- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మతానికి, రాజ్యవ్యవస్థకు మధ్య సంబంధం ఏంటి?
ఆధునిక భారతదేశంలో మతానికి, రాజ్య వ్యవస్థకు మధ్య బలీయమైన అనుసంధానం ఏర్పడుతుండటంపై సీరియస్ చర్చ జరగాల్సి ఉంది. మతాన్ని ఇతర సాంస్కృతిక గుర్తింపులను, ఎన్నికల రాజకీయాలలో గెలుపుకోసం విచ్చలవిడిగా వాడటం మంచిదేనా? 1970 నుండి పెరిగిన పోటా పోటీ మత, సాంస్కృతిక గుర్తింపుల దుర్వినియోగంపై ఇప్పటికైనా లోతైన చర్చ జరగాలి.
ఆధునిక యూరోపియన్ విజ్ఞాన యుగం మతాన్ని బలమైన రాజకీయ అధికార క్షేత్రం నుండి దూరం చేసిన మాట నిజమే. ఆ మేరకు రాజ్య శక్తిని ఎవరు పొందాలి ఎవరు పొందకూడదు అని నిర్ణయం చేయగల స్థాయి నుండి మతం పక్కకు తప్పుకున్నది. ఆ విజ్ఞాన భౌతిక వాద ప్రధాన యుగ చింతన ఇప్పటికీ కొనసాగుతున్నప్పటికీ, మతాన్ని మానవ జీవితాల నుండి సంపూర్ణంగా చేయలేక పోయింది. ప్రజల నైతిక అంతరిక జీవితాలలో మతం ప్రభావం యూరోపియన్ సమాజాలలో (పరిమితులలో ఉన్నా) కూడా ఉంది. అందుకే మతం అనే ఒకనొక ప్రాచీన మానవ నిర్మిత వ్యవస్థ పట్ల, ఆధునిక వ్యక్తివాద, ప్రజాస్వామికవాద కాలంలో ఎటువంటి దృక్పథంతో ఉండాలి అన్నది నేటికీ సజీవ చర్చ గానే ఉంటున్నది.
మతం అంతరించి పోదు
సంప్రదాయం, దాని మీద విమర్శ ఎట్లా ఉండాలి అనే అంశంపై యూరోపియన్ సామాజిక తత్వంలో ఇప్పటికీ చర్చ జరుగుతూనే ఉన్నది. రాజ్య శక్తికీ, మతానికీ నడుమ ఒక పెద్ద గోడ ఉండాలి అనే ఫ్రెంచ్ తరహా ఆలోచనలు ఒక వైపు ఉండగా, మరో వైపు చర్చి పాటించే నైతిక విశ్వాసాలకు ప్రాధాన్యత ఇచ్చే రాజ్య వ్యవహారమూ యూరోప్‌లో ఉన్నది. సంప్రదాయమూ, దాని పట్ల విమర్శ గురించి ఇటీవలి యూరోపియన్ తత్వ చింతనలో గాడ్మర్, హెబర్ మాస్ డిబేట్‌గా పేరుపొందిన తత్వ చర్చలో సెక్యులరిజం, మతం అన్న అంశాలు సజీవ అంశాలే. అలాగే కెనడా, బెల్జియం వంటి చోట్ల చర్చలోకి వచ్చిన బహుళ సంస్కృతుల సహజీవనం, మత సంస్కృతుల మధ్య అవగాహన, సాముదాయిక హక్కులకు ప్రాధాన్యత అనే వైపు సాగుతూ ఉన్నాయి. ఏదేమైనా మతాలు మొత్తంగా విజ్ఞాన వాదం తాకిడికి డైనోసార్లలాగా అంతరించిపోవు అనేది ఇప్పుడు తేటతెల్లం. రాజ్యవ్యవస్థ కన్నా ముందు పుట్టిన ఈ మత వ్యవస్థలు ఏదో రూపంలో సామాజిక, సాంస్కృతిక మానవ ఆంతరిక జీవితాన్ని ప్రభావితం చేస్తూనే ఉన్నాయి.
మతానికీ, రాజ్యానికి మధ్య..
ప్రతి సమాజంలోనూ... రాజ్యవ్యవస్థ, మతాలతో ఎట్లా వ్యవహారం నెరపాలి అన్న చర్చ నిరంతరం సాగాల్సి ఉంటుంది. మతం ఎప్పుడు, ఎంతమేరకు ప్రయోజనకరం, ఎప్పుడు ఏమేరకు ప్రమాదకరం అన్న చర్చ చాలా జాగ్రత్తగా, హేతుబద్ధంగా సాగాల్సి ఉన్నది. భారతీయ సమాజం వంటి బహుళ మత సంస్కృతులు ఉండే చోట ఈ చర్చ మరింత అవసరం. మతాల ప్రయోజనాలు, పరిమితులు, వాటి ఉపయోగిత, రాజ్య శక్తితో వాటి సంబంధం మీద చర్చ సాగాలి. మన దేశంలో ఈ చర్చ దాదాపు 50 ఏళ్లుగా సాగడం లేదు. మరీ గత ముప్పై ఏళ్లుగా దారుణంగా ఉంది. ఇప్పుడు మతాలను రాజకీయ అవసరాలకు వాడుకోవడాన్ని బహిరంగంగా అడ్డూ అదుపూ లేకుండా చేస్తున్నారు. మెజారిటీ, మైనారిటీ మతం అనే తేడా లేకుండా మతాన్ని, ఇతర సాంస్కృతిక గుర్తింపులను అధికార రాజకీయాల కోసం వాడుకోవడం విపరీతం అయింది.
మేధో పేదరికం ప్రమాదకరం
దాదాపు 75 ఏళ్ల కింద డెమోక్రటిక్ రిపబ్లిక్‌గా మనలను మనం ప్రకటించుకున్నాము. మత ప్రమేయం లేని రాజ్యంగా మనలని మనం రూపొందించుకోవాలి అని నిర్ణయించుకున్నాము. మత స్వేచ్ఛ మన రాజ్యాంగంలో ప్రధాన అంశం. మన రాజ్యాంగం ఒకే ఒక ఆధిపత్య మతానికి కొమ్ముకాసేదిగా ఏమీ లేదు. రాజ్యం సంగతి అట్లా ఉండగా మన ప్రజా జీవితాలను 1950 నాటికి ఆ తరువాతా ప్రభావితం చేసిన చేస్తున్న స్వేచ్ఛ, సమత, న్యాయం అనే డెమోక్రటిక్ రిపబ్లికన్ విలువలు, భావనలు ఎట్లా ముడిపడాలి అనేది దాచి వేయలేని, దాటి వేయకూడని చర్చ. ఆర్థిక పేదరికం లాగే, గత కొన్ని దశాబ్దాలుగా మన దేశంలో మేధో పేదరికం పెరుగుతున్నందున మనం ఆ చర్చ లోకి పోవడం లేదనిపిస్తోంది.
1970ల నుండి ఈ దేశంలో మత శక్తిని రాజకీయ అధికార సాధనా మార్గం అయిన ఎన్నికల రాజకీయాలలో వాడుకోవడం పెరిగింది. 1990ల నుండి మెజారిటీలో ఉన్న వారి మతాలను రాజకీయ అవసరాలకు, వాడుకోవడం పెరిగింది. అకాలీ రాజకీయాలకు ఊతం ఇచ్చిన హర్యానా రాష్ట్ర వేర్పాటు, ఎమర్జెన్సీ తరువాత ఎన్నికలలో విజయం కోసం ఇందిరాగాంధీ హిందుత్వ శక్తులతో కలిసి సాగడం, షాబానో కేసు ద్వారా ముస్లిం మత ఛాందసవాదులతో రాజీవ్ గాంధీ చెట్టాపట్టాలు, వివాదాస్పదమైన ప్రార్థనా స్థలంలో శిలాన్యాసాలు, 1992లో ఉదారవాద ఆర్థిక విధానాల ప్రారంభంతో పాటు ఎదిగి వచ్చిన మెజారిటీ మతతత్వం, వీటి వెనుక పనిచేసిన, పనిచేస్తున్న కారకాలు ఏమిటి అనేది ఇప్పుడు పట్టించుకోవాలి.
ఈ చర్చ అవసరం!
ఈ వాస్తవ స్థితి మీద రాజకీయ భావజాల ఆవేశాలను దాటివేసి సాగే చర్చలు మనకు అందరికీ ముఖ్యమే. మతాన్ని ఇతర సాంస్కృతిక గుర్తింపులను ఎన్నికల రాజకీయాలలో గెలుపు కోసం విచ్చలవిడిగా వాడటం మంచిదేనా ఈ పరిణామం బాగోగులు ఏమిటి అన్న వివేకా పూరితమైన చర్చ మన దేశానికి అత్యవసరం. 2024 జనవరి 22 సందర్భానికి 1992 డిసెంబర్ 6 సందర్భంతో లింకు ఉన్నది. ఈ రెండూ 1970 నుండి పెరిగిన పోటా పోటీ మత, సాంస్కృతిక గుర్తింపుల దుర్వినియోగంతో అనుసంధానమై ఉన్నాయి, ఇంకా ముందుకు పోతే ఆధునిక జాతి నిర్మాణానికి మతం మాత్రమే బలమైన ప్రాతిపదిక అని భావించిన 18వ శతాబ్ది చివరి , 19వ శతాబ్ది మొదటి కాలం నాటి వలస భారత దేశ మేధో ప్రపంచంతో దీనికి లింకు ఉన్నది. అందుకే ఇప్పుడు ఈ దేశంలో మతానికీ, రాజ్య వ్యవస్థకూ నడుమ ఉండాల్సిన సంబంధం ఎలా ఉండాలి అన్న చర్చ జరగాలి. ఈ దేశ భవిత కోసం, రేపటి తరాల కోసం. ఇది ఏమాత్రమూ వాయిదా వేయదగిన చర్చ కాదు.
డా. హారతి వాగీశన్,
అసిస్టెంట్ ప్రొఫెసర్, పొలిటికల్ సైన్స్
నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం
94402 53089
- Tags
- Religion