నిజమైన సక్సెస్ అంటే ఫెయిల్యూర్ ఉండాల్సిందే!

by Ravi |   ( Updated:2025-04-19 00:31:19.0  )
నిజమైన సక్సెస్ అంటే ఫెయిల్యూర్ ఉండాల్సిందే!
X

ఈ మధ్య విద్యార్థుల ఆత్మహత్యలు ఎక్కువయ్యాయి. పరీక్షల్లో మార్కులు తగ్గాయని భవిష్యత్‌పై భయంతో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. జాతీయ నేర గణాంక సంస్థ నివేదిక ప్రకారం దేశంలో విద్యార్థుల ఆత్మహత్యలు నాలుగు శాతం చొప్పున పెరుగుతున్నాయి. ఈ సంవత్సరం జనవరి నెలలోనే ఆరుగురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇందుకు కారణాలను గమనిస్తే.. విద్యార్థి వ్యక్తిగత సామర్థ్యాలను పట్టించుకోకుండా అందరిని ఒకే తూనిక రాళ్లతో కొలవడం, మార్కులు రాని వారిని చులకనగా చూడడం. బట్టి పాఠాలు, బండ బోధనా పద్ధతులకు తోడు ర్యాంకుల రేసులు, ఇక తల్లిదండ్రుల ఒత్తిడితో విద్యార్థులు మానసికంగా కుంగిపోయి ఆ నిస్సహాయ స్థితిలో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అనేక వ్యాపార వైఫల్యాల తర్వాత 62 సంవత్సరాల వయసులో కర్నల్ శాండర్స్ KFC ని స్థాపించి విజయాన్ని సాధించాడు. 78 సంవత్సరాల వయసులో గ్రాండ్ మా మోసెస్ 'పెయింటింగ్' ప్రారంభించి విజేతగా నిలిచింది. 80 సంవత్సరాల వయసులో లండన్ మారథాన్ పూర్తి చేసి శారీరక సామర్థ్యానికి వయస్సు అడ్డు కాదని పౌజా సింగ్ నిరూపించాడు. ఆర్థికంగా, వ్యక్తిగతంగా ఎన్నో కష్టాలు ఎదుర్కొని 12 ప్రచురణా సంస్థలు తన పుస్తకాన్ని తిరస్కరించినా చివరికి 'హారి పోటర్' పుస్తక సిరీస్‌తో గొప్ప విజేతగా నిలిచింది J K. రోలింగ్. ఎన్నికల్లో ఎనిమిది సార్లు ఓడిపోయి, చివరిగా అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికై బానిస వ్యవస్థను రద్దు చేసిన అబ్రహం లింకన్ లాంటి వారి నుండి స్ఫూర్తి పొంది తాత్కాలిక వైఫల్యానికి నిరాశ చెందక, ఓడిపోయినా మళ్లీ ప్రయత్నించి విజయం సాధించాలి యువత. ఒక జపాన్ రచయిత అన్నట్లు “LIFE “లో F అనే Failure లేకపోతే lie (అబద్ధం) అవుతుంది. Failure తో కూడిన success నిజమైన LIFE. అందుకే చివరి వరకు బతికుంటే విజయం మనదే.

వెంగళ నరేష్

99485 35728



Next Story