ఓయూలో దాడుల సంస్కృతి ఏంటి?

by Ravi |   ( Updated:2024-09-21 01:00:23.0  )
ఓయూలో దాడుల సంస్కృతి ఏంటి?
X

నూరు పూలు వికసించనీ...వెయ్యి ఆలోచనలు సంఘర్షించనీ అనే లక్ష్యంతో ఇండియాలో విశ్వవిద్యాలయాలు ఏర్పాటు అయ్యాయి. భావ సంఘర్షణ జరిగి అత్యుత్తమమైన విధానం, సిద్ధాంతం పుట్టుకురావాల్సిన వర్సిటీల్లో దాడుల సంస్కృతి శరవేగంగా విస్తరిస్తోంది. విరుద్ధమైన భావాలు, సిద్ధాంతాలు వ్యక్తుల మధ్య అంతరాలుగా ఉండొద్దని చర్చలు కొనసాగించిన వర్సిటీల్లో నేడు జరుగుతున్నది ఏమిటి? భిన్న దృక్పథాలు, భిన్న ఆలోచనలు, సిద్ధాంతాలు ఉన్న విద్యార్థి సంఘాల నేతలపై మతోన్మాద విద్యార్థి సంఘం వరుస దాడులు చేపడుతూ వస్తున్నది.

ఇప్పటికే మతోన్మాద విద్యార్థి సంఘం సెంట్రల్ వర్సిటీలలో తుడిచిపెట్టుకుపోతోంది. జాతీయవాదం పేరిట వైషమ్యాలను రెచ్చగొడుతూ పాలకుల కుట్రలో భాగస్వామ్యం అవుతోన్న ఆ విద్యార్థి సంఘం..తమ వ్యతిరేక భావజాలం కలిగిన విద్యార్థి నాయకులపై చేస్తున్న దాడి ఇవాళ కొత్తది కాదు.. మూఢత్వాన్ని మోసుకు తిరుగుతోన్న ఆ విద్యార్థి సంఘాన్ని వ్యతిరేకించినందుకు ప్రొ.కాశీంను ఖతం చేయాలనుకున్నది. తర్వాత డీబీఎస్ఏ అధ్యక్షుడు శరత్ చమార్ పీహెచ్‌డీ థీసిస్‌ను కక్షపూరితంగా కాలబెట్టింది. అనంతరం మొన్న జేఎన్‌యూలో రక్త చరిత్రకు పాల్పడింది. ఇవాళ మళ్లీ ఓయూలో ఒకనాటి భయకంపిత వాతావరణం నెలకొల్పేలా ప్రయత్నిస్తున్నది. ఎన్నో విద్యార్థి ఉద్యమాలను కొనసాగిస్తూ.. ప్రజాస్వామిక, సామాజిక ఉద్యమాలకు ఇలవేల్పుగా నిలిచిన వర్సిటీలో తమ ఆధిపత్యం సడలుతుంది అన్నప్పుడల్లా...ఇలాంటి నెత్తుటి ఘటనలకు పాల్పడిన చరిత్ర ఆ కాషాయ మూకలకు ఉన్నది.

జార్జిరెడ్డిని పొట్టనబెట్టుకుని....

నాడు.. పేద, మధ్య తరగతి గ్రామీణ ప్రాంత విద్యార్థులను లక్ష్యంగా చేసుకొని వర్సిటీలో కాషాయ విద్యార్థి సంఘం అనేక అకృత్యాలకు పాల్పడింది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ జార్జిరెడ్డి ఆ విద్యార్థి సంఘంకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినందుకు ఆ మేధావిని పొట్టన పెట్టుకుంది. అనంతరం విద్యార్థులను వర్సిటీలో భయకంపితులను చేసి.. తమ ఆధిపత్యాన్ని చాటుతూ వచ్చింది. విప్లవ ఉద్యమం ఓయూ కేంద్రంగా జరుగుతున్న క్రమంలో ఆ విద్యార్థి సంఘం పట్టు మెల్లగా సడలుతూ వచ్చింది. అనంతరం సామాజిక ఉద్యమాలు ఓయూ కేంద్రంగా జరగడం..దళిత విద్యార్థి సంఘాలు బలోపేతం కావడం, ఐక్య ఉద్యమాల నిర్మాణంతో ఓయూలో మతోన్మాద విద్యార్థి సంఘం బలహీనపడుతూ వచ్చింది. ఒకప్పుడు సీపీఐ అనుబంధ విద్యార్థి సంఘం, ఏఐఎస్ఎఫ్ జెండా ఎగరేసేందుకు కూడా ఓయూలో అభ్యంతరం చెప్పిన మతోన్మాద విద్యార్థి సంఘం తోక ముడిచి, 2001లో సగర్వంగా ఎర్రజెండాను మళ్లీ రెపరెపలాడించారు.. ఆ తర్వాత ఓయూలో ఆ సంస్థ ప్రాతినిధ్యం తగ్గడంతో శాస్త్రీయ విద్యా విధానంకై డిమాండ్ చేసే విద్యార్థి సంఘాలను టార్గెట్ చేస్తూ పట్టు నిలుపుకునే పనిలో పడింది.

నిమజ్జనం రోజు పిడిగుద్దులు..

తమ వ్యతిరేక విద్యార్థి సంఘం బలపడితే..తమ ప్రాతినిధ్యం తగ్గుతుందని భయంతో వామపక్ష భావజాలంతో పనిచేసే విద్యార్థి నాయకులను టార్గెట్ చేస్తోంది. గతంలో టీఎన్ఎస్ఎఫ్‌లో ఉన్నా, ప్రస్తుతం టీఎస్ఏలో ఉన్నా లెఫ్ట్ ఐడియాలజీతో పనిచేసే విద్యార్థి సంఘం నేత ఎన్ఎమ్ శ్రీకాంత్‌పై వినాయక నిమజ్జనం రోజు పిడిగుద్దులతో దాడి చేసింది. భిన్న ఆలోచనలు, దృక్ప థాలు చర్చల ద్వారా పరిష్కరించుకోవాల్సిన వర్సిటీలో ఈ భౌతిక దాడుల సంస్కతి ఏంటి? ఇందుకు సహకరిస్తున్న కుట్రదారులు ఎవరు? ఇప్పటికైనా వర్సిటీలో మతతత్వాన్ని పెంపొం దించే కార్యక్రమాలపై నిషేధం విధించాల్సిన అవసరం ఉన్నది. దాన్ని బలపరిచే విద్యార్థి సంఘంపై కూడా లేదంటే.. శాస్త్రీయ విద్యా విధానం ఆలోచనలు తొలగి మతోన్మాద ఆలోచనలు విద్యార్థుల్లో తలకెక్కితే ఇలాంటి దాడులకు ఫుల్‌స్టాప్ పడటం ఎప్పటికీ జరగదు.

ప్రశాంత్ పగిళ్ల

ఓయూ విద్యార్థి

95812 62429

Advertisement

Next Story

Most Viewed