మూడు ఘటనలు..ముచ్చెమటలు

by Ravi |   ( Updated:2022-09-03 15:20:15.0  )
మూడు ఘటనలు..ముచ్చెమటలు
X

ఏడాదికి మూడు పంటలు పండే పచ్చని భూములను మేము వదులుకోబోమని రైతులు సర్వేను ముందుకు సాగనీయలేదు. ప్రాజెక్టుల నిర్మాణంతో ఇప్పుడిప్పుడే నీరందుతున్న పొలాలను ఇచ్చేదే లేదని వారు పట్టు సడలనీయలేదు. వారంతా అఖిలపక్షంగా ఏర్పడి మే 25న వరంగల్-హైదరాబాద్ రహదారిపై బైఠాయించి మూడు గంటల పాటు రాస్తారోకో చేపట్టారు. జీఓ 80 ఎ ను ప్రభుత్వం రద్దు చేసేదాకా ఆందోళన విరమించేది లేదని అన్నారు. ఈ ధర్నాలో ఏ విపక్ష జెండా, కండువా కనబడలేదు. విషయం ఎమ్మెల్యే ద్వారా మంత్రి కేటీఆర్‌కు, ఆయన్నుండి ముఖ్యమంత్రికి చేరింది. రెండేళ్ల లోపు కాలంలో అసెంబ్లీ ఎన్నికలు రానున్నందున దీన్ని మరింత పొడుగు చేసుకోవద్దని భావించిన ప్రభుత్వం భూసేకరణను నిలిపివేసింది.

తెలంగాణాలో ప్రభుత్వ విధానాలను, నిర్ణయాలను రాజకీయంగా కాంగ్రెస్, బీజేపీ విమర్శిస్తూ 'మా పాలన వస్తే ఏదేదో చేస్తాం' అంటూ మాట్లాడడం పరిపాటే. కానీ, ప్రభుత్వ ఉత్తర్వులను, పాలనను స్థానికులు, ప్రజలు వ్యతిరేకిస్తూ రోడ్డెక్కి నిరసనలు, ఆందోళనలు చేయడం తీవ్ర అంశమే. ఈ మధ్య ఇలాంటి సంఘటనలు రాష్ట్రంలో వరుసగా మొదలయ్యాయి. స్వచ్ఛందంగా బాధిత జనం గుంపులుగా ప్రశ్నిస్తున్నారంటే అందులో వాస్తవమే ఉంటుంది. ప్రభుత్వాలు కూడా ప్రతిష్టకు పోకుండా వీటిని విపక్ష రాజకీయ ఎత్తుగడగా చూడక సానుకూలంగా ఆలోచించాలి.

అలాంటి వాటిలో ఈ మధ్య సద్దు మునిగిన 'వరంగల్ ఔటర్ రింగ్ రోడ్' గొడవ ఒకటి. నిజానికి రింగ్ రోడ్ నిర్మాణం ట్రాఫిక్ సమస్యను ఎంతగానో తీర్చుతుంది. దాని అవసరం వరంగల్‌కు ఉంది కూడా. అయితే, రింగ్ రోడ్ వ్యవహారాన్ని రియల్ ఎస్టేట్ దందాగా మలుచుకోవడానికి స్థానిక నేతలు, పెద్దలు ప్రయత్నించడంతోనే రైతుల ఆందోళన మొదలైంది. భూమి కోల్పోయిన రైతులకు సరైన న్యాయం జరగకపోగా దానికి ఇరువైపులా ఉన్న స్థలాల రేట్లు పదింతలు అవుతాయి. చివరకు పరిహారంలోనూ, నిర్వాసిత ప్యాకేజిలోనూ రైతులు మోసపోతున్నారనేది కాలం చెబుతున్న సత్యం.

రైతుల ఆగ్రహం

ముఖ్యమంత్రి కేసీఆర్ 2017 లో పునాదిరాయి వేసిన ఈ ప్రాజెక్టు సజావుగా సాగుతుందనే అందరూ అనుకున్నారు. దాని నిర్మాణం కోసం ఆయన ఈ మధ్య రూ.669 కోట్లు తొలివిడతగా మంజూరు చేశారు. భూసేకరణ కోసం 'కుడా' ఏప్రిల్ 30న నోటిఫికేషన్ జారీ చేసింది. వరంగల్ రింగ్ రోడ్ కోసం హన్మకొండ, వరంగల్, జనగామ జిల్లాలలోని 28 గ్రామాలకు చెందిన 21,510 ఎకరాల స్థలం అవసరం. గ్రామాలకు వెళ్లి కుడా సిబ్బంది సర్వే మొదలు చేస్తుండగా రైతుల నుండి వ్యతిరేకత మొదలైంది. ఏడాదికి మూడు పంటలు పండే పచ్చని భూములను మేము వదులుకోబోమని రైతులు సర్వేను ముందుకు సాగనీయలేదు. ప్రాజెక్టుల నిర్మాణంతో ఇప్పుడిప్పుడే నీరందుతున్న పొలాలను ఇచ్చేదే లేదని వారు పట్టు సడలనీయలేదు. వారంతా అఖిలపక్షం గా ఏర్పడి మే 25న వరంగల్-హైదరాబాద్ రహదారిపై బైఠాయించి మూడు గంటల పాటు రాస్తారోకో చేపట్టారు.జీఓ 80 ఎ ను ప్రభుత్వం రద్దు చేసేదాకా ఆందోళన విరమించేది లేదని అన్నారు.

ఈ ధర్నాలో ఏ విపక్ష జెండా, కండువా కనబడలేదు. విషయం ఎమ్మెల్యే ద్వారా మంత్రి కేటీఆర్‌కు, ఆయన్నుండి ముఖ్యమంత్రికి చేరింది. రెండేళ్ల లోపు కాలంలో అసెంబ్లీ ఎన్నికలు రానున్నందున దీన్ని మరింత పొడుగు చేసుకోవద్దని భావించిన ప్రభుత్వం భూసేకరణను నిలిపివేసింది. ప్రజల వ్యతిరేకతను తట్టుకోలేక వెనక్కు తగ్గినా రైతులను ఇబ్బంది పెట్టే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని అందుకే వారికీ అనుకూల నిర్ణయం తీసుకున్నామని ప్రకటించింది. బుట్టలో పెట్టిన ఈ పాము మళ్లీ ఎప్పుడైనా బుసకొట్టవచ్చు.

అర్ధరాత్రి ఘర్షణ

సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలో నిర్మాణం జరుగుతున్న గౌరవెల్లి రిజర్వాయరు భూనిర్వాసితుల ఆందోళన ఇప్పుడు రాష్ట్రంలో రగులుతున్న సమస్యలలో ఒకటి. భూములు కోల్పోయినా పూర్తి పరిహారం అందక వీరు ఖాళీ చేయాల్సిన ఊళ్లో, ఇళ్లల్లో గడుపుతున్నారు. ట్రయల్ రన్‌కు అధికారులు సిద్దపడడంతో వారి పరిస్థితి చిక్కులలో పడింది. తమకు పూర్తి పరిహారం చెల్లించే దాకా ప్రాజెక్టు పనులు ముందుకు సాగేది లేదని వారు ఏకంగా రిజర్వాయర్ కట్ట మీదనే ఆందోళనకు దిగారు. ట్రయిల్ రన్ అయిందంటే అధికారులు చేతులు దులిపేసుకుంటారు అనే భయం వారిది. అయితే, ట్రయల్ రన్‌కు అడ్డువస్తారని భావించి గుడాటిపల్లివాసులను పోలీసులు 12వ తేదీ అర్ధరాత్రి అరెస్టు చేసి సమీప పోలీస్ స్టేషనుకు పంపించారు.

ఆ సమయంలో ఊరికి కరెంటు సరఫరా ఆగిపోవడంతో పాటు తెలియని వ్యక్తులు ఇళ్లలో చొచ్చుకు రావడంతో పిల్లలు, ఆడవాళ్లు భయపడిపోయారు. తోపులాటలో పలువురికి గాయాలయ్యాయి. పోలీసుల ఈ చర్య తీవ్ర వివాదానికి, వ్యతిరేకతకు దారి తీసింది. మర్నాడు గుడాటిపల్లివాసులు హుస్నాబాద్ పోలీస్ స్టేషన్ ముందు గుమిగూడారు. ధర్నాలు నిర్వహించారు. తీవ్రతను గ్రహించిన ప్రభుత్వం మంత్రి హరీశ్‌రావును రంగంలోకి దింపి పరిస్థితి సద్దుమణిగేలా చేసింది. సిద్దిపేట క్యాంప్ ఆఫీసులో హరీశ్‌రావు ఈ సమస్య పరిష్కారంపై నిర్వాసితులతో పాటు కాంగ్రెస్ నేతలు పొన్నం ప్రభాకర్, ఎం కోదండరెడ్డితో చర్చించడం విశేషం.

విద్యార్థుల ఆందోళన

బాసర ఆర్జీయూకేటీ విద్యార్థులది మరో ఆందోళన. మంత్రులు హామీలు ఇచ్చినా వారు వెనక్కి తగ్గడం లేదు. గత అయిదు రోజులుగా పగలు ప్రాంగణం ప్రధాన ద్వారం ముందు బైఠాయించి నిరసన తెలిపిన విద్యార్థులు ఆదివారం 24 గంటల ఆందోళనకు దిగారు. బాసరలో ఐఐటి ఉండాలని ఎంతో శ్రమపడిన చుక్కా రామయ్య కల చెదిరినా, చివరకు 2008 లో రాజీవ్‌గాంధీ యానివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ పేరిట విశ్వవిద్యాలయంగా రూపుదాల్చింది. పదో తరగతి పాసయిన విద్యార్థులు పాలిసెట్ ర్యాంకు ఆధారంగా ఈ ఆరేళ్ల కోర్సులో చేరి ఏకంగా ఇంటర్మీడియట్, ఇంజనీరింగ్ పూర్తి చేయవచ్చు. యేటా 1,500 విద్యార్థులకు ప్రవేశం లభిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం దీనిని పట్టించుకోకపోవడంతో విద్యార్థుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. దీని నిర్వహణకు ఏడాదికి రూ.60 కోట్ల అంచనా ఉంది. గత మూడేళ్లుగా బడ్జెట్‌లో రూ. 20 కోట్లు కేటాయిస్తున్నప్పటికీ, రూ. 10 కోట్లు మాత్రమే విడుదలవుతున్నాయి. తగినంత బోధన, బోధనేతర సిబ్బంది లేరు.

ఈ రెండు మాటల ద్వారా ఈ విద్యార్థులు ఎన్ని అగచాట్లు పడుతున్నారో ఊహించవచ్చు. గత ఏడాది ఈ సంస్థ నాక్ ర్యాంకు సి గ్రేడ్ కు పడిపోయింది. దీనితో క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ తగ్గిపోతాయి. విద్యార్థులు డిమాండ్ల చిట్టా సిల్లీగా ఉందని విద్యాశాఖ మంత్రి అనడం విమర్శకు దారి తీసింది. విద్యార్థులలో మరింత ఉక్రోషాన్ని పెంచినా ఆశ్చర్యం లేదు. ఉపకులపతి నియమించాలని, లాప్‌టాప్, యూనిఫారం ఇయ్యాలని, క్లాస్‌రూములను, హాస్టల్ గదులను మరమ్మత్తు చేయాలని, మంచి భోజనం అందించాలని, ఇతర టెక్నాలజీ విద్యా సంస్థలతో అనుసంధానం కల్పించాలని అడిగారు. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా తమ విశ్వవిద్యాలయాన్ని సందర్శించాలని కోరారు. ముఖ్యమంత్రి వీలు చూసుకొని వస్తానన్న సరిపోతుంది. ప్రభుత్వ ఉన్నత విద్యను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్న తెలంగాణ సర్కారు ఈ విద్యార్థులను ఎలా శాంతింప చేస్తుందో చూడాలి. ఇప్పటికే రాజకీయంగా విపక్షాల నుంచి తీవ్ర ఒత్తిడికి గురవుతున్న ప్రభుత్వం ప్రజల బాసటను పెంచుకోవాలి. ఓట్ల గ్రాఫును కిందికైనా మీదికైనా చేర్చేది ప్రజల నమ్మకమే.

బి.నర్సన్

94401 28169

Advertisement

Next Story