- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఒకే కులానికి రెండు అస్తిత్వాలా..?

రజక (చాకలి) కులస్తులను ఎస్సీ జాబితాలో చేర్చాలనేది దశాబ్దాలుగా కోరుతున్న డిమాండ్. భారత రాజ్యాంగం ప్రకారం దేశంలో ఓ కులం వేర్వేరు జాబితాలో ఉండకూడదు.. కానీ, ఈ దేశంలో ఒక్క రజకులు మాత్రమే అత్యధిక రాష్ట్రాల్లో ఎస్సీలుగా పరిగణించబడుతూ.. దక్షిణాది రాష్ట్రాల్లో బీసీలుగా చెలామణి అవుతున్నారు. అసలెందుకు ఈ వ్యత్యాసం? అంబేడ్కర్ చెప్పిన దానికి భిన్నంగా ఈ వైరుధ్యాలు ఎందుకు?
భారత రాజ్యాంగం గురించి వేనోళ్ల మాట్లాడే మేధావులు సైతం ఈ విషయంలో జాతి ప్రయోజనాల కోసం వెంపర్లాడుతూ.. రాజ్యాంగబద్ద హక్కు కోసం గొంతెత్తిన రజకులకు కనీసం సంఘీభావం ప్రకటించడమే లేదు. జాతి ప్రయోజనాల కోసం అంబేడ్కర్ విధానాలకు ఎంచక్కా పాడె మోస్తున్నారు.
ఎస్సీల్లో చేర్చేందుకు అదే అర్హతా..?
రజకులు అస్పృశ్యులు కాదు.. వాళ్లు అంటరాని వాళ్లు కాదు అని గొప్ప మేధావులుగా పరిగణింపబడుతున్న వారి అభిప్రాయాలు.. బ్రిటిష్ ఇండియా ప్రభుత్వంలో ఆంగ్ల అధికారులు పరిశోధించి రాసిన గ్రంథాల్లోనూ రజకులు అంటరానివారు అనే రాశారు. అంతేందుకు అంబేడ్కర్ తగలబెట్టిన మనుస్మృతిలోనూ రజకులు అస్పృశ్యులుగా పరిగణించబడ్డారన్న విషయం గమనంలోకి తీసుకోరా? అయినా, ఎస్సీలో జాబితాలో కులాలని చేర్చేందుకు కేంద్రం అంటరాని తనం ఒక్కటే ప్రామాణికంగా తీసుకోలేదు. సామాజిక, ఆర్థిక వెనకబాటును ప్రాతిపదికన తీసుకొని ఎస్సీ జాబితాలో చేర్చింది అనే విషయాన్ని విస్మరించి.. రజకులను ఎస్సీ జాబితాలో చేర్చేందుకు నిరాకరిస్తున్నారు. ఇది అంబేడ్కర్‌ను అవమానించడమే. సామాజిక సూత్రాన్ని సమాధి చేయడమే. వీటిని వదిలేసి రజకులు కేవలం ఆర్థికంగా వెనకబాటుకు గురి అయిన వారు మాత్రమే. వాళ్లలో ఎక్కడిది అస్పృశ్యత అని ప్రశ్నిస్తున్నారు. నిజంగా ఈ దేశంలో అస్పృశ్యులు ఎవరు? ఎస్సీలు మాత్రమేనా? రజకులు కూడా ఆ జాబితాలోకి వస్తారు.. కానీ, రజకులు ఎస్సీల బట్టలు ఉతికారా? ఉతకలేదు కాబట్టి, వాళ్ళు అస్పృశ్యులు కాదనే దిక్కుమాలిన వాదన ఎప్పుడూ చర్చలో ఉంచుతారు. అంటే ఎస్సీల బట్టలు ఉతికుంటే రజకులు ఎస్సీలుగా పరిగణించబడేందుకు అర్హులు అని చెప్పదల్చుకున్నారా? పైగా..ఈ దేశంలో ఓ ఇంటి ముందు అన్నం అడుక్కొచ్చుకొని తిని పొట్టపోసుకున్న జీవితాలు..ఎన్నో మైలబట్టలు ఉతికి అస్పృశ్యతను వాళ్ల జీవితంలోకి ఆహ్వానించి.. ఎన్నో జీవితాలను శుభ్రం చేసి అస్పృశ్యత నుంచి బయటపడేసింది రజకులే.
బీసీలు అంటూనే అవమానిస్తున్నారు..
బీసీల్లో కొనసాగుతూ కుల వివక్షను మోస్తున్నది ఎవరు? చాకలోడా అనే కుల దూరహంకారానికి ఇప్పటికీ బహిరంగంగా గురి అవుతున్నది ఎవరు? ఏళ్ల తరబడి ఎస్సీలతో పాటు రజకులూ అస్పృశ్యతను అనుభవిస్తున్నారు. అయినప్పటికీ రజకులు అంటరాని వాళ్లు అనేందుకు మెజార్టీ ఎస్సీలు నిరాకరిస్తున్నారు. ఇకపోతే, సీఎం రేవంత్ రెడ్డి కూడా గతంలో రజకులను ఎస్సీలో చేర్చాలని డిమాండ్ చేసిన వారే.. ఇప్పుడు ప్రభుత్వం మీది.. నిర్ణయం రేవంత్ చేతుల్లోనే ఉంది. నిజంగా..రజకులు అంటరాని వారు కాకపోతే ఆర్థిక వెనుకబాటు మాత్రమే ఉంటే ఈ సామాజిక వర్గాన్ని బీసీలలో కాదు.. ఓసీలో చేర్చండి. బీసీలోని ఏ జాబితాలోని ఏ ప్రయోజనాలూ మాకు అందటం లేదు. పైగా బీసీలు అనే ట్యాగ్ మోస్తూ ఈ సామాజిక వర్గాల్లో అవమానాలను, వివక్షను అదనంగా అనుభవిస్తున్నారు. వచ్చే రిజర్వేషన్ ఫలాలను కూడా ఈ రజక సమాజం ఆశించిన మేర అందిపుచ్చుకోలేకపోతుంది. అందుకే 5 శాతం కూడా సరిగ్గా లేని ఓసీలకు ఎట్లైతే ఈడబ్ల్యూఎస్ కోటా కింద 10శాతం రిజర్వేషన్ వర్తింపజేస్తున్నారో.. రజకులకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు, అట్రాసిటీ యాక్ట్‌ను కల్పించండి. రజకులకు ఎలాంటి హక్కులు లేకపోవడంతో కులం పేరిట వివక్ష అనుభవిస్తూ, సమాజంలో చిన్నచూపుకు గురి అవుతున్నారు. అందుకే బీసీ కుల గణనలో భాగంగా వారిని ప్రత్యేక కేటగిరీలో చేర్చడమో.. లేదంటే కొన్నాళ్లు ఓసీ జాబితాలో చేర్చి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఫలాలు దక్కేలా ప్రభుత్వాలు కృషి చేయడం చేయాలి. ఆ మేరకు ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచాలి. అందుకు ఎస్సీలు కూడా సోదర భావంతో బాధ్యతతో తమ గళం వినిపించాలి.
-పగిళ్ళ ప్రశాంత్
ఉస్మానియా యూనివర్సిటీ
95812 62429