సమకాలిన కవిత్వం.. సామాజిక ప్రయోజనం కొరకు కవిత్వం

by Vinod kumar |   ( Updated:2023-09-27 19:15:47.0  )
సమకాలిన కవిత్వం.. సామాజిక ప్రయోజనం కొరకు కవిత్వం
X

కవిత్వాన్ని ఆయుధంగా చేసుకుని మూఢ ఆచారాలపై తిరగబడిన కవి... ఆయనే నవయుగ కవి చక్రవర్తి దళిత వర్గ జ్వాలా స్పూర్తి గుర్రం జాషువా. ఎన్నో అవమానాలను ఎదుర్కుని కవిత్వంతో పరిష్కార మార్గాన్ని చూపాడు. దీపాల పిచ్చయ్య శాస్త్రి సహచర్యంతో కవిత్వంపైన ఆసక్తి కలిగి 36గ్రంధాలూ మరెన్నో కవితా ఖండికలు రాశారు.ఆయన రచనలలో సర్వోత్తమైన రచన గబ్బిలం పాఠకుల హృదయాలలో నిలిచిపోయిన కావ్యం. కాళిదాసు మేఘ సందేశం వలె ఇది ఆ తరహా కొనసాగుతుంది.

కధానాయకుడి ద్వారా తన అంటరాని కులానికి చెందిన బాధనంతా కాశీ విశ్వనాధునికి చేరవేయమని, తన ఇంటికి వచ్చిన మొదటి అతిధివి నీవే అంటూ గబ్బిలంతో సందేశం పంపడమే కధాంశం. గబ్బిలమా నీవు ఎంతో పుణ్యం చేసుకున్నావు, గుడిలోని ప్రవేశానికి నీకు అడ్డు లేదు. కానీ నా పరిస్థితి అలా కాదు అంటరానివాడిననే ముద్ర నాపై వేసి దేవుడిని చూసే అదృష్టం లేకుండా చేసింది ఈ సమాజం అంటూ విన్నవించుకుంటాడు. వేదనను వర్ణించిన తీరు హృదయాలను కదిలించింది. ఇవేకాక క్రీస్తుచరిత్ర కావ్యానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది.

రాజు మరణించే నొకతార రాలిపోయే..

కవియు మరణించే నొకతార గగనమెక్కె..

రాజు జీవించె రాతి విగ్రములందు..

సుకవి జీవించె ప్రజల నాలుకల యందు..

అన్న పద్యం పిరదౌసి అనే కావ్యంలో రాసి నిజమైన కవిగా కవితత్వాన్ని చాటుకున్నాడు. మరెన్నో ఖండ కావ్యాలు రాసిన జాషువా 1895 సంవత్సరంలో సెప్టెంబర్ 28వ తేదీన తల్లి లింగమాంబ తండ్రి వీరయ్యలకు జన్మించారు. అభ్యుదయ భావాలు కలిగి సాంప్రదాయ కవిగా పేరు తెచ్చుకుని, కవికోకిల, కవితా విశారద, కవి దిగ్గజ, నవయుగ కవి చక్రవర్తి వంటి బిరిదులను సొంతం చేసుకున్నారు. నేతాజీ, బాపూజీ, రాష్ట్రపూజ, స్వయంవరం,కొత్తలోకం, స్వప్నకధ వంటి ఖండకావ్యాలతో పాటుగా నాకధ అనే స్వీయ రచన చేసి ఎన్నో పురస్కారాలకు ప్రతీకగా నిలిచారు.

మద్రాసు ఆకాశవాణి కేంద్రంలో రేడియో ప్రయోక్తగా పని చేశారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం జాషువాను కళాప్రపూర్ణ బిరుదుతో కీర్తించింది. బుద్ధుడు, క్రీస్తు, గాంధీజీల జీవకారుణ్యం ఇతని కవిత్వంలో మనం చూడవచ్చు. ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ కవిగా తన రచనలలో అరబ్బీ, పారశీ, ఉర్దూ పదాలను యధేచ్చగా ప్రయోగించి కవిత్వానికి ప్రాణం పోశారు. తెలివికి కలిమిలేములతో పనిలేదని ప్రతిభను కులమతాల తక్కెడలో తుచరాదని విశ్వసించి తన జీవితమంతా ఆ విశ్వాసానికే కట్టుబడిన కవి మన జాషువా.

(నేడు గుర్రం జాషువా జయంతి)

యం. లక్ష్మి, (తెలుగు అధ్యాపకులు) కాకినాడ

98484 34500

Advertisement

Next Story