- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- వైరల్
- Union Budget 2025-2026
ప్రమాదంలో వర్సిటీ విద్య!
ఉమ్మడి జాబితాలో విద్య ఉన్నప్పటికీ రాష్ట్రాల అధికారాలను హరిస్తూ విశ్వవిద్యాల యాల వైస్ ఛాన్సలర్లను ఎంపిక చేసే విధానానికి సవరణలు చేస్తూ యూజీసీ ‘యూనివర్సిటీలు, కాలేజీలలో టీచర్లు, అకడమిక్ సిబ్బంది నియామకం, ప్రమోషన్, ఉన్నత విద్యలో ప్రమాణాల పరిరక్షణకు కనీస అర్హతలు’ పేరిట కొత్త నిబంధనల ముసాయిదాను విడుదల చేసింది. ఇది రాజ్యాంగం కల్పించిన సమాఖ్య స్ఫూర్తికి భిన్నంగా ఉందని బీజేపీయేతర రాష్ట్రాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇప్పటివరకు రాష్ట్రాలకు ఉన్న హక్కులకు పాతర వేయడమేనని, అన్ని అధికారాలను గవర్నర్లకు అప్పగించడంతో పాటు, వైస్ చాన్సలర్‌ల నియామకం కోసం విద్యాపరమైన అర్హతలను సడలించడం పట్ల ఆ రాష్ట్రాల అధినేతలు నిరసన తెలుపుతున్నారు. అంతే కాకుండా అఖిలభారత యూనివర్సిటీ కాలేజీ టీచర్ల సంఘాల సమాఖ్య కూడా స్పందిస్తూ యూజీసీ ముసాయిదాను ఉపసంహరించుకోవాలని కోరుతోంది. రాష్ట్రాల హక్కులను, విశ్వవిద్యాలయాల విద్యా స్వయం ప్రతిపత్తిని మూల్యంగా పెట్టి తన కేంద్రీకరణ ఎజెండాను కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.
భారతదేశంలో ఉన్నత విద్యా వ్యవస్థకు ఒక కొత్త రూపు ఇవ్వాలని, దానికో కొత్త దృక్పథం ఉండా లని నూతన జాతీయ విద్యా విధానం 2020 ఎన్నుకున్న మార్గం కేంద్రీకరణ. అన్ని అధికారాలను కేంద్రీకరిస్తూ కేంద్ర ప్రభుత్వ కనుసన్నల్లో విద్యారంగం నడవాలనేది జాతీయ విద్యా విధానం మౌలిక స్వభావం. కేంద్ర, రాష్ట్రాల ఉమ్మడి జాబితాలో ఉన్న విద్యను రాష్ట్రాల అభిప్రాయాలను స్వీకరించకుండా ఏకపక్షంగా అధికారాలను తన గుప్పిట్లోకి తీసుకుంటూ కేంద్ర ప్రభుత్వం తన సంస్థల ద్వారా అధికారం అమలు చేయడానికి చేసే ప్రయత్నాలను ఈ ముసాయిదా ద్వారా మరింత ముందుకు తీసుకెళ్తుంది.
వర్సిటీల నియంత్రణ అంటే ఇదా?
ఉన్నత విద్యా వ్యవస్థ ఎదుర్కొంటున్న అనేక సమస్యలను జాతీయ విద్యా విధానం ఏకరువు పెడుతూ వీటిని అధిగమించడానికి ఉన్నత విద్యా వ్యవస్థను సంపూర్ణంగా సంస్కరించి, నాణ్యమైన ఉన్నత విద్య అందించాలని ఆకాంక్షిస్తోంది. అందుకు జాతీయ విద్యావిధానం ఎన్నుకున్న మార్గం ఏకైక నియంత్రణ వ్యవస్థ ద్వారా ఉన్నత విద్యను నియంత్రించాలని, ఉన్నత విద్యాసంస్థల పాలన అత్యున్నత యోగ్యతలు ఉన్న స్వతంత్ర బోర్డుల ద్వారా జరగాలని ఆకాంక్షిస్తుంది. ఆ మేరకు కేంద్రం చేత నియమించబడిన బోర్డ్ ఆఫ్ గవర్నర్స్‌కు విశ్వ విద్యాలయాల నిర్వహణను అప్పగించనుంది. ప్రస్తుతం విశ్వ విద్యాలయాలను ప్రజాస్వామికంగా నిర్వహిస్తున్న విద్యా కార్య నిర్వహణ కౌన్సిళ్ల స్థానాన్ని భవిష్యత్తులో రాజకీ య ప్రేరేపిత బోర్డులు ఆక్రమించనున్నాయి.
యూజీసీకి ఆ అధికారం ఉందా?
1956లో పార్లమెంట్ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ చట్టాన్ని చేసింది. విశ్వవిద్యాలయాల్లో ప్రమాణాలను నిర్ధారించడానికి, సమన్వయ పరచడానికి యూజీసీని నెలకొల్పుతున్నామని పార్లమెంట్ ప్రకటించింది. అంతేకాక విశ్వవిద్యాలయ పరీక్షల నిర్వహణ, పరిశోధనల ప్రమాణాలను నిర్ధారించడానికి, మెరుగుపరచడానికి యూజీసీ కృషి చేయాలని చట్టం స్పష్టం చేస్తోంది. ప్రస్తుతం విశ్వవిద్యాలయాల వైస్ చాన్సలర్ పదవులకు అర్హతలు సవరిస్తూ కొత్త ప్రతిపాదనలు తెచ్చే అధికారం యూజీసీ చట్ట ప్రకారం యూజీ సీకి ఉన్నదా అనేది ఇక్కడ కీలకమైన ప్రశ్న. వాస్తవానికి చట్టంలో విశ్వవిద్యాలయాల వైస్ చాన్సలర్ ఎంపిక నియామకాల్లో యూజీసీకి ఎలాంటి అధికారాలు లేవు. కనుక వైస్ చాన్సలర్ల నియామకానికి సంబంధించి యూజీసీ తెచ్చిన కొత్త ప్రతిపాదనలు చట్టరీత్యా చెల్లుబాటు కావు.
హైకోర్టు తీర్పును ధిక్కరించి మరీ..!
ప్రత్యేకంగా చేసిన శాసనాల ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విశ్వవిద్యాలయాలను నెలకొల్పుతాయి. కాబట్టి ఆయా విశ్వవిద్యాలయాల వైస్ చాన్సలర్ల నియామకాలకు సంబంధించిన విధి విధానాలు, అర్హతలు సదరు ప్రభుత్వాలు శాసన రూపేణా నిర్ణయించాలి తప్ప ఆ పని యూజీసీ చేపట్ట రాదు. యూజీసీ చట్టంలోని సెక్షన్ 26 కింద విశ్వవిద్యాలయాల వైస్ చాన్సలర్ల ఎంపిక, నియామకాలు యూజీసీ పరిధిలో లేవని సురేష్ పాటిల్ ఖేడ్ వర్సెస్ ద చాన్సలర్ యూనివర్సిటీస్ ఆఫ్ మహారాష్ట్ర అండ్ అదర్స్ కేసులో ముంబై హైకోర్టు నిర్ధారించింది. అంతేకాకుండా యూజీసీ చట్టం లోని 7.3.0 నిబంధన ప్రకారం రాష్ట్రాల శాసన సభల ద్వారా నెలకొల్పబడిన కాలేజీలు, విశ్వవిద్యాలయాలకు యూజీసీ సిఫార్సులు మాత్రమే చేయగలదని బొంబాయి హైకోర్టు ఇచ్చిన తీర్పును కళ్యాణి మతివనన్ కేసులో సుప్రీంకోర్టు సమర్థిస్తోంది.
కాంట్రాక్టు అధ్యాపకులకే పట్టం
అంతేకాకుండా కొత్త నిబంధనలు కాంట్రాక్టు అధ్యాపకుల నియామకాల ఖాళీల్లో 10 శాతానికి మించకూడదనే 2018 యూజీసీ నిబంధనను తొలగిస్తున్నాయి. అంటే ఇకపై ఎలాంటి పరిమితి లేకుండా కాంట్రాక్టు పద్ధతిలో అధ్యాపకులను నియమించుకోవచ్చు. కాంట్రాక్టు అధ్యాపకులు లేని విద్యా వ్యవస్థను అభివృద్ధి పరుచుకోవాలనే స్ఫూర్తికి ఇది వ్యతిరేకం. పైగా విద్యా రంగంలో చట్టబద్ధమైన వెట్టి చాకిరికి దోహదం చేస్తుంది. ఇది నూతన జాతీయ విద్యా విధానంలో ఉపాధ్యాయుల, అధ్యాపకుల నియామకాలకు సంబం ధించి కాంట్రాక్టు పద్ధతులను, పారా టీచర్ల పద్ధతిని వ్యతిరేకించని విధానాన్నే ప్రతిబింబిస్తుంది. అంటే నూతన విద్యా విధానం ప్రకారంగా కాంట్రాక్టు పద్ధతిలో అధ్యాపకులను నియమించుకునే స్వేచ్ఛ ఈ ప్రతిపాదన ద్వారా వస్తుంది. ఈ నిబంధనలు స్థూలంగా జాతీయ విద్యా విధానం 2020 నిర్దేశాలకు అనుగుణంగా, కార్పొరేట్లకు అనుకూలంగా, టీచర్లపై ఒత్తిడి పెంచేవిగా ఉన్నాయి.
ప్రైవేట్ రంగానికి తోకలుగా వర్సిటీలు..
ఈ నిబంధనల ద్వారా యూజీసీ నాన్ అకడమిక్ వ్యక్తులను కూడా వైస్ ఛాన్సలర్లుగా నియమించడాన్ని చట్టబద్దం చేసుకోవాలనుకుంటున్నది. ఇప్పుడీ నిబంధనలు బ్యూరోక్రాట్లు, పరిశ్రమలకు సంబంధించిన వారిని కూడా వీసీలుగా నియమించేందుకు అనుమతినిస్తున్నాయి. ఇది యూనివర్సిటీల అకడమిక్ స్వభావాన్ని దెబ్బతీసి వాటిని పరిశ్రమలకు, ప్రత్యేకించి కార్పొరేట్, ప్రైవేటు రంగా నికి తోకలుగా మార్చేందుకు జరుపుతున్న దాడి ఇది. అంతేగాక దేశంలో స్థాపించబడిన ప్రయి వేటు యూనివర్సిటీలకు అకడమిక్ వ్యక్తులనే వీసీ లుగా నియమించాలనే ఆలోచన లేకుండా స్వేచ్ఛ కల్పించే చర్య. ఇది ప్రైవేటు యూనివర్సిటీల విద్యా ప్రమాణాలపై ప్రభావం చూపుతుంది. నాణ్యతపై మరింత రాజీకి దారితీస్తుంది. ఉన్నత విద్యను తన గుప్పిట్లోకి తీసుకుని కేంద్రీకృతం చేసే, వ్యాపారమయం చేసే ఇటు వంటి ఎత్తుగడలను తిప్పికొట్టాలి. రాజ్యాంగాన్ని, అది నెలకొల్పిన విలువలను రక్షించుకోవాలి. మన విద్యా వ్యవస్థ పట్ల, దేశ భవిష్యత్తు పట్ల ఆసక్తి గల వారందరూ ఈ నిబంధనలకు తమ వ్యతిరేకించాలి. ఈ నిబంధనల ఉపసంహరణ కోసం విద్యార్థులు, అధ్యాపక వర్గాలు అన్ని ప్రజాస్వామిక శక్తులు కృషి చేయాలి.
-కె. వేణుగోపాల్
పూర్వ అధ్యక్షులు, ఏపిటిఎఫ్,
98665 14577