బిజినెస్ లైన్:వాయిదా కట్టకపోతే ఏమవుతుంది?

by Ravi |   ( Updated:2022-09-03 17:42:08.0  )
బిజినెస్ లైన్:వాయిదా కట్టకపోతే ఏమవుతుంది?
X

రుణం చెల్లింపు ఆలస్యమయితే బ్యాంకులు మీ ఇంటిని మీకు తెలియకుండా వేలం వేసే అధికారం లేదు. లోన్ చెల్లించకుండా కనీసం 90 రోజులు గడిస్తే వాటిని NPA కింద భావిస్తారు బ్యాంకు అధికారులు. రుణ చెల్లింపు అలస్యమయిన 60 రోజుల తరువాత నోటీసులు పంపుతారు. అంటే, మీరు రుణం చెల్లించడానికి ఇంకా రెండు నెలల గడువు ఉంటుంది. నోటీసు వచ్చిన మరో 30 రోజుల తరువాత, ఆస్తిని వేలం వేసే హెచ్చరికతో ఒక నోటీసు ఇస్తారు. అప్పుడు ఆస్తిని విలువ కట్టడానికి వ్యాల్యూయేటర్‌ను పంపుతారు. లెక్కింపు పక్రియ ముగిసాక, ఆ ఇల్లు ఎక్కడ ఎంతకు? అనే వివరాలతో మరో నోటీసు పంపుతారు.

రోజులలో సొంత ఇల్లు, సొంత కారు అనేది ప్రతి మనిషి కల. గతంతో పోలిస్తే ఈ మధ్య కాలంలో బ్యాంకు రుణాలతో కలలను నిజం చేసుకోవడం అనేది కొంచెం క‌ష్టప‌డితే సాధ్యమ‌వుతోంది. అందుకే ఇంటి రుణమో లేక కారు రుణమో తీసుకొని సమయానికి తిరిగి బ్యాంకులకు చెల్లించకపోతే ఏమవుతుంది? సంబంధిత బ్యాంకు లేదా ఆర్థిక సంస్థ ఏం చేస్తుంది? అనేది ముందుగానే తెలుసుకోవాలి.మొదటిసారి మీరు ఇల్లు కట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటే ముందుగా మీ విలాసాలకు గొళ్లెం వేయండి. ఎందుకంటే చాలా మంది బ్యాంకు లోన్ ఎలాగైన కట్టవచ్చు అని విలాసాలకు పోయి ఇల్లు కట్టుకున్న తరువాత నెలసరి వాయిదా డబ్బు (EMI) ని సరైన సమయంలో చెల్లించలేకపోతే బ్యాంక్‌లు ఆ ఇంటిని స్వాధీనం చేసుకుని వేలం వేస్తాయి.

కారణాలు వివరించాలి

బ్యాంకు అధికారులతో వేలం వేయడానికి వచ్చిన పరిస్థితులలో వారితో వారించకుండా సాధ్యమైనంతవరకు స్నేహపూరిత పద్ధతిలో పరిష్కరించడానికి ప్రయత్నించాలి. రుణం చెల్లించకపోవడానికి ఏర్పడిన పరిస్థితులు, ఉద్యోగం పోవడం లేదా అనారోగ్య సమస్యలులాంటి కారణాలు సంబంధిత బ్యాంకు అధికారులకు వివరించాలి. ఇది తాత్కాలిక పరిస్థితులు కావున బ్యాంకు లోన్ తొందరగానే తీరుస్తానని వారికి హామీ ఇవ్వాలి. మీ వాదనకు బ్యాంకు అధికారులు సంతృప్తి పడితే మీకు సహకరించే అవకాశమే ఎక్కువ. దాంతో మీ లోన్ పునరుద్ధరిస్తారు. అయినప్పటికీ, బ్యాంకు అధికారులు మొండిపట్టు పడితే, ఒప్పుకోకపోతే మీరు మరో బ్యాంకుని సంప్రదించవచ్చు.

ఈ పరిస్థితులలో మీకు మరో బ్యాంకు రుణం ఇవ్వడానికి ముందుకు రావొచ్చు. ఇలాంటి సందర్భాలలో మొదటి బ్యాంకులో ఉన్న రుణం మొత్తాన్ని రెండో బ్యాంకు చెల్లిస్తుంది. ఒకవేళ రెండో బ్యాంకు రుణం ఇవ్వకపోతే మీ దగ్గర ఏవైనా ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, మ్యూచువల్ ఫండ్స్ లేదా ఈక్విటీలు వంటి ఏవైనా ఇతర పెట్టుబడులు ఉంటే, మీరు లోన్ చెల్లించాల్సిన బ్యాంకుకు వాటిని బదిలీ చేయవచ్చు, వాటిని మార్చి రుణం కట్టవచ్చు. అలా మీ ఇల్లు చెక్కుచెదరకుండా ఉంటుంది. ఆ అవకాశం కూడా లేకపోతే మీ ఇంటిని అమ్మేయండి. బ్యాంకుల కోసం ఎదురు చూడకుండా మీరే మంచి ధరకు మీ ఇంటిని అమ్మే అవకాశం ఉంది. మంచి ధరకు పెండింగ్‌లో రుణం చెల్లించి, మిగిలిన డబ్బుతో మరోచోట తక్కువ బడ్జెట్‌లో మరో ఇంటిని కొనుక్కోవచ్చు.

సిబిల్ స్కోరుపై ప్రభావం

రుణం చెల్లింపు ఆలస్యమయితే బ్యాంకులు మీ ఇంటిని మీకు తెలియకుండా వేలం వేసే అధికారం లేదు. లోన్ చెల్లించకుండా కనీసం 90 రోజులు గడిస్తే వాటిని NPA కింద భావిస్తారు బ్యాంకు అధికారులు. రుణ చెల్లింపు అలస్యమయిన 60 రోజుల తరువాత నోటీసులు పంపుతారు. అంటే, మీరు రుణం చెల్లించడానికి ఇంకా రెండు నెలల గడువు ఉంటుంది. నోటీసు వచ్చిన మరో 30 రోజుల తరువాత, ఆస్తిని వేలం వేసే హెచ్చరికతో ఒక నోటీసు ఇస్తారు. అప్పుడు ఆస్తిని విలువ కట్టడానికి వ్యాల్యూయేటర్‌ను పంపుతారు. లెక్కింపు పక్రియ ముగిసాక, ఆ ఇల్లు ఎక్కడ ఎంతకు? అనే వివరాలతో మరో నోటీసు పంపుతారు.

ఒకవేళ బ్యాంకు నిర్ణయించిన ధర సరైనది కాదు అని మీరు భావిస్తే మీ అభ్యంతరాలను వారికి తెలియ చేయవచ్చు. ఏడు రోజులలో బ్యాంకు స్పందిస్తుంది. అప్పుడు వారికి మీరు మంచి ధర చూపిస్తే బ్యాంక్ మరలా దాని గురించి ఆలోచిస్తుంది. తీసుకున్న రుణం సకాలంలో చెల్లించకపోతే మొట్టమొదట ప్రభావం చూపేది సిబిల్ స్కోర్ పైనే. ఎవరైనా వ్యక్తి బ్యాంకులు లేదా ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాన్ని తీసుకున్నప్పుడే ఆ సమాచారం మొత్తం క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సిబిల్) కు చేరిపోతుంది. ఇలా తనకు అందిన సమాచారాన్ని బట్టి ఆ సంస్థ అతని క్రెడిట్ స్కోర్ ను తయారు చేస్తుంది. రుణాలు సరైన సమయంలో చెల్లించకపోతే ఈ విషయాలన్నీ సిబిల్‌లో పొందుపరచబడతాయి. దీంతో భవిష్యత్తులో కొత్త రుణాలు వచ్చే అవకాశాలు సన్నగిల్లుతాయి.

శ్రీనివాస్ గౌడ్ ముద్దం

సీఈఓ, కళ్యాణి ప్రాజెక్ట్స్

81254 37565

Advertisement

Next Story