కృష్ణా జలాల్లో మన వాటాపై పోరాడాల్సిందే!

by Ravi |   ( Updated:2024-02-24 01:16:08.0  )
కృష్ణా జలాల్లో మన వాటాపై పోరాడాల్సిందే!
X

తెలంగాణాకు కృష్ణా జలాల్లో న్యాయమైన వాటాను సాధించే అంశంపై రేవంత్ రెడ్డి నేతృత్వంలోని నూతన ప్రభుత్వం వెంటనే శ్రద్ధ చూపించాలి. ముందుగా తక్షణావసరాలపై నూతన ప్రభుత్వం చొరవ చూపాలి. కీలకమైన ట్రిబ్యునల్‌కు సంబంధించిన అంశాలపై దృష్టిని సారించాల్సిన అవసరం ఉంది.

వచ్చే నెల నుండే తెలంగాణకు కృష్ణా జలాలపై వాదనలు ప్రారంభం కావాల్సి ఉండగా అందుకు సంబంధించిన స్టేట్మెంట్ ఆఫ్ కేసు (ఎస్ ఓసి)ని ఇంత వరకు మన ప్రభుత్వం తరపున దాఖలు చేయలేదు. ఈ విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎంత త్వరగా నిర్ణయాలను తీసుకుంటే తెలంగాణకు అంత మంచి జరుగుతుంది.

నూతన మార్గదర్శకాల ప్రకారం..

కరువు వర్షపాతం లాంటి పరిస్థితులతో పాటు సాగుకు యోగ్యమైన భూములు క్యాచ్యుమెంట్ ఏరియా విస్తీర్ణం తదితర అంశాల వారీగా ట్రిబ్యునళ్ళు నదీ జలాల్లో వాటాలను కేటాయిస్తాయి. అందుకు విరుద్ధంగా కేవలం అప్పటికే వినియోగంలో ఉన్న కృష్ణా జలాలను మాత్రమే ఏపీ పునర్విభజన చట్టం 2014లోని సెక్షన్ 89 ప్రకారం ప్రాజెక్టుల వారీగా ఏపీ, తెలంగాణకు జలాలను కేటాయించాలని కేంద్ర ప్రభుత్వం గతంలో బ్రిజేశ్ కుమార్‌కు మార్గదర్శకాలను జారీ చేసింది. కానీ, ఆ మార్గదర్శకాలతో తెలంగాణకు ఒరిగింది ఏమీ లేదు.

అంతరాష్ట్ర జల వివాదాల చట్టం 1956 లోని సెక్షన్ 3 ప్రకారం ట్రిబ్యునల్ విచారణ చేసే అధికారం కల్పించాలని సుదీర్ఘ పోరాటం చేసింది. దీంతో దిగివచ్చిన కేంద్రం సెక్షన్ 3 ప్రకారం కృష్ణా జలాలను పంపిణీ చేయాలని కృష్ణా జల వివాద ట్రిబ్యునల్-2 కు గత ఏడాది అక్టోబర్ నెలలో నూతన మార్గదర్శకాలను జారీ చేసింది.

ఈ అంశంపై దృష్టి పెట్టండి

ఉమ్మడి ఏపీకి కేటాయించిన జలాలను ఇరు రాష్ట్రాల మధ్య పునఃపంపిణీ చేయాలని, గోదావరి డైవర్షన్ ద్వారా వచ్చే 45 టీఎంసీల నీటి విషయాన్ని కూడా తేల్చాలని ట్రిబ్యునల్ సిఫారసు చేసింది. దీంతో నూతన మార్గదర్శకాల ప్రకారం విచారణ చేపట్టేందుకు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్-2 సిద్ధమైంది. తెలంగాణకు అత్యంత కీలకమైన కృష్ణా జిలాల్లో న్యాయమైన వాటా సాధన కోసం ట్రిబ్యునల్ ఎదుట వాదనలను వినిపించాలి అంటే మన రాష్ట్ర ప్రభుత్వం అంతర్ రాష్ట్ర అంశాల్లో అనుభవజ్ఞులైన సమర్థులైన అధికారులు, సహాయకులను ఇంటర్ స్టేట్ విభాగంలో నియమించాలి. వారికి ఈఎంసీ జనరల్ ఎప్పటికప్పుడు దిశా నిర్దేశం చేస్తూ ఉండాలి. కానీ, ప్రస్తుతం ఆ పరిస్థితి లేకుండా పోయింది. శ్వేత పత్రం తయారీ, మేడిగడ్డ పర్యటనపై దృష్టి సారించినంతగా ఇంటర్ స్టేట్ విభాగంపై, ట్రిబ్యునల్ అంశంపై ఇప్పటివరకు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దగా దృష్టి పెట్టలేదు. వెంటనే ఇంటర్ స్టేట్ అధికారులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి, వారికి దిశా నిర్దేశం చేయడానికి ఇప్పటివరకు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం ఏమిటన్నది అర్థం కావడం లేదు.

న్యాయవాదులకు దిశా నిర్దేశం ఏది?

మరొకవైపు ఇంటర్ స్టేట్ విభాగం చీఫ్ ఇంజనీర్ మోహన్ కుమార్ ఇటీవలే నెల రోజులు సెలవుపై వెళ్లడంతో ప్రభుత్వ బాధ్యతలను ఈఎంసీ జనరల్ వద్ద విధులు నిర్వహిస్తున్న చీఫ్ ఇంజనీర్ శంకర్ నారాయణకు అప్పగించింది. తెలంగాణ తరఫున ట్రిబ్యునల్ ఎదుట బలమైన వాదనలు వినిపించేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం సీనియర్ న్యాయవాదులు వైద్యనాథన్, రవీందర్రావు, నిఖిల్ స్వామి, తదితరులను నియమించింది. కానీ ప్రస్తుతం రేవంత్ రెడ్డి ప్రభుత్వం తమను కొనసాగిస్తుందా లేదా అనే సందిగ్ధంలో న్యాయవాదులు పడిపోయారు. ఆ న్యాయవాదులు విచారణకు సంబంధించిన అంశాలను పొందుపరచడానికి సందేహాన్ని వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.

నూతన ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ వస్తే తప్ప ట్రిబ్యునల్‌కు సంబంధించిన అంశాలను ముట్టుకోకూడదనే భావనలో వారు ఉన్నట్టు తెలుస్తుంది. అయినప్పటికీ అంతరాష్ట్ర జల విభాగం అధికారులతో కానీ, న్యాయవాదులతో గానీ, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు సమావేశాన్ని నిర్వహించలేదు. దీంతో అంతర్రాష్ట్ర జల విభాగం అధికారులు ఏం చేయాలో తెలియని స్థితిలో ఉన్నారు. ఈ విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎంత త్వరగా నిర్ణయాలను తీసుకుంటే తెలంగాణకు అంత మంచి జరుగుతుంది.

డా. కోలాహలం రామ్ కిషోర్

98493 28496

Advertisement

Next Story

Most Viewed