ఏది నిజమైన స్వాతంత్య్రం...!?

by Ravi |   ( Updated:2024-08-15 16:35:32.0  )
ఏది నిజమైన స్వాతంత్య్రం...!?
X

స్వాతంత్య్రమంటే ఏమిటో నిర్వచించుకోలేని దశలోనే దశాబ్దాలు గడిచిపోవడం నిజంగా విషాదకరం’ అంటారు ఆరుద్ర. స్వాతంత్య్ర పోరాటంలో ఆస్తులు, అశువులు కోల్పోయిన యోధులంతా బహుశా నేడు తిరిగి పుట్టినా ఈ పరిస్థితులలో మార్పు రాదేమో..! అయినా నిరాశా పూరిత వ్యాఖ్యానాలు అనవసరం.

దేశంలో ఎన్నెన్నో మార్పులు, అభివృద్ధి అనివార్య మయ్యాయి. సాంకేతిక రంగంలో వినూత్నమైన ఆవిష్కరణలు జరిగాయి. చంద్రుని మీదకు ప్రయా ణాలు విస్తృతమయ్యాయి. ఆర్థిక పరమైన వృద్ధి సాధ్యమైంది. ‘అభివృద్ధి చెందవలసిన’ దేశం ‘అభివృద్ధి చెందిన దేశంగా’ రూపురేఖలు మార్చు కుంది. ప్రతి ఒక్క రంగంలో ఈ మార్పు కనిపిస్తుం ది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో మనుషులను సజీవంగా యాంత్రికతతో నిలుపుతున్నాం. మానవ రహిత వ్యోమనౌకలను అంతరిక్షంలోకి పంపగలుగుతున్నాం. మరొకవైపు దేశ స్వాతంత్య్రం అంటే ఇదేనా అనే ‘విరుపులు’ కూడా ఉన్నాయి.

అక్షర సత్యంగా ఆ కవి మాటలు..

ఈ మెరుపులు నాణేనికి ఒకవైపు. మరి రెండోవైపు...! ‘ఆకాశం అందుకొనే ధర లొకవైపు, అంతులేని నిరుద్యోగమింకొక వైపు అవినీతి, బంధుప్రీతి చీకటి బజారు...’’ అని శ్రీశ్రీ అయిదు దశాబ్దాల క్రితమే ఆవేదనను వ్యక్తం చేశారు. ఏడున్నర పదుల స్వాతంత్య్రం పూర్తి చేసుకున్నప్పటికీ, నాటి మహాకవి ఆవేదన అక్షర సత్యంగానే మిగలటం విచారం కలిగిస్తుంది. ‘‘భారతదేశ స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా దేశంలోని ఆసేతు హిమాచల పర్యంత ప్రజలంతా ప్రగతి ఫలాలు అందుకోవాలని’’ ఆశించిన నెహ్రూ కలలు ‘కల్ల’ కావడం శోచనీయం.

బతుకు భరోసా ఇవ్వని స్వాతంత్ర్యం!

నాలుగు వైపులా నీరున్నా ‘అన్నదాతకు’ బతుకు భరోసా లేదు. పీజీలు చేసినా పిడికెడు బువ్వ కోసం నిరంతర ఆరాటంలో యువత ఉన్నారు. అటవీ ప్రాంతంలో అభివృద్ధి ఛాయలు పావు వంతు కూడా లేవు. ఆదివాసుల జీవనం ఎంత దుర్భరమో దుర్భిణి వేసి చూసినా నాయకులు లేరు. ఆగష్టు పదిహేనున జెండాకు వందనం చేసే నాయకులకు సహితం ఏది నిజమైన స్వాతంత్య్రం ‘‘నిజంగా దేశానికి స్వాతంత్య్రం వచ్చిందా” అనే సందేహాలున్నాయి. రాజ్యాంగ ప్రవేశికలో ‘భారతదేశం లౌకిక దేశమని’ పేర్కొన్నారు. ఆ ఛాయలు మాత్రం మణిపూర్ లాగానే కనిపిస్తున్నాయి. దానికి ఎవరు బాధ్యు లంటే ‘అంతటా’ నిశ్శబ్దం ఆవహిస్తుంది. భాష, కులం, మతం, ప్రాంతం, వర్గం ఇవి నేడు దేశాన్ని నడిపిస్తున్న తరుణంలో ‘పాడవోయి భారతీయుడా ప్రగతి గీతిక’ని ఎలా నినదించాలి? ‘‘అధికారాన్ని ప్రజాపాలనకి, వారి అభివృద్ధికి నాయకులు వినియోగించాలని’’ చెప్పిన రాజ్యాంగ నిర్మాతల ఉపదేశాలు కేవలం నాయకుల ఉపన్యాసాలకే పరిమితం కావడం మరో విషాదం. స్త్రీ, బాలికల సం‘రక్షణ’ అంకెలు ఘనం. ఆచరణ శూన్యం. ‘మండుతున్న’ ప్రాంతాలు అందుకు ప్రత్యక్ష సాక్ష్యం. స్వాతం త్రం కేవలం నామమాత్రపు అంశం’గా ఏర్పడే అవకాశం ఉందని బాబు రాజేంద్రప్రసాద్ ఆనాడే హెచ్చరిక జారీ చేశారు. మరి వర్తమాన, రాబోయే తరాలకు ఏది నిజమైన స్వాతంత్య్రమో ఎలా వివరించగలం?

ఉద్యమాల సిలబస్ తీసేసి..

విశ్వవిద్యాలయాలు, విద్యాలయాలు సహితం స్వాతంత్య్ర దినోత్సవం కోసం ఆటలు ఆడిస్తున్నారు. వివిధ రకాల పోటీలు పెడుతున్నారు. బహుమతులు ఇస్తున్నారు. కానీ ఆగస్టు 15 గొప్పతనం, ఉద్యమ స్ఫూర్తి పోరాటాలు గురించి వివరించే ‘సిలబస్’లను మాత్రం దూరం చేస్తు న్నాయి. అభివృద్ధి అంటే ‘సాంకేతికంగా’ ఎదగ డం కాదు. సంపద, ఉత్పత్తి, శ్రమ, పెట్టుబడులకు సమానమైన ఫలితం దక్కడం. సామాన్యుడి నుంచి సంపన్నుల వరకు స్వాతంత్య్ర ఫలాలను, కనీస సౌకర్యాలను పొందగలగడం. భద్రతతో కూడిన బతుకును స్వేచ్ఛగా అనుభవించగలగటం. భ్రమలు లేని వాస్తవ సమాజాన్ని నిర్మించడం.

1857 నుంచి 1947 వరకు ఉధృతంగా పోరాటాలు చేసి ధన, మాన, ప్రాణాలను తృణంగా సమర్పించిన నిస్వార్ధ నాయకుల జీవితం గురించి వివరించాల్సిన అవసరం వర్తమానంలో ఉంది. కానీ... ఆ దిశగా ‘విద్యా విధానం’లో తగు మార్గదర్శక సూత్రాలు లేవు. ఉన్నవాటిని సహితం ‘రాజకీయ, మత ప్రయోజనాల ప్రాతిపదికగా ‘పుస్తకాల’ నుంచి తీసేయడం ఎటువంటి ‘పునఃనిర్మాణమో’ ఏలికలే చెప్పాలి.

తిండి, విద్య, వైద్యం అందని ఫలాలే..!

‘సమ సమాజమనే కల వాస్తవం కాదని ఏభై సంవత్సరాల స్వాతంత్య్రం నాకు చెప్పింది. కానీ... సమన్యాయం, అందరికీ తిండి, విద్య, వైద్యం కూడా అందని ఫలాలని నాకు తెలిసింది. మరెందుకీ స్వాతంత్య్రమని రాబోయే తరాలు చింతిస్తే ఆ తప్పుకు బాధ్యత ఎవరు తీసుకుంటారని ‘అలిశెట్టి ప్రభాకర్ చేసిన వ్యాఖ్యానం నేటికీ సత్యం.

భమిడిపాటి గౌరీశంకర్

94928 58395

Advertisement

Next Story

Most Viewed