జల భద్రతే.. భవిష్యత్ భరోసా!

by Ravi |   ( Updated:2025-01-29 01:15:47.0  )
జల భద్రతే.. భవిష్యత్ భరోసా!
X

ప్రపంచ జనాభాలో భారతదేశ జనాభా సుమారు 18 శాతం ఉన్నా ప్రపంచంలోని మంచి నీటి వనరులలో 4 శాతం మాత్రమే కలిగి ఉంది. ప్రస్తుతం దేశంలో మూడింట ఒక వంతు జనాభా నీటి కొరతను ఎదురుకుంటున్నట్లు నిపుణులు చెబుతున్నారు. పోను పోను పరిస్థితులు మరింతగా విషమించి 2050 నాటికి నీటి కొరత పెచ్చరి ల్లి దేశంలోని సగం జిల్లాలు తీవ్రమైన నీటి ఎద్దడిని ఎదుర్కొనున్నాయని తాజా అధ్య యనంలో వెల్లడైంది. ప్రస్తుత పోకడలు కొనసాగితే, 20 ఏళ్లలో భారత దేశంలోని మొత్తం 60 శాతం జలాశయాలు ప్రమాదకర స్థితిలో ఉంటాయి.

దేశంలో లభ్యమవుతున్న నీటి వనరులలో 85 శాతం పంటల సాగుకి, ఆ తర్వాత గృహావసరాలు, పారిశ్రామిక రంగం ఈ నీటిని అత్యధికంగా వినియోగించుకుంటున్నాయి. నగరాల్లో నిత్యం ఉత్పన్నమౌతున్న 7,200 కోట్ల లీటర్లకు పైగా మురికి నీటిలో 28 శాతం మాత్రమే శుద్ధికి నోచుకుని మిగిలినదంతా నదులు, సరస్సులలో కలిసి వాటిని విషతుల్యం చేస్తోందని నీతి ఆయోగ్ హెచ్చరించింది. ఈ వ్యర్ధ జలాలను శుద్ధి చేసి పునర్వినియోగించడం వలన 75 శాతం పరిశ్రమల అవసరాలు తీర్చవచ్చని నిపుణులు వెల్లడిస్తున్నారు. సమర్థవంతమైన నీటి పారుదల వ్యవస్థల ఏర్పాటు (ఉదా. డ్రిప్‌లు, స్ప్రింక్లర్లు) తక్కువ నీటిని వినియోగించే పంటలను పండించడం, శుద్ధి చేసిన వ్యర్థ జలాలను వినియోగించడం ద్వారా వ్యవసాయంలో నీటి వినియోగాన్ని నియంత్రించి నీటి కొరతను అధిగమించవచ్చు.

అతి పెద్ద భూగర్భజల వినియోగదారులం..

భారతదేశంలో భూగర్భ జలాల వెలికితీత దశాబ్దాలుగా పెరుగుతోంది. వేగవంతమైన గ్రామీణ విద్యుదీ కరణ, ఆధునిక సాంకేతికతల లభ్యతతో 1960 దశకం నుండి ఆహార భద్రతను కల్పించడానికి ప్రభుత్వం వ్యవసాయానికి మద్దతుగా భూగర్భ జలాలను భారీగా తోడటాన్ని ప్రోత్సహించింది. దీని వలన బోర్‌వెల్‌ల సంఖ్య గత 5 దశాబ్దాలలో 1 మిలియన్ నుండి 30 మిలియన్లకు పెరిగి భారత దేశాన్ని ప్రపంచంలోనే అతిపెద్ద భూగర్భజల వినియోగదారుగా చేసింది. సంవత్సరానికి 230 క్యూబిక్ కిలోమీటర్ల భూగర్భ జలాలను అనగా ప్రపంచంలోని భూగర్భజలాల్లో నాలుగింట ఒక వంతు పైనే భారత్ వినియోగిస్తోంది. వ్యవసాయ, పారిశ్రామిక అవసరాలకు భూగర్భ జలాలు ప్రధాన వనరుగా మారాయి. దేశంలో 60 శాతం కంటే ఎక్కువ నీటిపారుదల వ్యవసాయం, గ్రామీణ నీటి డిమాండ్‌లో 85 శాతం, పట్టణ నీటి డిమాండ్‌లో 50 శాతం భూగర్భ జలాల ద్వారా తీర్చబడుతోంది. సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డు ఆఫ్ ఇండియా అంచనా ప్రకారం సుమారు 17శాతం భూగర్భ జలాల బ్లాక్‌లు తిరిగి నింపబడుతున్న దానికంటే వేగంగా సంగ్రహించ బడుతున్నాయి. భూగర్భ, ఉపరితల నీటి వనరుల కొరత సంక్షుభిత స్థాయికి చేరడానికి కారణాలు అనేకం. ప్రధానంగా జనాభా పెరుగుదల, విచక్షణా రహితంగా నీటి వనరుల వినియోగం, సమర్ధ వంతంగా జల సంరక్షణ విధానాల నిర్వహణలో వైఫల్యం, రైతులు సాగునీరు ఎక్కువగా అవ సరం అయ్యే పంటలను పండించడం వలన జల వనరులపై ఒత్తిడి పెరిగిపోతోంది.

జలాశయాలు ఖాళీ అయితే..

విస్తృతమైన నదీ వ్యవస్థను కలిగివుండి చైనా, అమెరికా తర్వాత పెద్ద సంఖ్యలో (5334) ఆన కట్టలు, బ్యారేజీలు, రిజర్వాయర్లు ఉన్నప్పటికీ, దేశంలో సురక్షితమైన తాగునీరు, సుస్థిర వ్యవసాయ నీటిపారుదల సౌకర్యాల కొరత ఉంది. ఆనకట్టలలో 234 ప్రధాన డ్యాం నిర్మించి 100 సం.లు పైబడగా, 50 నుండి 100 సం.ల మధ్యలో 1034 డ్యాంల నిర్మాణం జరిగింది. దేశంలోని భారీ, మధ్య తరహా ప్రాజెక్టులు ఒక్కసారి నిండితే రెండేళ్లపాటు నీటి భద్రత లభిస్తుంది. అయితే నిర్వహణా లోపం వలన వీటి స్థూల నీటి నిల్వ సామర్థ్యం 325.45 బీసీఎంల (11484.50 టీఎంసీ) నుండి ప్రత్యక్ష నీటి నిల్వ సామర్థ్యం 8796.64 బీసీఎంల ( సుమారు 8797 టీఎంసీ) లకు తగ్గిపోయింది. దురదృష్టవశాత్తు మరమ్మత్తులు కొరవడి నీటి లీకేజి, పూడికలు, అసంబద్ధంగా నీరు విడుదల చేయడం, నీరు ఆవిరిగా మారడం వల్ల నిండు జలాశయాలు ఖాళీ అవుతున్నాయి. కేవలం ప్రాజెక్టులను ఆధునీకరించక పోవడం వలన 2688 టీఎంసీల నీటి నిల్వ సామ ర్థ్యాన్ని కోల్పోయాము. ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పటిస్టీకరించుకుని పూర్తి స్థాయిలో నీటి నిల్వ సాధించాలి.

నదుల అనుసంధానం గేమ్ చేంజర్

ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల నిర్మాణం కూడా పూర్తి అయితే మరో 29.615 బీసీఎంల (సుమారు 1046 టీఎంసీల) జలాలు అందుబాటులోకి వస్తాయి. ప్రతి ఏడాది సుమారు 1200 బీసీఎంల (దాదాపు 42,378 టీఎంసీలు) వర్షపు నీరు సముద్రంలో కలుస్తోంది. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ నీటి సంవత్సరం తొలి అర్ధ భాగంలోనే 11,082 టీఎంసీల నీళ్లు అందుబాటులోకి వస్తే వినియోగించుకున్నది 972.83 టీఎం సీలు మాత్రమే. వృధాగా సముద్రంలో కలుస్తున్న విలువైన నీటిని నదుల అనుసంధానం ద్వారా దారి మళ్లించి వినియోగించుకోగలిగితే దేశంలో సాగు నీరు, తాగునీరు ఇబ్బందులకు పరిష్కారం లభిస్తుం ది. ఈ నేపథ్యంలో రాజస్థాన్‌లో పదకొండు నదుల అనుసంధానం కోసం రూ.40 వేల కోట్ల అంచనా వ్యయంతో రూపొందించిన డీపీఆర్‌ను కేంద్ర ప్రభు త్వం ఆమోదించడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక శుభ సంకేతంగా, నదుల అనుసంధాన ప్రక్రియలో కీలక పరిణామంగా భావించాలి. ప్రయోగాత్మకంగా పట్టిసీమ నీటిని కృష్ణా ఆయకట్టుకు తరలించి సత్ఫలితాలు సాధించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రూ.70వేల కోట్లతో వంశధార- గోదావరి- కృష్ణా-పెన్నా నదుల అనుసంధాన ప్రణాళికకు కేంద్ర ప్రభుత్వ ఆమోదం కోసం ప్రధాని మోడీతో చేసిన చర్చలు ఫలప్రదం అవుతాయని ఆశిస్తున్నారు.

శుద్ధి చేస్తున్న నీరు 28 శాతమే!

మన దేశంలో నదీ జలాలు, భూగర్భ జలాలు ఇప్పటికే కలుషితమయ్యాయి. నగరాల్లో నిత్యం ఉత్పన్నమౌతున్న 7,200 కోట్ల లీటర్లకు పైగా మురికి నీటిలో 28 శాతం మాత్రమే శుద్ధికి నోచుకుని మిగిలినదంతా నదులు, సరస్సులలో కలిసి వాటిని విషతుల్యం చేస్తోందని నీతి ఆయోగ్ హెచ్చరించింది. ఈ వ్యర్ధ జలాలను శుద్ధి చేసి పునర్వినియోగించడం వలన 75 శాతం పరిశ్రమల అవసరాలు తీర్చవచ్చని నిపుణులు వెల్లడిస్తున్నారు. భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా చెక్ డ్యాములు, ఇంకుడు గుంతల నిర్మాణం ద్వారా స్థానికంగా భూగర్భ జల మట్టాలను పెంచుకోవాలి. ప్రధాన జలాశయాలనే నమ్ముకోకుండా ఎక్కడికక్కడ చిన్న నీటి పారుదల వ్యవస్థలను, స్థానిక నీటి వనరులను బలోపేతం చేయాలి. వర్షాకాలంలో కురిసే ప్రతి నీటి బొట్టును భూమిలో ఇంకేలా చర్యలు చేపట్టి నీటి వనరులను జాగ్రత్తగా కాపాడుకోవాలి. జలాశయాలలో నీటి సంరక్షణ, నదుల అనుసంధానం, నీటి పొదుపు వంటి బహుముఖ చర్యలతో నీటి భద్రతను సాకారం చేయవచ్చు.

లింగమనేని శివరామ ప్రసాద్

సామాజిక, రాజకీయ విశ్లేషకులు

79813 20543



Next Story