Uniform Civil Code: యూసీసీ.. రాజ్యాంగంలో భాగమే!

by Ravi |   ( Updated:2023-07-21 00:15:37.0  )
Uniform Civil Code: యూసీసీ.. రాజ్యాంగంలో భాగమే!
X

మ్మడి పౌరస్మృతి (యూసీసీ) అంటే దేశంలో అందరికీ ఒక్కటే పౌర చట్టం అమలుపరచే బిల్లు. భారతావని ఒకే దేశంగా అవతరించినప్పటికి పెళ్లి, విడాకులు,వారసత్వం, దత్తత తదితర వ్యక్తిగత అంశాల్లో ఒకే పౌర చట్టం అమల్లో లేదు. మతాల వారీగా ఎవరి చట్టాలు వారికున్నాయి. హిందువులు, ముస్లింలు, క్యాథలిక్ క్రిస్టియన్లు, పార్సీలకు తమ తమ మత చట్టాలు వర్తిస్తున్నాయి. అయితే, యూసీసీ అమల్లోకి వస్తే ఇవన్నీ రద్దయి అందరికీ ఒకే చట్టం అమలవుతుంది. ఇది అమలైతే.. భారతదేశంలో ఉన్న స్త్రీలకు, పిల్లలకు, కులం, మతం, వర్గం, ప్రాంతం, భేదం లేకుండా సమాన హక్కులు వర్తిస్తాయి. అయితే ఉమ్మడి పౌరస్మృతిని మతాల పరంగా చూడకుండా స్త్రీల పిల్లల హక్కుల గురించి ఆలోచించాలి. ఏ మతాన్ని డామినేషన్ చేయడానికి యూసీసీ తీసుకొని రావడం లేదనేది గుర్తించాలి.

రెచ్చగొడుతూ.. రాద్దాంతం చేస్తూ..

భారతదేశంలో షరియా చట్టం లేదు. ముస్లిం సమాజంలో స్త్రీలు, పిల్లలకు సమాన హక్కులు అవసరం. మతం ముసుగులో మహిళా హక్కులకు భంగం వాటిల్లుతోంది. వాటిని అరికట్టడానికే మాత్రమే ఉమ్మడి పౌర స్మృతి తీసుకొని రావడానికి ప్రయత్నం జరుగుతోంది. భారతదేశం గొప్పతనమేమంటే ఇస్లాం, క్రైస్తవం, జుడాయిజం మనదేశంలోకి వచ్చినప్పుడు వ్యతిరేకించలేదు. వాటితో నేటికీ సహజీవనం చేస్తోంది హిందూ సమాజం. ఉమ్మడి పౌరస్మృతి ఉండాలని రాజ్యాంగంలోనూ నిర్దేశించారు. రాజ్యాంగ ఆదేశిక సూత్రాల్లో ఉమ్మడి పౌర స్మృతి ఒకటి. రాజ్యాంగంలోని 44 ఆర్టికల్ భారతదేశంలోని పౌరులందరికీ ఒకే చట్టం వర్తించేలా ఉమ్మడి పౌర స్మృతి రూపొందించటానికి ప్రభుత్వం ప్రయత్నించాలని స్పష్టం చేస్తోంది. స్వాతంత్య్రానంతరం అప్పుడప్పుడు యూసీసీ చర్చల్లోకి వచ్చినా అమలు దిశగా అడుగులు పడలేదు. రెండవ లా కమిషన్ ఉమ్మడి పౌరస్మృతి ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకించింది. అయితే యూసీసీ అనేది వివిధ చట్టాల్లోని వివక్షను తొలగించి జాతి సమగ్రతకు దోహదం చేస్తుందని, ప్రభుత్వమే చొరవ తీసుకొని తన బాధ్యతను నిర్వర్తించాలని గతంలో సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.

వేర్వేరు మతాలు, వర్గాలకు చెందిన భారతీయ పౌరులు వేర్వేరు ఆస్తి, వివాహ చట్టం అనుసరించడం జాతీయ సమైక్యతకు భంగం కలిగిస్తుంది. దేశంలోని పౌరులందరికీ వివాహం, విడాకులు, దత్తత, వారసత్వం వంటి అంశాల్లో మతంతో సంబంధం లేకుండా అందరికీ సమానంగా చట్టాలను అమలు చేయడమే ఉమ్మడి పౌర స్మృతి, కులం, మతం, వర్గం, స్త్రీ, పురుష భేదాలకు అతీతంగా దేశంలోని పౌరులందరికీ సమాన హోదా కల్పిస్తోంది. ఉమ్మడి పౌరసత్వం. ఇలాంటి అంశాల్లో ప్రస్తుతం వేర్వేరు మతస్తులకు వేర్వేరు చట్టాలు అమలవుతున్నాయి. హిందూ వివాహ చట్టం, హిందూ వారసత్వ చట్టం, ఇండియన్ క్రిస్టియన్ మ్యారేజెస్ యాక్ట్, ఇండియన్ డైవోర్స్ యాక్ట్,పార్శీ మ్యారేజ్ అండ్ డైవోర్స్ యాక్ట్ వంటివి అమల్లో ఉన్నాయి. ముస్లిం పర్సనల్ చట్టాన్ని క్రోడీకరించలేదు. ముస్లింల మతపరమైన గ్రంథాలే వీటికి ఆధారంగా ఉన్నాయి. ఈ వ్యక్తిగత చట్టాల వల్ల ఉత్పన్నమయ్యే సమస్యలను పరిష్కరిస్తూ, దేశంలోని ప్రజలందరికీ ఒకే నిబంధనలు వర్తించే విధంగా చేయడం కోసం ఉమ్మడి పౌర స్మృతిని అమలు చేయాలనే అభిప్రాయాలను తెలియజేయాలని శాసన పరిశీలక సంఘం ఇటీవల ప్రజలను, మత సంస్థలను కోరింది. కొంతకాలంగా ఉమ్మడి పౌర స్మృతిపై సమాజంలో విపక్షాలు ప్రజలను రెచ్చగొడుతూ, రాద్ధాంతం చేస్తున్నాయి. అనేకమంది వారి రాజకీయ ప్రయోజనాల కోసం వారికి నచ్చిన విధంగా రకరకాల విశ్లేషణలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు.

భారతీయత భావం పెరుగుతుంది!

వ్యక్తిగత చట్టాల వల్ల ఉత్పన్నమవుతున్న వైరుధ్యాలతో కక్షిదారులు న్యాయస్థానం మెట్లెక్కుతున్నారు. ఇలాంటి వైరుధ్యాల వల్ల వివాహ బంధంలోకి ప్రవేశించిన వివిధ కులాలు, వర్గాలు, మతాలకు చెందినవారు సంఘర్షణకు గురవుతున్నారు. ఒక్క పెళ్లిళ్ల విషయంలోనే కాదు. విడాకుల సందర్భంలో, పిల్లల్ని దత్తత తీసుకోవడంలో, చివరకు వారసత్వ హక్కుల విషయంలోనూ ఈ వైరుద్ధ్యాలు అడ్డంకిగా మారుతున్నాయి. భారత రాజ్యాంగంలోని 44వ అధికరణ మేరకు ఉమ్మడి పౌర స్మృతి అవసరాన్ని సుప్రీంకోర్టు తరచు ఉద్ఘాటిస్తూనే ఉంది. దేశ సమైక్యత కోసం యూనిఫాం సివిల్ కోడ్ తీసుకురావాలని.. సుప్రీంకోర్టు అనేకసార్లు వివిధ తీర్పుల ద్వారా ఉమ్మడి పౌరస్మృతి ఆవశ్యకతను వివరించింది. కామన్ సివిల్ కోడ్ ద్వారా జాతీయ సమైక్యత సమగ్రతను సాధించవచ్చు. పార్లమెంట్ దీనిపై వెంటనే దృష్టి పెట్టాలని అన్నారు. కానీ నాటి రాజీవ్ గాంధీ ప్రభుత్వం దీన్ని పట్టించుకోలేదు. పైపెచ్చు క్రిమినల్ కోడ్ ముస్లిం మహిళలకు వర్తించకుండా సెక్షన్ 125ను సవరిస్తూ ప్రత్యేక చట్టాన్ని 1986లో నాటి ప్రభుత్వం చేసింది. 1995లో సరళా ముద్గల్ కేసు పరిశీలించిన సుప్రీంకోర్టు సాధ్యమైనంత త్వరగా ఉమ్మడి పౌరస్మృతి తేవాలని చెప్పింది.

హిందూ కోడ్ బిల్లును 1954లో తెచ్చిన నెహ్రూ ఉమ్మడి పౌర స్మృతి తేవడానికి దేశంలో పరిస్థితులు అనుకూలంగా లేవని ఆనాడు అన్నారు. సరే, మరి స్వాతంత్య్రం వచ్చి నాలుగు దశాబ్దాలకు పైబడిన తర్వాత కూడా పరిస్థితులు మెరుగుపడలేదా? ఇక రాజ్యాంగంలోని 44వ అధికరణలో పేర్కొన్న కామన్ సివిల్ కోడ్ అంశం ఎప్పటికీ దుమ్ము కొట్టుకొని పడి ఉండటమేనా? దేశంలో 80% మంది పౌరులు దీనికి సమ్మతించినప్పుడు ఇంకా దేనికి ఆలస్యం అని జస్టిస్ కుల్ దీప్ సింగ్ ఆ నాటి తీర్పులో ప్రశ్నించారు. 2003లో జాన్ మల్ల మట్టం కేసులో కూడా ఉమ్మడి పౌర స్మృతి ఆవశ్యకతను సుప్రీం గుర్తు చేసింది. ఉమ్మడి పౌరస్మృతి వల్ల కలిగే ప్రయోజనాల్లో ప్రధానంగా కులం, మతం, వర్గం, స్త్రీ, పురుష లింగ భేదాలకు అతీతంగా దేశంలోని పౌరులందరికీ సమాన హోదా లభిస్తుంది. చట్టప్రకారం ఆడ, మగ ఇద్దరూ సమానమేననే.. లింగ సమానత్వం సాధించొచ్చు. క్రిమినల్, సివిల్ చట్టాలన్నీ అందరికీ సమానమవుతాయి. ప్రస్తుతమున్న పర్సనల్ చట్టాలను సంస్కరించాల్సిన పనిలేదు. బహుభార్యత్వం నేరమవుతుంది. అన్ని మతాల్లో.. చిన్న కుటుంబం తప్పనిసరి చేసే అవకాశం కలుగుతుంది. దేశ సమగ్రతను సాధించేందుకు వీలవుతుంది. భారతీయత భావం పెంపొందుతుంది.

అంబేద్కర్ సమర్ధించినా..ఇంకా మరుగునే!

భారత్ ప్రజాస్వామ్య దేశమైనప్పటికీ, అందరికీ సమాన హక్కులు కల్పిస్తున్నప్పటికీ, వివిధ మతాల వ్యక్తిగత చట్టాలు ఈ ప్రయోజనాన్ని నిర్వీర్యం చేస్తున్నాయి. ఫ్రాన్స్, జర్మనీ, చైనా, యూకే ఎక్కడైనా మతాల ప్రాతిపదికన రకరకాల చట్టాల ప్రసక్తే లేదు. ఈజిప్ట్, మొరాకో, టర్కీ వంటి ముస్లిం దేశాల్లోనూ అల్పసంఖ్యాక పౌరులకు వేరే చట్టాల పద్ధతన్నదే లేదు. అనేక దేశాల్లో యూనిఫార్మ్ చట్టాలు ఉన్నాయి. ఓటు బ్యాంకు రాజకీయాలు చేసే పార్టీలు ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన ముస్లింల హక్కులను తిరస్కరిస్తూ వారిని పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేశాయి. నేడు కూడా యూసీసీని సాకుగా చూపించి, రెచ్చగొట్టి రాజకీయ ప్రయోజనం పొందుతున్నాయనే విషయాన్ని ముస్లింలు గ్రహించాలి. భారతదేశం లౌకిక సమాజానికి కట్టుబడి ఉన్న దృష్ట్యా ఉమ్మడి పౌరస్మృతి ప్రవేశపెట్టడం నేడు ఎంతైనా అవసరం ఉంది.

ఉమ్మడి పౌర స్మృతి రాజ్యాంగ స్వప్నం. అదేశిక సూత్రాల్లో ఉమ్మడి పౌర స్మృతి ప్రస్తావన ఉంది. దేశంలోని పౌరులందరికీ వర్తించేటట్లు ఒకే స్మృతి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం కృషి చేయాలని ఆర్టికల్ 44 పేర్కొంది. బీఆర్ అంబేద్కర్, కేఎం మున్షీ, అల్లాడి కృష్ణస్వామి అయ్యర్ ఉమ్మడి పౌర స్మృతిని గట్టిగా సమర్ధించారు. సామాజిక పురోగతికి, మత చట్టాలను సంస్కరించడం తప్పనిసరని అంబేద్కర్ స్పష్టం చేశారు. స్వాతంత్య్రానికి ముందే 1941లో హిందూ మతాల చట్టాల సమీక్షకు హిందూ లా రిఫార్మ్స్ కమిటీని ఏర్పాటు చేసి, దాని ద్వారా హిందూ కోడ్ బిల్‌ను 1954-55లో అమల్లోకి తెచ్చింది. మత చట్టాల పరిశీలన తర్వాత కమిటీ ఇచ్చిన నివేదికపై చర్చించి హిందూ వ్యక్తిగత ఆచారాల సంస్కరణలు మూడు దశల్లో ఆమోదించారు. అప్పట్లో రాజ్యాంగ పరిషత్ చేసిన సూచనలు కాలక్రమంగా మరుగున పడిపోయాయి.

సభావట్ కళ్యాణ్

ఏబీవీపీ రాష్ట్ర నాయకులు

90143 22572

Advertisement

Next Story

Most Viewed