సుప్రీంకోర్టు వ్యాఖ్యల్లో తప్పేముంది?

by Ravi |   ( Updated:2025-02-19 01:01:16.0  )
సుప్రీంకోర్టు వ్యాఖ్యల్లో తప్పేముంది?
X

ఎన్నికల ముందు రాజకీయ పార్టీలు అనుచితంగా ప్రకటించే ఉచిత పథకాల వల్ల ప్రజల్లో సోమరితనం పెరిగి, కష్టపడే మనస్తత్వం నుంచి దూరంగా జరిగిపోతారని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు చేసిన వ్యాఖ్యలు వివాదస్పదంగా మారాయి. ఈ విషయం భారత దేశంలోని మీడియా హౌసులకు హాట్ టాపిక్ అయింది. ఈ వ్యాఖ్యలపై వామపక్ష సంస్థలు, పార్టీలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశాయి. ఈ వ్యాఖ్యలను తప్పుపడుతూ, సీపీఎం నాయకురాలు బృందా కారత్ ఏకంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు లేఖ రాయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.

ఆమె తన లేఖలో ప్రజల జీవనోపాధిని వృద్ధి చేయడానికి ప్రభుత్వాలు కొన్ని ప్రజోపయోగ సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టవలసిందే! ఈ విషయంలో జాతి హితాన్ని కోరే ఎవరు కూడా వ్యతిరేకించరు. ఈ పథకాల అమలులో పారదర్శకత లోపిస్తే, దేశ ఆర్థిక వ్యవస్థకు అది గుదిబండగా మారుతుందని వారి వాదన.

ప్రభుత్వంపై భారం కోసం..

ఉచిత విద్యుత్, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం యువతకు నిరుద్యోగ భృతి, పొలంలో రైతు పైరు వేయకపోయినా రైతు భరోసాను చెల్లించడం లాంటి పథకాలన్నీ దేశ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసేవే. ఈ ఉచిత పథకాలు ఎన్నికల్లో గెలుపోటముల నిర్ణయంలో భాగమే తప్ప సమాజ హితం కోసం కాదనే విషయం జగమెరిగిన సత్యమే. ఈ పథకాల అమలుకు ప్రభుత్వాలు ఖజానాలను నింపుకోవాలి. ఈ పని కోసం ప్రభుత్వం నిజాయితీగా పన్నులు చెల్లించే వాళ్లపైన అధిక భారం మోపుతుంది. వాస్తవంగా ఈ దేశంలో పన్ను చెల్లింపుదారుల కంటే పన్ను ఎగవేతదారులు, పన్నుల భారం నుండి తప్పించుకునే వారు ఎక్కువగా ఉంటారు. అక్రమ మార్గాల్లో ఉచిత పథకాల కొట్టేయాలనే మానసిక స్థితిని రాజకీయ పార్టీలు ప్రోత్సహిస్తున్నాయి.

దేశ హితం పట్టని పథకాలు..

ఈ ఉచిత పథకాలను ప్రవేశపెట్టే చాలా రాజకీయ పార్టీలకు దేశ హితం పట్టదు. తమ పార్టీ అనుయాయులకు, వారి బంధువులకు అనుచితంగా ఈ పథకాల ప్రయోజనాలు అందుతున్నాయి. సుప్రీంకోర్టు వ్యాఖ్యలను తప్పుబట్టిన వామపక్ష నాయకులకు, ఈ పథకాల అమలులో కీలక పాత్ర పోషించే ప్రభుత్వ ఉన్నతాధికారులకు ఈ విషయం బాగా తెలుసు. సత్యాసత్యాలు బహిర్గతం చేయడానికి వెనుకాడడం వెనుక ఎవరి కారణాలు వారికున్నాయి. ఈ విషయంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి బి. ఆర్ గవాయ్ బలి పశువు అయ్యారు అంటే అతిశయోక్తి కాదేమో! ప్రస్తుతం దేశంలోని రాజకీయ పార్టీల ఆలోచన తీరుపై ఒక అవగాహనతో ఆయన ఈ విషయంపై నోరు జారి ఉండవచ్చు.

అర్హత లేని వారికే ప్రయోజనాలు..

ఇక ఉచిత పథకాలే సంక్షేమ పథకాలు అని భ్రమించే వారి వల్ల భవిష్యత్తులో ఈ దేశానికి ఎక్కువ నష్టం జరుగుతుంది. దేశంలో రేషన్ కార్డులు అనేక సంక్షేమ పథకాలకు ప్రామాణికమైందున అనర్హులు సైతం ఈ కార్డులు పొందడం, సంక్షేమ పథకాలను ఎగరేసుకుని పోవడం ఇందులో దాగి ఉన్న రహస్యం. రేషన్ కార్డు ద్వారా పంపిణీ చేయబడే బియ్యాన్ని ఎంతమంది తింటున్నారో నిజాయితీగా లెక్కలు కడితే వాస్తవాలు బయటపడతాయి. ఉచిత గృహాల అమలులో ఎంత అవినీతి ఉందో రాజకీయ పార్టీల నాయకులకు, ప్రభుత్వ అధికారులకు తెలిసిన విషయమే. పలుకుబడి కలిగిన రాజకీయ పార్టీల నాయకులూ, వారి అనుయాయులు అర్హత లేకున్నా ఈ పథకాల ప్రయోజనాలను తీసుకోలేదా?

బీజేపీకీ గత్యంతరం లేక

ఇక ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణంలో సంక్షేమ ప్రయోజనం దాగి ఉన్నట్లేనా? కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల ఎన్నికల్లో ఈ ఉచిత పథకాలు కాంగ్రెస్ పార్టీని, 2015, 2020 ఢిల్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీని గట్టెక్కించాయి. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని, బీజేపీ తనకు ఇష్టం లేకపోయినప్పటికీ అధికారాన్ని చేజిక్కించుకోవడానికి ఢిల్లీ ఎన్నికల్లో ఈ ఉచిత పథకాల మంత్రాన్ని జపించి, 70 సీట్లకు 48 సీట్లు గెలిచి అధికారాన్ని కైవసం చేసుకుంది. హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల్లో ఆ పార్టీ విజయ రహస్యం కూడా ఇదే.

కులమతాల ఆధారంగా పథకాలు..

సమాజ సమగ్ర అభివృద్ధికి కొన్ని సంక్షేమ పథకాలు అమలు చేయాల్సిందే. ఈ విషయంలో కూడా ప్రభుత్వాలు దేశ విదేశాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకోవాలి. దేశ రాజకీయాలు మతాల చుట్టూ, కులాల చుట్టూ పరిభ్రమించడం వల్ల రాజకీయ పార్టీల నాయకులు సంక్షేమ పథకాలను మతాలను, కులాలను ఆధారం చేసుకుని ప్రకటించడం సర్వసాధారణమై పోయింది. సంక్షేమ పథకాలకు ఎవరు అర్హులు? ఎవరు అనర్హులు అనే విషయంలో ప్రభుత్వం వద్ద కరెక్టు లెక్కలు ఉన్నాయి. ఈ లెక్కలను బేరీజు వేసుకుంటే సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలలో తప్పు లేదనిపిస్తుంది.

కూలీలపై సుప్రీం వ్యాఖ్య తగదు!

ఇక ఉచిత పథకాల వల్ల వ్యవసాయ పనులకు కూలీలు దొరకడం లేదని సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు అసమంజసంగా ఉన్నాయి. వ్యవసాయ పనులకు కూలీలు దొరకకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా వ్యవసాయ కుటుంబాల్లోని కుటుంబ సభ్యుల్లో చాలామంది పనులు చేయడం మానేశారు. ఒకప్పుడు వ్యవసాయం గౌరవప్రదమైన వృత్తిగా ఉండేది. ఈరోజు ఆ వృత్తి సమాజం చేత తిరస్కరించబడింది. ఆ వృత్తిని ప్రధానంగా భావించే వ్యక్తుల మానసిక స్థితి పూర్తిగా మారిపోయింది. సమస్య అంతా ఇక్కడే ఉంది. సమాజం సంఘటితంగా ఈ సమస్యకు పరిష్కారం కనుక్కోవాలి. ఇక చివరగా ఉచిత పథకాలకు నిధులను రాజకీయ పార్టీల నాయకులు తమ కార్యకర్తల నుంచి సేకరించి, ఖర్చు చేస్తే, కోర్టులకు ఎటువంటి అభ్యంతరం ఉండదు!

ఉల్లి బాల రంగయ్య,

సామాజిక, రాజకీయ విశ్లేషకులు.

94417 37877

Advertisement
Next Story

Most Viewed