మహనీయుల స్మరణలో నేర్చుకున్నదేంటి?

by Ravi |   ( Updated:2023-04-26 22:30:07.0  )
మహనీయుల స్మరణలో నేర్చుకున్నదేంటి?
X

నదేశానికి, సమాజానికి ఎన్నో సేవలు చేసిన నాయకుల్ని, మేధావుల్ని తలచుకుంటూ, తరతరాలుగా వారికి నివాళులు అర్పిస్తూనే ఉన్నాం. కానీ వారు చూపిన బాటలో నడిచి, వారి ఆశల్ని, ఆశయాల్ని ఎంతవరకు ఆచరిస్తున్నము? అని ప్రశ్నించుకుంటే మౌనమే సమాధానం వస్తోంది. వందల సంవత్సరాల క్రితం ఒక చరితగా వచ్చిన రాముని పాత్రని ఇప్పటికి మన సమాజంలో కథానాయకునిగా చూస్తున్నాం. ఆ రాముని నామాన్ని కూడా మన పిల్లలకు నేర్పిస్తూనే ఉన్నాము. అయితే ఆనాటి రామాయణంలోని ప్రతినాయకుడైన రావణుడిని సైతం ఈనాడు ఆదరించేవాళ్ళ సంఖ్య ఎందుకు పెరిగిపోతుందో అర్థం కావడం లేదు. గాంధీ, గాడ్సేలు కూడా వారు బ్రతుకున్న కాలం కంటే వారు కాలగర్భంలో కలిశాకే సంచలనం సృష్టిస్తున్నాయి. గాంధీ కన్నా గాడ్సే నే గ్రేట్ అంటూ సరికొత్త సినిమాలు, సాహిత్యం కూడా రోజుకొక రూపంలో సంచలనం సృష్టిస్తునే ఉంది.

అయితే ఆనాటి చరిత్రని, వాస్తవాల్ని ఈనాటి సినిమా రంగం, సాహిత్యం వక్రీకరిస్తున్నాయని ఎన్నో రకాల విమర్శలు వస్తున్నప్పటికీ వాస్తవాల్ని మాత్రం ఏ ఒక్కరూ కూడా వెలికితీసే ప్రయత్నం చేయడం లేదు. నేటి రాజకీయ నాయకులు సైతం ప్రజల్ని కులాలు, మతాలు వారిగానే కాకుండా ఆచారాలు, సంప్రదాయాలు పరంగా కూడా విభజించి పాలించడం మొదలు పెట్టారు. వారి స్వలాభం కోసం ప్రజలకు సరికొత్త సిద్ధాంతాల్ని నూరి పోస్తూ వాళ్ళల్లో వారే కొట్టుకుని చచ్చేలా కొత్త కొత్త కథల్ని రూపకల్పన చేస్తున్నారు.

ముఖ్యంగా భారతరత్న అంబేద్కర్ జయంతి వస్తే చాలు దేశవ్యాప్తంగా ఒక పండగ వాతావరణం నెలకుంటుంది. కానీ కులనిర్మూలన కోసం పోరాడిన అంబేద్కర్ జయంతిని మాత్రం దేశంలో అన్నీ కులాలవారు ఒకే రీతిలో జరుపుకోకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అంబేద్కర్ ఆశలు, ఆశయాలు అంటూ దీర్ఘంగా ఉపన్యాసాలు ఇచ్చే నాయకులు సైతం ఆచరణలో అంబేద్కర్ విధానాలకు తూట్లు పొడుస్తూనే వున్నారు.

ఈనాటి రాజకీయ నాయకుల పుణ్యాన అగ్రకులాలు, అల్ప కులాలు అన్న పదాలు ప్రజల మధ్య ప్రతిరోజూ చిచ్చురేపుతూనే ఉన్నాయి. దీర్ఘకాలికంగా అమలవుతున్న రిజర్వేషన్లు సైతం సమాజాన్ని రెండు భాగాలుగా విభజించాయనే చెప్పొచ్చు. మనుధర్మం గూర్చి ఇప్పటికి నేటి సమాజంలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఆనాడు బ్రాహ్మణిజం ఏమి బోధించిందో తెలియదు గాని ఈ నాటికి ఆ పదం ఒక రకమైన వివక్షని ఎదుర్కొంటూనే ఉంది.

స్వాతంత్ర్యానికి పూర్వము, తరువాత దేశానికి ఒక దశ, దిశని నిర్దేశించిన నాయకుల్ని ఈనాటికి మనం జయంతి, వర్ధంతి ఇతర ఉత్సవాల పేరిట స్మరించుకుంటూనే ఉన్నాం కానీ వారి అడుగుజాడల్లో మాత్రం నడవలేకపోతున్నాం. ఫ్లెక్సీలు, డిజేలు పెట్టి ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం తప్ప, వారు చూపిన సన్మార్గంలో మాత్రం వెళ్లలేకపోతున్నాము. అందుకే ఇప్పటికైనా ప్రజలు ముఖ్యంగా యువత ఆనాటి మహాపురుషులు, మేధావులు చూపిన బాటలో నడిచి మనదేశాన్ని, సమాజాన్ని అభివృద్ధి వైపు తీసుకువెళ్లే ప్రయత్నం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

పసునూరి శ్రీనివాస్

88018 00222

Advertisement

Next Story