- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
చేలో పంట.. మార్కెట్లో ధర లేక మంట!
అరుగు మీద కూసున్న రామయ్యను అటుగా పోతున్న సోమయ్య సూసి.. అగో రా రాయయ్య ఏంది దిగాలుగా కూర్చున్నడేంది..? అరె ఏందే రామయ్య.. అంత దిగాలుగా కూసుని ఆలోచిస్తున్నవ్..
మీ ఆవిడ ఏమన్నా అందా ఏంటి..?
అవునే.. మా ఆవిడ.. దూం తిడుతోంది.. దేనికే పుట్టింటికి పోతానంటే వద్దన్నావా ఏంది..? యే.. నేనెందుకు అద్దంటనే.. గిప్పుడు కూలీలు దొరకట్లేదు.. పత్తి ఏరుదామంటే.. పత్తేమో చేన్లోనే కిందవడిపోతోంది. ఏ చేన్ల చూసినా కైకిలోల్లు దొరక్క పత్తి వలిగి పనంతా ఆగమాగమవుతోందే... ఒకవైపేమో ఆకాశంలో దొంగమబ్బులు తిరుగుతున్నయ్. వాతావరణ శాఖోల్లేమో అక్కడక్కడ ఆనలు వడ్తాయని చెబుతున్నరు. పుట్టు పత్తి ఏరుడు కాలేదు. కైకిలోల్లు దొరుకుతలేరు. పక్క ఊళ్లోకి వెళ్తే అక్కడా కొరతనే ఉంది. దొరికినోల్లను అడిగితే కిలో పది రూపాయలని ఒకల్లం టే.. కిలో 12 ఇస్తే అస్తమని మరికొందరంటున్నరే. పండిందే అంతంత అంటే.. అది ఏరుకుని అమ్ముకుందామంటే కైకిలోల్లు దొరకట్లే.
ఇగ ఆల్లు అడిగినంత ఇచ్చి ఏరిపిద్దామన్నా మార్కెట్లో ధర లేకపాయే. మార్కెట్లో మద్దతు ధర ఇస్తామని చెబుతున్న గవర్నమెంటేమో.. కుంటాలుకు రూ.7521 చెప్పింది. కానీ సీసీఐ సార్లేమో తేమ 8 శాతం ఉంటేనే కొంటామంటున్నరు. ఇగ మొన్నటిదాకా ఆనలు కురిసినయి. ఇప్పుడే మో పొగమంచు కురుస్తోంది. పత్తి ఏరి పిస్తే తేమ ఉండదానే. మరోదిక్కు ఆనలు పడే అవకాశం కనిపిస్తుంది.
మొన్న సూరయ్య పత్తి ఏరిపిచ్చి మార్కె ట్‌కి తీసుకెళ్తే సీసీఐ సార్లు తేమ 13 ఉంద ని రిజక్ట్ చేసిండ్రట. ఆయనదే కాదే.. మస్తు మంది రైతులది రిజక్ట్ చేసిండ్రట. దీంతో ఆయన ప్రయివేటుకు అమ్మితే కుంటాలు కు రూ. 6700 ధర వెట్టిండ్రటనే. దీంతో ఆయన లబోదిబోమంటూ పత్తి అమ్ము కుని అచ్చిండు. మంచిదే కదానే.. రామ య్య.. పత్తి అమ్ముకున్నడు కదా..
ఏం మంచిదే.. నా బొంద. ఈ సారి ఆనలు వడుడుతోని పంటలు మంచిగా కనిపిస్తున్నయని దళారుల వద్ద అధిక మిత్తికి అప్పు తెచ్చిన్నే. చూస్తే పత్తి పంట మంచిగా పెరగడంతో ఇగ అప్పులు తీరుతయనుకున్న భారీ మందులు తెచ్చిన. మందు పోతలు తెచ్చి ఇరగ పారవోసిన. కలుపు మందులు కొట్టిచ్చిన. కానీ మొన్న పొగమంచుతో ఆనవడడంతో బారంత రాలిపోయింది. ఉన్న కాయ ఒక్కసారే పట్టన వలిగింది. ఇంకేం మొత్తం చేనంత బారు లేక ఉన్నదంతా ఊడుకపోవడంతో ఇక పలిగిన పత్తిన మాత్రమే ఏరుకోవాలి. మొత్తం ఆరు ఎకరాల్లో పత్తి వండిస్తే ఎకరానికి 8 కుంటాల్లు కూడా నిండేలా లేదే. ఖర్చేమో తడిసి మోపెడైందే..!
ఎంతంటే అంత ఖర్చు చేసి యవసాయం చేయిస్తే ఇప్పుడు చేతికందే ప౦ట చూస్తే బాధేస్తోందే. ఎల్లేదే తక్కువంటే కైకిలోల్లు బాగా అడుగుతున్నరు. పోనీ ఆలా అడి గింది ఇచ్చి ఏరిపిచ్చుకోవచ్చు. కానీ మార్కెట్లో ధర బాగా లేదే.. తెచ్చిన అప్పుడు ఒక దిక్కు.. చేన్లో పత్తి అంతంతే ఉండడంతో ఇప్పుడు ఏరిపిద్దామంటే దిగాలవుతోంది. కూలీలకు ఇవ్వడానికి ఇబ్బందేంలేదే. మొన్నటి వరకు పంట బాగా ఉందని ఖర్చు పెట్టుకుంటా పోయినం. ఇప్పుడేమే వాతావరణం దెబ్బతీసింది. ప్రయివేటు వ్యాపారులేమో పత్తికి కుంటాలుకు మొన్నటి వరకు 7140 ఇచ్చిండ్రు. ఇప్పుడే మో అది కూడా లేకుండా చేసిండ్రు. ఇయ్యాల 7010 రూపాయలే ఇస్తుండ్రు. ఇచ్చే దే అంతంత అంటే అందు లోనూ కోత వెడుతున్నరు. ఇగ తేమ పేరుతోని పాయిం ట్ల పేరుతో కోత వెళ్తుంటే కుంటాలుకు 6500 నుండి 6600 రూపాయలే దిక్కవుతోందే. ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలో ఆలోచిస్తుంటే పత్తి ఏరేందుకు కైకిలోల్ల కోసం పొరుగూరికి పొమ్మని మా ఇంటిది పోరు పెడ్తున్నదే. అందుకే పత్తి ఏరేందుకు కైకిలోల్ల కోసం ఏం చేయాలో తెల్వక.. అడిగింది ఇవ్వలేక ఇలా దిగులుగా కూసున్ననే. నువ్వే ఏదైనా ఉపాయం చెప్పవే సోమయ్య.
అదేందే గట్లంటున్నవ్. డోలు వోయి మద్దెలకు మొరపెట్టుకున్నట్లు.. ఇప్పటిదాక నువ్వు కైకిలోల్ల కోసం కూసుండి ఆలోచిస్తుంటే.. నేనేమో బయటకెల్లి ఎవరైనా దొరుకుతరేమోనని అడిగి అడిగి ఓల్లు దొరకక ఇంటికి తిరిగొస్తున్న. మరి ఆడ మార్కెట్లో ధర లేదు. ఈడ అడిగినంత ఇచ్చుకోలేం. ఏం చేయాలో తెల్వడం లేదు. సూద్దాం.. అప్పులు తీరడం లేదని.. పంట చేన్లో ఉంచుకోలేం. ధర తక్కు వుందని తెచ్చి ఇంట్లో ఉంచుకోనూ లేం.
ప్రభుత్వాలు మారినా రైతుల బతుకులు మారయే.. మార్కెట్లో ఏ వస్తువు ధర అయినా తయారు చేసేటోడే నిర్ణయించుకుంటున్నరు. కానీ మనం పండించిన పంటకు మనం ధర నిర్ణయించుకోలేనని రోజులు ఇలాగే ఉంటయే మన బతు కులు.. అనుకుంటూ సోమయ్య కంట తడివెట్టుకున్నడు. అందుకేనే మొన్న ఏదో పేపర్ల రైతులు పూర్తిగా తగ్గిపోతున్నరని ఇన్నా. రానున్న రోజుల్లో మనం యవ సాయం చేయకపోతే అప్పుడు తెలుస్తుందే మన అవసరం ఎంతుందో..?
అలాగే, మనం ఐక్యంగా లేకపోవడమేనే మన బతుకులు ఆగం కావడానికి కారణం.. అందుకేనే మనల్లి ఒక్కటి కాకుండా పెద్ద పెద్ద యాపారులు అడ్డువడుతున్నరు. పోనీ గవర్నమెంటు అధికారులు మనకు ధర వెట్టించి మన పత్తిని కొనిపిచ్చేందుకు సీసీఐ అధికారులకు చెబుతరంటే ఆల్లే సీద తీసుకెళ్లి పత్తిని ప్రయివేటు వాళ్లకు అమ్మేల చూస్తున్నరే. అరె తేమ ఎక్కువుంటే ఆల్లే కొంచెం చూసీ చూడనట్లు పంటను కొంటే మనకు ఎంతో కొంత భారం తక్కువవుతుంది కదనే. ఆల్లు కూడా మన దిక్కు సూడకనే కద్నే మనం మద్దతు ధర దొరక్క అప్పులు తీరక అవస్థలు పడుతున్నం. ఎప్పుడు గుర్తిస్తరో మరి అధికారులు, ప్రభుత్వాలు.. అంటూ సోమయ్య రామయ్య వద్ద సెలవు తీసుకుని ఇంటి బాట పట్టాడు. మరి ప్రభుత్వాలు సోమయ్య, రామయ్యలాంటి రైతుల బాధను ఎప్పుడు పట్టించుకుంటయో!
-మామిళ్ల వామన్,
సీనియర్ జర్నలిస్టు
99085 56358