచ్చినప్పుడు ఎన్నికలలో తమ అభిప్రాయాన్ని విముఖతను ఓట్ల రూపంలో తమ నిర్ణయాన్ని తెలియజేస్తూనే వున్నారు. దీని నుంచి పాఠాలు గుణపాఠాలు నేర్చుకోకపోగా పదేపదే ప్రజలను తప్పుదారి పట్టించవచ్చునని ఇచ్చిన హామీలను మర్చిపోతారని నాయకులు భ్రమ పడుతుంటారు. ఇది ఎల్లవేళలా సాధ్యం కాదు అనడానికి తార్కాణం మొన్న తెలంగాణలో జరిగిన శాసనసభ ఎన్నికలే మంచి ఉదాహరణ.

ఆత్మపరిశీలన చేసుకోవాల్సింది పోయి..

ప్రభుత్వాల వైఫల్యాలను ప్రజలకు ఇచ్చిన మాటను సమర్థవంతంగా ప్రజా సమూహాలలోకి తీసుకపోయే సత్తా గలిగిన నాయకుడు ఓటర్ల మనసులను గెలవడం ద్వారా ప్రభుత్వాలు మారుతుంటాయి. ఇప్పటివరకు దేశంలో జరిగిన అన్ని ఎన్నికల ఫలితాల చరిత్ర తీరుతెన్నులను లోతుగా విశ్లేషిస్తే, ఇది చాలాసార్లు వాస్తవమేనని నిరూపణకు కాబడుతుంది. దీనిని రాజకీయ పార్టీలు దాని అధినాయకులు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సింది పోయి తమ ఓటమికి ప్రజల అవగాహన రాహిత్యమే కారణమని ప్రజలని తప్పుపడుతుంటారు. తెలంగాణలో గత ప్రభుత్వం నడిపిన వ్యవహార శైలి, చేసిన విన్యాసాలు దీనికి మాదిరిగా నిలుస్తాయి. గత సంవత్సరాలలో అధికార పార్టీ చేసిందంతా చేసింది. చారాన కోడికి బారాన మసాలా లెక్క తమకు తోచినట్టు బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన తీరు గర్హనీయమైనది. పైగా ఇప్పుడు తగుదునమ్మా అని అధికార పార్టీని ఏమీ ఎదగనట్టు నిలదీయడం.. మాట్లాడడం వీరికే చెల్లింది. ఇప్పటికే ఇచ్చిన హామీలు నెరవేర్చాలని ప్రతిపక్షంపై అధికారపక్షం అధికారపక్షంపై విపక్షం కారాలు మిరియాలు గాక పదునైన మాటల కత్తులు నూరడం మొదలుపెట్టాయి. ఇందులో ఒకరు తక్కువ అని ఒకరు మరొకరు ఎక్కువని పెద్దగా స్థాయి బేధాలు కనిపించకపోవడమే కాక మీడియా ద్వారా సభల ద్వారా ఉపన్యాసాలను విన్నవారికి కన్నవారికి కించిత్తు కాలక్షేపంగా కొండొకచో వినోదంగా పరిణమించాయి. ఇటువంటి ధోరణి ప్రజాస్వామ్య మూల సిద్ధాంతాలకు ఏమాత్రం ఆరోగ్యాన్ని చేకూర్చక పోగా రాజకీయ వ్యవస్థల పట్ల ప్రజలు విశ్వాసాన్ని కోల్పోయే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

రాజకీయ పద్మవ్యూహంలో ఓటరు చిక్కి..

అయితే రాజకీయ పార్టీల యొక్క ఈ విధానాలను అరికట్టడానికి ఎన్నికల సందర్భంగా ఆయా పార్టీలు విడుదల చేసే ప్రణాళికలను పార్లమెంటు చట్టబద్ధం చేయాల్సిన అవసరం ఉన్నది. ఆయా ప్రభుత్వంలోని పెద్దలు ఒకవేళ నిధులను దుర్వినియోగపరిస్తే, చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి అట్టి సొమ్మును ఆయా వ్యక్తుల నుండి రాబట్టడానికి ఎలాంటి లోసుగులకు తావు లేకుండా అర్హత కలిగిన లాబోక్తలకు సంక్షేమ ఫలాలు అందేలా చట్టబద్దత కల్పించాల్సి ఉన్నది. అంతేగాక ఈ విషయంపై లోతైన వివరంగాత్మక ఔత్సాహిక ఆర్థిక విద్యార్థులతో అధ్యయనం జరపాల్సి ఉంది. ఇచ్చిన హామీలపై జవాబుదారీతనం పెంపొందించాలి. లేకుంటే తప్పించకపోయిన తాబేలు బుర్రలా అవుతుంది. అంతవరకూ యాంత్రికంగా రాజకీయ వ్యవస్థలు ప్రతి ఎన్నికల సమయంలో ఆపద మొక్కులు మొక్కుతూనే ఉంటారు. ప్రజలకు ఇచ్చిన హామీలను వాగ్దానాలను నెరవేర్చడంలో అంతిమంగా చట్టసభలే జామీను పడాలి. అప్పటి వరకు ఎన్నికలలో పన్నిన రాజకీయ పద్మవ్యూహంలో చిక్కి ధర్మమో అధర్మమో ఓటరు అభిమన్యుడుగా క్షతగాత్రుడై అపజయం పొందుతూనే ఉంటాడు. శంభూకుడిగా బలి అవుతూనే ఉంటాడు.

- జూకంటి జగన్నాథం

కవి, రచయిత

94410 78095

Advertisement

Next Story

Most Viewed