బీసీ ఎమ్మెల్యేల బాధ్యతలేమిటి?

by Ravi |   ( Updated:2022-09-03 17:08:52.0  )
బీసీ ఎమ్మెల్యేల బాధ్యతలేమిటి?
X

సామాజిక సమతుల్యత పేరిట ప్రజలను తృప్తిపరిచేందుకు ప్రభుత్వాలు నాలుగింటిలో ఒకటి బీసీలకు అందిస్తున్నాయి. ఆయా సామాజికవర్గాల ఓట్ల ఆశకే పార్టీలు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలలో బీసీలకు స్థానం కలిగిస్తున్నాయి. మరి అలా అవకాశం అందుకున్న బడుగువర్గాల ప్రతినిధులు తమ వర్గాలకు మిగిల్చే సంతృప్తి ఏమిటి అని ఆలోచించాలి. 'అన్ని ప్రభుత్వమే చేస్తుంది, మేము జేజేలు పలుకుతూ జనంతో పాలాభిషేకాలు చేయిస్తాం' అంటే చట్టసభలలో బీసీలు ఉన్నా లేనట్లే!

రాజ్యాంగంలో పొందుపరచిన రిజర్వేషన్ల మేరకు ఎస్సీ, ఎస్టీలు స్వతంత్ర భారత తొలి ఎన్నికల నుంచి చట్టసభలలోకి అడుగుపెడుతున్నారు. ఎవరికిష్టమున్నా లేకున్నా రాజ్యాంగ పరిరక్షణ ఉన్నందున లెక్క ప్రకారం నియోజకవర్గాలను వారికి కేటాయించక తప్పదు. అట్టడుగు బతుకులకు రాజ్యాంగం ప్రసాదించిన అద్భుత వరంగా ఈ సదుపాయాన్ని భావించాలి. ఆర్థికంగా చాలా బలహీనంగా ఉన్నప్పటికీ వారు రిజర్వేషన్‌ల తోడ్పాటుతో అసెంబ్లీ, లోక్‌సభకు ఎన్నికవుతున్నారు. బీసీలు మాత్రం జనరల్ స్థానాలకు పోటీ చేసి, ఆర్థికంగా తరతరాలుగా బలంగా ఉన్న అగ్ర సామాజిక అభ్యర్థులతో తలపడాల్సి వస్తోంది.

సీట్ల కేటాయింపులోనూ రాజకీయ పార్టీలు ఉన్నత సామాజికవర్గాలకు చెందినవారు లేనప్పుడే బీసీలకు అవకాశం ఇస్తున్నాయి. ఎంత తెలివి ఉండి, శ్రమపడినా ఎన్నికలలో సీట్ల పంపకం వచ్చేసరికి బీసీ నేతలు, కార్యకర్తలను వెనుకకు నెట్టి, అప్పుడే అమెరికా నుంచి వచ్చిన అగ్రకుల వ్యక్తికి పార్టీలు బి-ఫారం ఇచ్చి ఘనంగా అసెంబ్లీకి పంపిన సందర్భాలున్నాయి. తెలంగాణాలో సుమారు 60 లక్షల జనాభా ఉన్న ఎస్సీ వర్గాలకు అసెంబ్లీలో 18 సీట్లు, 35 లక్షల దాకా ఉన్న ఎస్టీలకు 9 సీట్లు రిజర్వ్ అయినప్పుడు, అదే కోవలో బీసీలకు చోటు దక్కకపోవడంతో స్వశక్తితో గెలవలేక చతికిలపడుతున్నారు.

దినదిన గండంగానే

జనాభాలో సగానికి పైగా ఉన్న బీసీలలో సామాజికంగా వివక్షకు గురవుతూ దినదిన గండంగా బతుకుతున్న కులాలు చాలానే ఉన్నాయి. బీసీ-ఏ లో ఉన్న కులాలు దాదాపుగా ఎస్సీ, ఎస్టీల జీవన స్థితిగతులకు దగ్గరగానే ఉంటాయి. వారిలోంచి చట్టసభలలో కాలుపెట్టినవారు ఒకరిద్దరు ఉండొచ్చు. బీసీలలో కొంత మెరుగ్గా బతుకుతున్న మున్నూరు కాపు, యాదవ, పద్మశాలి, ముదిరాజ్, గౌడు కులాలకు చెందినవారే అధికంగా బీసీల తరఫున గ్రామస్థాయి నుంచి ఢిల్లీ దాకా వెళ్లగలుగుతున్నారు. పై కులాలకు చెందిన అభ్యర్థులు అసలే లేనప్పుడు మాత్రమే వీరికి టికెట్ దొరికే అవకాశం వస్తోంది. బీసీ అభ్యర్థికి బి-ఫారం చేతికి వచ్చినంత మాత్రాన గెలుపు ఖాయం కాదు.ఎన్నికల ఖర్చును తట్టుకోగలగడమే అసలు సమస్య.

రెడ్డి, వెలమలలో అధికులకు తరతరాలుగా స్థిర, చర ఆస్తులు ఉండడం వలన ఎన్నికల ఖర్చులో వారు ప్రత్యర్థితో పోటీ పడగలుగుతారు. అదే బీసీలు అయితే, ఆ ఒక్క తరం సంపాదించిన ఆస్తిని పణంగా పెట్టవలసిందే. ఉన్నది ఊడ్చి ఎన్నికలలో నిలబడినా, ఓడిపోతే ఆర్థికంగా చితికిపోక తప్పదు. మరోవైపు ఎన్నికల ప్రచార సమయంలోనే బీసీ అభ్యర్థి గెలుపును జీర్ణించుకోలేక, సొంత పార్టీలోని ఉన్నతవర్గాలే చాటుమాటుగా ఓటమికి కుట్రలు పన్నుతాయి. బయటి పార్టీ నుంచి గెలిచి అధికార పార్టీలో చేరితే ఇక ఓడిన బీసీల రాజకీయ జీవితం ముగిసినట్లే. ఇలా దగా పడిన బీసీ నేతలు ఎందరో ఉన్నారు. అగ్రవర్ణాలవారు ఓడిపోయినా రాజకీయంగా కాపాడేందుకు నామినేటెడ్ పదవులతో వారికి బతుకునిస్తారు.

కత్తుల వంతెనలు దాటి

ఒక బలహీనవర్గాల వ్యక్తి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ స్థానం దాకా రావడానికి ఎన్ని అగ్ని పరీక్షలకు గురవుతాడో, ఎన్ని కత్తుల వంతెనలను దాటుతాడో మరింత వివరించనవసరం లేదు. వారి గెలుపు ఒక సాహస క్రీడ. జీవన్మరణ సమస్య. పదిరువై ఏండ్ల యజ్ఞఫలం. ఎన్నికలలో గెలిచాక బీసీ ప్రజాప్రతినిధులు వారి వర్గాలకు చేస్తున్న ప్రత్యేక మేలు ఏమిటన్నది అసలు ప్రశ్న. బీసీకి టికెట్ ఇవ్వగానే నియోజకవర్గంలోని బీసీలంతా సంబరాలు చేసుకుంటారు.

అభ్యర్థిని తమ ఇంటి మనిషిగా స్వీకరించి అతడి విజయం కోసం విశేష కృషి చేస్తారు. గెలుపుని వేడుకగా జరుపుకుంటారు. కుల సంఘాల తరఫున సన్మాన సత్కారాలు విజేతకు లభిస్తాయి. సదరు బీసీ ఎమ్మెల్యే మాత్రం పార్టీ అధినేతకు మరింత విధేయుడై అందిన అందలాన్ని కాపాడుకొనే పనిలోనే ఉంటాడు. తన విజయాన్ని తమ విజయంగా తలచే తమవారి రుణం తీర్చుకోవాలన్న ప్రయత్నం కనబడదు. ఒంటరిగా అలాంటి ప్రయత్నాలు చేస్తే హద్దులు దాటుతున్నాడని పార్టీ పెద్దలు భావిస్తారని భయం కూడా వెంటాడుతుంది.

ఆ స్పృహ వారికి ఉండాలి

తెలంగాణ అసెంబ్లీలో 40 మంది రెడ్డిలు, 22 మంది బీసీలు, 10 మంది వెలమలున్నారు. 17 గురు మంత్రులలో ముగ్గురు బీసీలు. ఈటల రాజేందర్ నిష్క్రమణ తర్వాత ఆరోగ్య శాఖను హరీశ్‌రావుకు అప్పగించారు. ఈటల ఉదంతం వెనుకబడిన కులాలకు చెందిన ఎమ్మెల్యేలు, మంత్రులకు ఒక షాక్ ట్రీట్‌మెంట్‌గా భావించాలి. జెండా మోసిన ప్రతివాడు పార్టీలో హక్కుదారుడే అన్న ఈటల మాట పార్టీ పెద్దల ఆగ్రహానికి కారణమైంది. మిగతా బీసీ ప్రజాప్రతినిధులు సామరస్య పరిష్కారానికి ప్రయత్నించకపోగా రోజూ ప్రెస్ మీట్‌లు పెట్టి ఈటలను తూలనాడారు. ఈ తతంగమంతా తెలంగాణ బీసీ జనాభాను ఎంతో కలచివేసింది. ధిక్కార స్వరం వినిపిస్తే బలి కావలసిందే.

అసలు, ఒక బీసీ ప్రతినిధి చట్టసభలో అడుగుపెట్టి సాధించిందేమిటి? తాను ఎమ్మెల్యేనయ్యాననే తృప్తి అతడొక్కడు పొందితే చాలా! ఎన్నో ఆశలు పెట్టుకొని గెలిపించిన తన జాతి ప్రజలకు ప్రభుత్వపరంగా ఏమీ చేయకుంటే గెలిచి ప్రయోజనమేమిటి? బీసీ ప్రజాప్రతినిధులు తామంతా ఒకటి అనుకుంటే ఎన్నో పనులయ్యే అవకాశముంది. వీరంతా ఒక ఫోరమ్‌గా ఏర్పడాలి. బడ్జెట్ కేటాయింపుల సమయంలో, వాటి వినియోగం, ఖర్చు విషయంలో శ్రద్ధ వహించాలి. బీసీల కోసం కొత్త పథకాల రచన చేసి ప్రభుత్వానికి అందజేయాలి. పథకాల నిర్వహణలో భాగమవ్వాలి. అమలులో జాప్యాన్ని, అలసత్వాన్ని ప్రశ్నించగలగాలి. 'మేము బీసీల కోసమే ప్రజాప్రతినిధులమయ్యాము, వారి ప్రయోజనాలకోసం ప్రభుత్వంతో ఎల్లవేళలా సంప్రదింపులు జరుపుతాము' అనే స్పృహ వారిలో ఉండాలి. ప్రభుత్వాలు కూడా వీరి వైఖరిని సానుకూలంగా అర్థం చేసుకోవాలి.

సమష్టిగా నిలబడి

రాజకీయ పార్టీలలో కూడా బీసీ విభాగం ఉండాలి. దానికి తగిన కార్యవర్గముండాలి. సీట్ల కేటాయింపులో పార్టీ ఆ విభాగంతో రాతపూర్వకంగా సంప్రదించాలి, దాని మాటకు గౌరవముండాలి. బీసీ ప్రజాప్రతినిధులు ఆ విభాగానికి బద్ధులై ఉండాలి. ఐక్యతకు నిదర్శనంగా ఆ విభాగాన్ని బలోపేతం చేయాలి. అప్పుడే బీసీల అస్తిత్వానికి తగిన గౌరవం దక్కుతుంది. సామాజిక సమతుల్యత పేరిట ప్రజలను తృప్తి పరిచేందుకు ప్రభుత్వాలు నాలుగింటిలో ఒకటి బీసీలకు అందిస్తున్నాయి. ఆయా సామాజికవర్గాల ఓట్ల ఆశకే పార్టీలు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలలో బీసీలకు స్థానం కలిగిస్తున్నాయి. మరి అలా అవకాశం అందుకున్న బడుగువర్గాల ప్రతినిధులు తమ వర్గాలకు మిగిల్చే సంతృప్తి ఏమిటి అని ఆలోచించాలి. 'అన్ని ప్రభుత్వమే చేస్తుంది, మేము జేజేలు పలుకుతూ జనంతో పాలాభిషేకాలు చేయిస్తాం' అంటే చట్టసభలలో బీసీలు ఉన్నా లేనట్లే!

బి.నర్సన్

94401 28169

Advertisement

Next Story

Most Viewed