- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మూడు ప్రాజెక్టులు.. ఖర్చు ఎంత? లాభం ఎంత?
తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు నీళ్లు, నిధులు, నియామకాలు అనే ఆచార్య జయశంకర్ ఉద్యమ నినాదాన్ని కేసీఆర్ రాజకీయ నినాదంగా మార్చి, తెలంగాణ ప్రజలలో ఒక ఆలోచన ధోరణి రేకెత్తించారు. కానీ కేసీఆర్ మదిలో ఉన్నది ఒకటి, తెలంగాణ ప్రజలు అనుకున్నది ఇంకొకటి. సుదీర్ఘ పోరాటం, 1200 మంది బలిదానాల తర్వాత తెలంగాణా సాధించాం. కానీ అప్పటి నుండి కేసీఆర్ మదిలో ఉన్న నీళ్లు, నిధులు, నియామకాలకు (N3) తెలంగాణ ప్రజలు అనుకుంటున్నా N3 నినాదానికి మధ్య ఆకాశానికి భూమికి మధ్య ఉన్న వ్యత్యాసంలా కనిపించింది. నీరు పన్నీరు లాగా కేసీఆర్‌కి బాగా కలసి వచ్చింది. ఇక వారు నిర్మించిన ప్రపంచంలోని అతి పెద్ద భారీ లిఫ్ట్ ఇరిగేషన్, అతి తక్కువ ఖర్చుతో నిర్మించిన దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్, ఒక లిఫ్ట్ లేకుండా సున్నా ఖర్చుతో మొదలెట్టిన SLBC టన్నెల్ ప్రాజెక్టులైన మూడు ఇరిగేషన్ పథకాలను విశ్లేషిద్దాం.
ప్రజలపై.. లక్షన్నర కోట్ల భారం!
కాళేశ్వరం 30,000 కోట్ల బడ్జెట్‌తో ప్రాణహిత- చేవెళ్ళగా మొదలైన ప్రాజెక్టు, కేసీఆర్ మేధో సంపత్తితో కాళేశ్వరం ప్రాజెక్టుగా మారి, పూర్తి అయ్యేవరకు 1.2 - 1.5 లక్షల కోట్ల బడ్జెట్‌కు చేరుతుంది. అసలు ప్రాణహితకు గాని, కాళేశ్వరానికి గాని ఎల్లంపల్లి కీలకం. ఎల్లంపల్లి నుండి పైకి ఒకలా ఉన్నా, కొత్తగా వచ్చింది కొండ పోచమ్మ (ఎర్రవల్లి సాగర్). పాత డిజైన్ ప్రకారం ప్రాణహిత నుండి ఎల్లంపల్లికి (148 మీటర్లు ఎత్తుకి) నీళ్ల తరలింపుకు ఒక్క లిఫ్ట్ చాలు. కేసీఆర్ ప్రాకారం కాళేశ్వరం 3 చెక్ డ్యాములు, గోదావరి నుండి నీళ్లు ఎత్తి, మల్ల గోదావరిలోకి పోయడం. 100 మీటర్ల నుండి 150 మీటర్లకు ఎత్తి పోయడం. దీనికి WAPCOS ప్రభుత్వ సంస్థను వాడటం, తెలివిగా అశ్వత్థామ కుంజరః అని ధర్మరాజు అన్నట్లు. చివరకు ఆ WAPCOS చైర్మన్ అవినీతి ఆరోపణలతో ఈ మధ్యనే సస్పెన్షన్ అయ్యిండు.
దీనికి కేసీఆర్ పెట్టిన వాదం ఏంటంటే ప్రాణహిత దగ్గర 100 - 120 టీఎంసీలు మాత్రమే ఉన్నవి, కానీ గోదావరి (ప్రాణహిత కలిసిన తర్వాత ) నుంచి 200 టీఎంసీల నీటిని ఎత్తి పోయొచ్చని అందరిని నమ్మించారు. కానీ ఇప్పటి వరకు జరిగిన నిజాలు ప్రాణహిత ( తుమ్మిడిహట్టి ) దగ్గర బ్యారేజ్ కడితే ఖర్చు కేవలం 2000 కోట్లు, ఇప్పటి వరకు మొత్తం 30 - 50 టీఎంసీల నీళ్లు ఎత్తి పోయలేదు కదా!ప్రాణహిత గోదావరి ఉపనది, వర్షం మహారాష్ట్రలో పడితే రెండు నదుల్లో నీళ్లు వస్తవి కదా! ప్రతి సంవత్సరం మేడిగడ్డ బ్యారేజీ దాటి 3000 - 4000 టీఎంసీ నీళ్లు సముద్రం పాలు అవుతున్నవి కదా! కాళేశ్వరం ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్ అన్నట్లు ఒక విఫల యత్నమా? ఫలితం ఒక ఎకరా నీళ్లు ఎత్తటానికి 5 లక్షల ఖర్చు అవుతుందని తెలిసి కాగ్ నివ్వెరపోయింది? చివరిగా కాళేశ్వరం వలన మంచిర్యాల జిల్లాలో పంట పొలాలు మునిగాయి, ఎర్రవల్లి ఫార్మ్ హౌస్‌కు కొండా పోచమ్మ వచ్చింది, తెలంగాణ ప్రజల మీద 1.5 లక్షల కోట్ల భారం మిగిలింది.
కాళేశ్వరం, దేవాదుల.. ఏది బెటర్?
తర్వాత దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఇది ప్రచారం తక్కువ, ఫలితం ఎక్కువ! మొదటి, రెండో దశ కలిపి ఇప్పటి వరకు దాదాపు 3000 కోట్లు అయ్యింది. గతంలో సీమాంధ్ర నాయకుల పాలనలో తెలివిగా ప్రాజెక్టు కట్టారు కానీ, ఇన్టేక్ వెల్ 74 మీటర్ల దగ్గర పెట్టడం వలన, కేవలం వరద ఉన్నప్పుడు తప్ప, నీరు లిఫ్ట్ చేసే అవకాశం చాలా తక్కువ. 60 టీఎంసీలతో 6.20 లక్షల ఎకరాలు నూతన ఆయకట్టుకు నీళ్లు ఇచ్చే ప్రాజెక్టు ఎప్పుడు 20 టీఎంసీ నీళ్ల కంటే ఎక్కువ లిఫ్ట్ చేయలేదు. ఇప్పుడు సమ్మక్క బ్యారేజీ ద్వారా 2,121 కోట్ల బడ్జెట్‌తో 85 మీటర్ల ఎత్తు ఉన్న బ్యారేజీ నిర్మించడం వలన 100 టీఎంసీ నీళ్లు లిఫ్ట్ చేసే అవకాశం ఏర్పడ్డది. అదే విధంగా 240 మెగా వాట్ల హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ఏర్పాటు కూడా అయ్యింది. దేవాదుల దగ్గర గోదావరి, ప్రాణాహిత, ఇంద్రావతి నదుల తర్వాత కనుక 360 రోజులు నీళ్లు అందుబాటులో ఉంటాయి. అంటే కేవలం 2121 కోట్ల బ్యారేజితో, 100 టీఎంసీ నీళ్లు, 6.20 లక్షల దేవాదుల ఆయకట్టు, 6 లక్షల SRSP 2 ఆయకట్టు స్థిరీకరణ, తాగు నీరు, పరిశ్రమలకు నీళ్లు, 240 మెగా వాట్ల కరెంటు ఉత్పత్తి. విశేషం ఏమిటంటే ఈ ప్రాజెక్టు కింద ఒక పెద్ద రిజర్వాయర్ లేదు. ఒక 2000 కోట్లతో 20 టీఎంసీల రిజర్వాయర్ కట్టి ఉంటే, ఉన్న చిన్న చిన్న రిజర్వాయిర్ల సామర్థ్యం పెంచి ఉంటే ఉమ్మడి వరంగల్, ఉమ్మడి నల్గొండ జిల్లా, కరీంనగర్ , ఖమ్మం , చివరకు తాపసపల్లి రిజర్వాయర్ ద్వారా సిద్ధిపేట వరకు నీళ్లు పోయే అవకాశం ఉండే. దీనిపై ఎక్కడా కనీస ప్రచారం లేదు, ఎందుకంటే 1.20 లక్షల కోట్లతో నిర్మించిన కాళేశ్వరం, 2121 (టెండర్ పలికింది 1900 కోట్లే ) కోట్ల ఖర్చుతో 12 లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తున్న దేవాదుల మధ్య పోలికలపై చర్చ జరుగుతుందని చాప కింద నెట్టివేసింది ప్రభుత్వం.
10 కి.మీ టన్నెల్‌కు 9 ఏండ్లా?
అలాగే SLBC టన్నెల్ ప్రాజెక్ట్ ఇది అంతులేని కథ, 2004లో శ్రీశైలం నుండి గ్రావిటీ ద్వారా 4 లక్షల ఎకరాలకు నీళ్లు అందించే ప్రాజెక్టు. మొత్తం 40 టీఎంసీ నీళ్లు, ఒక్క పైసా ఖర్చు లేకుండా, కేవలం రూ. 2800 కోట్లతో 51 కిలోమీటర్ల టన్నెల్‌తో ఉమ్మడి నల్గొండ జిల్లాకు ఒక వరం. ఇప్పటివరకు 43 కిలోమీటర్ల మేరకు టన్నెల్ పూర్తి అయిపోయింది, కేవలం 8 -11 కిలోమీటర్ల టన్నెల్ పెండింగ్‌లో ఉంది. కావలసింది 500 కోట్లు, కానీ కేసీఆర్ ఇవ్వరు. లాభం అయ్యేది 4 లక్షల ఎకరాలకు గ్రావిటీ ద్వారా శ్రీశైలంలో 826 అడుగుల వద్ద పాయింట్. ఇంత అద్భుతమైన ప్రాజెక్టు కేసీఆర్ ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నట్లు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మొదలు పెట్టిన ప్రాజెక్టు అణా తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం జరుగుతుంది కాబట్టి, కాళేశ్వరంతో పోల్చుతారనా ? లేదా తన మిత్రుడు జగన్ మెప్పు కోసమా? 10-15 కిలోమీటర్లు టన్నెల్ పూర్తి చేయడానికి 9 ఏండ్లు పడుతుందా!
దీనిపై ఇక తెలంగాణ ప్రజలే ఆలోచించాలి. రూ. 1.20 లక్షల కోట్లతో ఎంత ఆయకట్టు వస్తుందో తెలియని ఒక పజిల్ అయిన కాళేశ్వరం, కేవలం రూ. 2,121 కోట్లతో 12 లక్షల ఎకరాలకు సాగునిచ్చే దేవాదుల, 500 కోట్లతో గ్రావిటీ ద్వారా 4 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చే SLBC టన్నెల్ ప్రాజెక్టుల మధ్య మంత్రం, తంత్రం, యంత్రం ఏమిటో చర్చ జరగాలి.
డా. బూర నర్సయ్య గౌడ్
బోనగిరి, మాజీ ఎంపీ