బ్యూరోక్రాట్లు నిస్సహాయంగా ఉంటే?

by Ravi |   ( Updated:2025-01-28 01:01:12.0  )
బ్యూరోక్రాట్లు నిస్సహాయంగా ఉంటే?
X

"ఎవరో ఒకరు.. ఎపుడో అపుడు.. నడవరా ముందుగా.." అన్నారు "అంకురం" సినిమాలో సిరివెన్నెల. ఇటీవల అలా ముందడుగు వేశారు జననేత పవన్ కళ్యాణ్. ఆ మధ్య జరిగిన జిల్లా కలెక్టర్ల సదస్సులో ఏపీ ముఖ్యమంత్రి పాలన వ్యవస్థ బాధ్యతను సుతిమెత్తగా గుర్తు చేయగా, ఉప ముఖ్యమంత్రి మాత్రం గత ప్రభుత్వం ఇష్టారాజ్యంగా వ్యవహరించేటప్పుడు, సీనియర్ అధికారులు, బ్యూరోక్రాట్లు అభ్యంతరం చెప్పకపోవడం పట్ల ఆశ్చర్యం ప్రకటించారు. అంతేకాదు. "వ్యవస్థలను బలోపేతం చేయాల్సింది పోయి, బ్యూరోక్రాట్లు కూడా నిస్సహాయంగా ఉంటే సగటు మనిషి ఎక్కడికి వెళ్లాలి" అని ప్రశ్నించడం ద్వారా మంది మౌన ఘోషకు గొంతునిచ్చారు. ఎందుకంటే, 'విధానాలు రూపొంచేది అధికారంలో ఉన్న ప్రభుత్వమైనా, క్షేత్రస్థాయిలో వాటిని ప్రజలకు చేరువ చేయాల్సింది పాలనా యంత్రాంగమే కదా.

ఇదే విషయాన్ని, "ఏ పాలనా వ్యవస్థ కూడా అమలుపరిచే పాలనా యంత్రాంగం కంటే మెరుగుగా ఉండద"ని తొలుత మురార్జీ దేశాయ్, తదనంతరం పార్లమెంట్ సభ్యుడు కె.హనుమంతయ్య అధ్యక్షత వహించిన మొదటి పరిపాలనా సంస్కరణల కమిషన్ (1966) తేల్చి చెప్పింది. స్వతంత్ర భారతదేశంలో అనేక పర్యాయాలు ఇది రుజువయింది. అత్యవసర పరిస్థితుల్లో ఇది పరా కాష్టకు చేరుకుంది.

పౌర సేవకులకు రాజ్యాంగ రక్షణ ఉంది

ఈ నేపథ్యంలో పాలన వ్యవస్థలో అత్యున్నత అధికారులు సక్రమంగా కర్తవ్యం నెరవేర్చేందుకు రాజ్యాంగం కల్పించే రక్షణ గుర్తు చేసుకుందాం. నిష్పక్షపాతంగా, నిర్భీతిగా, తమ అభిప్రాయం వ్యక్త పరిచేందుకు, సలహాలు, సూచనలు చేసేందుకు వీలుగా, ఏ లిఖిత రాజ్యాంగంలోనూ లేని రక్షణలు భారత రాజ్యాంగం అఖిల భారత పౌర సేవల అధికారులకు ప్రసాదించింది. ఈ నిబంధన ప్రధానంగా పౌర సేవకులను ఏకపక్షంగా ఉద్యోగాల నుండి తొలగించే వీలు లేకుండా చేసింది. ఇందుకు రాజ్యాంగ సభలో పట్టుపట్టిన వారు అప్పటి గృహ శాఖా మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్. మన దౌర్భాగ్యమేమంటే మన దేశంలో అత్యవసర పరిస్థితి అమలులో ఉన్నప్పుడు (25 జూన్ 1975 నుండి 21 మార్చి 1977 వరకు) ఉన్నతాధికారులలో అత్యధికులు ఆనాటి పరిపాలనలో అకృత్యాలకు వత్తాసు పలికారు లేదా మిన్నకుండిపోయారు. ప్రముఖ పాత్రికేయుడు కులదీప్ నయ్యర్ ప్రకారం, అత్యవసర పరిస్థితి అమలులో ఉన్న కాలంలో, స్వల్ప వేతనానికి, కుటుంబాలకు దూరంగా, దేశ సరిహద్దుల రక్షణ కోసం ప్రాణాలకు తెగించి సైనికులు విధులు నిర్వర్తిస్తుండగా, బదిలీకి బెదిరి పౌర సేవల తలమానికాలైన ఉన్నతాధికారులు నివారణ నిర్బంధం ఉత్తర్వులపై అనాలోచితంగా సంతకాలు చేసారు.

పై వారి ఉత్తర్వులకు జీ హుజూర్

షా కమిషన్ తన నివేదికలో "పాలనా వ్యవస్థ (బ్యూరోక్రసీ)పై వారి ఉత్తర్వులు నియమాలకు విరుద్దాలనీ, రాజకీయ ఉద్దేశ ప్రేరితాలనీ తెలిసీ ఆమోదం తెలిపింద"నీ, "మొత్తానికి పౌర సేవకులు (సివిల్ సర్వెంట్స్) తమ వృత్తిగత పురోగతి కోసం అధికారంలో ఉన్న పక్షానికి విధేయత చూపాలని భావించార"ని నివేదించింది. రక్షకభట వ్యవస్థను ఒక రాజకీయ పక్షానికి మేలు చేకూర్చేలా వినియోగించారని, అది చట్టబద్ధ పాలనను విధ్వంసం చేయడమేనని అభిప్రాయపడింది. ఇప్పుడు వెలుగులోకి వస్తున్న వార్తలు చదివితే, ఏపీలోనూ గత ప్రభుత్వ హయాంలో కొంతమేరకు ఇలాగే జరిగిందని తోస్తోంది. ఇందుకు కారణభూతులైన అందరి మీదా ప్రభుత్వ విధి విధానాలు, చట్టాల పరంగా సత్వరమే చర్యలు తీసుకోవాలి. ఇందుకు ఎవరూ మినహాయింపు కారాదు.

అక్రమ ఒప్పందాలకు అందరూ బాధ్యులే!

30 సంవత్సరాల పౌర సేవలో, 26 సార్లు బదిలీ చేయబడి, కేంద్ర ప్రభుత్వ కార్యదర్శిగా 2000 సంవత్సరంలో స్వచ్ఛందంగా పదవీ విరమణ చేసి, మానవ హక్కుల కాపలాదారుగా, పర్యావరణ పరి రక్షకునిగా, సేవలందిస్తున్న శ్రీ ఇ.ఎ.ఎస్.శర్మ ఇలాంటి సందర్భాల్లో ఎలా వ్యవహరించాలో, ఇప్పటికే పలుమార్లు వివిధ మాధ్యమాల ద్వారా వెల్లడించారు. ఉదాహరణకు అదానీ సెకి (SECI) ఒప్పందం కారణంగా, విద్యుత్ వినియోగదారుల మీద పడిన అదనపు చార్జీలను వెనక్కి తీసుకోవడంతోపాటు, ప్రస్తుత ప్రభుత్వ శ్వేత పత్రం ప్రకారం, ఆ ఒప్పందం వలన రాష్ట్ర ఖజానాకు ఏటా పడే 3,850 కోట్ల రూపాయల భారాన్ని అందుకు బాధ్యులైన నేతలతో బాటు అధికారుల నుంచీ వసూలు చేయాలని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రికి 25-11-24న వ్రాసిన లేఖలో విజ్ఞప్తి చేసారు. ఇలా చర్యలు తీసుకోవడం వలన ప్రస్తుత ప్రభుత్వం, రాబోయే ప్రభుత్వాలు తప్పుదారిలో నడిచే యత్నం చేసినా, అందుకు పాలనా యంత్రాంగం ( బ్యూరోక్రసీ) సహకరించడమో, సహించడమో జరగకుండా ఉండే అవకాశం ఉంటుంది.

పాలన పక్కదారులు పట్టొద్దంటే...!

రాజకీయ ఒత్తిడులకు‌ లోను గాకుండా రాజ్యాంగబద్ధంగా, ప్రకటిత విధి విధానాలకు అనుగుణంగా, నిజాయితీగా, నిర్భీతిగా అధికారిక విధులు నిర్వహించడానికి పాలనా యంత్రాంగానికి ఆర్టికల్ 311 రక్షణ కల్పించగలదు గానీ, మానవ దౌర్బగ్యాల నుండీ వ్యక్తులు ఎవరికి వారే బయటపడాలి. అలా జరగనప్పుడు వైఫల్యాలకు ప్రతిఫలం ఉన్న ప్పుడే సుపరిపాలన సాకారమవుతుంది. అప్పుడే కుల, మత, ధన ప్రలోభాలకు అతీతంగా ఓటు ఆయుధం ద్వారా ప్రభుత్వాలను మార్చిన ఓటర్ల‌ అభిమతం నెరవేరుతుంది. పాలన పక్కదారులు పట్టకుండా సజావుగా సాగుతుంది. లేదంటే చరిత్ర పునరావృతమవుతుంది.

- మల్లాప్రగడ రామారావు

సామాజిక, రాజకీయ విశ్లేషకులు

99898 63398

Next Story

Most Viewed