అగ్నివీరులతో సమాజానికి మేలు

by Ravi |   ( Updated:2022-09-03 16:32:19.0  )
అగ్నివీరులతో సమాజానికి మేలు
X

అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్స్, గ్రీస్, క్యూబా వంటి అనేక దేశాలలో ఇలాంటి నియామక ప్రక్రియ ఉంది. అమెరికాలో సైన్యంలో చేరడం స్వచ్ఛందమే, సైనికులు నాలుగేళ్లు విధులలో ఉంటారు. తర్వాత నాలుగేళ్లు వారిని రిజర్వులో ఉంచి అవసరమైనప్పుడు పిలుస్తారు. చైనాలో 18 ఏళ్లు నిండినవారు నిర్బంధంగా సైన్యంలో చేరాల్సిందే, ఫ్రాన్స్‌లో సైనికులను కాంట్రాక్టు పద్ధతిలో నియమిస్తారు, 19 సంవత్సరాలు సర్వీస్‌లో ఉంటే పింఛన్‌ ఇస్తారు, రష్యాలో నియామకాలు హైబ్రిడ్‌ విధానంలో, నిర్బంధ, కాంట్రాక్ట్‌ పద్ధతిలో జరుగుతాయి. ఆ దేశాలలో తాత్కాలికంగానే నియామకాలు జరుగుతున్నాయి. ఆగ్నిపథ్‌ పథకం వాస్తవాలను, దీని ద్వారా దేశానికి, సమాజానికి జరిగే ప్రయోజనాలను ప్రతిపక్ష పార్టీలు, నిరసనకారులు తెలుసుకోవాలి.

దేశంలో సైనిక వ్యవస్థను మరింత పటిష్టం చేసేందుకు కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం సర్వ ప్రయత్నాలు చేస్తున్నది. దేశ సైనిక వ్యవస్థను తిరుగులేని విధంగా తయారు చేయాలనే దృఢ సంకల్పంలో భాగంగా మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆగ్నిపథ్‌ పథకాన్ని తీసుకువచ్చారు. ఇక సైనికుల ఎంపిక ఈ పథకం ద్వారానే జరుగుతుంది. ఆర్మీలో జరిగే ప్రతి నియామకం దీని ద్వారానే ఉంటుంది. అధిక సంఖ్యలో యువతను సైన్యంలో భాగస్వాములను చేయడానికి, సైనికులలో దేశభక్తిని రగిలించడానికి, వారిలో క్రమశిక్షణను పెంపొందించడానికి వీలుగా ఈ పథకానికి శ్రీకారం చుట్టారు.

భారత సాయుధ దళాలకు దీని ద్వారా ఎంపిక చేయబడినవారు నాలుగు సంవత్సరాల కాలానికి అగ్నివీరులుగా నమోదు చేయబడతారు. వ్యవధి పూర్తయిన తర్వాత ఇతర రంగాలలో వీరికి ఉపాధి ఉంటుంది. క్రమశిక్షణ, చైతన్యం, ప్రేరణ, నైపుణ్యం కలిగిన వర్క్‌ఫోర్స్‌గా అగ్నివీరులు సమాజానికి సేవ చేస్తారు. లేదా వారు ఎంచుకున్న ఇతర ఉద్యోగాలలో కొనసాగుతారు. వీరిలో 25 శాతం వరకు అగ్నివీరులు సాయుధ దళాలలో సాధారణ కేడర్‌గా నమోదు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ పథకం దేశానికి సేవ చేయాలనుకునే భారతీయ యువతకు ఒక మార్గాన్ని అందిస్తుంది.

సేవకు చక్కని మార్గం

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అగ్నిపథ్‌ పథకం స్వచ్ఛంద సైనిక శిక్షణ వంటిది. ఆర్మీలో చేరి దేశానికి సేవ చేయాలని అనుకునేవారికి ఒక సువర్ణావకాశం. దీనిని 1989 నుంచే దేశంలో అమలు చేయాలని అనుకున్నారు. 1999 కార్గిల్ యుద్ధం తర్వాత కార్గిల్ కమిటీ ఏర్పాటు చేసినప్పుడు కూడా ఈ ఆలోచనలు వచ్చాయని చెబుతారు. దేశానికి సేవ చేయాలనే ఆసక్తి ఉన్న యువతకు ఆర్మీలో అవకాశాలు దొరకడం చాలా కష్టంగా మారింది, దేశంలోని అనేక ప్రాంతాలలో ఆర్మీకి నియామకాలు జరుగుతున్నా, దేశం కోసం పని చేయాలనే తపన ఉన్న కొంత మంది ఆర్మీకి ఎంపిక కాక ఇబ్బందులు పడుతున్నారు.

దేశం కోసం, ధర్మం కోసం నీతి, నిజాయితీగా పనిచేసే వారందరికీ అవకాశాలు కల్పించాలనే అలోచనలో భాగంగా నరేంద్రమోడీ నాయకత్వన కేంద్ర ప్రభుత్వం ఈ పథకం దిశగా అడుగులు వేసింది. దీని ద్వారా నియామకాలకు అవకాశం కల్పిస్తే దేశంలో అత్యధిక మంది యువతను ఆర్మీలో భాగం చేయడమే కాకుండా సాయుధ దళాలలో నైతికత, ధైర్యం, స్నేహం, నిబద్ధత మొదలైనవి పెరుగుతాయని కేంద్ర ప్రభుత్వం భావించింది.

అనంతరం కూడా ఉపాధి

అగ్నివీరులుగా నాలుగేండ్లు పని చేసినవారికి రక్షణ, హోంశాఖలో ఉద్యోగాలకు పది శాతం రిజర్వేషన్ ఉంటుందని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ రెండు శాఖలలోనే కాదు ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలలో ఉపాధి అవకాశాలు ఉంటాయి. వీరికి నమ్మకం, నిజాయితీగా, అంకితభావంతో పని చేసిన అనుభవం ఉండటంతో చాలా సంస్థలు వెంటనే నియమించుకునే ఆస్కారం ఉంది. యువతలో జాతీయభావం, క్రమశిక్షణతో కూడిన విలువలను నేర్పించడానికి, యువతను ప్రయోజకులుగా మార్చడానికి ఈ పథకం ఉపయోగకరంగా ఉంటుంది. మన దేశంలోనే కాదు ప్రపంచంలోని అనేక దేశాలలో ఈ మాదిరి నియామకాలు జరుగుతున్నాయి. అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్స్, గ్రీస్, క్యూబా వంటి అనేక దేశాలలో ఇలాంటి నియామక ప్రక్రియ ఉంది.

అమెరికాలో సైన్యంలో చేరడం స్వచ్ఛందమే, సైనికులు నాలుగేళ్లు విధులలో ఉంటారు. తర్వాత నాలుగేళ్లు వారిని రిజర్వులో ఉంచి అవసరమైనప్పుడు పిలుస్తారు. చైనాలో 18 ఏళ్లు నిండినవారు నిర్బంధంగా సైన్యంలో చేరాల్సిందే, ఫ్రాన్స్‌లో సైనికులను కాంట్రాక్టు పద్ధతిలో నియమిస్తారు, 19 సంవత్సరాలు సర్వీస్‌లో ఉంటే పింఛన్‌ ఇస్తారు, రష్యాలో నియామకాలు హైబ్రిడ్‌ విధానంలో, నిర్బంధ, కాంట్రాక్ట్‌ పద్ధతిలో జరుగుతాయి. ఆ దేశాలలో తాత్కాలికంగానే నియామకాలు జరుగుతున్నాయి. ఆగ్నిపథ్‌ పథకం వాస్తవాలను, దీని ద్వారా దేశానికి, సమాజానికి జరిగే ప్రయోజనాలను ప్రతిపక్ష పార్టీలు, నిరసనకారులు తెలుసుకోవాలి.

డా. పద్మ వీరపనేని

జాతీయ కార్యవర్గ సభ్యురాలు

భారతీయ జనతా మహిళా మోర్చా

Advertisement

Next Story

Most Viewed