మణిపూర్‌లో అల్లర్లకు కారణాలేంటి?

by Ravi |   ( Updated:2023-05-10 09:13:43.0  )
మణిపూర్‌లో అల్లర్లకు కారణాలేంటి?
X

“భిన్న సంస్కృతులకు, కళలకు పుట్టినిల్లు మన భారతదేశం. అలాంటి దేశంలోని ఎనిమిది సాంప్రదాయ నృత్యాలలో ఒకటి మణిపురి నృత్యం, ప్రధానంగా రాధా కృష్ణల రాసలీలల పురాతన నృత్య రీతి ఇది. అలాంటి ప్రాధాన్యత కలిగిన ఉత్తర ఈశాన్య రాష్ట్రం అయిన మణిపూర్ ఇప్పుడు మండుతోంది. మే 3 న మొదలైన ఘర్షణలు ఈ రోజుకి తీవ్ర రూపం దాల్చి చివరికి కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు ఇవ్వాల్సిన స్థితిలోకి వెళ్ళిపోయింది. మణిపూర్‌లో ఉంటున్న కుకీ, నాగా, మైతీతెగల ప్రజల మధ్య తీవ్ర ఘర్షణలు జరగడం వల్ల చివరికి కర్ఫ్యూ విధించాల్సిన పరిస్థితి నెలకొంది. గత నాలుగు రోజులుగా ఇంటర్ నెట్, మొబైల్ సేవలని నిలిపివేశారు కానీ ఘర్షణలు ఆగలేదు సరికదా ఇంకా పెరిగిపోయాయి.

కాశ్మీర్ తరహా నిబంధనలు..

అక్కడ ఎందుకీ జాతి వైషమ్యాలు నెలకొన్నాయని చూస్తే, అక్కడ కుకీ తెగ, నాగా తెగ, మైతీ తెగ ప్రజలతో పాటుగా కుకీఫంగల్ తెగ కూడా అక్కడ ఉంది. కుకీ, నాగా తెగల ప్రజలు షెడ్యూల్ ట్రైబ్[ఎస్టీ] కింద రక్షణ పొందుతున్నారు. వీళ్ళు అందరూ క్రైస్తవులు. మెజారిటీ తెగ ప్రజలు అయిన మైతీ ప్రజలు హిందువులు. వీళ్ళు మణిపూర్ లో గత 2 వేల సంవత్సరాలకి పైబడి ఉంటున్నారు. మైతీ తెగ ప్రజలలో మతం మార్చబడ్డ ప్రజలని మైతీపంగల్‌లు అంటారు వీళ్ళు ముస్లిమ్స్. మణిపూర్ లోని ఎత్తైన కొండ ప్రాంతాలలో కుకీ, నాగా జాతి ప్రజలు ఉంటున్నారు. లోయలో ఉండే మైదాన ప్రాంతంలో మైతీ తెగ ప్రజలు ఉంటున్నారు. స్వాతంత్య్రం వచ్చాక కుకీ, నాగా ప్రజలని షెడ్యూల్ ట్రైబ్స్ జాబితాలో చేర్చారు. ఈ కుకీ, నాగా ప్రజలు మొత్తం కొండల మీద ఉంటారు. ఈ కొండ ప్రాంతానికి రక్షణగా ఆర్టికల్ 371సి రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. ఆర్టికల్ 371సి అనేది దాదాపుగా కాశ్మీర్ కి సంబంధించిన ఆర్టికల్ 370 లోని నిబంధనలకి దగ్గరగా ఉంటుంది! అంటే ఈ కొండ ప్రాంతాలలో బయటి వాళ్ళు ఎవరూ స్థలాలు కొనడానికి వీలు లేదు. ఈ కొండ ప్రాంతంలో ఉండే అడవులలో కుకీలు, నాగాలు ఉండవచ్చు కానీ ఆ స్థలాలని అమ్మడానికి లేదు బయటి వాళ్ళు కొనడానికి లేదు. కానీ అదే లోయలో ఉండే మైదాన ప్రాంతంలో ఎవరయినా స్వేచ్ఛగా స్థలాలు కొనవచ్చు, అక్కడ ఎవరైనా నివాసాలు ఏర్పరుచుకోవచ్చు. వ్యాపారాలు చేసుకోవచ్చు.

ఈ రావణ కాష్టానికి కారణమిదే!

ఒకే రాష్ట్రంలో ఉన్న ప్రాంతాలకి వేర్వేరు చట్టాలు, అధికారాలని అమలు చేయడమే ఈ నాటి రావణ కష్టానికి కారణమయ్యింది. షెడ్యూల్ కులాలకు, షెడ్యూల్ జాతుల కోసం ఏర్పాటు చేసిన చట్టాలు ఎప్పుడయితే మొదలయ్యాయో అప్పటి నుండి మణిపూర్‌లో ఉన్న కుకీ, నాగా ప్రజలకి ఎస్టీ హోదా కల్పించారు. అలాగే కొండ ప్రాంతాలలో ఉండే అడవులలో స్వేచ్చగా తమకి ఇష్టం వచ్చినట్లు బ్రతికే హక్కునీ కల్పించారు. అయితే కుకీలు, నాగాలు మతం మారి క్రైస్తవం స్వీకరించాక వీళ్ళకు ఎస్టీ హోదాని ఎందుకు రద్దు చేయలేదు? అదే కొండ దిగువ ప్రాంతంలో ఉండే మీతీ ప్రజలని జనరల్ కేటగిరీలో ఉంచేశారు ఎందుకు? వాళ్ళు సనాతన ధర్మాన్ని ఆచరిస్తున్నందుకా? అసలు మణిపూర్‌లో మూల వాసులుగా చెప్పబడే మీతీ ప్రజలకి ఎలాంటి ప్రత్యేక హక్కులు ఎందుకు లేకుండా చేశారు? లోయలోని మైదాన ప్రాంతంలో ఉంటున్న మైతీ ప్రజల స్థలాలని ఎవరైనా కొనవచ్చు. బయటి వాళ్ళు అక్కడ ఉద్యోగ, వ్యాపారాలు చేయవచ్చు, శాశ్వత నివాసాలు ఏర్పాటు చేసుకోవచ్చు. బంగ్లాదేశ్, మియాన్మార్ నుండి అక్రమంగా మణిపూర్ లోకి ప్రవేశించిన వలస దారులు మైతీ ప్రజల అవకాశాలని కొల్లగొడుతున్నారనే ఆరోపణలు కూడా వస్తున్నాయి.

ఇలాంటి ఎన్నో సమస్యలున్న మైతీ ప్రజలు తమను కూడా ఎస్టీ కేటగిరీ లోకి చేర్చి రక్షణ కల్పించమని గత పదేళ్లకి పైగా ఆందోళనలు చేస్తూ వచ్చారు,ఫలితం శూన్యం కావడంతో చివరకి విసుగెత్తి రాష్ట్ర హైకోర్టుకి తమ సమస్యలని విన్నవించుకున్నారు. హైకోర్టు మైతీ ప్రజల వాదనలని విన్న తరువాత మైతీ ప్రజలని ఎస్టీ కేటగిరీలో చేర్చాల్సిందిగా కోరుతూ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించాల్సిందిగా మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చింది. దాంతో ఆగ్రహించిన కుకీ, నాగా ప్రజలు మైతీ ప్రజల మీద దౌర్జన్యానికి దిగారు. కుకీ ప్రజలు సహజంగా వాడే కత్తులతోనూ, నాగా ప్రజలు AK-47లతోనూ విరుచుకు పడ్డారు.

అక్రమ వలసదారులు పెరిగిపోవడంతో..

అయితే కుకీ, నాగా ప్రజల ఆగ్రహానికి మరో ముఖ్య కారణం ఉంది. దశాబ్దాలుగా కుకీ, నాగా ప్రజలు కొండల మీద అడవులలో గంజాయి సాగు చేస్తూ వస్తున్నారు. గంజాయి పంట చేతికి వచ్చాక గంజాయిని ప్రాసెస్ చేసి దానిని హెరాయిన్‌గా మార్చి అమ్ముకుంటున్నారు. అడవులలో ఉండడం వరకే వాళ్ళకి హక్కు ఉంది కానీ అటవీ స్థలాల మీద వాళ్ళకి ఎలాంటి హక్కు లేదు. కానీ దశాబ్దాలుగా కొన్ని స్వార్థ శక్తులు కుకీ, నాగా ప్రజలకి అడవులు మీవే అంటూ మభ్యపెడుతూ వచ్చాయి. దాంతో అసలు అడవులు తమవే అనివారు వాదిస్తున్నారు.

బర్మాలో ఉండే కుకీలని మణిపూర్ లోకి రప్పించి వాళ్ళకి నకిలీ ఆధార్ కార్డులని ఇస్తూ వచ్చారు. బంగ్లాదేశ్ నుండి అక్రమంగా మణిపూర్ లోకి వచ్చిన వాళ్ళకి కూడా ఇస్తూ వచ్చారు. దాంతో మైదాన ప్రాంతంలో ఉంటున్న హిందూ మైతీ ప్రజల మెజారిటీ తగ్గిపోతూ అక్రమ వలసదారుల సంఖ్య పెరిగిపోయి మైతీ ప్రజల జీవనోపాధికి గండి పడ్డది. మైతీ ప్రజలకి ఎస్టీ హోదా ఇవ్వాలంటూ కేంద్రానికి సిఫారసు చేయమని హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో సమస్య పెద్దది అయ్యింది. హైకోర్టు ఆదేశాల మేరకు తమకి ఎస్టీ హోదా కల్పించాలని, తక్షణమే ఎన్నార్‌సీని అమలు చేసి అక్రమ వలసదారులని గుర్తించి బయటికి పంపించేయాలని, యూనిఫాం సివిల్ కోడ్ చట్టాన్ని వెంటనే అమలులోకి తీసుకురావాలంటూ మణిపూర్ మైతీ హిందూ ప్రజలు మూడు డిమాండ్లు చేస్తున్నారు ఇప్పుడు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం త్వరితగతిన స్పందించి శాంతి భద్రతలు నెలకొల్పాలని ఆశిద్దాం. మనకేం పట్టింది అని వదిలేస్తే ప్రాచీన సంస్కృతికి నిలయమైన మణిపూర్ రాష్ట్రం తన పూర్వ వైభవాన్ని కోల్పోతుంది!

రోహిణి ప్రసాద్

ఫ్రీలాన్స్ జర్నలిస్ట్

70367 04687

Advertisement

Next Story

Most Viewed