- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఈ బడ్జెట్ మధ్యతరగతికి మేలు చేసిందా!

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన ఎనిమిదవ బడ్జెట్‌లో మధ్యతరగతిని ఉత్సాహపరిచే నిర్ణయాలు ప్రకటించారు. కొత్త ఆదాయపు పన్ను స్లాబ్‌లు, తగ్గిన పన్ను రేట్లు మధ్యతరగతిలో ఆనందాన్ని కలిగించాయి. సుమారు ₹1,00,000 కోట్ల ప్రత్యక్ష పన్ను ఆదాయాన్ని త్యాగం చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉండటం ద్వారా మధ్యతరగతి ప్రజల చేతిలో ఎక్కువ డబ్బు మిగిలే అవకాశముంది. ఈసారి మధ్యతరగతి ప్రజల స్పందనపై బడ్జెట్ విజయవంతమవుతుందో లేదో ఆధారపడి ఉంటుంది. అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు కూడా ప్రభావితం చేయవచ్చు.
ముఖ్యంగా అమెరికా వంటి దేశాల నుండి వచ్చే పన్ను విధాన మార్పుల వల్ల భవిష్యత్తులో ఏమి జరగనుందో ఇప్పుడే చెప్పలేం. అయితే ప్రస్తుతం ఆందోళన కలిగించే అంశం ఏమిటంటే, మధ్యతరగతి ప్రజల చేతిలో ఎక్కువ డబ్బు ఉండటం ఖచ్చితంగా ఎక్కువ ఖర్చులకు దారితీస్తుందా! అన్నది సందేహాస్పదం. సంప్రదాయంగా, భారతీయులు ఆపద సమయం కోసం పొదుపు చేయడం పరంపరాగతంగా వస్తుంది. పెరుగుతున్న ధరలు, తక్కువ వేతనాలు మధ్యతరగతిని మరింత జాగ్రత్తగా డబ్బును పొదుపుగా వినియోగించేలా చేస్తాయి. భారత జనాభాలో సుమారు 570 మిలియన్ల మంది, అంటే 38 శాతం వరకు మధ్యతరగతి వర్గంలోకి వస్తారు. ప్రభుత్వ సబ్సిడీలు, పథకాల ద్వారా పేదలకు అండ అందుతుండగా, మధ్యతరగతి వర్గం ఆదాయ పెరుగుదలలేమి, ద్రవ్యోల్బణం, నిత్యావసరాల ధరల పెరుగుదలతో తీవ్ర ఆర్థిక ఒడిదుడుకులకు లోనవుతోంది. ఈ పరిస్థితిని గుర్తించిన ప్రభుత్వం బడ్జెట్ ద్వారా ఆర్థిక ఊరట ఇవ్వాలనే ప్రయత్నం చేసింది.
స్థానిక ఉత్పత్తులనే ఎంచుకునే ట్రెండ్
అయితే ఈ బడ్జెట్ లక్ష్యం ఏమిటో లోతుగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. ప్రధాన ఉద్దేశ్యం వినియోగాన్ని పెంచడం. మధ్యతరగతి ప్రజల చేతిలో ఎక్కువ డబ్బు ఉండటం వల్ల వారు ఎక్కువ ఖర్చు చేస్తారు, ఇది ఉత్పత్తి పెరుగుదలకు దారితీస్తుంది. తద్వారా ప్రైవేటు రంగంలో పెట్టుబడులు పెరుగుతాయి. కొత్త ఉద్యోగాలు వస్తాయి, ఫలితంగా ఆర్థిక వృద్ధి వేగవంతమవుతుంది. భారత్ 2030 నాటికి మధ్యాదాయ ఆర్థిక వ్యవస్థగా మారాలంటే కనీసం 8 శాతం వృద్ధి రేటును సాధించాలి. తక్కువ ఖర్చుతో ఎక్కువ వస్తువులను కొనుగోలు చేయడం, పెద్ద బ్రాండ్‌లకు బదులుగా స్థానిక ఉత్పత్తులను ఎంచుకోవడం వంటివి ట్రెండ్‌గా విస్తరిస్తోంది. నిత్యావసరాలు కుటుంబ ఖర్చులలో సగానికి పైగా ఉంటాయి. అందువల్ల పప్పులు, కూరగాయలు వంటి వస్తువుల్లోనూ తక్కువ ధర ఉన్న వాటిని ఎంచుకునే అలవాటు పెరుగుతోంది. దీని వల్ల పరోక్షంగా పోషకాహారంపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది.
అందరూ ఒకేలా ఖర్చు పెట్టలేరు!
మధ్యతరగతి వర్గం మూడు వేర్వేరు స్థాయిలుగా ఉంటుందనుకోవాలి. ఉన్నత, మధ్య, తక్కువ ఆదాయం గల వర్గాలు. రూ.26 లక్షల నుండి రూ.2.36 కోట్ల వార్షిక ఆదాయం కలిగిన కుటుంబాల మధ్య భారీ వ్యత్యాసాలు ఉన్నాయి. కాబట్టి అందరూ ఒకే విధంగా స్పందించరు. కొంతమంది ఈ అదనపు డబ్బును అప్పులు తీర్చడానికి, మరికొంతమంది పొదుపు చేయడానికి ఉపయోగిస్తారు. కొందరు షేర్ మార్కెట్‌లో షేర్లు కొని మదుపు చేస్తారు. ఉద్యోగ భద్రత లేకపోవడం, ఆర్థిక అనిశ్చితి వంటి కారణాల వల్ల కూడా ఎక్కువ ఖర్చులు చేసే అలవాటును కూడా నిరోధించవచ్చు. బడ్జెట్ 2025లో ఈ అంశాలపై దృష్టి సారించడం గమనార్హం. కొత్త ఆదాయపు పన్ను చట్టం మరిన్ని మార్పులను తీసుకురావచ్చు.
ఖర్చుపై పన్ను విధించడమే మేలు..
చివరగా, ఒక ప్రగతిశీల ఆలోచన ఏమిటంటే, ఆదాయంపై పన్ను వసూలు చేయడం బదులుగా ఖర్చుపైన పన్ను విధించడం ఆదాయం సంపాదించడం కష్టమైన పని, కానీ ఖర్చులను నియంత్రించడం సులభం. ఈ విధానం భవిష్యత్తులో సరైనదిగా మారవచ్చు. మన దేశ పౌరులు కూడా విదేశీ వస్తు వ్యామోహం చంపుకోవాలి, అత్యవసరమైతేనే మన దేశ వస్తువులనే కొనుగోలు చేయాలి. శక్తికి మించి ఖర్చు చేయరాదు. చేబదుళ్ళకు దూరంగా ఉండాలి. సాదా, సీదాగా నిరాడంబరంగా ఉండాలి. సాధారణంగా మన పల్లె ప్రజలు నిత్యజీవితంలో పొదుపుగా జీవించడం జన్మతః వచ్చిన సంస్కారం.
డాక్టర్ కోలహలం రామ్ కిశోర్,
98493 28496