- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘వంద మంది దోషులు..’ సూక్తి ఏమైంది?
తల్లి చనిపోయిన బాధలో ఉంటే, కొడుకే హంతకుడు అంటూ పోలీసులు అరెస్టు చేశారు. నేర శిక్షా స్మృతి (సీఆర్ పీసీ)ప్రకారం 161 సెక్షన్ కింద నేర అంగీకార పత్రం(కన్ఫెషన్) ఆధారంగా చార్జిషీట్ దాఖలు చేశారు. ట్రయల్ కోర్టు యావజీవ శిక్ష విధించింది. పెరోల్‌తో స్వేచ్ఛా గాలులు పిలుద్దామనుకున్న ఆ బాధిత గుండె సరిగ్గా బయటకు రావడానికి ఒక రోజు ముందు గుండెపోటుతో ఆగిపోయింది. ఆయన చనిపోయిన ఆరేళ్ల తర్వాత .. హైకోర్టు తీరిగ్గా అతన్ని 'నిర్దోషి' అని తేల్చింది. ఈ నేరాలకు, పాపాలకు పోలీసులకు శిక్షలు ఉండవా? కింది కోర్టుల న్యాయమూర్తులకు శిక్షలు ఉండవా?
హృదయాన్ని కదిలించి వేసే ఈ కేసు పూర్వపరాలను చూస్తే... సిద్ధి పేట జిల్లా, దుబ్బాక మండ లం, పెద్ద గుండవెళ్లికి చెంది న గుండెళ్లి ఎల్లవ్వ (80 ) 2013 ఫిబ్రవరి 1న తన ఇంటి పక్కనే ఉన్న సీతా ఫలం చెట్టుకు టవల్‌తో ఉరేసుకుని చనిపోయారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు... సరైన సాక్ష్యాధారాలు లేకుం డానే, సరిగ్గా కేసును పరిశోధించకుండానే ఎల్లవ్వ మృతిని హత్యగా తేల్చారు. ఆమె కుమారుడు పోశయ్య (అప్పటి ఆయన వయసు 58 )పై అనుమానంతో అరెస్ట్ చేశారు. ఎల్లవ్వ అనారోగ్యంతో బాధపడటం చూడలేక పోశయ్య ఆమెను టవల్‌తో గొంతు నులిమి, హత్య చేసి, సీతాఫలం చెట్టుకు వేలాడదీసాడని పోలీసులు అభియోగాలు మోపారు.(కల్పిత ఊహలతో కథ అల్లారు) 2015 జనవరి 12న సిద్ధి పేట జిల్లా అదనపు సెషన్స్ కోర్టు నిందితుడికి పోలీసులు చెప్పిన మాటలనే విశ్వసించారు. సరైన సాక్ష్యాలు ఉన్నాయో లేదో పరిశీలన చేయకుండానే...యావజ్జీవ కారాగార శిక్ష విధించి చేతులు దులుపుకున్నారు. పోశయ్య దీన్ని సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. విచారణ ఆలస్యం కావడంతో 2018లో పెరోల్‌కు దరఖాస్తు చేసుకున్నారు. పెరోల్ రావడంతో... 2018 ఆగస్టు 15న విడుదల కావలసి ఉండగా... ఒక రోజు ముందే చర్లపల్లి జైలులో మృతి చెందారు.
చనిపోయాక నిర్దోషి అని తీర్పు వస్తే...!?
గుండెపోటు కారణంగా అతను మృతి చెందినట్లు జైలు అధికారులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఆగస్టు 16న పోశయ్యకు అతని స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు. అయి తే పోశయ్య అప్పీల్ పిటిషన్‌పై హైకోర్టు గత శనివారం తుది తీర్పు ఇచ్చింది. పోశయ్యే హత్య చేశాడని అనడానికి సరైన సాక్ష్యాధారాలను పోలీ సులు సమర్పించలేదని కోర్టు వ్యాఖ్యానించింది. కేవలం నిందితుడు పోలీసుల ఎదుట సీఆర్‌పీసీ 161 కింద ఇచ్చిన నేర అంగీకార పత్రంలో పేర్కొన్నట్లు నేర నిర్ధారణకు అది సరిపోదని కోర్టు తేల్చి చెప్పింది. పోస్టుమార్టం నివేదిక కూడా అది హత్యనా! ఆత్మహత్యనా అన్న దాన్ని తేల్చలేదని, రెండింటిలో ఏదైనా కావచ్చు అనే సంశయాన్ని వ్యక్తం చేసిన విషయాన్ని గుర్తు చేసింది. సరైన సాక్ష్యాధారాలు లేనందున పోశయ్యను హైకోర్టు నిర్దోషిగా ప్రకటిస్తూ... కింది కోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేస్తూ తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు పట్ల పోశయ్య కుమారులు జయరాజ్, దేవయ్య హర్షం వ్యక్తం చేశారు. అయితే... నిర్దోషి అయిన పోశయ్య ఇప్పుడు తమ మధ్యలో లేరని ఆవేదన వ్యక్తం చేశారు.
తప్పుడు కేసులు, శిక్షలకు బాధ్యతెవరిది?
అయితే, ఈ నేరానికి, ఈ పాపానికి బాధ్యులు ఎవరు పోలీసులు సరైన విధంగా శాస్త్రీయంగా ఇన్వెస్టిగేషన్ చేయలేదు. సరైన సాక్ష్యాలు సేకరించలేకపోయారు. ఈ పోలీసులు చెప్పిన నిరాధార మాటలను నమ్మి సిద్ధిపేట సెషన్ కోర్టు నిందితునికి యావజ్జీవ కారా గార శిక్ష విధించింది. దీనికి ఆ పోలీసులు బాధ్యత వహిస్తారా? తీర్పు చెప్పిన సెషన్స్ కోర్టు న్యాయ మూర్తి బాధ్యత వహిస్తాడా? వీరు తమ బాధ్యతలను సక్రమంగా నెరవేర్చలేదు. వీరికి చట్ట ప్రకారం ఏ శిక్షలు ఉండవా? ఈ ఆరేళ్లు పోశయ్య చేయని నేరా నికి కారాగారంలో నిందలు భరించి, కుటుంబానికి దూరంగా శిక్ష అనుభవించాడు. అతని శారీరక, మానసిక క్షోభకు ఎవరు లెక్కగడతారు? ఆయన కోల్పోయిన స్వేచ్ఛకు విలువ ఎవరు కడతారు? సకాలంలో కేసులు సరైన విధంగా కేసును పరిష్కరించకపోవడం వల్ల న్యాయస్థానం బాధ్యత వహిస్తుందా? ఈ సందేహాలు ఎవరు తేల్చాలి?
సాయిబాబను పదేళ్లు జైల్లో పెట్టారు..
గతంలో ఇలాగే ...ప్రొ. సాయిబాబ కూడా చేయని నేరానికి 10 ఏళ్లు జైలు శిక్ష అనుభవించారు. ఆయన తల్లి... కన్న కుమారుని అరెస్టుతో కలతచెంది, మనోవేదనతో చనిపోయింది. తల్లిని కడసారి చూపులకు కూడా పోలీసులు అనుమతించలేదు. పదేళ్ల తర్వాత ప్రొ. సాయిబాబ నిరపరాధిగా ఉన్నత న్యాయస్థానం తీర్పులు చెప్పింది. ఈ పదేళ్లు 90 శాతం వికలాంగుడు అయిన సాయిబాబ జైలులో నరకయాతన అనుభవించారు. ఆయన ఉద్యోగం పోయింది. ఆయన కుటుంబం ఆర్థికంగా అనేక బాధలు పడింది. ఈ నేరాలకు పాపాలకు పోలీసులకు శిక్షలు ఉండవా? న్యాయస్థానాల అలసత్వానికి, విచారణ జరిపే ఆలస్యానికి, జాప్యాలకు ఎవరు బాధ్యులు? కింది కోర్టుల న్యాయమూర్తులకు శిక్షలు ఉండవా? వంద మంది నేరస్థులు తప్పించుకున్నా పర్వాలేదు కానీ... ఒక్క నిరపరాధికి కూడా..శిక్ష పడరాదన్న సూక్తి ఏమయింది?
బడిత పూజే విచారణాస్త్రమా?
మన దేశంలో పోలీస్ స్టేషన్లలో నిందితుని మొర ఎవరు వింటారు? పోలీసులు చెప్పిందే వేదం. పోలీసులు బనాయించిందే కేసు. ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ నిందితుడు సంతకం పెట్టవలసిందే. లేకపోతే ప్రత్యక్ష నరకం చూడవలసిందే. మన దేశంలో చట్ట ప్రకారం నేరం అయినా సరే...పోలీసులు థర్డ్ డిగ్రీ ఉపయోగించకుండా విచారణ శాస్త్రీయ పద్ధతిలో చేయలేరు. దారుణంగా కొట్టి, నానారకాలుగా హింసించి నేరం చేసినట్లు నిందితులను ఒప్పిస్తారు. దెబ్బలకు తాళలేక నిందితులు నేరం చేయకపోయినా ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ సంతకం పెడతారు. ఆ పేపర్‌పై ఏం కేసులు రాసుకుంటారో..ఏ సెక్షన్లు బనాయిస్తారో నిందితులకు తెలియదు. తెలి సినా ఏం చేయలేడు. పోలీసులకు శాస్త్రీయ నేర పరిశోధనలో సరైన శిక్షణ ఉంటుందా? అనేది సందే హమే. ఒక వేళ ఉంటే ఈ హింస దేనికి? బడిత పూజే విచారణాస్త్రమా? ఫోర్సెనిక్ రిపోర్టులు సరిగ్గా పరిశీలించరా? న్యాయమూర్తులు కూడా పోలీసులు సమర్పించిన ఫైళ్ల మీదనే ఆధారపడతారా? లోతుగా అన్ని సాక్షాలు బలంగా ఉన్నాయో లేదో పరిశీలన చేయరా?
ఏది చట్టం, ఏది న్యాయం, ఏది ధర్మం?
ఇలా ఎంతోమంది నిర్దోషులు ఏళ్లకు ఏళ్లు శిక్ష అనుభవించాక నిర్దోషిగా తీర్పు వస్తే ఏం లాభం? చేయని నేరానికి పోయిన పరువు, జైళ్లలో అనుభవించిన శారీరక, మానసిక నరకయాతనకు ఎవరు బాధ్యత వహిస్తారు? వారు కోల్పోయిన గౌరవప్రద జీవితానికి అంటిన కళంకం... చచ్చాక నిర్ధోషి తీర్పుతో తిరిగివస్తుందా? ఈ తప్పుడు కేసులు పెట్టిన పోలీసుల నేరా లకు, ఘోరాలకు బాధ్యత ఎవరిది? మన దేశంలో నిరుపేదలు, దళితులు, నిరక్షరాస్యులు, నిస్సహాయులు హైకోర్టు, సుప్రీంకోర్టు వరకు వెళ్లగలరా? లక్షలు, కోట్లతో సీనియర్ లాయర్లను నియమించుకుని వారి ఫీజులు భరించగలరా? ఏది చట్టం, ఏది న్యాయం, ఏది ధర్మం?
డా. కోలాహలం రామ్ కిశోర్,
98493 28496