- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Uniform Civil Code: అన్ని వర్గాలకు..ఆమోదయోగ్యమైన చట్టం సాధ్యమా?
ఈ మధ్య దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా ఉన్న అంశం ‘ఉమ్మడి పౌరస్మృతి’. అసలు దీని చరిత్ర ఏమిటి? రాజ్యాంగ రచన సమయంలో దీనిపై చర్చలు జరిగాయా? జరిగితే ఇప్పటివరకు ఎందుకు అమల్లోకి తీసుకురాలేదు? కేంద్ర ప్రభుత్వం ఇప్పుడే తేవాల్సిన అవసరం ఏమిటి? నిజంగానే ఉమ్మడి పౌరస్మృతి దేశ ఐక్యతకు, సమగ్రతకు పాటుపడుతుందా? లేక ఐక్యత, సమగ్రతను దెబ్బతీస్తుందా? అనే విషయాల గురించి లోతైన విశ్లేషణ అవసరం.
ప్రాథమిక హక్కులలో.. విస్మరించి
ప్రతి మనిషి జీవితంలో.. వివాహం, విడాకులు, వారసత్వం, దత్తత వంటివి వ్యక్తిగత విషయాలు. అయితే ఇందులో, అన్ని మతాల, వర్గాల ప్రజలకు ఒకే రకమైన చట్టం ఉండటాన్ని ఉమ్మడి పౌరస్మృతి అంటారు. ఇది ఇప్పటి భావన కాదు. స్వాతంత్రం పూర్వం నుంచే ఉంది. 1858 చార్టర్ చట్టం ద్వారా బ్రిటిష్ ప్రభుత్వం న్యాయ నిర్వహణను సులభతరం చేయడానికి ప్రామాణిక పద్ధతులను భారతీయ చట్టాలుగా క్రోడీకరించాలని భావించింది. కానీ 1858 చార్టర్ చట్టం తరువాత కేవలం సివిల్ ప్రొసీజర్ కోడ్, ఇండియన్ పీనల్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ లాంటి వాటికే పరిమితం అయింది. వ్యక్తిగత విషయాల్లో సాధ్యం కాలేదు. హిందూ, ముస్లిం వర్గాల కోసం వ్యక్తిగత చట్టాలు, బ్రిటిష్ వారి సమయంలో రూపొందించబడ్డాయి కానీ కమ్యూనిటీ నాయకుల ప్రతిఘటనతో బ్రిటిష్ వారు ఇందులో ఎక్కువగా జోక్యం చేసుకోలేదు.
భారత రాజ్యాంగాన్ని రూపొందించే సమయంలోనూ ఉమ్మడి పౌరస్మృతి చర్చకు వచ్చింది. లింగ సమానత్వం, లౌకికవాదం, జాతీయ సమైక్యతను ప్రోత్సహించడానికి ఉమ్మడి పౌరస్మృతి అవసరమని అంబేద్కర్ తో సహా రాజ్యాంగ సభలోని అల్లాడి కృష్ణస్వామి, మున్షీ లాంటి సభ్యులు భావించారు. కానీ నజీరుద్దీన్ అహ్మద్ సహా అనేక ఇతర సభ్యులు వ్యతిరేకించారు. రాజ్యాంగం ప్రాథమిక విధుల ప్రకారం.. ఉమ్మడి పౌరస్మృతిని అందరికి అందించాలని కమిటీ చెబితే.. రాజ్యాంగ పరిషత్ ప్రాథమిక హక్కుల సంఘం కావాలనే దీనిని విస్మరించి ప్రాథమిక హక్కుగా చేర్చకుండా వ్యక్తిగత చట్టాలు చేసే ఉమ్మడి జాబితా అయిన పార్ట్-5 లో చేర్చింది. దీని ప్రకారం దీనిపై చట్టం చేసే అధికారం పార్లమెంట్, రాష్ట్ర అసెంబ్లీలకు ఇచ్చింది. వీటిపై చట్టాలు చేయడానికి పార్లమెంటుకు శాసనాధికారాన్ని ఇచ్చారు.
కోర్టు తీర్పులతో..
భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత హిందూలు. బౌద్ధుల, జైనుల, సిక్కులు, క్రైస్తవులు, యూదులు, ముస్లింలు వారి వారి వ్యక్తిగత చట్టాలు రూపొందించుకొని పాటిస్తున్నారు. అయితే 1985లో సుప్రీంకోర్టు ‘షాబానో కేసు’ను విచారించే సమయంలో క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 125 ప్రకారం ట్రిపుల్ తలాక్ చెప్పిన తర్వాత ఆమెకు మెయింటెనెన్స్ డబ్బులు చెల్లించాల్సిందేనని తీర్పునిచ్చింది. అలాగే ఈ కేసు సందర్భంలో ఉమ్మడి పౌరస్మృతి రూపొందించాలని కేంద్రానికి సూచించింది. కానీ 1986లో తీర్పును సవాల్ చేయగా.. ముస్లిం మహిళల( విడాకుల రక్షణ చట్టం) ప్రకారం తీర్పును కొట్టివేయడానికి అనుమతించింది. దీని ప్రకారం భరణం కోరేందుకు ముస్లిం మహిళకు అనుమతి లేదని తేల్చింది. ఆ తర్వాత చాలా కాలానికి ట్రిపుల్ తలాక్ రాజ్యాంగ విరుద్ధమని కేంద్రం ప్రకటించింది. అలాగే సరళ ముద్గల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులోనూ సుప్రీంకోర్టు ఉమ్మడి పౌరస్మృతిని సిఫార్సు చేసింది. దీని కోసం ప్రభుత్వం 2016లో జస్టిస్ బీఎస్ చౌహాన్ అధ్యక్షతన 21వ లా కమిషన్ ఏర్పాటు చేసి, ఈ చట్టం అమలుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించమని కోరింది. అయితే ఈ కమిషన్ ఉమ్మడి పౌరస్మృతి ఈ పరిస్థితుల్లో అవసరం లేదని తిరస్కరించింది. అయినప్పటికీ మోడీ ప్రభుత్వం జస్టిస్ రీతురాజ్ అవస్తి అధ్యక్షతన 22వ లా కమిషన్‌ను నియమించింది. ఈ కమిషన్ గత నెల 14 నుంచి సంప్రదింపులు ప్రారంభించి ప్రజల నుండి, గుర్తింపు పొందిన మత సంస్థల నుండి అభిప్రాయాలు, సిఫార్సులు చేయడానికి నోటీసు తేదీ నుండి 30 రోజుల గడువు విధించింది.
అనుకూలతలు.. ప్రతికూలతలు..
ఉమ్మడి పౌరస్మృతి అమల్లోకి వస్తే అంబేద్కర్ ఊహించిన విధంగా మహిళలు, మతపరమైన మైనారిటీలతో సహా బలహీన వర్గాలకు రక్షణ కల్పించడంతో పాటు ఐక్యత, జాతీయవాద భావాన్ని పెంచుతుంది. పౌరులందరూ ఒకే పౌర చట్టానికి లోబడి ఉంటారు. మతంపై ఆధారపడిన చట్టాలు కొన్నిసార్లు వివక్ష పూరితమైన పద్ధతులకు దారితీస్తాయని, మహిళలకు వ్యతిరేకంగా ఉంటాయని వాదన అందుకే జాతీయ సమగ్రత, లింగ సమానత్వానికి, మతాల సమానత్వానికి ఇది ముఖ్యమైనదని ఇది లౌకిక సూత్రాలను బలపరుస్తుందని వాదన. అలాగే ఈ చట్ట అమలు వారసత్వం, విడాకుల పరంగా చట్టాన్ని సులభతరం చేస్తుందని, చాలా కాలంగా ఉన్న మతపరమైన వ్యక్తిగత చట్టాలను తొలగిస్తుందని న్యాయ నిపుణులు అంటున్నారు. స్వాతంత్ర్యం వచ్చి 7 దశాబ్దాలు దాటిన తర్వాత కూడా వివిధ మతాలకు వేర్వేరు వ్యక్తిగత చట్టాలు ఉండాలా? అని ప్రశ్నిస్తున్నారు.
అలాగే, 21వ లా కమిషన్ ఉమ్మడి పౌరస్మృతి అవసరం లేదని నివేదిక ఇచ్చినా, 22వ లా కమిషన్ వేయాల్సిన అవసరం ఏంటని? అలాగే ఉమ్మడి పౌరస్మృతి అమలుపరిస్తే, మత స్వేచ్ఛను ఉల్లంఘించవచ్చని, మతపరమైన పద్ధతులతో ఘర్షణ పడవచ్చని వ్యతిరేకులు వాదిస్తున్నారు. భారతదేశం విభిన్న సంస్కృతులతో కూడిన వైవిధ్యమైన దేశం. కాబట్టి, వివిధ వర్గాల వారి ప్రత్యేక ఆచారాలు కొనసాగించే హక్కు ఉండాలని, వారి అనుమతి లేకుండా మైనారిటీ వర్గాలపై చట్టాన్ని అమలు చేయరాదనే వాదనలు ఉన్నాయి. పైగా ఇది సమానత్వ హక్కు, స్వతంత్రపు హక్కుకు విరుద్ధంగా ఉందని..యూసీసీ వీటన్నిటింపై ప్రభావం చూపుతుందని వాదిస్తున్నారు. ఏకరూపత పేరుతో మెజారిటీ సంస్కృతిని తమపై రుద్దుతున్నారని మైనారిటీలు ఆందోళన చెందుతున్నారు. భారతదేశంలోని విస్తారమైన సాంస్కృతిక వైవిధ్యాన్ని బట్టి ఈ వ్యక్తులందరినీ ఒకచోట చేర్చడం చాలా కష్టమని నిర్వర్తిస్తున్నారు. పైగా ఈ చట్టం ద్వారా హిందూ అవిభాజ్య కుటుంబాలపై పన్నుల ప్రభావం ఉంటుంది, జీఎస్టీ, ఐటీ, ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ బదిలీ చట్టాల్లో మార్పులు అవసరం. యూసీసీ అమలు పరిస్తే, హిందూ అవిభాజ్య కుటుంబం యొక్క ప్రత్యేక 'వ్యక్తి' స్థితి ఇకపై కొనసాగదు. ఇది ఎంతో మందిని ప్రభావితం చేస్తుంది. వివిధ పన్ను మినహాయింపుల ప్రయోజనాలను కోల్పోతారు.
లోతైన చర్చ అవసరం!
ఏది ఏమైనప్పటికీ హిందువులు, ముస్లింలు, ఇతర మైనారిటీల వ్యక్తిగత చట్టాలను తులనాత్మకంగా అధ్యయనం చేస్తే ఈ చట్టాల సంపూర్ణ వైవిధ్యం, వారు కట్టుబడి ఉన్న పిడివాదం ఏ విధమైన ఏకరూపతను అనుమతించలేదని చెప్పవచ్చు. నిజానికి హిందూ కోడ్‌లోనూ ఏకరూపత లేదు.. వివిధ ప్రాంతాల్లో వివిధ ఆచారాలు ఉన్నాయి. అలాగే ముస్లింలలో కూడా ఉన్నాయి. అందువల్ల, ఈ భిన్నమైన చట్టాలను మార్చడం వల్ల, అన్ని వర్గాలకు ఆమోదయోగ్యమైన ఉమ్మడి కోడ్‌ను రూపొందించడం సాధ్యమేనా? వచ్చే పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ప్రభుత్వం యూనిఫాం సివిల్ కోడ్ (యూసీసీ)ని ప్రవేశపెట్టే అవకాశం ఉందని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ప్రస్తుతం, వారసత్వం, వివాహం, విడాకులు, భరణం, దత్తత మొదలైన వాటికి సంబంధించిన నియమాలు సంబంధిత వ్యక్తిగత చట్టాలు పౌరుల మతం ద్వారా నిర్వహించబడుతున్నాయి. యూసీసీని వారి మతంతో సంబంధం లేకుండా భారతీయ పౌరులందరికీ అన్ని అంశాలకు సంబంధించి ఏకరీతి చట్టపరమైన ఫ్రేమ్‌వర్క్‌ను అమలు చేయాలని కేంద్రప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. కానీ దేశవ్యాప్తంగా యూసీసీపై లోతైన చర్చ జరగాలి. రాజకీయ కోణంలో కాకుండా దేశ భవిష్యత్తు దృష్ట్యా అందరి అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకుని, అందరి ఆమోదంతో ఉమ్మడి పౌరస్మృతి నిర్మాణం కావాలి.
జుర్రు నారాయణ యాదవ్,
తెలంగాణ టీచర్స్ యూనియన్,
9494019270.